Skip to main content

Daily Current Affairs in Telugu: ఫిబ్ర‌వ‌రి 24, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu February 24th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
February 24th 2023 Current Affairs

Sangeet Natak Akademi Awards: జాతీయ సంగీత, నాటక అకాడమీ అవార్డుల ప్రదానం..  
కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఫిబ్ర‌వ‌రి 24వ తేదీ జాతీయ సంగీత, నాటక అకాడమీ అవార్డుల కార్యక్రమం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఘనంగా జరిగింది. కరోనా కారణంగా గత మూడేళ్లుగా ఈ అవార్డులు ఇవ్వలేదు. దీంతో 2019, 2020, 2021 సంవత్సరానికి కలిపి ఒకేసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 128 మంది కళాకారులకు అవార్డులు అందజేశారు. ఈ అవార్డుల్లో ఆరు తెలుగు రాష్ట్రాల్లో కళా, సంగీత సేవ చేస్తున్న వారికి దక్కాయి. 

హరికథ కళాకారిణి ఉమామహేశ్వరి, కథక్ నృత్యకారులు రాఘవరాజ్ భట్, మంగళ భట్ (సంయుక్తంగా) 2019 సంవత్సరానికి గానూ ఈ అవార్డులు అందుకోగా, 2020 సంవత్సరానికి కర్నాటక సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, ప్రఖ్యాత గాయని ప్రేమ రామ్మూర్తి, కూచిపూడి నృత్య కళాకారులు పసుమర్తి విఠల్, పసుమర్తి భారతి దంపతులు (సంయుక్తంగా) అవార్డులు అందుకున్నారు. 2021 సంవత్సరానికి గానూ నాటక రంగాన్ని కాపాడుకునేందుకు కృషి చేస్తున్న వినాయక నాట్యమండలి (సురభి) నిర్వాహకులు ఆర్.వేణుగోపాల్ రావు సంగీత, నాటక అకాడమీ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. అవార్డులు అందుకున్న 128 మంది కళాకారుల్లో 50 మంది మహిళలే ఉన్నారు. 

Dadasaheb Phalke Award 2023 : దాదా సాహేబ్‌ ఫాల్కే అవార్డు విజేతలు వీరే.. మ‌ళ్లీ ఆర్‌ఆర్‌ఆర్‌కు..

Ajay Banga: ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడిగా అజయ్‌ బంగా.. ఈయ‌న చ‌దివింది మ‌న హైద‌రాబాద్‌లోనే..! 
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన వ్యక్తి అజయ్ బంగా (63) పేరును ఫిబ్ర‌వ‌రి 23వ తేదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. ప్రస్తుత వరల్డ్ బ్యాంకు అధ్యక్షుడు డేవిస్ మాల్పాస్ ఈ ఏడాది చివర్లో పదవికి రాజీనామా చేయనున్న నేపథ్యంలో బైడెన్ అజయ్ పేరును ప్రతిపాదించారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ప్రపంచ బ్యాంక్‌ను సమర్థంగా ముందుకు నడిపించగల సత్తా అజయ్‌ బంగాకు ఉందని ప్రశంసించారు. ప్రపంచ బ్యాంక్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఆమోదిస్తే అత్యంత ప్రతిష్టాత్మక పదవికి అజయ్‌ బంగా ఎంపికవుతారు. అదే జరిగితే ఆయన ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి భారత్‌–అమెరికన్‌గా, తొలి సిక్కు–అమెరికన్‌గా రికార్డుకెక్కుతారు. 

Niti Aayog: నీతి ఆయోగ్‌ సీఈఓగా బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం
అజయ్ బంగా హైదరాబాద్, బేగంపేట్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నారు. ఐఐఎం ఢిల్లీలో ఎంబీఏ పూర్తి చేశారు. 2009లో అజయ్ మాస్టర్ కార్డు సీఈఓగా పనిచేశారు. అంతకుముందు సిటీ గ్రూప్ సంస్థకు చెందిన ఆసియా పసిఫిక్ వ్యవహారాలు చూసేవారు. ప్రస్తుతం అజయ్ జనరల్‌ అట్లాంటిక్‌ వైస్‌–చైర్మన్‌గా పనిచేస్తున్నారు. గతంలో మాస్టర్‌కార్డ్‌ అధ్యక్షుడు, సీఈఓగా సేవలందించారు. 2016లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అమెరికాలో ప్రఖ్యాత పురస్కారాలు స్వీకరించారు.    

వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (22-28 జనవరి 2023)

Winter Storm: అమెరికాలో భీకర మంచు తుపాను.. విమాన సర్వీసులు రద్దు 
అమెరికాను భీకర మంచు తుపాను వణికిస్తోంది. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో ఎక్కడి వాహనాలక్కడే నిలిచిపోయాయి. వందలాది నివాసాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. విమాన సర్వీసులు రద్దయ్యాయి. స్కూళ్లు మూతబడ్డాయి. వాతావరణ విభాగం 1989 తర్వాత మొదటిసారిగా మంచు తుపాను(బ్లిజ్జార్డ్‌) హెచ్చరికలను జారీ చేసింది. కొన్ని తీర ప్రాంతాల్లో అలలు 3 నుంచి 4.3 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. తుపాను తీవ్రత దృష్ట్యా సుమారు 24 రాష్ట్రాల్లోని 6.5 కోట్ల మంది ప్రజలకు వాతావరణ హెచ్చరికలు జారీ చేశారు. వ్యోమింగ్, ఆరిజోనా, న్యూ మెక్సికో, పోర్ట్‌ల్యాండ్, ఓరెగాన్‌ పలు చోట్ల ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది.
మిషిగన్, ఇలినాయీ, కాలిఫోర్నియాల్లో విద్యుత్‌ లైన్లు తెగిపోవడంతో జనం రాత్రిళ్లు చీకట్లోనే గడిపారు. మంచు, చలిగాలులతో కాలిఫోర్నియా, సియెర్రా నెవడాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సుమారు 1,800 విమాన సర్వీసులు రద్దు కాగా, మరో 6 వేలకు పైగా సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇలా ఉండగా, మరికొన్ని రాష్ట్రాల్లో ఇందుకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. నాష్‌విల్లేలో బుధవారం అత్యధికంగా 26.67 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదై 127 ఏళ్ల రికార్డు బద్దలైందని అధికారులు చెప్పారు. ఇండియానా పొలిస్, సిన్సినాటి, అట్లాంటా, లెక్జింగ్టన్, కెంటకీ, అలబామాల్లోనూ ఇదే స్థాయిలో ఎండలున్నాయి.

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగి ఏడాది పూర్తి

Fifth Layer of Earth: భూమికి ఐదో పొరను కనిపెట్టిన శాస్త్రవేత్తలు
అశోక చక్రానికి కనిపించే మూడు సింహాలతో పాటు కనిపించని నాలుగో సింహమూ ఉన్నట్టుగా, భూమికి మనకిప్పటిదాకా తెలియని ఐదో పొర ఉందట! భూగర్భం తాలూకు మిస్టరీలను ఛేదించేందుకు తాజాగా చేపట్టిన ప్రయోగాల్లో ఈ విషయం యాదృచ్ఛికంగా వెలుగుచూసిందని సైంటిస్టులు చెబుతున్నారు. భూమికి నాలుగు పొరలుంటాయని మనకిప్పటిదాకా తెలుసు..

భూమి తాలూకు ఇన్నర్‌ కోర్‌ గుండా భూకంప తరంగాలు ఎంత వేగంతో చొచ్చుకుని సాగిపోతున్నాయో తెలుసుకునేందుకు ఆస్ట్రేలియా నేషనల్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు గత దశాబ్దకాలంగా పలు ప్రయోగాలు చేస్తున్నారు. వాటిలో భాగంగా రిక్టర్‌ స్కేల్‌పై ఆరుకు పైగా తీవ్రతతో కూడిన 200కు పైగా భూకంపాల తాలూకు గణాంకాలను వారు లోతుగా విశ్లేషిస్తున్నారు. చివరికి ఈ భూకంప తరంగాలు భూమి కేంద్రకం గుండా నేరుగా ప్రయాణిస్తున్నట్టు అంచనాకు వచ్చారు. ఇన్నర్‌ కోర్‌ తాలూకు అత్యంత లోతైన భాగాలకు సంబంధించి పలు కొత్త విషయాలు ఈ అధ్యయనం ద్వారా వెలుగుచూశాయి.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (సైన్స్ & టెక్నాలజీ) క్విజ్ (22-28 జనవరి 2023)

మరింత సమాచారం కోసం ఆ తరంగాల ప్రయాణ సమయాల్లో మార్పులను పరిశోధకులు తాజాగా మరింత లోతుగా విశ్లేషించారు. ఈ క్రమంలో భూమికి ఇప్పటిదాకా మనకు తెలియని ఐదో పొర ఉందన్న విషయం బయట పడిందని చెబుతున్నారు! ఇది భూమి లోలోతుల్లో ఘనాకృతిలోని లోహపు గోళం మాదిరిగా ఉందని చెప్పారు. ఇన్నర్‌ కోర్‌ తాలూకు కేంద్ర స్థానంలో ఇమిడిపోయి ఉన్న ఈ పొరను ప్రస్తుతానికి ‘అత్యంత లోపలి ఇన్నర్‌ కోర్‌’గా వ్యవహరిస్తున్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తే భూ కేంద్రానికి సంబంధించి మనకెంతో ప్రయోజనకరమైన సమాచారం వెలుగుచూడొచ్చని చెబుతున్నారు. ఈ తాజా అధ్యయన ఫలితాలను జర్నల్‌ నేచర్‌ కమ్యూనికేషన్స్‌లో ప్రచురించారు. పూర్తి స‌మాచారం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

BioAsia 2023: ఆసియాలోనే అతిపెద్ద వేదిక.. బయో ఆసియా–2023 సదస్సు ముఖ్యాంశాలు

‘బయో ఆసియా’ 20వ వార్షిక సదస్సు.. జీవశాస్త్ర, ఆరోగ్య రక్షణ రంగాలకు సంబంధించి ఆసియాలోనే అతిపెద్ద వేదిక. ఈ సదస్సు ‘బయో ఆసియా 2023’పేరిట, నాణ్యమైన వైద్యం.. అందరికీ ఆరోగ్యం లక్ష్యంగా.. ఫిబ్ర‌వ‌రి 24వ తేదీ నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ) ప్రాంగణంలో జరుగుతోంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు దీనిని ప్రారంభించారు.

‘అడ్వాన్సింగ్‌ ఫర్‌ వన్‌.. షేపింగ్‌ ది నెక్ట్స్‌ జనరేషన్‌ హ్యూమనైజ్డ్‌ హెల్త్‌కేర్‌’అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఇస్తున్న ‘జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌’పురస్కారాన్ని ఈసారి ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీపై కృషి చేసిన ప్రొఫెసర్‌ రాబర్ట్‌ లాంగర్‌కు అందజేయనున్నారు.
సదస్సు నిర్వహణలో బ్రిటన్‌ భాగస్వామ్యం వహిస్తుండగా, స్థానిక పార్ట్‌నర్‌గా ప్లాండర్స్‌ వ్యవహరిస్తోంది. ప్రముఖ సంస్థ ‘ఆపిల్‌’ తొలిసారిగా బయో ఆసియా సదస్సులో పాల్గొంటోంది. నోవార్టిస్‌ సీఈఓ వాస్‌ నరసింహన్‌ కీలకోపన్యాసం చేస్తారు. ప్లీనరీ టాక్‌లో యూకేకి చెందిన డా.రిచర్డ్‌ హాచెట్‌ ప్రసంగిస్తారు. పూర్తి స‌మాచారం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (22-28 జనవరి 2023)


Forest Development Corporation: తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు 

తెలంగాణ అటవీ, అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ)కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అడవుల నిర్వహణ, అభివృద్ధిలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకుగాను ఎఫ్‌డీసీకి జర్మనీ ఫారెస్ట్‌ స్టీవర్డ్‌ కౌన్సిల్‌ సర్టిఫికెట్‌ దక్కింది. సేంద్రియ పద్ధతిలో యూకలిప్టస్, వెదురు, టేకు, జీడిమామిడి లాంటి అటవీ ఉత్పత్తు(ముడిసరుకు)ల నుంచి తయారయ్యే వస్తువులకు ఐదేళ్లపాటు తమ లోగోను ఉపయోగించుకునేందుకు ఎఫ్‌డీసీకి కౌన్సిల్‌ అనుమతినిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 75 వేల ఎకరాల్లో యూకలిప్టస్, వెదురు, టేకు, జీడిమామిడి చెట్లను ఉన్నత ప్రమాణాలతో సాగు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి అటవీ డివిజన్లలో సుమారు 45 వేల ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్న పంటకు ఈ గుర్తింపు దక్కిందని అటవీ అభివృద్ధి సంస్థ అధికారులు అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి వివరించారు.
దీనివల్ల అంతర్జాతీయంగా ఎఫ్‌డీసీ బ్రాండ్‌ ఇమేజ్‌ పెరుగుతుందని, ఐకియా వంటి ఇంటర్నేషనల్‌ బ్రాండ్లకు జర్మన్‌ కౌన్సిల్‌ ధ్రువీకరించిన కలపను విక్రయించే అవకాశం దక్కిందన్నారు. ఐదేళ్లలో రూ.10 కోట్ల అదనపు ప్రయోజనం కలగనుందని, కంపోజిట్‌ వుడ్‌పేపర్, ప్యాకింగ్‌ పరిశ్రమల కోసం ప్రాసెస్‌ చేసిన ఉత్పత్తులకు అధికధర లభిస్తుందన్నారు. అటవీ ఉత్పత్తుల నుంచి చేసిన కాగితం, టెట్రాప్యాక్, మిశ్రమ కలపకు ఎఫ్‌ఎస్సీ ఆమోదం లభించిందని తెలియజేశారు. ఈ సంద‌ర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి అట‌వీ శాఖ అధికారులు, సిబ్బందిని అభినందించారు. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (22-28 జనవరి 2023)

IIT Madras: ఐఐటీ మద్రాస్‌లో సింథటిక్‌ వజ్రాల ల్యాబ్‌.. రూ.243 కోట్లు వెచ్చింపు
దేశీయంగా సింథటిక్‌ వజ్రాల తయారీకి సంబంధించిన సెంటర్‌ను (ఇన్‌సెంట్‌–ఎల్‌జీడీ) ఐఐటీ–మద్రాస్‌లో ఏర్పాటు చేయనున్నట్లు వాణిజ్య శాఖ వెల్లడించింది. దీనికి 5 ఏళ్లలో సుమారు రూ. 243 కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొంది. దేశీయంగా సింథటిక్‌ వజ్రాల తయారీ పరిశ్రమకు, వ్యాపారవేత్తలకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించేందుకు ఈ ప్రాజెక్టు తోడ్పడుతుందని వివరించింది. స్టార్టప్‌లకు చౌకగా టెక్నాలజీని అందించేందుకు ఉపాధి అవకాశాలను, ఎల్‌జీడీ ఎగుమతులను పెంచేందుకు ఇన్‌సెంట్‌–ఎల్‌జీడీలో పరిశోధనలు ఉపయోగపడగలవని వాణిజ్య శాఖ తెలిపింది. ల్యాబ్స్‌లో తయారయ్యే వజ్రాలను ఆభరణాల పరిశ్రమలోనే కాకుండా కంప్యూటర్‌ చిప్‌లు, ఉపగ్రహాలు, 5జీ నెట్‌వర్క్‌లు మొదలైన వాటిల్లోనూ ఉపయోగిస్తారు.
అంతర్జాతీయంగా ఈ మార్కెట్‌ 2020లో బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉంది. 2025 నాటికి సింథటిక్‌ డైమండ్‌ ఆభరణాల మార్కెట్‌ 5 బిలియన్‌ డాలర్లకు, 2035 నాటికి 15 బిలియన్‌ డాలర్లకు వృద్ధి చెందుతుందన్న అంచనాలు ఉన్నాయి. 2021–22లో వీటికి సంబంధించి అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్‌కు 25.8% వాటా ఉంది. కెమికల్‌ వేపర్‌ డిపోజిషన్‌ (సీవీడీ) టెక్నాలజీతో వజ్రాలను తయారు చేసే టాప్‌ దేశాల జాబితాలో భారత్‌ కూడా ఉంది. అయితే, కీలకయంత్ర పరికరాలు, ముడి వనరు అయిన సీడ్స్‌ కోసం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (22-28 జనవరి 2023)

Published date : 24 Feb 2023 06:13PM

Photo Stories