Daily Current Affairs in Telugu: 2022, డిసెంబర్ 2nd కరెంట్ అఫైర్స్
G-20 Presidency: నిర్ణయాత్మకంగా జీ20 ఎజెండా
ప్రపంచంలో శక్తివంతమైన జీ–20(గ్రూప్–20) అధ్యక్ష బాధ్యతలను భారత్ డిసెంబర్ 1వ తేదీ లాంఛనంగా చేపట్టింది. ఏడాది పాటు ఈ బాధ్యతలను నిర్వర్తించనుంది. జీ–20 అధినేతగా భారతదేశ లక్ష్యాలను వివరిస్తూ ప్రధాని మోదీ ఒక ఆర్టికల్(వ్యాసం) విడుదల చేశారు. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ స్ఫూర్తితో ప్రపంచదేశాలను ఏకం చేసేందుకు కృషి చేస్తామని ఉద్ఘాటించారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి వంటివి నేడు మానవళికి అతిపెద్ద సవాళ్లుగా మారాయని, అందరం కలిసికట్టుగా వాటిని ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. ప్రపంచంలో కొన్ని దేశాల కంఠశోషను ఎవరూ వినిపించుకోవడం లేదని ఆక్షేపించారు. జీ–20 దేశాలతోపాటు.. నిర్లక్ష్యానికి గురైన దేశాలను కూడా కలుపుకొని ముందుకెళ్తామని, అందరితో చర్చించి, తమ జీ–20 ప్రాధాన్యతలను నిర్ణయించుకుంటామని వివరించారు.
పాత ఆలోచనా ధోరణికి స్వస్తి
‘మానవ కేంద్రీకృత ప్రపంచీకరణ’కు సంబంధించిన ఒక కొత్త నమూనా కోసం ప్రపంచ దేశాల ప్రజలంతా చేతులు కలిపి, ఉమ్మడిగా కృషి చేయాలని సూచించారు. ప్రపంచ దేశాల నడుమ ఆహారం, ఎరువులు, ఔషధ ఉత్పత్తుల సరఫరాను రాజకీయ కోణంలో చూడొద్దని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో మొత్తం మానవళికి మేలు కలిగేలా మన ఆలోచనా విధానం(మైండ్‌సైట్) మార్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. కొరతకు, సంఘర్షణలకు కారణమయ్యే పాత ఆలోచనా ధోరణికి స్వస్తి పలకాలని చెప్పారు. కలిసికట్టుగా ఉంటూ, సవాళ్లను ఎదిరించడానికి గాను మన ఆధ్యాత్మిక సంప్రదాయాల నుంచి స్ఫూర్తిని పొందడానికి ఇదే సరైన సమయమని వివరించారు.
G20 summit : బంధం బలోపేతం.. జో బైడెన్‌తో ప్రధాని మోదీ చర్చలు
మనకు యుద్ధం అక్కర్లేదు
మొత్తం మానవ జాతికి కనీస అవసరాలను తీర్చగలిగే ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురాగల మార్గాలు ప్రపంచంలో ఉన్నాయని, మనుగడ కోసం ఒకరిపై ఒకరు పోరాటం చేయాల్సిన అవసరం లేదని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రస్తుతం మనకు యుద్ధం ఎంతమాత్రం అవసరం లేదని వ్యాఖ్యానించారు. భవిష్యత్తు తరాల భద్రమైన జీవితాల కోసం సామూహిక జనన హనన ఆయుధాల నిర్మూలన దిశగా శక్తివంతమైన దేశాల నడుమ చర్చలకు చొరవ చూపుతామని వెల్లడించారు. ప్రపంచ శాంతి, రక్షణ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తామన్నారు.
భారత్‌తో కలిసి నడుస్తాం: అమెరికా
జీ–20 కూటమి అధ్యక్ష హోదాలో ఉన్న భారత్‌కు మద్దతు ఇవ్వడానికి, కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా పేర్కొంది. ఆహారం, ఇంధన భద్రత వంటి పెనుసవాళ్లను పరిష్కరించే విషయంలో భారత్‌తో కలిసి నడవాలని అమెరికా నిర్ణయించకున్నట్లు వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కెరైన్ జీన్–పియర్రీ చెప్పారు. జీ–20 దేశాల అధినేత శిఖరాగ్ర సదస్సు 2023 సెప్టెంబర్ 9, 10న ఇండియా రాజధాని ఢిల్లీలో జరుగనుంది.
6511 ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
Jayadheer Tirumala Rao: ఆద్యకళ బృందానికి అరుదైన గౌరవం
ఆదివాసీ, గిరిజన జానపద వస్తు సముదాయానికి అరుదైన గౌరవం లభించింది. కొన్ని వందల ఏళ్లుగా విస్మరణకు గురైన గిరిజన సంస్కృతి, చరిత్ర తాలూకు అమూల్యమైన ఆనవాళ్లను ఆద్యకళ ద్వారా జనబాహుళ్యంలోకి తెచ్చిన ఆచార్య జయదీర్ తిరుమలరావు, సమన్వయకర్త ఆచార్య గూడూరు మనోజకు ఫ్రాన్స్‌లో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం లభించింది. ఇండో–యూరోపియన్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఫ్రాన్స్‌లోని నాంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్‌లో ‘భారత్, ఆఫ్రికా మానవీయ శాస్త్రాల సంభాషణ’అనే అంశంపై ఈ నెల 13 నుంచి 16 వరకు జరగనున్న సదస్సులో వీరు పాల్గొననున్నారు. ఆద్యకళపై జరిగిన పరిశోధన, కళాఖండాల సేకరణపై ప్రసంగించనున్నారు.
National Sports Awards: జాతీయ క్రీడా పురస్కారాలు ప్రదానం
Singareni Thermal Power Plant: అగ్రస్థానంలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం
మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నాటికి 90.86% సామర్థ్యంతో విద్యుదుత్పత్తి(పీఎల్‌ఎఫ్) సాధించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆరేళ్ల క్రితం ప్రారంభమైన విద్యుత్ కేంద్రం ఏటా అత్యధిక పీఎల్‌ఎఫ్ సాధిస్తూ దేశంలోని 25 అత్యుత్తమ థర్మల్ ప్లాంట్లలో ఒకటిగా నిలిచిందని సింగరేణి సంస్థ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. రెండోదశ కింద కొత్తగా నిర్మిస్తున్న 800 మెగావాట్ల మరో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని 2026 నాటికి పూర్తి చేస్తామని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు.
Success Story: నాడు పశువులకు కాపల ఉన్నా.. నేడు దేశానికి కాపల కాసే ఉద్యోగం చేస్తున్నా.. ఇందుకే..
ISIS: ఐసిస్ చీఫ్ హతం.. కొత్త సారథిని ప్రకటించిన ఉగ్రసంస్థ
ప్రపంచానికి పెను సవాలుగా మారిన అంతర్జాతీయ ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్ గ్రూప్(ఐసిస్)కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దాని ప్రస్తుత అధినేత అబూ అల్ హసన్ అల్ హషిమి అల్ ఖురేషి ఇటీవల జరిగిన దాడుల్లో మరణించారని ఐసిస్ అధికార ప్రతినిధి అబూ ఒమర్ అల్ ముహాజిర్ నవంబర్ 30వ తేది ప్రకటించారు. ‘దేవుని శత్రువులతో పోరాడుతూ ఖురేషి మరణించారు’ అంటూ ముహాజిర్ అధికారికంగా ఒక ఆడియా సందేశం విడుదలచేశారు. ఏ దేశ సైన్యం, ఎవరు చేసిన దాడుల్లో ఇతను హతమయ్యాడనే వివరాలు ఐసిస్ వెల్లడిచేయలేదు. ఏ రోజు, ఏ ప్రాంతంలో మరణించిందీ పేర్కొనలేదు. ఇరాక్‌కు చెందిన ఖురేషిని తామే చంపేశామని ఏ దేశమూ ఇంతవరకూ ప్రకటించుకోలేదు. సిరియా, ఇరాక్‌లలో భారీ స్థాయిలో దాడులకు తెగబడి ఆ దేశాల్లో మళ్లీ ఇస్లామిక్ రాజ్యస్థాపనకు సంసిద్ధమవుతున్నట్లు ఐసిస్ ప్రకటించుకున్న కొద్దిరోజులకే సంస్థ చీఫ్‌ను కోల్పోవడం గమనార్హం. అయితే, మరో నేతను తమ చీఫ్‌గా ఐసిస్ బుధవారం ప్రకటించింది. ఇకపై అబూ అల్ హుస్సేన్ అల్ హుస్సేనీ అల్ ఖురేషి తమ చీఫ్‌గా ఉంటారని తెలిపింది. 2019 అక్టోబర్‌లో ఐసిస్ వ్యవస్థాపక చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీని అమెరికా సేనలు అంతంచేశాక తదుపరి దాడుల్లో అంతమైన అగ్రనేతల్లో ఖురేషి మూడోవాడు.
UN Security Council: భద్రతామండలి ప్రెసిడెంట్‌గా భారత్
ఐక్యరాజ్యసమితిలోని శక్తివంతమైన భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టింది. 15 దేశాల మండలిలో డిసెంబర్ నెలకు గాను అధ్యక్ష పీఠంపై ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ కొనసాగుతారు. ప్రెసిడెన్సీ సమయంలో చేపట్టాల్సిన ప్రాధాన్యాంశాలపై ఆమె ఇప్పటికే ఐరాస సెక్రటరీ గుటెరస్, జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు కసాబా కరోసితో చర్చలు జరిపారు. 2021 ఆగస్ట్ నెలలో కూడా మండలి అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వహించింది. మండలిలో భారత్ రెండేళ్ల పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్‌తో ముగియనుంది.
TSPSC & APPSC Groups Best Books: గ్రూప్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులు ఈ పుస్తకాలను చదివారంటే..
Supreme Court: సుప్రీంకోర్టులో మరోసారి మహిళా ధర్మాసనం
సుప్రీంకోర్టులో మరోసారి మహిళా న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఆసీనులైంది. డిసెంబర్ 1వ తేది జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనాన్ని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఏర్పాటు చేశారు. ఈ ధర్మాసనం 10 వైవాహిక బదిలీ, 10 బెయిలు పిటిషన్లు సహా 32 కేసులు విచారించింది. ఇలా కేవలం మహిళా న్యాయమూర్తులతో ధర్మాసనం ఏర్పాటు చేయడం సుప్రీంకోర్టు చరిత్రలో ఇది మూడోసారి. సుప్రీంకోర్టులో 2013లో జస్టిస్ జ్ఞాన సుధా మిశ్ర, జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్‌లతో కూడిన ధర్మాసనం తదనంతరం 2018లో జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఇందిరాబెనర్జీలతో కూడిన ధర్మాసనాలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్ బీవీ నాగరత్న సహా ముగ్గురు మహిళా న్యాయమూర్తులున్నారు. జస్టిస్ బీవీ నాగరత్న 2027లో ప్రధాన న్యాయమూర్తి కానున్న విషయం విదితమే.
IAS Officer Success Story : నాన్న డ్రైవర్.. కూతురు ఐఏఎస్.. చదవడానికి డబ్బులు లేక..
Reliance Industries: విలువలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నంబర్‌వన్
దేశంలో అత్యంత విలువైన (మార్కెట్ విలువ ఆధారితంగా) లిస్టెడ్ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో నిలిచింది. టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. ‘2022 బర్గండి ప్రైవేట్ హరూన్ ఇండియా 500’ కంపెనీల జాబితా డిసెంబర్ 1వ తేదీ విడుదలైంది. 500 కంపెనీల ఉమ్మడి విలువ రూ.226 లక్షల కోట్లుగా ఉంది. రిలయన్స్ మార్కెట్ విలువ రూ.17.25 లక్షల కోట్లు. రెండో స్థానంలో ఉన్న టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.11.68 లక్షల కోట్లుగా ఉంది. రూ.8.33 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మూడో స్థానంలో నిలిచింది. ఇన్ఫోసిస్ (రూ.6.46 లక్షల కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్ (రూ.6.33 లక్షల కోట్లు), ఎయిర్‌టెల్ (రూ.4.89 లక్షల కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ (రూ.4.48 లక్షల కోట్లు), ఐటీసీ (రూ.4.32 లక్షల కోట్లు), అదానీ టోటల్ గ్యాస్ (రూ.3.96 లక్షల కోట్లు), అదానీ ఎంటర్‌ప్రైజెస్ రూ.3.81 లక్షల కోట్ల విలువతో టాప్–10లో ఉన్నాయి.
అదానీ కంపెనీలు ఎనిమిది..
‘‘గౌతమ్ అదానీకి సంబంధించి ఏడు కంపెనీలు ఇందులో ఉన్నాయి. అంబుజా సిమెంట్స్ కొనుగోలుతో ఎనిమిదో కంపెనీ వచ్చి చేరింది. ఉపఖండంలో అత్యంత సంపన్నుడు కావడందో ఇదేమీ ఆశ్చర్యాన్నివ్వలేదు. టాటా సన్స్ నుంచి ఆరు కంపెనీలు, సంజీవ్ గోయెంకా నుంచి మూడు, కుమార మంగళం బిర్లా నుంచి మూడు చొప్పున కంపెనీలు జాబితాలో ఉన్నాయి’’అని హరూన్ ఇండియా ఎండీ అనాస్ రెహమాన్ జునైద్ తెలిపారు.
లిస్టులో తెలంగాణ సంస్థల సంఖ్య రెండు పెరిగి 31కి చేరింది. టాప్ 10 యంగెస్ట్ కంపెనీల జాబితాలో సువెన్ ఫార్మా, మెన్సా బ్రాండ్స్ చోటు దక్కించుకున్నాయి.
Success Story : లక్ష జీతం వదులుకున్నా.. జామకాయలు అమ్ముతున్నా.. కారణం ఇదే..
Tata Steel India 2022 Rapid Tourney: రన్నరప్ అర్జున్.. హారికకు మూడో స్థానం
టాటా స్టీల్ ఇండియా చెస్ అంతర్జాతీయ ర్యాపిడ్ టోర్నీ ఓపెన్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ రన్నరప్‌గా నిలువగా.. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో స్థానాన్ని దక్కించుకుంది. అర్జున్‌కు ఐదు వేల డాలర్లు (రూ. 4 లక్షలు), హారికకు నాలుగు వేల డాలర్లు (రూ. 3 లక్షల 24 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. డిసెంబర్ 1న ముగిసిన ర్యాపిడ్ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత అర్జున్ 6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఏడో రౌండ్‌లో మగ్సూద్‌లూ (ఇరాన్)తో 39 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న అర్జున్, ఎనిమిదో రౌండ్‌లో 56 ఎత్తుల్లో నకముర (అమెరికా)పై, తొమ్మిదో రౌండ్‌లో 59 ఎత్తుల్లో నిహాల్ సరీన్ (భారత్)పై గెలిచాడు. మహిళల విభాగంలో హారిక 5.5 పాయింట్లతో మూడో స్థానాన్ని సాధించింది. ఏడో రౌండ్ గేమ్‌ను అన్నా ముజిచుక్ (ఉక్రెయిన్) తో 22 ఎత్తుల్లో, ఎనిమిదో రౌండ్ గేమ్‌ను మరియా (ఉక్రెయిన్)తో 25 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హారిక తొమ్మిదో రౌండ్‌లో 30 ఎత్తుల్లో సవితాశ్రీ (భారత్)పై గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఐదు పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది.
► ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 11 పతకాలు
GST Collection: జీఎస్‌టీ వసూళ్లు.. రూ.1.46 లక్షల కోట్లు
వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) భారీ వసూళ్లు కొనసాగుతున్నాయి. వినియోగ వ్యయాల దన్నుతో నవంబర్‌లో 11 శాతం పెరిగి (2021 నవంబర్‌తో పోల్చి) రూ.1,45,867 కోట్లుగా నమోదయ్యాయి. జీఎస్‌టీ వ సూళ్లు రూ.1.4 లక్ష కోట్లు దాటడం ఇది వరుసగా తొమ్మిదవ నెల. ఇందులో రెండు నెలలు రూ.1.50 లక్షల కోట్లు దాటాయి. కాగా, ఆగస్టు తర్వాత తక్కువ వసూళ్లు జరగడం నవంబర్‌లోనే మొదటిసారి. ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాలు విభాగాల వారీగా..
☛ సెంట్రల్ జీఎస్‌టీ రూ.25,681 కోట్లు
☛ స్టేట్ జీఎస్‌టీ రూ.32,651 కోట్లు
☛ ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ రూ.77,103 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.38,635 కోట్లుసహా).
☛ సెస్ రూ.10,432 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.817
కోట్లతో సహా)
☛ ‘ఒకే దేశం– ఒకే పన్ను’ నినాదంతో 2017 జూలైలో పలు రకాల పరోక్ష పన్నుల స్థానంలో ప్రారంభమైన జీఎస్‌టీ వ్యవస్థలో 2022 ఏప్రిల్‌లో వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.1,67,650 కోట్లుగా నమోదయ్యాయి.
Inspirational Story : ఇరవై ఒక్కవేల పెట్టుబడి.. లక్షల్లో ఆదాయం.. నా సక్సెస్ సిక్రెట్ ఇదే..
2022 నుంచి ఇలా...
నెల | జీఎస్‌టీ ఆదాయం (రూ.కోట్లలో) |
జనవరి 2022 | 1,40,986 |
ఫిబ్రవరి | 1,33,026 |
మార్చి | 1,42,095 |
ఏప్రిల్ | 1,67,650 |
మే | 1,40,885 |
జూన్ | 1,44,616 |
జూలై | 1,48,995 |
ఆగస్టు | 1,43,612 |
సెప్టెంబర్ | 1,47,686 |
అక్టోబర్ | 1,51,718 |
నవంబర్ | 1,45,867 |