Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 3rd కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu September 3rd 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Current Affairs in Telugu September 3rd 2022
Current Affairs in Telugu September 3rd 2022

Greenpeace India report: 99 శాతం మందికి కలుషిత గాలే గతి 

 దేశ జనాభాలో అక్షరాలా 99 శాతం మంది కలుషిత గాలి పీలుస్తున్నారు. పీఎం 2.5 విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) నిర్దేశించిన ప్రమాణాలను మీరిన గాలే దిక్కవుతోంది. గ్రీన్‌పీస్‌ ఇండియా సంస్థ ‘డిఫరెంట్‌ ఎయిర్‌ అండర్‌ వన్‌ స్కై’ పేరిట సెప్టెంబర్ 2 న విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. నివేదికలోని ముఖ్యాంశాలు..  

  • భారత్‌లో ప్రజలు పీలుస్తున్న గాలి డబ్ల్యూహెచ్‌ఓ వార్షిక సగటు గైడ్‌లైన్‌ కంటే ఐదు రెట్లు అధిక పీఎం 2.5 కణాలు కలిగి ఉంటున్నదే.  
  • దేశంలో 62 శాతం మంది గర్భిణులు అత్యంత కాలుష్య ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మొత్తం జనాభాలో 56 శాతం మంది ఇలాంటి ప్రాంతాల్లోనే ఉంటున్నారు.  
  • ఇండియాలో అత్యధిక కాలుష్య ప్రాంతం దేశ రాజధాని ప్రాంతం–ఢిల్లీ.   
  • కలుషిత గాలి వల్ల  వయోవృద్ధులు, శిశువులు, గర్భిణులు అధికంగా ప్రభావితమవుతున్నారు.  
  • గాలి కాలుష్యానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ఎయిర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ సిస్టమ్‌ను ప్రభుత్వాలు తప్పనిసరిగా ప్రారంభించాలి.  
  • గాలి కాలుష్యం ఎక్కువగా ఉండేందుకు ఆస్కారం ఉన్న రోజుల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించాలి. ప్రజలకు ఆరోగ్య సూచనలు జారీ చేయాలి. దీనివల్ల వారు అప్రమత్తంగా వ్యవహరించేందుకు వీలుంటుంది.  
  • ఇప్పుడున్న జాతీయ గాలి నాణ్యత ప్రమాణాల్లో వెంటనే మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.   
  • నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌(ఎన్‌సీఏపీ)ను మరింత పారదర్శకంగా, శక్తివంతంగా, సమగ్రంగా రూపొందించాలి.  

Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 2nd కరెంట్‌ అఫైర్స్‌

Maternity leave: పుట్టిన వెంటనే బిడ్డ మరణిస్తే... 60 రోజుల ప్రసూతి సెలవులు
కేంద్ర ప్రభుత్వోద్యోగులకు ప్రసవమైన వెంటనే శిశువు మరణిస్తే 60 రోజులు ప్రత్యేక ప్రసూతి సెలవును మంజూరు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ‘‘ఉద్యోగి ప్రసూతి సెలవులన్నీ వాడుకున్నా ఈ ప్రత్యేక సెలవులు తీసుకోవచ్చు. పుట్టిన శిశువు 28 రోజుల్లోపు మరణిస్తే ఈ ప్రసూతి సెలవులు వర్తి స్తాయి’’ అంటూ సెప్టెంబర్ 2 న ఉత్తర్వులిచ్చింది.

INS Vikrant : ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ జలప్రవేశం  

 పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డిజైన్‌ చేసి, నిర్మించిన అత్యంత భారీ విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ సెప్టెంబర్ 2 న జలప్రవేశం చేసింది. కేరళలోని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (సీఎస్‌ఎల్‌) ఇందుకు వేదికగా మారింది. భారీ యుద్ధ నౌకలను సొంతంగా నిర్మించుకొనే సామర్థ్యం గల అమెరికా, యూకే, రష్యా, చైనా, ఫ్రాన్స్‌ దేశాల జాబితాలో భారత్‌ కూడా సగర్వంగా చేరింది. ఈ బాహుబలి యుద్ధనౌకను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ జల ప్రవేశానికి సూచికగా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ విక్రాంత్‌ అంటే విజయమని అన్నారు. విక్రాంత్‌ కేవలం యుద్ధనౌక కాదని, దేశ నైపుణ్యాలకు, ప్రతిభకు సిసలైన తార్కాణమని ఉద్ఘాటించారు. ‘‘ఈ నౌక మన దేశానికి నూతన విశ్వాసాన్ని అందించింది. ఇది సముద్రంలో అలలపై తేలియాడే వైమానిక క్షేత్రం. ఒక నగరం. విక్రాంత్‌లో ఉత్పత్తి చేసే కరెంటుతో 5,000 ఇళ్లకు వెలుగులు పంచవచ్చు’’ అని అన్నారు.

Also read: Worlds Biggest Temple: అతిపెద్ద వేదిక్‌ ప్లానిటోరియం టెంపుల్‌ని నిర్మిస్తున్న ఇస్కాన్

శివాజీ నౌకాదళం ప్రేరణతో..  నౌకాదళానికి కొత్త పతాకం

  • ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో రూపొందించిన నావికాదళ నూతన చిహ్నాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ‘‘ఇది చరిత్రాత్మక దినం.  ఈ జెండాను శివాజీకి అంకితమిస్తున్నాం’’ అన్నారు. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌పై నూతన పతాకాన్ని మోదీ ఎగురవేశారు.
  • నావికాదళానికి కొత్త జెండా చేరింది. ఇందులో ఎడమవైపు పైభాగాన జాతీయ జెండా ఉంది, కుడి వైపు కింది భాగంలో ఛత్రపతి శివాజీ ప్రేరణతో ఒక చిహ్నాన్ని చేర్చారు. 
  • నీలం రంగులో అష్టభుజి ఆకారంలో ఉన్న ఈ చిహ్నంలో రెండు బంగారు రంగు బోర్డర్లున్నాయి. అష్టభుజి ఆకారాన్ని, ఈ రెండు బోర్డర్‌ లైన్లను శివాజీ నౌకాదళం చిహ్నం నుంచి తీసుకున్నారు.
  • అష్టభుజి ఎనిమిది దిక్కులకు సూచిక అని, అన్ని దిక్కుల్లోనూ నౌకాదళం దుర్భేద్యమని తెలియజేయడానికి ఈ చిహ్నాన్ని డిజైన్‌ చేసినట్లు నావికాదళం వెల్లడించింది.  
  • అష్టభుజి మధ్యభాగంలో నాలుగు సింహాల జాతీయ చిహ్నం. లంగరు (యాంకర్‌) గుర్తు డిజైన్‌ చేశారు. దాని కిందిభాగంలో నావికాదళం మోటో ‘సం నో వరుణః’ (వరుణ దేవుడా, మాపై కరుణ కురిపించు) కనిపిస్తోంది. దీన్ని రుగ్వేదం నుంచి స్వీకరించారు. 

Also read: Green Hydrogen Hub గా ఆంధ్రప్రదేశ్‌

Telangana Policeకు ఫిక్కీ స్మార్ట్‌ పోలీసింగ్‌ అవార్డు

స్మార్ట్‌ పోలీసింగ్‌లో ఉత్తమ విధానాలను అమలు చేస్తున్నందుకుగాను ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ) తెలంగాణ పోలీస్‌ శాఖకు 2021–స్మార్ట్‌ పోలీసింగ్‌ అవార్డును ప్రకటించింది. తెలంగాణ పోలీస్‌ శాఖ మహిళా భద్రతా విభాగంలో షీ–భరోసా, సైబర్‌ ల్యాబ్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి బాలల రక్షణలో సాధించిన ఉత్తమ ఫలితాలకుగాను న్యూఢిల్లీలోని ఫిక్కీ ఈ అవార్డును ప్రకటించింది. ఈ ఫిక్కీ స్మార్ట్‌ పోలీసింగ్‌ అవార్డు–2021ను ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్‌ మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతి లక్రా స్వీకరించారు.

Also read: Guinness Record: గీతా పారాయణంలో గిన్నిస్‌ రికార్డు

Telugu University: 44 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు​​​​​​​

తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో విశేషమైన సేవలందించిన 44 మంది ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2019వ సంవత్సరానికి కీర్తి పురస్కారాలను ప్రకటించింది. విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య తంగెడ కిషన్‌రావు అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల సంఘం ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను పురస్కార గ్రహీతలుగా ఎంపిక చేసింది. 

Also read: Central Sahitya Akademi Award: పత్తిపాక మోహన్‌కు బాలల సాహిత్య పురస్కారం

పురస్కారాలకు ఎంపికైనవారు వీరే..
పి.వి.మనోహరరావు(ఆధ్యాత్మిక సాహిత్యం), బాలాంత్రపు వెంకటరమణ(ప్రాచీన సాహిత్యం), గన్ను కృష్ణమూర్తి (సృజనాత్మక సాహిత్యం), రామగిరి శివకుమార్‌(కాల్పనిక సాహిత్యం), వి.రామాంజనీ కుమారి(అనువాద సాహిత్యం), గరిపల్లి అశోక్‌(బాలసాహిత్యం), కవిరాజు (వచన కవిత), బి.రాములు(తెలుగు గేయం), డాక్టర్‌ నలవోలు నరసింహారెడ్డి(పద్యరచన), డాక్టర్‌ వి.రంగాచార్య(పద్య రచన), కూతురు రాంరెడ్డి(కథ), పి.ఎస్‌.నారాయణ(నవల), వై.వి.ఎల్‌.ఎన్‌.శాస్త్రి­(హాస్య రచన), గిడుగు వెంకట రామకృష్ణారావు(జీవితచరిత్ర), మల్లవరపు చిన్నయ్య­(వివిధ ప్రక్రియలు), వడ్డేపల్లి నర్సింగరావు(నాటక రచయిత), దోర్బల బాలశేఖర శర్మ, (జనరంజక విజ్ఞానం), సంకేపల్లి నాగేంద్రశర్మ(పరిశోధన), పొన్నం రవిచంద్ర(పత్రికా రచన), పారుపల్లి కోదండరామయ్య(భాష), ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్‌(సాహిత్య విమర్శ), చుక్కాయపల్లి శ్రీదేవి(అవధానం), విజయలక్ష్మి శర్మ(లలిత సంగీతం), దారూరి సులోచనాదేవి(శాస్త్రీయ సంగీతం), అంతడ్పుల రమాదేవి (జానపద గాయకులు), జగ్లర్‌ నారాయణ(జానపద కళలు), డాక్టర్‌ సావిత్రి సాయి(ఉత్తమ రచయిత్రి), ఝాన్సీ కె.వి.కుమారి­(ఉత్తమ రచయిత్రి), బి.హైమావతి(ఉత్తమ నటి), వి.నారాయణ(ఉత్తమ నటుడు), ముట్నూరి కామేశ్వరరావు(నాటక రంగం), డాక్టర్‌ బి.­కుమారస్వామి­(ఆంధ్రనాట్యం), డాక్టర్‌ పసుమర్తి శేషుబాబు(కూచిపూడి నృత్యం), డాక్టర్‌ సి,వీరేందర్‌(వ్యక్తిత్వ వికాసం), నార్నె వెంకట సుబ్బయ్య (హేతవాద ప్రచారం), ప్రొఫెసర్‌ రమా మెల్కోటే (మహిళాభ్యుదయం), ఎ.పుల్లయ్య (గ్రంథాలయ సమాచార విజ్ఞానం), ఎం.సైదానాయక్‌(గ్రంథాలయ కర్త), రఘుశ్రీ (సాంస్కృతిక సంస్థ నిర్వహణ), వేములపాటి మాధవరావు(ఇంద్రజాలం), నర్సిం (కార్టూనిస్ట్‌), డాక్టర్‌ రథం మధనాచార్యులు( జ్యోతిçష్యం), డాక్టర్‌ రాజ్‌ మహ్మద్‌ (ఉత్తమ ఉపాధ్యాయుడు), ప్రొఫెసర్‌ గీతా కృష్ణమాచారి(చిత్రలేఖనం)లకు త్వరలో తెలుగు వర్సిటీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఒక్కొక్కరిని రూ.5,116 నగదు, పురస్కారపత్రంతో సత్కరిస్తామని రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 

Also read: IBRAD : అరకు కాఫీకి జాతీయ స్థాయి అవార్డు

RBI: నవంబర్‌ 30 నుంచి డిజిటల్‌ రుణాలకూ కొత్త నిబంధనలు

డిజిటల్‌ రుణాలకు సంబంధించి ఇటీవల ప్రకటించిన కొత్త నిబంధనలను, ఇప్పటికే పంపిణీ చేసిన డిజిటల్‌ రుణాలకు సైతం వర్తింపజేయాలని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలను ఆర్‌బీఐ ఆదేశించింది. ఇందుకు నవంబర్‌ 30 వరకు గడువు ఇచ్చింది. అసాధారణ స్థాయిలో వడ్డీ రేట్లు, అనైతిక రుణ వసూళ్లను కట్టడి చేస్తూ నూతన నిబంధనలను ఆర్‌బీఐ గత నెలలో ప్రకటించింది. డిజిటల్‌ రుణాలకు మధ్యవర్తులుగా వ్యవహరించే ఫిన్‌టెక్‌ సంస్థలు కస్టమర్ల నుంచి చార్జీ వసూలు చేయకూడదని కూడా ఆదేశించింది. బ్యాంకులే ఈ చార్జీలను చెల్లించాలని నిర్దేశించింది. మొబైల్‌ యాప్‌లు, డిజిటల్‌ మాధ్యమాల ద్వారా మంజూరు చేసే రుణాలకు ఈ నూతన నిబంధనలు వర్తిస్తాయి. ఇప్పటికే తీసుకున్న డిజిటల్‌ రుణాలు, తాజాగా తీసుకునే వాటికి కొత్త నిబంధనలు అమలుకానున్నాయి. ప్రస్తుత రుణాలనూ కొత్త నిబంధనల పరిధిలోకి తీసుకొచ్చేందుకు తగిన సమయం ఇస్తున్నట్టు ఆర్‌బీఐ పేర్కొంది. కొత్త నిబంధనల కింద రుణాన్ని బ్యాంకు నేరుగా రుణ గ్రహీత ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. లెండింగ్‌ సర్వీస్ ప్రొవైడర్‌ లేదా డిజిటల్‌ లెండింగ్‌ యాప్‌ (డీఎల్‌ఏ)  ద్వారా రుణ దరఖాస్తు వచ్చినప్పటికీ, ఆ రుణాన్ని మంజూరు చేసే సంస్థ, నేరుగా రుణ గ్రహీతకు అందించాలి.

Also read: On online safety: 2 వేల లోన్‌ యాప్స్‌ తొలగింపు

Starbucks CEOగా లక్ష్మణ్‌ నరసింహన్‌ నియామకం

మరో బహుళజాతి సంస్థ పగ్గాలు భారత సంతతి వ్యక్తి చేతికి రానున్నాయి. స్టార్‌ బక్స్‌ తదుపరి సీఈవోగా లక్ష్మణ్‌ నరసింహన్‌ (55) ఎంపికయ్యారు. ఆయన ప్రస్తుతం రెకిట్‌ బెంకిసర్‌ సీఈవో పనిచేస్తున్నారు. ఈ బాధ్యతల నుంచి సెపె్టంబర్‌ 30న తప్పుకుంటారు. అక్టోబర్‌ 1న స్టార్‌బక్స్‌ ఇన్‌కమింగ్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీఈవో అయిన హోవార్డ్‌ షుల్జ్‌తో కలసి పనిచేస్తారు. 2023 ఏప్రిల్‌ 1 నుంచి పూర్తి స్థాయి సీఈవోగా, స్టార్‌ బక్స్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లలో భాగం అవుతారని కంపెనీ ప్రకటించింది. అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఎన్నింటికో ప్రస్తుతం భారత సంతతి వ్యక్తులు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌లుగా పనిచేస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌ సత్యనాదెళ్ల, ఆల్ఫాబెట్‌ సుందర్‌ పిచాయ్, ట్విట్టర్‌ సీఈవో పరాగ్‌ అగర్వాల్, అడోబ్‌ శంతను నారాయణన్, డెలాయిట్‌ పునీత్‌ రెంజెన్‌ తదితరుల సరసన నరసింహన్‌ కూడా చేరనున్నారు. ప్రస్తుతం లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న నరసింహన్‌ యూఎస్‌కు మారనున్నారు.  

Also read: GDP Growth Rate: ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 13.5 శాతం

విద్యాభ్యాసం..  
కాలేజీ ఆఫ్‌ ఇఫ్‌ ఇంజనీరింగ్, యూనివర్సిటీ ఆఫ్‌ పుణేలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చేసిన లక్ష్మణ్‌ నరసింహన్‌ ఉన్నత విద్యాభ్యాసం అంతా విదేశాల్లో సాగింది. జర్మనీలో మాస్టర్స్‌ డిగ్రీ, యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాలోని లాడర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఇంటర్నేషనల్‌ స్టడీస్, వార్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ ది యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా నుంచి ఫైనాన్స్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. ఐకానిక్‌ కంపెనీలో చేరుతుండడం పట్ల నరసింహన్‌ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘హోవార్డ్, స్టార్‌ బక్స్‌ బోర్డు, కంపెనీ లీడర్‌షిప్‌ టీమ్‌తో సన్నిహితంగా కలసి పనిచేసేందుకు సుముఖంగా ఉన్నాను. స్టార్‌బక్స్‌ భాగస్వాముల ఉమ్మడి సహకారంతో కంపెనీని తదుపరి వృద్ధి దశలోకి తీసుకెళతాం’’అని ప్రకటించారు. నరసింహన్‌కు బ్రాండ్ల అభివృద్ధిలో, కంపెనీల నిర్మాణంలో మంచి ట్రాక్‌ రికార్డు ఉన్నట్టు స్టార్‌బక్స్‌ ప్రకటించింది. వినియోగదారు కేంద్రంగా, డిజిటల్‌ ఆవిష్కరణలతో భవిష్యత్తు ఆకాంక్షలను నెరవేరుస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొంది. నరసింహన్‌ లోగడ పెప్సికో, మెకిన్సే అండ్‌ కంపెనీలోనూ పనిచేశారు. స్టార్‌బక్స్‌ 80కు పైగా దేశాల్లో కాఫీ స్టోర్లను నిర్వహిస్తోంది. భారత్‌లో టాటాలతో జాయింట్‌ వెంచర్‌ కింద కార్యకలాపాలు కొనసాగిస్తోంది. 

Also read: Quiz of The Day (September 02, 2022): భారతదేశంలో బ్రిటిష్‌ సామ్రాజ్యానికి పునాది వేయడానికి కారకుడు?

బహుళజాతి కంపెనీల చీఫ్‌లుగా భారతీయులు...

పేరు కంపెనీ
సుందర్‌ పిచాయ్‌ ఆల్ఫాబెట్, గూగుల్‌
సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌
పరాగ్‌ అగర్వాల్‌ ట్విట్టర్‌
లీనా నాయర్‌ చానెల్‌
అరవింద్‌ కృష్ణ ఐబీఎం గ్రూపు
శంతను నారాయణన్‌ అడోబ్‌ గ్రూపు
అజయ్‌పాల్‌ సింగ్‌ బంగా మాస్టర్‌కార్డ్‌
జయశ్రీ ఉల్లాల్‌ అరిస్టా నెట్‌వర్క్స్‌
రాజీవ్‌ సూరి నోకియా ఐఎన్‌సీ
జార్జ్‌ కురియన్‌ నెట్‌యాప్‌

Also read: FM Nirmala Sitharaman: రెండేళ్ల పాటు 7.4 శాతం వృద్ధి

AIFF: భారత మాజీ గోల్‌కీపర్‌ కల్యాణ్‌ చౌబేకు ఏఐఎఫ్‌ఎఫ్‌ పగ్గాలు​​​​​​​

భారత మాజీ గోల్‌ కీపర్‌ కల్యాణ్‌ చౌబే 85 ఏళ్ల ఏఐఎఫ్‌ఎఫ్‌ చరిత్రలో అధ్యక్షుడైన ఆటగాడిగా నిలిచారు. మాజీ కెప్టెన్, దిగ్గజం బైచుంగ్‌ భూటియా ఈ ఎన్నికలో ఓడినప్పటికీ మైదానంలోలాగే ఓ ఆటగాడి చేతిలోనే ఓడాడు. రాజకీయ నాయకుడి చేతిలో కాకపోవడం గొప్ప ఊరట. సెప్టెంబర్ 2 న జరిగిన ఎన్నికల్లో 46 ఏళ్ల కల్యాణ్‌ చౌబే అధ్యక్షుడిగా ఏకపక్ష విజయం సాధించారు. ఆయన 33–1 ఓట్ల తేడాతో భూటియాను ఓడించారు. ఆశ్చర్యకరంగా మాజీ  కెప్టెన్ కు ఒక్క ఓటే రావడం విచిత్రం! భూటియా, ఐఎం విజయన్, లారెన్స్, హైదరాబాద్‌కు చెందిన భారత మాజీ కెప్టెన్ షబ్బీర్‌ అలీ ఆటగాళ్ల ప్రతినిధులుగా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (ఈసీ) సభ్యులుగా వ్యవహరిస్తారు. మిగతా 14 మంది ఈసీ మెంబర్లంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో తెలంగాణ ఫుట్‌బాల్‌ సంఘం జనరల్‌ సెక్రటరీ జీపీ ఫల్గుణతో పాటు అవిజీత్‌ పాల్, పి.అనిల్‌ కుమార్, వాలంక నటాష, మాలోజి రాజే ఛత్రపతి, మేన్ల ఎతెన్పా, మోహన్‌   లాల్, ఆరిఫ్‌ అలీ, కె.నీబౌ సెఖోస్, లాల్గింగ్లోవా, దీపక్‌ శర్మ, విజయ్‌  బాలి, ఇంతియాజ్‌ హుస్సేన్‌ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన గోపాలకృష్ణ కొసరాజు కోశాధికారి పదవి కోసం పోటీపడి 1–32తో కిపా అజయ్‌ (అరుణాచల్‌ ప్రదేశ్‌) చేతిలో ఓడారు.  

Also read: Quiz of The Day (September 03, 2022): తెలంగాణ రాష్ట్రంలో అతి పొడవైన నది?

మంచి గోల్‌ కీపర్‌... 
కల్యాణ్‌ చౌబే మాజీ గోల్‌ కీపర్, మంచి గోల్‌కీపర్‌  కూడా. 1996లో మోహన్‌ బగాన్‌ సీనియర్‌ క్లబ్‌ తరఫున అరంగేట్రం చేశారు. తదనంతరం ఈస్ట్‌ బెంగాల్, జేసీటీ, సాల్గావ్‌కర్‌ తదితర క్లబ్‌లకు 2003 ఏడాది వరకు ప్రాతినిధ్యం వహించారు. అంతకంటే ముందు జూనియర్‌ స్థాయిలో భారత అండర్‌–17, అండర్‌–20 జట్ల తరఫున ఆసియా యూత్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. 1999–2000లో ప్రి–ఒలింపిక్‌ క్వాలిఫికేషన్‌లో భారత సీనియర్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. దక్షిణాసి యా ఫుట్‌బాల్‌ చాంపియషిప్‌లో భారత్‌ మూడుసార్లు విజేతగా నిలువడంలో గోల్‌కీపర్‌ గా చౌబే కీలకపాత్ర పోషించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో 2019లో బీజేపీ తరఫున బెంగాల్‌లో ఎంపీ పదవికి పోటీ చేసి ఓడిపోయారు.  

Also read: Indian Polity Bit Bank For All Competitive Exams: భారతదేశ పాలన బ్రిటిష్‌ చక్రవర్తి పరిధిలోకి వచ్చినట్లు విక్టోరియా రాణి ప్రకటన చేసిన రోజు?

Tennis Star Serena Williams Retires: 27 ఏళ్ల కెరీర్‌కు సెరెనా విలియమ్స్ గుడ్ బై 
​​​​​​​

అమెరికన్‌ మహిళ టెన్నిస్‌ స్టార్‌.. సెరెనా విలియమ్స్‌ సెప్టెంబర్ 3 న ఉదయం జరిగిన విమెన్స్ సింగిల్స్ మూడో రౌండ్‌లో సెరెనా 5-7, 7-6 (7/4), 1-6 తో ఆస్ట్రేలియాకు చెందిన అజ్లా టామ్లానోవిక్ చేతిలో పోరాడి ఓడిపోయింది. దీంతో 24వ గ్రాండ్‌స్లామ్‌ అందుకోవాలన్న ఆమె కల తీరకుండానే కెరీర్‌ ముగించింది.  

Also read: World Badminton Championship 2022 : ప్రపంచ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో.. 

27 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో సెరెనా విలియమ్స్‌ 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నెగ్గింది. ఇందులో ఏడుసార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, మూడుసార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌, ఏడుసార్లు వింబుల్డన్‌.. మరో ఆరుసార్లు యూఎస్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచింది.

Also read: Quiz of The Day (September 01, 2022): నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎక్కడ జన్మించారు?

ఈ తరంలో మహిళల టెన్నిస్‌ విభాగంలో అత్యధిక టైటిళ్లు గెలిచిన క్రీడాకారిణిగా సెరెనా రికార్డు సృష్టించింది. 2017లో ప్రెగ్నెంట్‌ ఉ‍న్న సమయంలోనే సెరెనా చివరిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ నెగ్గింది. అయితే, వయసు మీద పడటం, గాయాల కారణంగా గత ఐదేళ్లలో ఆమె ఒక్క గ్రాండ్ స్లామ్ కూడా గెలవలేకపోయింది. దాంతో 41 ఏళ్ల సెరెనా కెరీర్ ముగించాలని నిర్ణయానికి వచ్చింది.

Also read: India vs Pakistan Cricket Match : పాకిస్తాన్‌పై భారత్‌ ఘ‌న విజయం.. రికార్డులు ఇవే..

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 03 Sep 2022 06:40PM

Photo Stories