Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 13th కరెంట్ అఫైర్స్
National Games 2022: స్వర్ణం సాధించిన తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్
జాతీయ క్రీడల్లో మళ్లీ సరీ్వసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ) జట్టే సత్తా చాటుకుంది. ‘సెంచరీ’ని మించిన పతకాలతో ‘టాప్’ లేపింది. సర్వీసెస్ క్రీడాకారులు మొత్తం 128 పతకాలతో అగ్రస్థానంలో నిలిచారు. ఇందులో 61 స్వర్ణాలు, 35 రజతాలు, 32 కాంస్యాలున్నాయి. అట్టహాసంగా ఆరంభమైన 36వ జాతీయ క్రీడలకు అక్టోబర్ 12న తెరపడింది.
28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 8000 పైచిలుకు అథ్లెట్లు ఈ పోటీల్లో సందడి చేశారు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో 38, అక్వాటిక్స్‌లో 36 జాతీయ క్రీడల రికార్డులు నమోదయ్యాయి.
- పురుషుల విభాగంలో ఎనిమిది పతకాలు సాధించిన కేరళ స్విమ్మర్ సజన్ ప్రకాశ్ (5 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యం) ‘ఉత్తమ క్రీడాకారుడు’గా... మహిళల విభాగంలో ఏడు పతకాలు సాధించిన కర్ణాటకకు చెందిన 14 ఏళ్ల స్విమ్మర్ హషిక (6 స్వర్ణాలు, 1 కాంస్యం) ‘ఉత్తమ క్రీడాకారిణి’గా పురస్కారాలు గెల్చుకున్నారు. గత జాతీయ క్రీడల్లోనూ (2015లో కేరళ) సజన్ ప్రకాశ్ ‘ఉత్తమ క్రీడాకారుడు’ అవార్డు అందుకోవడం విశేషం.
- చివరిరోజు తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ ‘పసిడి పంచ్’తో అలరించాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన హుసాముద్దీన్ సర్వీసెస్ తరఫున ఈ క్రీడల్లో పాల్గొన్నాడు. 57 కేజీల ఫైనల్లో హుసాముద్దీన్ 3–1తో సచిన్ సివాచ్ (హరియాణా)పై గెలిచాడు.
- ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఓవరాల్ చాంప్ సర్వీసెస్‌కు ‘రాజా భళీంద్ర సింగ్’ ట్రోఫీని అందజేశారు. సర్వీసెస్ నాలుగోసారి ఈ ట్రోఫీ చేజిక్కించుకుంది. 39 స్వర్ణాలు, 38 రజతాలు, 63 కాంస్యాలతో కలిపి మొత్తం 140 పతకాలు సాధించి రెండో స్థానంలో నిలిచిన మహారాష్ట్రకు ‘బెస్ట్ స్టేట్’ ట్రోఫీ లభించింది. ఓవరాల్‌గా సరీ్వసెస్‌కంటే మహా రాష్ట్ర ఎక్కువ పతకాలు సాధించినా స్వర్ణాల సంఖ్య ఆధారంగా సరీ్వసెస్‌కు టాప్ ర్యాంక్ దక్కింది.
- తెలంగాణ 8 స్వర్ణాలు, 7 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పతకాలతో 15వ స్థానంలో... ఆంధ్రప్రదేశ్ 2 స్వర్ణాలు, 9 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 16 పతకాలతో 21వ స్థానంలో నిలిచాయి. 2015 కేరళ జాతీయ క్రీడల్లో తెలంగాణ 8 స్వర్ణాలు, 14 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి మొత్తం 33 పతకాలతో 12వ స్థానంలో... ఆంధ్రప్రదేశ్ 6 స్వర్ణా లు, 3 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 16 పతకాలతో 18వ స్థానంలో నిలిచాయి.
Retail inflation: సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.41%
భారత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అక్టోబర్ 12న వెలువడిన అధికారిక గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా తొమ్మిదవ నెల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న ఆరు శాతం వద్ద కట్టడి పరిధి దాటి నమోదయ్యింది. పైగా ఆగస్టులో 7% ఉంటే, సెప్టెంబర్ లో 7.41%కి (2021 ఇదే నెల ధరలతో పోల్చి) పెరిగింది. గత ఏడాది సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.35 శాతమే. ఇక ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో వృద్ధిలేకపోగా 0.8 శాతం క్షీణించింది.
Also read: India Cricket Team : టీమిండియా అరుదైన ప్రపంచ రికార్డు.. ఇతర జట్లకు అందనంత దూరంలో..
సామాన్యునిపై ధరల భారం
రిటైల్ ద్రవ్యోల్బణ బాస్కెట్‌లో కీలక ఆహార విభాగం ధరలు సెప్టెంబర్‌లో తీవ్రంగా పెరిగాయి. మొత్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్టం... 7.41 శాతం పెరగ్గా, ఒక్క ఫుడ్ బాస్కెట్ ఇన్‌ఫ్లెషన్ 8.60 ( ఆగస్టులో 7.62 శాతం) శాతానికి చేరింది. కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం హద్దు మీరి పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి వరుసగా నాలుగుసార్లు ఆర్‌బీఐ రెపోరేటు పెంచింది. మేలో 4 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు) ఈ నాలుగు దఫాల్లో 190 బేసిస్ పాయింట్లు పెరిగి, ఏకంగా 5.9 శాతానికి (2019 ఏప్రిల్ తర్వాత) చేరింది. మరింత పెరగవచ్చనీ ఆర్‌బీఐ సంకేతాలు ఇచి్చంది. రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతంకాగా, క్యూ2 , క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1 శాతం, 6.5%, 5.8 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనావేసింది. అక్టోబర్, నవంబర్‌ల్లోనూ ద్రవ్యోల్బణం ఎగువబాటనే పయనిస్తే, తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 5 నుంచి 7 సమయంలో ఆర్‌బీఐ రెపో రేటును మరో అరశాతం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడచిన తొమ్మిది నెలలుగా ద్రవ్యోల్బణం కట్టడిలో ఎందుకు లేదన్న అంశంపై కేంద్రానికి ఆర్‌బీఐ త్వరలో ఒక నివేదిక సమర్పిస్తుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.
Industrial production: 18 నెలల కనిష్టానికి పారిశ్రామిక రంగం
ఇక ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి గడచిన 18 నెలల్లో ఎన్నడూ లేని తీవ్ర పతన స్థాయి 0.8 శాతం క్షీణతను చూసింది. 2021 ఫిబ్రవరిలో ఐఐపీలో 3.2 శాతం క్షీణత నమోదయ్యింది. తాజా సమీక్షా నెల్లో సూచీలో దాదాపు 60 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగం కూడా 0.7% క్షీణతను (2021 ఇదే నెలతో పోల్చి) చూసింది. గత ఏడాది ఇదే కాలంలో తయారీ ఉత్పత్తి వృద్ధి రేటు 11.1%. మైనింగ్ ఉత్పాదకత 23.3 శాతం వృద్ధి నుంచి 3.9% క్షీణతలోకి జారింది. విద్యుత్ రంగం ఉత్పత్తి వృద్ధి రేటు 16% నుంచి 1.4 శాతానికి పడిపోయింది. క్యాపిటల్ గూడ్స్ విభాగంలో వృద్ధి రేటు 20% నుంచి 5%కి పడిపోయింది.
Also read: Quiz of The Day (October 13, 2022): పూగాలోయ ఏ రాష్ర్టంలో ఉంది?
Human intelligence: ల్యాబ్‌లోని మెదడు కణాలూ వీడియోగేమ్ ఆడేశాయ్
సిడ్నీ: మానవ మేథోశక్తిని ప్రయోగశాలలో పునఃసృష్టి చేసేందుకు ప్రయత్నిస్తున్న పరిశోధకులు ఆ క్రతువులో స్వల్ప విజయం సాధించారు. 1970ల నాటి టెన్నిస్ క్రీడను తలపించే పోంగ్ కంప్యూటర్ వీడియోగేమ్‌ను ప్రయోగశాలలో అభివృద్ధిచేసిన మెదడు కణాలు అర్థంచేసుకుని, అందుకు అనుగుణంగా స్పందిస్తున్నాయి. కొత్త తరం బయోలాజికల్ కంప్యూటర్ చిప్స్ అభివృద్ధి కోసం ఆస్ట్రేలియాలోని కార్టికల్ ల్యాబ్స్ అంకురసంస్థ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇందులోని న్యూరో శాస్త్రవేత్తల బృందం మానవ, ఎదగని ఎలుక నుంచి మొత్తంగా దాదాపు 8,00,000 మెదడు కణాలను ల్యాబ్‌లో పెంచుతోంది. డిష్‌బ్రెయిన్‌గా పిలుచుకునే ఈ మెదడు కణాల సముదాయం ఎలక్ట్రోడ్ వరసలపై ఉంచినపుడు పోంగ్ వీడియోగేమ్‌కు తగ్గట్లు స్పందించిందని పరిశోధనలో భాగస్వామి అయిన డాక్టర్ బ్రెడ్ కగాన్ చెప్పారు. ఈ తరహా ప్రయోగం కృత్రిమ జీవమేథో ప్రయోగాల్లో మొదటిది కావడం గమనార్హం. మూర్ఛ, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం సమస్యలను మరింతగా అర్ధంచేసుకునేందుకు, భవిష్యత్‌లో కృత్రిమంగా ప్రయోగశాలలోనే జీవమేథ రూపకల్పనకు ఈ పరిశోధన ఫలితాలు ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. తదుపరి పరీక్షలో తాము మత్తునిచ్చే ఇథనాల్‌ను వాడి కణాల పనితీరు.. మద్యం తాగిన మనిషి ‘పనితీరు’లా ఉందో లేదో సరిచూస్తామన్నారు. ఈ పరిశోధన వివరాలు న్యూరాన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
Also read: Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 12th కరెంట్ అఫైర్స్
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP