Skip to main content

PM Narendra Modi : వరుసగా తొమ్మిదోసారి.. ఎర్రకోటపై ప్రధాని మోదీ పతాకావిష్కరణ

అమృతోత్సవ సంబరాల్లో ఆసేతుహిమాచలం తడిసి ముద్దయింది. ఏ ఇంటిపై చూసినా త్రివర్ణ పతాక రెపరెపలే క‌న్పించాయి. ఎక్కడ చూసినా స్వాతంత్య్ర స్ఫూర్తి వెల్లివిరిసింది. 76వ స్వాతంత్య్ర దినాన్ని ఆగస్టు 15వ తేదీన (సోమవారం) దేశమంతా ఘనంగా జరుపుకుంది.

ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని, రాష్ట్రాల రాజధానుల్లో ముఖ్యమంత్రులు జెండా ఎగురవేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు సర్వత్రా మువ్వన్నెల జెండా సగర్వంగా ఎగిరింది. చిన్నా పెద్దా అంతా ఉత్సవాల్లో పాల్గొని జోష్‌ పెంచారు. జెండాలు చేబూని ర్యాలీలు, ప్రదర్శనలతో అలరించారు. వలస పాలనను అంతం చేసేందుకు అమర వీరులు చేసిన అపూర్వ త్యాగాలను మనసారా స్మరించుకున్నారు. దేశాభివృద్ధికి, జాతి నిర్మాణానికి పునరంకితమవుతామంటూ ప్రతిజ్ఞ చేశారు. భారత నౌకా దళం ఆరు ఖండాల్లో పంద్రాగస్టు వేడుకలు జరిపి దేశవాసుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచింది.

వందేళ్ల వేడుకల నాటికి..
‘అమృతోత్సవ భారతం ఇక అతి పెద్ద లక్ష్యాలనే నిర్దేశించుకోవాలి. రానున్న పాతికేళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు సంక‌ల్పించుకోవాలి’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇందుకు పంచ ప్రతిజ్ఞలు చేసుకుందామంటూ పిలుపునిచ్చారు. ‘మన ఘన వారసత్వం, తిరుగులేని ఐక్యతా శక్తి, సమగ్రత పట్ల గర్వపడదాం. ప్రధాని, ముఖ్యమంత్రులు మొదలుకుని సామాన్యుల దాకా పూర్తి చిత్తశుద్ధితో బాధ్యతలను నెరవేరుద్దాం. తద్వారా వందేళ్ల వేడుకల నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకుందాం’’ అని ప్రజలను కోరారు. ‘‘అవినీతి, బంధుప్రీతి జాతిని పట్టి పీడిస్తున్నాయి. వారసత్వ పోకడలు దేశం ముందున్న మరో అతి పెద్ద సవాలు. రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లోనూ తిష్ట వేసిన ఈ అతి పెద్ద జాఢ్యాల బారినుంచి దేశాన్ని విముక్తం చేయాల్సిన సమయమిదే’ అన్నారు. 

వరుసగా తొమ్మిదోసారి..
76వ స్వాతంత్య్ర దినం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన (సోమవారం) ఉదయం ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా సంప్రదాయ కుర్తా, చుడీదార్, బ్లూ జాకెట్, త్రివర్ణాల మేళవింపుతో కూడిన అందమైన తలపాగా ధరించారు. అనంతరం పూర్తిగా దేశీయంగా తయారు చేసిన ఏటీఏజీఎస్‌ శతఘ్నుల ‘21 గన్‌ సెల్యూట్‌’ నడుమ జాతీయ జెండాకు వందనం చేశారు. ప్రధానిగా పంద్రాగస్టున ఆయన పతాకావిష్కరణ చేయడం ఇది వరుసగా తొమ్మిదోసారి. అనంతరం గాంధీ మొదలుకుని అల్లూరి దాకా దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధులందరికీ పేరుపేరునా ఘన నివాళులరి్పంచారు. తర్వాత జాతినుద్దేశించి 82 నిమిషాల పాటు ప్రసంగించారు. గత ప్రసంగాల్లా ఈసారి కొత్త పథకాలేవీ ప్రధాని ప్రకటించలేదు.

Published date : 17 Aug 2022 04:21PM

Photo Stories