Top 10 Current Affairs: మరోసారి అధ్యక్ష బరిలో జో బైడెన్
1. కేరళలో తొలిసారి కొత్త మెట్రో వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. కోచి వాటర్ మెట్రో పేరుతో నీటిపై నడిచే మెట్రో సర్వీస్‌ను ప్రధాని మోదీ మంగళవారం జాతికి అంకితం చేశారు. అలాగే కేరళలో మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు జెండా ఊపారు. ఇది తిరువనంతపురం నుంచి కాసరగోడ్ వరకు రాకపోకలు సాగిస్తుంది. అంతేగాకుండా డిజిటల్ సైన్స్ పార్క్‌కు శంకుస్థాపన చేశారు.
2. హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ‘ఆపరేషన్ కావేరి’ని చేపట్టినట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. ఇప్పటివరకు సూడాన్ ఓడరేవుకు 500 మంది భారతీయులు చేరుకున్నారు. నౌకలు, విమానాలను సూడాన్‌కు భారత్ పంపించింది. ఆపరేషన్ కావేరి పర్యవేక్షణ బాధ్యతలను విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ పర్యవేక్షిస్తున్నారు.
3. ప్రధాని నరేంద్రమోదీ ప్రతినెలా చివరి ఆదివారం ‘మన్‌కీ బాత్’ పేరుతో నిర్వహించే కార్యక్రమానికి శ్రోతలు 23 కోట్ల మంది ఉన్నారని, వారిలో 65% మంది హిందీలో వింటున్నారని రోహ్‌తక్‌లోని ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్’ (ఐఐఎం) అధ్యయనంలో వెల్లడైంది.
వచ్చే ఆదివారంతో ఈ కార్యక్రమం 100 నెలలు పూర్తి చేసుకోనుంది. దాదాపు 100 కోట్ల మంది ప్రజలు ఒక్కసారైనా ఈ కార్యక్రమాన్ని విన్నారని, 41 కోట్ల మంది అప్పుడప్పుడు వింటున్నారని ఐఐఎం రోహ్‌తక్ డైరెక్టర్ ధీరజ్ పి.శర్మ సోమవారం తెలిపారు. 22 భారతీయ భాషలు, 29 మాండలికాలతో పాటు చైనీస్, అరబిక్, ఫ్రెంచ్ వంటి 11 విదేశీ భాషల్లోనూ కార్యక్రమం ప్రసారమవుతోంది.
4. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా డెమోక్రటిక్ పార్టీ తరఫున 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ప్రచారం మొదలుపెట్టారు. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా వచ్చే ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్‌గా తిరిగి పోటీ చేయనున్నట్లు బైడెన్ వెల్లడించారు.
5. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు వివాదాలను పరస్పర ఆమోదయోగ్య రీతిలో సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలని భారత్, చైనా నిర్ణయించాయి. ఆదివారం ఇరు దేశాల మధ్య జరిగిన సైనిక చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. వాస్తవాధీన రేఖ వెంబడి అన్ని సమస్యలపై దృష్టిసారించినట్లు వివరించింది.
6. భారత్, అమెరికాలు సంయుక్తంగా చేపట్టిన ‘కోప్ ఇండియా-2023’ వైమానిక విన్యాసాలు సోమవారం ముగిశాయి. పశ్చిమ బెంగాల్‌లోని కలైకుండ వైమానిక స్థావరంలో 15 రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమంలో ఇరు దేశాల వైమానిక దళాలకు చెందిన యుద్ధవిమానాలు పాలుపంచుకున్నాయి. భారత్ తన రఫేల్, తేజస్, సుఖోయ్-30 ఎంకేఐ విమానాలతో... అమెరికా తన ఎఫ్-15ఈ ఫైటర్ జెట్‌లు, బీ1బీ బాంబర్, సి-130జె, సి-17 విమానాలు విన్యాసాల్లో పాల్గొన్నాయి.
7. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ భారత అగ్రశ్రేణి రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం నోటీసు జారీ చేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ఆటగాళ్లు చేసిన తీవ్రమైన ఆరోపణలను పేర్కొంటూ ఢిల్లీ పోలీసులు మరియు ఢిల్లీ ప్రభుత్వం నుండి ప్రతిస్పందన కోరింది.
8. ప్రాంతీయ పార్టీల విరాళాలకు సంబంధించి 2021-22 ఆర్థిక సంవత్సరంలో బీఆర్‌ఎస్ దేశంలోనే టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ పార్టీకి మొత్తం రూ.40.9కోట్లు విరాళాలు అందాయి. రెండో స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఆప్‌కు రూ.38.2 కోట్ల విరాళాలు అందాయి.
అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) ఈ గణాంకాలను వెల్లడించింది. ఆప్ తర్వాత జేడీఎస్‌కు రూ.33.2 కోట్లు డోనేషన్ల రూపంలో వచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీకి రూ.29.7కోట్లు, వైఎస్సార్‌సీపీకి రూ.20 కోట్లు విరాళాలు అందినట్లు ఏడీఆర్ నివేదక తెలిపింది. దేశంలోని మొత్తం 26 ప్రాంతీయ పార్టీలకు రూ.189.8 కోట్లు అందినట్లు నివేదిక పేర్కొంది.
9. తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలతో రాజ్‌భవన్‌లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండిపోయిన బిల్లుల వ్యవహారంలో కదలిక వచ్చింది. మొత్తం 10 బిల్లులు పెండింగ్‌లో ఉండగా, 7 బిల్లులపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయాలు తీసుకుని పరిష్కరించినట్టు ఈ నెల 10న సుప్రీంకోర్టుకు రాజ్‌భవన్ నివేదించింది.
తాజాగా మిగిలిన 3 బిల్లులపై సైతం గవర్నర్ నిర్ణయాలు తీసుకుని పరిష్కరించారని సోమవారం వెల్లడించింది. రాజ్‌భవన్ వర్గాల ప్రకారం.. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ ఏన్యుయేషన్) చట్ట సవరణ బిల్లు–2022ను గవర్నర్ తిరస్కరించారు. తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు–2022తో పాటు తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు–2022పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణలు కోరుతూ తిప్పి పంపారు.
10. సాటీ జుల్డిజ్ అంతర్జాతీయ బ్లిట్జ్ చెస్ టోర్నీలో 11 రౌండ్‌లు ముగిశాక తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ 7 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
కజకిస్తాన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం అర్జున్ ఆరు గేముల్లో గెలిచి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మూడు గేముల్లో ఓడిపోయాడు. సిందరోవ్, హు ఇఫాన్, బిబిసారా, గెల్ఫాండ్, క్రామ్నిక్, కాటరీనా లాగ్నోలపై అర్జున్ నెగ్గాడు. నేడు జరిగే మరో 11 రౌండ్‌లతో టోర్నీ ముగుస్తుంది.