Top 10 Current Affairs: తమిళనాడులో మద్యం డోర్ డెలివిరీ... ప్రత్యేక లైసెన్స్ జారీ
1. కేదార్‌నాథ్ యాత్రకు రిషికేశ్, హరిద్వార్‌లలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు. ఏప్రిల్ 30 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందన్నారు. గఢ్‌వాల్ హిమాలయ సానువుల్లో భారీ వర్షాలు, హిమపాతం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వాతావరణ పరిస్థితులను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. మంగళవారం నుంచి కేదార్‌నాథ్ ధామ్ తెరుచుకోనుంది.
2. దేశంలో తొలిసారిగా నీటిపై నడిచే మెట్రో సర్వీస్ అందుబాటులోకి రానుంది. కొచ్చిన్ వాటర్ మెట్రో సర్వీస్ పేరుతో కేరళ ప్రభుత్వం దీన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది.
ప్రధాని మోదీ ఏప్రిల్ 25న ఈ వాటర్ మెట్రోను జాతికి అంకితం చేయనున్నారు. దక్షిణాసియాలో తొలి వాటర్ మెట్రో ఇదే.
3. అయోధ్యలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఏడు ఖండాల్లోని 155 దేశాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో అయోధ్య రామమందిర స్థలంలో శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు అభిషేకం నిర్వహించారు. పాకిస్థాన్ సహా రష్యా, ఉక్రెయిన్ తదితర దేశాల నుంచి నీటిని తీసుకువచ్చారు. అభిషేకానికి ముందు ఆయా దేశాల నుంచి తెచ్చిన జలాలకు మంత్రోచ్చారణలతో పూజలు చేశారు. బాబర్ జన్మస్థలమైన ఉజ్బెకిస్థాన్‌లోని ప్రసిద్ధ నది కషక్ నుంచి కూడా నీటిని తీసుకువచ్చారు. ఈ జలాలను సేకరించడానికి ట్రస్టుకు రెండున్నర సంవత్సరాలు పట్టింది.
4. దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ (కెఎన్‌పి)కి తీసుకువచ్చిన చీతాల్లో ఒకటి ఆదివారం మరణించింది. దీని వయసు ఆరేళ్లు. దీనికి ఉదయ్ అనే పేరు పెట్టారు. ఆదివారం ఉదయం అస్వస్థతతో ఉన్నట్లు గుర్తించి చికిత్స ప్రారంభించినా ఫలితం దక్కలేదు. నెలరోజుల వ్యవధిలో రెండు చీతాలు ఇక్కడ కన్నుమూశాయి.
5. 'ఎఫ్.ఎల్.12' అనే ఒక ప్రత్యేక లైసెన్స్‌ని తీసుకొచ్చింది తమిళనాడు ప్రభుత్వం. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ని ఎక్సైజ్ శాఖ గత నెలలోనే జారీ చేసింది. మద్యం అమ్మకాల ద్వారా పెద్ద ఎత్తున నిధులను సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న తమిళనాడు ప్రభుత్వం.. అందులో భాగంగా మద్య అమ్మకాలు పెంచేలా ప్రత్యేక లైసెన్స్‌ని తీసుకువచ్చింది. దీంతో పెళ్లిళ్లలోనూ, ఇతర శుభాకార్యల్లోనూ మద్యం సేవించడానికి అధికారికంగా అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు స్టాలిన్ ప్రభుత్వం వాణిజ్య సముదాయాలు, కాన్ఫరెన్స్ హాల్స్, కన్వెన్షన్ సెంటర్లు, మ్యారేజ్ హాల్స్, బంక్వెట్ హాల్స్, స్పోర్ట్స్ స్టేడియాల్లోనూ మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
6. 35 రోజులుగా పోలీసులను ముప్పు తిప్పులు పెడుతున్న ఖలిస్థానీ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్ పాల్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం మోగా జిల్లాలోని ఓ గురుద్వార్ లో అతడు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. చాకచక్యంగా చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.
అతనిపై ఇప్పటికే ఎన్‌ఎస్‌ఏ వారెంట్ జారీ అయ్యింది. అమృత్ పాల్ సింగ్‌ను భద్రతా కారణాల దృష్ట్యా అసోంలోని డిబ్రూగఢ్ జైలుకు తరలించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
7. విదేశీ కరెన్సీ డిపాజిట్ల అంశంలో టీటీడీకి ఊరట లభించింది. మూడేళ్లుగా కొనసాగుతున్న ఈ వ్యవహారానికి కేంద్ర ప్రభుత్వం ఫుల్‌స్టాప్ పెట్టింది. శ్రీవారికి భక్తులు సమర్పించిన విదేశీ కరెన్సీ కానుకలను బ్యాంక్‌లో డిపాజిట్ చేసుకునేందుకు కేంద్రం అనుమతిచ్చింది. ఎఫ్‌సీఆర్‌ఏ చట్టం మేరకు దేశంలో ఎవ్వరికీ ఇవ్వని మినహాయింపును టీటీడీకి ఇచ్చింది. ఏఫ్‌సీఆర్‌ఏ చట్టం సెక్షన్ 50 మేరకు శ్రీవారికి భక్తులు హుండీలో సమర్పించిన విదేశీ కరెన్సీని బ్యాంకులో డిపాజిట్ చేసుకునేందుకు అంగీకరించింది.
దీంతో ఫారెన్ కరెన్సీ మారకంపై టీటీడీలో నెలకొన్న సందిగ్దత తొలగినట్టయ్యింది.
8. ట్విటర్ ఖాతాలకు ‘బ్లూటిక్’ సంబంధించి చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. శుక్రవారం బ్లూటిక్‌ను కోల్పోయిన.. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల ట్విటర్ ఖాతాలకు ఆదివారం మళ్లీ బ్లూటిక్ వచ్చింది. ‘ట్విటర్ బ్లూ’ సర్వీసులకు డబ్బులు చెల్లించని వారికి బ్లూ చెక్‌మార్కును తొలగించే ప్రక్రియను ట్విటర్ అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే కనీసం 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తుల ఖాతాలకు బ్లూ టిక్‌ను పునరుద్ధరించింది.
9. ప్రధాని నరేంద్ర మోదీ 2014 అక్టోబర్ 3న ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ప్రతి నెల చివరి ఆదివారంలో ఆల్ ఇండియా రేడియలో మోదీ ప్రసంగిస్తారు. ఇప్పటి వరకు 99 కార్యక్రమాలు పూర్తికాగా.. 100వ ఎపిసోడ్ సందర్భంగా ప్రధాని మోదీ రూ.100 నాణేలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 30న జరిగే మన్‌కీ బాత్ 100 ఏపీసోడ్ సందర్భంగా రూ.100 కాయిన్‌ను కేంద్రం విడుదల చేయనుంది. విడుదల అనంతరం దీనిని సాధారణ కాయిన్‌లాగా వినియోగించేందుకు వీలు లేదు. కేవలం ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థలు మాత్రమే ఉపయోగించుకునే వెసలు బాటును కేంద్రం కల్పించింది.
10. తెలంగాణలో మొత్తం 64,056 జల వనరులు ఉన్నాయని.. వీటిలో 98.5% (63,064) గ్రామీణ ప్రాంతాల్లో, మిగిలిన 1.5% (992) పట్టణాల్లో ఉన్నాయని కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన తొలి జల వనరుల సెన్సస్ నివేదిక వెల్లడించింది. 80.5% (51,593) జల వనరులు ప్రభుత్వ యాజమాన్యంలో ఉండగా, 19.5% (12,463) ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నాయి. 17.3% (11,076) జల వనరులు ‘కరువు పీడిత ప్రాంతాల కార్యక్రమం’కింద, 10.6% (6,781) గిరిజన ప్రాంతాల్లో, మిగిలిన 72.1% (46,199) వరద పీడిత ప్రాంతాలు, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. అంతేగాక 64,056 జల వనరుల్లో 80.8% (51,733) వాడుకలో ఉండగా, 19.2% (12,323) ఎండిపోవడం, పూడిక తీయకపోవడం, మరమ్మతు చేయలేని విధంగా నాశనం కావడం, లవణీయత ఇతర కారణాల వల్ల ఉపయోగంలో లేవని నివేదికలో వెల్లడించారు.