April 21 Curent Affairs: మే 4, 5వ తేదీల్లో ఎస్‌సీవో సదస్సుకు హాజరుకానున్న బిలావల్ భుట్టో జర్దారీ
1. సూడాన్‌లో సైన్యానికి, పారామిలిటరీ దళమైన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్‌కు మధ్య జరుగుతోన్న సాయుధ పోరాటంలో వందల మంది పౌరులు, సైనికులు మరణించారు. దీంతో అక్కడున్న సుమారు 4వేల మంది భారత పౌరుల్లో ఆందోళన మొదలయ్యింది. ఇప్పటికే భారత ప్రభుత్వం వారిని అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయిన ప్రధాని మోదీ.. సూడాన్‌లో నెలకొన్న పరిస్థితులను సమీక్షించారు. ఈ తరుణంలో ఐరాస సెక్రటరి జనరల్ ఆంటోనియా గుటెరస్‌తో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ న్యూయార్క్‌లో భేటీ అయ్యారు. అయితే సూడాన్‌లోని భారతీయులు అక్కడి భారత రాయబార కార్యాలయానికి వెళ్లొద్దని కేంద్రం ఇప్పటికే సూచనలు జారీ చేసింది.
2. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన గ్రనేడ్ల దాడిలో అయిదుగురు భారత సైనికులు అమరులయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.సైనికులంతా రాష్ట్రీయ రైఫిల్స్ దళానికి చెందినవారని, ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు వీరిని మోహరించారని సైన్యం తెలిపింది. సైనికులు ప్రయాణిస్తున్న ఓ ఆర్మీ ట్రక్కు భింబర్ గలీ నుంచి సాంగియోట్‌కు వెళ్తుండగా గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు ఈ దారుణం చోటు చేసుకుంది.
3. గోవా వేదికగా మే 4, 5 తేదీల్లో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో పాల్గొనేందుకు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ భారత్‌కు రానున్నారు. ఎస్‌సీవో విదేశాంగ మంత్రుల భేటీకి హాజరుకావాలన్న భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ ఆహ్వానం మేరకు ఈ పర్యటన ఖరారైందని పాక్ విదేశీ వ్యవహారాల కార్యాలయ అధికారి ముంతాజ్ జహ్రా బలోచ్ తెలిపారు. రష్యా, చైనా, భారత్, పాకిస్థాన్‌లతోపాటు మధ్య ఆసియా దేశాలతో కూడిన ఎస్‌సీవో అంతర్జాతీయంగా ప్రభావశీల ప్రాంతీయ కూటమిగా గుర్తింపు పొందింది. 2014లో అప్పటి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పర్యటన తర్వాత ఆ దేశ నాయకులు భారత్‌కు రావడం ఇదే తొలిసారి.
4. దేశంలో ఎల్పీజీ వినియోగదారుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. గడిచిన 9 ఏళ్లలో కొత్తగా 17 కోట్ల మంది వినియోగదారులు ఎల్పీజీ కనెక్షన్లు తీసుకున్నారు. దీంతో 2014 ఏప్రిల్‌లో 14.52 కోట్ల మందిగా ఉన్న గ్యాస్ వినియోగదారుల సంఖ్య 2023 నాటికి 31.36 కోట్లకు చేరింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద అధికంగా కనెక్షన్లు తీసుకుంటున్నారు. ఒకప్పుడు సిలిండర్ రావడానికి సగటున 7-10 రోజులు పట్టేది. ఇప్పుడు చాలా చోట్ల 24 గంటల్లోనే వంట గ్యాస్ ఇంటికి చేరుతోంది.
5. రిజిస్ట్రేషన్ శాఖలో ఇ–స్టాంపింగ్ సేవలను క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎంలు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఐటీ సలహాదారు శేషిరెడ్డి హాజరయ్యారు.
6. గోద్రా రైలు దహనం కేసులో దోషులకు ఊరట లభించింది. గుజరాత్ అల్లర్లకు కారణమైన గోద్రా సబర్మతి రైలు దహనం కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఎనిమిది మందికి శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. మరో నలుగురికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు శుక్రవారం బెయిల్ ఆదేశాలు జారీ చేసింది. ఎనిమిది మంది 17 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవించిన కారణంగా వాళ్లు బెయిల్‌కు అర్హులేనని ప్రకటించింది ధర్మాసనం. అయితే ఈ నేరంలో మరో నలుగురి పాత్ర తీవ్రత దృష్ట్యా వాళ్లకు బెయిల్ అభ్యర్థలనలను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది.
7. 2002, ఫిబ్రవరి 27వ తేదీన గుజరాత్ గోద్రా రైల్వే స్టేషన్ వద్ద సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లోని కొన్ని కోచ్‌లను తగలబెట్టారు. ఈ దుర్ఘటనలో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అయోధ్య కరసేవకు వెళ్లి తిరిగి వస్తున్నవాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఆ మరుసటి రోజు నుంచి గుజరాత్ భగ్గుమంది. ఈ పరిణామం.. గుజరాత్ అల్లర్లకు కారణమైంది.
8. 2011లో స్థానిక కోర్టు(ట్రయల్ కోర్టు) గోద్రా ఘటనకు సంబంధించిన కేసులో.. 31 మందిని నిందితులుగా, 63 మంది నిర్దోషులుగా ప్రకటించింది. పదకొండు మందికి మరణశిక్ష, 20 మందికి జీవిత ఖైదు విధించింది ట్రయల్ కోర్టు.
9. కర్ణాటక రాష్ట్ర విధానసభ ఎన్నికల్లో ముఖ్యమైన నామినేషన్ల ఘట్టం గురువారం సాయంత్రం(ఏప్రిల్ 20)తో సమాప్తమైంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్, చిన్నపార్టీలైన ఆప్, ఎస్‌డీపీఐ, బీఎస్పీ, సీపీఐ, సీపీఎంల అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. శుక్రవారం ఉదయం నుంచి ఎన్నికల అధికారుల కార్యాలయంలో నామినేషన్ పత్రాల పరిశీలన జరిగింది. మధ్యాహ్నం 3 గంటల తరువాత ఆమోదించినవి, తిరస్కరించిన నామినేషన్ల వివరాలను ప్రకటించారు.
10. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు ఎదురు గాలి వీస్తోంది. బ్రిటన్ ఉప ప్రధాని, న్యాయశాఖ మంత్రి డొమినిక్ రాబ్ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. న్యాయశాఖలో పాటు వైట్‌హాల్ విభాగాల్లో ఆయన సిబ్బందిపై వేధింపులకు పాల్పడ్డారంటూ కొంతకాలంగా ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు కమిటీ రిపోర్ట్ గురువారం ప్రధాని సునాక్‌కు చేరింది. ఈ నేపథ్యంలో శుక్రవారం డొమినిక్ రాబ్ తన పదవులకు రాజీనామా ప్రకటించారు.