Skip to main content

ఫిబ్రవరి 2021 ద్వైపాక్షిక సంబంధాలు

మోల్డో బోర్డర్‌ పాయింట్‌ ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంది?
Current Affairs
తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సడలింపు, బలగాల ఉపసంహరణ కోసం ఇరుదేశాల మిలటరీ అధికారుల మధ్య తూర్పు లద్దాఖ్‌లో మోల్డో బోర్డర్‌ పాయింట్‌లో ఫిబ్రవరి 21 పదో దఫా చర్చలు జరిగాయి. హాట్‌ స్ప్రింగ్స్, గోగ్రా, డెప్సాంగ్‌లలో సైన్యం ఉపసంహరణకు సంబంధించి ఇరుపక్షాలు చర్చలు జరిపాయి. గోగ్రా, గోగ్రా, హాట్‌స్ప్రింగ్స్‌లలో సైన్యం ఉపసంహరణపై ఒక అవగాహనకు వచ్చినప్పటికీ డెప్సాంగ్, డెమ్‌చోక్‌లపై ఎలాంటి అవగాహన కుదరలేదు. డెప్సాంగ్‌ ప్రాంతంలో ఉద్రిక్తతల నివారణకు 2013 తర్వాత చైనా చర్చించడం ఇదే మొదటిసారి.
చర్చల్లో భారత ప్రతినిధుల బృందానికి 14 కార్ప్స్‌ కమాండర్‌ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ పీజీకే మీనన్, చైనా బృందానికి దక్షిణ జిన్‌జియాంగ్‌ మిలటరీ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ లియూ లిన్‌ నేతృత్వం వహించారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : భారత్, చైనాల మధ్య పదో దఫా చర్చలు
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు : లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ పీజీకే మీనన్, మేజర్‌ జనరల్‌ లియూ లిన్‌
ఎక్కడ : మోల్డో బోర్డర్‌ పాయింట్, తూర్పు లద్దాఖ్, భారత్‌–చైనా సరిహద్దు
ఎందుకు : తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సడలింపు, బలగాల ఉపసంహరణ కోసం

లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఒప్పందం ఏ రెండు దేశాల మధ్య కుదిరింది?
రక్షణ రంగంలో ప్రాజెక్టుల కోసం భారత్, మాల్దీవుల మధ్య 5 కోట్ల డాలర్ల లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఒప్పందం కుదిరింది. మాల్దీవుల ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత్‌కు చెందిన ఎక్స్‌పోర్ట్‌ ఇంపోర్ట్‌ బ్యాంకుల మ«ధ్య ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం మాల్దీవులు తమ రక్షణ రంగ అవసరాల కోసం భారత్‌ బ్యాంకుల నుంచి నిధుల్ని రుణాలుగా తీసుకుంటుంది. ఫిబ్రవరి 21న మాల్దీవుల రాజధాని మాలెలో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, మాల్దీవుల రక్షణ మంత్రి మారియా దీదీ, ఆర్థిక మంత్రి ఇబ్రహీం పాల్గొన్నారు.
మాల్దీవుల్లోని తీరప్రాంత రక్షణ, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం కూడా భారత్, మాల్డీవుల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం... మాల్దీవుల్లో రేవులు, డాక్‌యార్డ్‌ల నిర్మాణం, వాటిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, రాడార్‌ సర్వీసులు, ఆ దేశ నావికాదళానికి శిక్షణ వంటి వాటిలో భారత్‌ సహకారం అందించనుంది. 2016లో కుదుర్చుకున్న రక్షణ కార్యాచరణ ప్రణాళిక మేరకు ఈ ఒప్పందాలు కుదిరాయి.
మాల్దీవులు రాజధాని: మాలె ; కరెన్సీ: మాల్దీవియన్‌ రుఫియా
మాల్దీవులు ప్రస్తుత అధ్యక్షుడు: ఇబ్రహీం మొహమ్మద్‌ సోలిహ్‌
మాల్దీవులు ప్రస్తుత ఉపాధ్యక్షుడు: ఫైసల్‌ నసీమ్‌
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : 5 కోట్ల డాలర్ల లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఒప్పందం
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు : భారత్, మాల్దీవులు
ఎందుకు : మాల్దీవులు తమ రక్షణ రంగ అవసరాల కోసం భారత్‌ బ్యాంకుల నుంచి నిధుల్ని రుణాలుగా తీసుకునేందుకు...

ఏ ఆఫ్రికా దేశంతో భారత్‌ సీఈసీపీఏ ఒప్పందం చేసుకుంది?
ఆఫ్రికా దేశమైన మారిషస్‌తో కీలకమైన ఆర్థిక సహకార, భాగస్వామ్య ఒప్పందం(సీఈసీపీఏ)పై భారత్‌ ఫిబ్రవరి 22న సంతకాలు చేసింది. ఒక ఆఫ్రికా దేశంతో ఈ తరహా ఒప్పందం చేసుకోవడం భారత్‌కు ఇదే ప్రథమం. ఆఫ్రికా ఖండంలో వ్యూహాత్మక స్థానంలో ఉన్న మారిషస్‌తో ఈ ఒప్పందం భారత వాణిజ్య విస్తృతికి అవకాశం కల్పించనుంది. మారిషస్‌ రాజధాని పోర్ట్‌లూయిస్‌ జరిగిన సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది. ఒప్పంద కార్యక్రమంలో మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ జుగ్నాథ్, భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ పాల్గొన్నారు.
ఇరు దేశాలకూ వాణిజ్య అవకాశాలు
సీఈసీపీఏ ఒప్పందం ఇటు భారత్, అటు మారిషస్‌ ఉత్పత్తులు, సేవలకు వాణిజ్య అవకాశాలను విస్తృతం చేయనుంది. ఇరు దేశాలు మరో దేశ ఉత్పత్తులు, సేవలకు ప్రత్యేక ప్రవేశ అవకాశాన్ని కల్పిస్తాయి. సుమారు 300 ఉత్పత్తులను భారత్‌ మారిషస్‌కు ఎగుమతి చేసేందుకు అవకాశం ఏర్పడనుంది.
మారిషస్‌ రాజధాని: పోర్ట్‌లూయిస్‌; కరెన్సీ: మారిషస్‌ రుపీ
మారిషస్‌ ప్రస్తుత అధ్యక్షుడు: పృథ్వీరాజ్‌సింగ్‌ రూపన్‌
మారిషస్‌ ప్రస్తుత ప్రధానమంత్రి: ప్రవింద్‌ జుగ్నాథ్‌
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఆర్థిక సహకార, భాగస్వామ్య ఒప్పందం(సీఈసీపీఏ)పై సంతకాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు : భారత్, మారిషస్‌
ఎక్కడ : పోర్ట్‌లూయిస్, మారిషస్‌
ఎందుకు : ఇరుదేశాల వాణిజ్య విస్తృతి కోసం

పాకిస్తాన్‌ ప్రధాని విమానానికి భారత్‌ అనుమతి
భారత గగనతలాన్ని ఉపయోగించుకునేందుకు పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌కు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అధికారిక పర్యటన కోసం ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రత్యేక విమానంలో శ్రీలంకకు వెళ్లనున్నారు. వీవీఐపీ విమానాలు తమ గగనతలం మీదుగా వెళ్లడానికి అన్ని దేశాలు అంగీకరించడం పరిపాటి. అయితే, పాకిస్తాన్‌ సర్కారు మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించింది. 2019లో భారత విమానాలు తమ గగనతలం గుండా వెళ్లకుండా నిషేధం విధించింది. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించే విమానానికి కూడా అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆ విమానం మరోమార్గంలో వెళ్లాల్సి వచ్చింది.

న్యూయార్క్‌ అసెంబ్లీలో కశ్మీర్‌పై తీర్మానం
Current Affairs
ఫిబ్రవరి 5వ తేదీని ‘కశ్మీర్‌ అమెరికన్‌ డే’గా ప్రకటించాలని గవర్నర్‌ అండ్రూ క్యుఒమోను కోరుతూ న్యూయార్క్‌ రాష్ట్ర అసెంబ్లీ ఫిబ్రవరి 8న ఒక వివాదాస్పద తీర్మానాన్ని ఆమోదించింది. అసెంబ్లీ సభ్యుడు నాదర్‌ సాయేఘ్, మరో 12 మంది సభ్యులు ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ‘కశ్మీరీలు పట్టుదలతో కృషి చేసి న్యూయార్క్‌ వలస ప్రజలకు పునాదిగా నిలిచారు. కశ్మీరీ ప్రజల మత స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛలకు న్యూయార్క్‌ రాష్ట్రం మద్దతునిస్తుంది’ అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు.
కశ్మీర్‌పై న్యూయార్క్‌ అసెంబ్లీ చేసిన తీర్మానంపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. జమ్మూకశ్మీర్‌ ఘన సంస్కృతిని, సామాజిక సంప్రదాయాలను తప్పుగా చూపి కశ్మీర్‌ ప్రజలను విడదీసే చర్యగా ఈ తీర్మానాన్ని అభివర్ణించింది. ఈ తీర్మానం వెనుక స్వార్ధ శక్తులున్నాయని ఆరోపించింది.
బైడెన్‌కు మోదీ ఫోన్‌
అమెరికా అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 8న తొలిసారి మాట్లాడారు. ఇరువురు నేతలు పలు అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.
Published date : 20 Mar 2021 01:21PM

Photo Stories