Skip to main content

మే 2019 ద్వైపాక్షిక సంబంధాలు

జీ-20 సమావేశంలో మోదీ, ట్రంప్ భేటీ
Current Affairs జపాన్‌లో జరగనున్న జీ-20 సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ కానున్నారు. భేటీ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలపై ఇరుదేశాధినేతలు చర్చలు జరపనున్నారు. మరోవైపు జపాన్‌లో ఇండియా, అమెరికా, జపాన్‌ల మధ్య త్రైపాక్షిక భేటీ కూడా ఉంటుందని అమెరికా తెలిపింది. ఈ భేటీలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛగా నౌకలు తిరిగే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. 2019, జూన్ 28, 29 తేదీల్లో ఈ జీ-20 సదస్సు జరగనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత ప్రధాని, అమెరికా అధ్యక్షుడి సమావేశం
ఎప్పుడు : 2019 జూన్ 28, 29
ఎవరు : నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్
ఎక్కడ : జపాన్

ఇరాన్ చమురు కొనుగోళ్ల నిలిపివేత
ఇరాన్, వెనెజువెలా దేశాల నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేసింది. అమెరికా సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికాలో భారత రాయబారి హర్ష వర్ధన్ శ్రీంగ్లా తెలిపారు. ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు విధించిన అమెరికా మే రెండో తేదీ తరువాత ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేయకూడదని భారత్ సహా ఎనిమిది దేశాలకు సూచించింది. కొనుగోళ్ల విషయమై ఇచ్చిన మినహాయింపులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దింపాలన్న ఉద్దేశంతో ఆ దేశం నుంచి కూడా చమురు కొనుగోళ్లపై 2019, జనవరిలో అమెరికా ఆంక్షలు విధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇరాన్ చమురు కొనుగోళ్ల నిలిపివేత
ఎప్పుడు : మే 24
ఎవరు : భారత్
ఎందుకు : అమెరికా సూచనల మేరకు

భారత్, జపాన్‌లతో శ్రీలంక ఒప్పందం
కొలంబో రేవు పట్టణంలో తూర్పుప్రాంతంలో ఉన్న కంటెయినర్ టెర్మినల్‌ను అభివృద్ధి చేసే విషయంలో శ్రీలంక ప్రభుత్వం భారత్, జపాన్‌లతో మే 28న ఒప్పందం కుదుర్చుకుంది. వ్యూహాత్మక ప్రాంతంలో వున్న ఈ కంటెయినర్ టెర్మినల్ ద్వారా జరుగుతున్న వాణిజ్యంలో భారత్‌కు 70 శాతం వాటా వున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యంపై భారత్ ఆసక్తి చూపుతుంది. అయితే ఈ ప్రాజెక్టులో భారత్ ప్రమేయాన్ని అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన వ్యతిరేకిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్, జపాన్‌లతో ఒప్పందం
ఎప్పుడు : మే 28
ఎవరు : శ్రీలంక ప్రభుత్వం
ఎందుకు : కంటెయినర్ టెర్మినల్‌ను అభివృద్ధి చేసే విషయంలో

మాల్దీవుల పార్లమెంటులో మోదీ ప్రసంగం
భారత ప్రధాని నరేంద్రమోదీ మాల్దీవుల పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు పీపుల్స్ మజ్లిస్ (మాల్దీవుల పార్లమెంటు) ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ప్రధానిగా మే 30న రెండోసారి బాధ్యతలు చేపట్టనున్న మోదీ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం నిమిత్తం 2019, జూన్‌లో మాల్దీవుల్లో పర్యటించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మాల్దీవుల పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగం
ఎప్పుడు : మే 29
ఎవరు : భారత ప్రధాని నరేంద్రమోదీ

600 కోట్ల డ్రగ్స్ ఉన్న పాక్ పడవ పట్టివేత
Current Affairs రూ. 600 కోట్ల విలువైన మాదకద్రవ్యాలతో నిండిన పాకిస్తానీ పడవను భారత తీరప్రాంత భద్రతాదళం (ఇండియన్ కోస్ట్ గార్డ్-ఐసీజీ) మే 21న పట్టుకుంది. గుజరాత్ తీరానికి దూరంగా, రెండు రోజులపాటు సముద్రంలో 200 నాటికల్ మైళ్ల దూరం గాలించి ఈ పడవను పట్టుకున్నారని ఓ ఉన్నతాధికారి చెప్పారు. మరోవైపు 8 నాటికల్ మైళ్లపాటు భారత జలాల్లోకి ప్రవేశించి చేపలు పడుతున్న ‘అల్-మదీనా’ అనే మరో పడవను కూడా ఐసీజీ గుర్తించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 600 కోట్ల డ్రగ్స్ ఉన్న పాక్ పడవ పట్టివేత
ఎప్పుడు : మే 21
ఎవరు : భారత తీరప్రాంత భద్రతాదళం (ఇండియన్ కోస్ట్ గార్డ్-ఐసీజీ)
ఎక్కడ : గుజరాత్ తీరం

భారత్-ఫ్రాన్స్ నౌకా విన్యాసాలు ప్రారంభం
Current Affairs గోవా సమీపలోని సముద్రంలో భారత్-ఫ్రాన్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న నౌకా విన్యాసాలు మే 10న ప్రారంభమయ్యాయి. వరుణ-2019తో నిర్వహిస్తున్న ఈ విన్యాసాలు ఫ్రాన్స్ కు చెందిన విమాన వాహక నౌక చార్లెస్ డీ గాల్లె కేంద్రంగా సాగుతున్నాయి. ఈ విన్యాసాల్లో ఇరు దేశాల నుంచి యుద్ధ నౌకలు, జలాంతర్గాములు కలిపి 12 (ఒక్కో దేశం నుంచి ఆరు) పాల్గొంటున్నాయి. చైనాను హెచ్చరించేలా ఈ విన్యాసాలు ఉన్నాయని భావిస్తుండగా, అలాంటిదేమీ లేదని ఫ్రాన్స్ కొట్టిపారేసింది. దక్షిణ చైనా సముద్రంలోని ఇతర దేశాల భాగాలను తమవిగా చైనా చెప్పుకోవడం ఉద్రిక్తతలకు దారితీయడం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్-ఫ్రాన్స్ నౌకా విన్యాసాలు ప్రారంభం
ఎప్పుడు : మే 11
ఎక్కడ : గోవా సముద్రతీరం

వియత్నాం ఉపాధ్యక్షురాలుతో వెంకయ్య సమావేశం
నాలుగు రోజుల వియత్నాం పర్యటనలో భాగంగా ఆ దేశ ఉపాధ్యక్షురాలు డాంగ్ థి గాక్ థిన్‌తో భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మే 10 సమావేశమయ్యారు. భారత్, వియత్నాం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని ఈ సందర్భంగా వెంకయ్య అభిప్రాయపడ్డారు. అనంతరం చేసిన సంయుక్త ప్రకటనలో భారత్, వియత్నాం వివిధ రంగాల్లో సహకారాన్ని అందించుకుంటాయన్నారు. 2020 నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యం 15 బిలియన్ డాలర్లకు చేరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం వియత్నాం జాతీయ వీరుల స్మారకాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వియత్నాం ఉపాధ్యక్షురాలు డాంగ్ థి గాక్ థిన్‌తో సమావేశం
ఎప్పుడు : మే 11
ఎవరు : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఎక్కడ : వియత్నాం

ఐఏఎఫ్‌కు తొలి అపాచీ హెలికాప్టర్
భారత వాయుసేన (ఐఏఎఫ్)కు తొలి అపాచీ గార్డియన్ అటాక్ హెలికాప్టర్‌ను అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ అప్పగించింది. భారత వాయుసేన (ఐఏఎఫ్) 2015 సెప్టెంబర్‌లో అమెరికా ప్రభుత్వం, బోయింగ్ సంస్థతో భారత వాయుసేన 22 అపాచీ హెలికాప్టర్ల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మొదటి హెలికాప్టర్‌ను అరిజోనాలోని మెసాలో భారతవాయుసేనకి అమెరికా అప్పగించింది. జూలైలో మొదటి హెలికాప్టర్ భారత్‌కు రానుంది. 2017లో భారత రక్షణ మంత్రిత్వ శాఖ మరో ఆరు అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు బోయింగ్ సంస్థతో రూ.4,168 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని టాటా అడ్వాన్స్ డ్ సిస్టం సంయుక్తంగా ఈ హెలికాప్టర్ల విడిభాగాలను ఉత్పత్తి చేయనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత వాయుసేన (ఐఏఎఫ్)కు తొలి అపాచీ హెలికాప్టర్
ఎప్పుడు : మే 12
ఎవరు : బోయింగ్ సంస్థ
ఎక్కడ : మెసా, అరిజోనా, అమెరికా

రష్యా విద్యాసంస్థతో భారత్ వర్సిటీ ఒప్పందం
విద్యా బంధాల బలోపేతమే లక్ష్యంగా రష్యాకు చెందిన యూరల్ ఫెడరల్ యూనివర్సిటీతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని తమిళనాడులోని భారత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (బీఐహెచ్‌ఈఆర్-భారత్ యూనివర్సిటీ) పునరుద్ధరించింది. రెండు విద్యా సంస్థల మధ్య పరిశోధన, శిక్షణ కార్యక్రమాలు, మానవ వనరుల అభివృద్ధిలో బంధాల బలోపేతంతో పాటు విద్యా ప్రచురణలు, సదస్సులు, కార్యశాలల నిర్వహణకూ ఈ ఒప్పందం ఉపకరించనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రష్యా విద్యాసంస్థతో భారత్ వర్సిటీ ఒప్పందం
ఎప్పుడు : మే 15
ఎవరు : యూరల్ ఫెడరల్ యూనివర్సిటీ - బీఐహెచ్‌ఈఆర్
ఎందుకు : పరిశోధన, శిక్షణ కార్యక్రమాలు, మానవ వనరుల అభివృద్ధిలో బంధాల బలోపేతం కోసం
Published date : 31 May 2019 03:31PM

Photo Stories