Skip to main content

మే 2017 ద్వైపాక్షిక సంబంధాలు

మారిషస్‌కు 500 మిలియన్ డాలర్ల సాయం
మారిషస్‌కు 500 మిలియన్ల అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 3,227 కోట్లు) రుణంగా ఇవ్వడానికి భారత్ అంగీకరించింది. మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా మే 27న మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు ద్వైపాక్షిక అంశాలపై ఇద్దరు చర్చించారు. ఈ నేపథ్యంలో హిందూ మహాసముద్ర తీర భద్రతా ఒప్పందంపై ఇరుదేశాల ప్రధానులు సంతకాలు చేశారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేయడం ద్వారా వ్యాపారం, టూరిజం, డ్రగ్‌‌స రవాణా, మనుషుల రవాణా, అక్రమంగా చేపలు పట్టడం, సముద్ర వనరుల అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేయొచ్చని ప్రధాని మోదీ ఒక ప్రకటనలో తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
మారిషస్‌కు 500 మిలియన్ డాలర్ల సాయం
ఎప్పుడు : మే 27
ఎవరు : భారత్

భారత్ - జర్మనీ మధ్య 12 ఒప్పందాలు
Current Affairs
ఉగ్రవాదానికి సహకరిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని భారత్, జర్మనీ నిర్ణయించాయి. ఈ మేరకు జర్మనీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌తో చర్చల సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలపై మే 30న కీలక చర్చలు జరిపారు.
అనంతరం రెండు దేశాల మధ్య 12 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. సైబర్ పాలసీ, అభివృద్ధి పథకాలు, సుస్థిర పట్టణాభివృద్ధి, క్లస్టర్ మేనేజర్స్ అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, డిజిటలైజేషన్, రైల్వే భద్రత, ఒకేషనల్ శిక్షణ ప్రోత్సహం వంటి రంగాల్లో ఈ ఒప్పందాలు కుదిరాయి.
భారత్ ఎన్‌ఎస్జీ సభ్యత్వానికి జర్మనీ మద్దతు
చర్చల్లో అణు సరఫరాదారుల కూటమి(ఎన్‌ఎస్‌జీ)లో భారత్ సభ్యత్వానికి జర్మనీ మద్దతు పలికింది. అత్యవసరంగా ఐరాస భద్రతామండలిలో భారీ స్థాయిలో సంస్కరణలు అవసరమని ఇరు దేశాలు అభిప్రాయపడ్డాయి. శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాల సంఖ్య పెరగాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాయి. అలాగే అలాగే ఇండో జర్మన్ ఎన్విరాన్‌మెంటల్ ఫోరం సమావేశం- 2017ను న్యూఢిల్లీలో నిర్వహించాలని నిర్ణయించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ - జర్మనీ మధ్య 12 ఒప్పందాలు
ఎప్పుడు : మే 30
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్
ఎక్కడ : జర్మనీలో

టర్కీ అధ్యక్షుడి భారత పర్యటన
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో భారత్‌కు అన్నివిధాలుగా సహాయమందిస్తామని టర్కీ అధ్యక్షుడు రిసెప్ టయిప్ ఎర్డోగాన్ పేర్కొన్నారు. ఈ మేరకు భారత పర్యటనకు వచ్చిన ఎర్డోగాన్ మే 1న ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక, ఆర్థిక, రాజకీయ సంబంధాలతోపాటు వివిధ కీలక అంశాలపై చర్చించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టర్కీ అధ్యక్షుడి భారత పర్యటన
ఎప్పుడు : మే 1
ఎవరు : రిసెప్ టయిప్ ఎర్డోగాన్
ఎక్కడ : న్యూఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్

మారిషస్ ప్రధాని భారత పర్యటన
మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ మే 26 నుంచి మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించారు. ఇందులో భాగంగా మే 27న ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మారిషస్‌కు 500 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.3,227 కోట్లు) రుణం ఇవ్వడానికి భారత్ అంగీకరించింది.

ఏడీబీ గ్రూపు 52వ వార్షిక సమావేశం
ఆఫ్రికా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) గ్రూపు 52వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ప్రధాని మోదీ మే 22న గాంధీనగర్‌లో ప్రారంభించారు. ఇది మే 26 వరకు జరిగింది. భారత్‌లో ఈ భేటీ జరగడం ఇదే తొలిసారి. ఆఫ్రికాలో సంపద సృష్టికి వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దడం ఈ సదస్సు ఉద్దేశం.

శ్రీలంక పర్యటనలో ప్రధాని మోదీ
భారత్-శ్రీలంక మధ్య బౌద్ధమతానికి సంబంధించి అవినాభావ సంబంధం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఈ మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం మే 11న శ్రీలంక చేరుకున్న ప్రధాని బౌద్ధులకు అత్యంత కీలక పండుగ అయిన అంతర్జాతీయ వేసాక్ దినోత్సవాల్లో పాల్గొననున్నారు. భారత ఆర్థిక సాయంతో శ్రీలంకలో రూ.150 కోట్లతో నిర్మించిన వైద్యశాలను కూడా ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధాని మోదీ శ్రీలంక పర్యటన
ఎప్పుడు : మే 11
ఎందుకు : అంతర్జాతీయ వేసాక్ దినోత్సవాల్లో పాల్గొనడానికి

స్వతంత్ర పాలస్తీనాకు భారత్ మద్దతు
శాంతికోసం పాలస్తీనా అనుసరిస్తున్న విధానానికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత పర్యటనకు వచ్చిన పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో మే 16న సమావేశమైన మోదీ ఈ మేరకు ప్రకటన చేశారు. ఇజ్రాయెల్‌తో శాంతియుత సహజీవనం సాగిస్తూనే సార్వభౌమాధికారం, స్వాతం త్య్రం కలిగిన ఐక్య పాలస్తీనాను చూడాలని భారత్ ఆకాంక్షిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా వీసా మినహాయింపులు, వ్యవసాయ రంగం, ఆరోగ్యం, క్రీడలు తదితర అంశాలకు సంబంధించి ఐదు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.
Published date : 12 Sep 2017 06:07PM

Photo Stories