జూన్ 2020 ద్వైపాక్షిక సంబంధాలు
భారత ప్రభుత్వం ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాల సరఫరా త్వరలో మొదలు కానుంది. తొలి దశలో భాగంగా 2020, జూలై 27 నాటికి ఆరు రఫేల్ యుద్ధవిమానాలు అందనున్నాయని భారత వాయుసేన జూన్ 29న తెలిపింది. భారత్ 36 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్ తో 2016 సెప్టెంబరులో రూ.58,000 కోట్లతో ఒక ఒప్పందం చేసుకోవడం తెలిసిందే.
అంబాలా కేంద్రంగా...
రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి భారత్ ఇప్పటికే పెలైట్ల శిక్షణ మొదలుకొని మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులను పూర్తి చేసింది. తొలి దఫా సరఫరా కానున్న యుద్ధ విమానాలు అంబాలా కేంద్రంగా పనిచేయనుండగా రెండో దఫా సరఫరా అయ్యేవాటిని పశ్చిమ బెంగాల్‌లోని హసిమార వైమానిక కేంద్రంలో ఉంచేందుకు రూ.400 కోట్లతో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన విమానాల్లో 30 యుద్ధ విమానాలు కాగా ఆరు శిక్షణ విమానాలు.
రఫేల్ ప్రత్యేకతలు...
- రఫేల్ యుద్ధ విమానాలు అత్యాధునిక ఆయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉన్నాయి.
- యూరోపియన్ క్షిపణి తయారీ సంస్థ ఎంబీడీఏ తయారు చేసే మిటియోర్ బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణితోపాటు, స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు రఫేల్‌లోని ముఖ్యమైన ఆయుధాలు.
- ఇజ్రాయెల్ తయారీ హెల్మెట్లు, రాడార్ వార్నింగ్ రిసీవర్లు, లోబ్యాండ్ జామర్లు, పది గంటల ఫ్లయిట్ డేటా రికార్డింగ్, ఇన్‌ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్స్ వంటివి భారత్ కోసం ప్రత్యేకంగా రఫేల్‌లో చేర్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2020, జూలైలో భారత్‌కు రఫేల్ యుద్ధవిమానాలు
ఎప్పుడు : జూలై 29
ఎవరు : భారత వాయుసేన
భారత వెబ్‌సైట్లపై చైనా హ్యాకర్ల దాడులు
భారత్, చైనా సైనికుల మధ్య గల్వాన్ లోయలో ఘర్షణలు చోటుచేసుకున్న అనంతరం భారత్‌కు చెందిన వెబ్‌సైట్లపైన చైనా హ్యాకర్ల దాడులు భారీ స్థాయిలో పెరిగాయి. ఈ విషయాన్ని సింగపూర్‌కి చెందిన సైబర్ రీసెర్చ్ సంస్థ సైఫర్మా వెల్లడించింది. 2020, జూన్ 18వ తేదీ తర్వాత చైనా ఆర్మీ(పీఎల్‌ఏ)మద్దతు ఉన్న హ్యాకర్ల దాడులు ఒక్కసారిగా 300 శాతం మేర పెరిగాయని ఆ సంస్థ పేర్కొంది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని భారత ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ కంప్యూటర్ రెస్పాన్స్ టీం(సీఈఆర్టీ)తో పంచుకున్నట్లు తెలిపింది.
బీజింగ్ కేంద్రంగా...
ముఖ్యంగా చైనాలోని బీజింగ్, గ్వాంగ్‌ర, షెంజెన్, చెంగ్డులోని స్థావరాల నుంచి సైబర్ దాడులు ఎక్కువగా జరిగినట్లు సైఫర్మా సీఎండీ కుమార్ రితేశ్ వెల్లడించారు. ‘‘ప్రభుత్వ అండతో నడిచే గోధిక్ పాండా, స్టోన్ పాండా అనే హ్యాకింగ్ ఏజెన్సీలు తమ ఉనికి బయటపడకుండా ఉండేందుకు చైనాకు బదులుగా అమెరికా, యూరప్, ఇతర ఆసియా దేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. చైనా ఆర్మీకి చెందిన మౌలిక వసతులను ఇవి ఉపయోగించుకుంటాయి’’ అని ఆయన పేర్కొన్నారు. హ్యాకర్ల సంభాషణను డీకోడ్ చేయగా తరచుగా ‘భారత్‌కు గుణపాఠం చెప్పాలి’వంటివి ఎక్కువగా వాడుతున్నట్లు తేలిందని వివరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత వెబ్‌సైట్లపై చైనా హ్యాకర్ల దాడులు
ఎప్పుడు : జూన్ 30
ఎవరు : సైబర్ రీసెర్చ్ సంస్థ సైఫర్మా
చైనాలో భారత సైట్లు బ్లాక్
చైనాలో భారత్‌కు చెందిన వెబ్ సైట్లు, న్యూస్ పేపర్లను అక్కడివారు చదివే అవకాశం లేకుండా అక్కడి ప్రభుత్వం వాటిని బ్లాక్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ భారత టీవీచానళ్లను ఐపీ టీవీ ద్వారా వీక్షించేవారు. బ్యాన్ కారణంగా ప్రస్తుతం వాటిని వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ ద్వారా మాత్రమే చూడగలుగుతున్నారు. భారత్ లో టిక్ టాక్, యూసీ బ్రౌజర్ వంటి 59 యాప్‌లను నిషేధించిన నేపథ్యంలో ఈ చర్య ప్రాధాన్యత సంతరించుకుంది. వీపీఎన్ లను కూడా బ్లాక్ చేయగల అధునాతన సాంకేతిక సామర్థ్యం చైనా దగ్గర ఉన్న సంగతి తెలిసిందే.
యాప్‌ల నిషేధంపై ఆందోళన
దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ఉన్నాయనే కారణంతో భారత ప్రభుత్వం 59 యాప్‌లపై నిషేధం విధించడంపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పెట్టుబడిదారుల చట్టపరమైన హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ పేర్కొన్నారు.
గోప్యతకు కట్టుబడి ఉన్నాం..
టిక్‌టాక్ యాప్‌ను బ్లాక్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపై ఆ సంస్థ స్పందించింది. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా పనిచేసేందుకు ప్రయత్నిస్తామని, తమ యాప్ భారతీయ వినియోగదారుల సమాచారాన్ని చైనా సహా ఏ విదేశీ ప్రభుత్వానికి చేరవేయలేదని తెలిపింది. వినియోగదారుల సమాచార గోప్యతకు కట్టుబడి ఉన్నామంది.
హైవే ప్రాజెక్టుల్లోకి చైనాకు అనుమతి నిరాకరణ
సరిహద్దుల్లో చైనాను గట్టిగా ఎదుర్కొన్న భారత్ తాజాగా డ్రాగన్‌ను వ్యాపార కార్యకలాపాలపరంగా కూడా కట్టడి చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా చైనా సంస్థలను జాతీయ రహదారుల నిర్మాణ ప్రాజెక్టుల్లో అనుమతించకుండా చర్యలు తీసుకుంటోంది. ‘చైనా భాగస్వాములు ఉన్న జాయింట్ వెంచర్ సంస్థలకు రహదారుల నిర్మాణ ప్రాజెక్టులకి అనుమతించం’ అని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ జూలై 1న వెల్లడించారు. అలాగే, లఘు, చిన్న, మధ్యతరహా సంస్థల్లాంటి (ఎంఎస్‌ఎంఈ) పలు రంగాల్లో చైనా ఇన్వెస్టర్లకూ ఎంట్రీ ఉండబోదని ఆయన పేర్కొన్నారు. చైనా సంస్థలను నిషేధిస్తూ, హైవే ప్రాజెక్టుల్లో పాల్గొనేలా దేశీ కంపెనీల అర్హత ప్రమాణాలను సడలించేందుకు త్వరలోనే విధానాన్ని ప్రకటించనున్నట్లు చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైవే ప్రాజెక్టుల్లోకి చైనాకు అనుమతి నిరాకరణ
ఎప్పుడు : జూలై 1
ఎవరు : కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ
ఎందుకు : వ్యాపార కార్యకలాపాలపరంగా చైనాను కట్టడి చేసేందుకు
సాధ్యమైనంత త్వరగా శాంతి: భారత్, చైనా
సరిహద్దుల్లో ఉద్రిక్తతలను సాధ్యమైనంత త్వరగా తగ్గించుకోవాలని భారత్, చైనా నిర్ణయించాయి. తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో గత 7 వారాలుగా నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ‘వేగవంతమైన, క్రమానుగత, దశలవారీ’ ప్రక్రియను ప్రారంభించడం ప్రాధాన్యతాంశంగా గుర్తించే విషయంలో రెండు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఇరుదేశాల మధ్య జరిగిన కమాండర్ స్థాయి చర్చల్లో ఈ నిర్ణయానికి వచ్చాయి.
చూషుల్‌లో...
ఎల్‌ఏసీకి భారత్ వైపు ఉన్న చూషుల్‌లో జూన్ 30వ తేదీన రెండు దేశాల మధ్య ఆర్మీ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. భారత ప్రతినిధి బృందానికి 14 కాప్స్ కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వం వహించగా, చైనా బృందానికి టిబెట్ మిలటరీ డిస్ట్రిక్ట్ మేజర్ జనరల్ లియు లిన్ నేతృత్వం వహించారు. ఈ రెండు బృందాల మధ్య జూన్ 6న తొలి విడత చర్చలు జరిగాయి. ఆ తరువాత గల్వాన్ లోయలో ప్రాణాంతక ఘర్షణల అనంతరం జూన్ 22న మరోసారి ఈ రెండు బృందాలు సమావేశమయ్యాయి. తాజాగా భేటీ మూడోది.
గాల్వన్ నదీ ప్రవాహానికి అడ్డుకట్ట
చైనా, భారత్ మధ్య సరిహద్దుల్లో గాల్వన్ నదీలోయ సమీపంలో చైనా చేసిన దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చైనా భారీ సంఖ్యలో బుల్‌డోజర్లను తీసుకువచ్చి ఏకంగా గాల్వన్ నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను జాతీయ మీడియా సంస్థ ఎన్‌డీటీవీ బయటపెట్టింది. భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన ప్రాంతానికి అర కిలో మీటరు దూరంలోని ఈశాన్య లద్దాఖ్‌లో గాల్వన్ ప్రాంతంలో బుల్‌డోజర్లతో నదీ ప్రవాహాన్ని తగ్గించేందుకు, మళ్లించేందుకు చైనా యత్నించింది. ఘర్షణలు జరిగిన ప్రాంతంలో చైనా తమ భూభాగం వైపు బుల్‌డోజర్లు, లారీలు, మిలటరీ రవాణా వాహనాలు 5 కి.మీ.ల పొడవునా నిలిపింది.
రష్యా, చైనాలతో భారత్ త్రైపాక్షిక చర్చలు
భారత్, చైనా, రష్యా విదేశాంగ మంత్రుల త్రైపాక్షిక వర్చువల్ చర్చలు 2020, జూన్ 23న జరగనున్నాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ జూన్ 18న తెలిపింది. ఈ చర్చల్లో భారత విదేశాంగ మంత్రి జై శంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ పాల్గొననున్నారు. కరోనా, ప్రపంచ భద్రత, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలు వీరి మధ్య చర్చకు రానున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గాల్వన్ నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు చైనా ప్రయత్నం
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : జాతీయ మీడియా సంస్థ ఎన్‌డీటీవీ
చైనా కంపెనీ రైల్వే కాంట్రాక్టు రద్దు
చైనా కంపెనీకి అప్పగించిన రూ.471 కోట్ల రైల్వే ప్రాజెక్టును భారత రైల్వే శాఖ రద్దు చేసింది. సకాలంలో పనులను పూర్తి చేయలేక పోవడంతోపాటు పనుల్లో పురోగతి చాలా స్వల్పంగా ఉండటం వల్లే చైనా సంస్థతో కాంట్రాక్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు జూన్ 18న తెలిపింది. ఈ విషయమై ప్రపంచ బ్యాంకుకు ఇప్పటికే సమాచారం అందించినట్లు పేర్కొంది.
ఒప్పందం వివరాలు...
కాన్పూర్ నుంచి మొగల్‌సరాయి వరకు ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌లోని 417 కి.మీ.ల మార్గంలో సిగ్నలింగ్, సమాచార వ్యవస్థ ఏర్పాటు కోసం చైనాకు చెందిన బీజింగ్ నేషనల్ రైల్వే రీసెర్చ్, డిజైన్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సిగ్నల్, కమ్యూనికేషన్ గ్రూప్‌తో 2016లో రైల్వే శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్టును 2019కల్లా పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటిదాకా 20 శాతం పనులే పూర్తయ్యాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సిగ్నల్, కమ్యూనికేషన్ గ్రూప్‌తో ఒప్పందం రద్దు
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : భారత రైల్వే శాఖ
ఎందుకు : సకాలంలో పనులను పూర్తి చేయలేక పోవడంతో
నేపాల్ కొత్త మ్యాప్‌కు రాజ్యాంగబద్ధత
భారత్‌లోని వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాలను తన భూభాగంలోకి కలుపుతూ నేపాల్ ప్రభుత్వం రూపొందించిన కొత్త మ్యాప్‌కు రాజ్యాంగబద్ధత లభించింది. ఇందుకు సంబంధించిన సవరణ బిల్లును నేపాల్ పార్లమెంట్ ఎగువ సభ జూన్ 18న ఆమోదించింది. అనంతరం నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ బిల్లును ఆమోదిస్తూ సంతకం చేశారు. దీంతో ఈ బిల్లుకు రాజ్యాంగబద్ధత లభించింది. సవరణ బిల్లు ఇప్పటికే దిగువసభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే.
భారత్‌కు చెందిన లిపులేఖ్, కాలాపానీ, లింపియధురా ప్రాంతాలను తమ దేశ భూభాగంలో చూపిస్తూ 2020, మేలో నేపాల్ కొత్త మ్యాప్ విడుదల చేయడం తెలిసిందే. భారత్‌తో విభేదాల నేపథ్యంలో నేపాల్ తన సరిహద్దుల్లో కాలాపానీ సమీపాన ఉన్న చంగ్రూ శిబిరాన్ని నేపాల్ ఆధునీకరించింది. దార్చులా జిల్లాలోని ఈ ఔట్ పోస్టులో ఇకపై శీతాకాలంలోనూ ఒక జవాను బందోబస్తు విధులు నిర్వర్తిస్తారు.
చారిత్రక వాస్తవాలు లేవు: భారత్
నేపాల్ కొత్త మ్యాప్‌పై భారత్ స్పందిస్తూ... నేపాల్ కృత్రిమంగా భూభాగాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించింది. నేపాల్ ప్రయత్నాలను మద్దతు తెలిపేందుకు ఎటువంటి రుజువులు గానీ, చారిత్రక వాస్తవాలు కానీ లేవని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు. సరిహద్దుల విషయంపై గతంలో కుదిరిన అవగాహనను నేపాల్ ఉల్లంఘించిందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేపాల్ కొత్త మ్యాప్‌కు రాజ్యాంగబద్ధత
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : నేపాల్ పార్లమెంట్
ఏకపక్ష చర్యలకు తెగబడవద్దు: భారత్
తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంట ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో.. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)కు అటు(చైనా) వైపే కార్యకలాపాలు కొనసాగించుకోవాలని చైనాకు భారత్ స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో మార్పులు చేసే దిశగా ఏకపక్ష చర్యలకు తెగబడవద్దని తేల్చిచెప్పింది. అలాగే, గాల్వన్ లోయ ప్రాంతం తమదేనంటూ చైనా చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టింది. అలాంటి అహేతుక, సమర్థనీయం కాని వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికింది. 2020, జూన్ 6న ఇరుదేశాల ఉన్నతస్థాయి మిలటరీ అధికారుల మధ్య కుదిరిన ఒప్పందానికి ఈ వ్యాఖ్య విరుద్ధంగా ఉందని పేర్కొంది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ జూన్ 18న పేర్కొన్నారు. దేశ భౌగోళిక సమగ్రతను కాపాడుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని అన్నారు.
గల్వాన్ లోయ మాదే: భారత్
గల్వాన్ లోయ తమదేనంటూ జూన్ 20న చైనా చేసిన ప్రకటనను భారత్ తీవ్రంగా ఖండించింది. అతిశయోక్తితో కూడిన చైనా వాదన ఏమాత్రం ఆమోదయోగ్యంకాదని స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ జూన్ 20న మీడియాతో మాట్లాడుతూ.. ‘గల్వాన్ లోయ చారిత్రకంగా భారత్‌దే. గతంలో ఎన్నడూ ఇది చైనా భూభాగం కాదు. రెండు దేశాల బలగాలు ఈ ప్రాంతంలో గస్తీ చేపడుతున్నా చాలాకాలంగా ఎటువంటి ఘటనలు జరగలేదు.’ అని అన్నారు.
చైనాలో కనిపించని మోదీ ప్రసంగం
గల్వాన్ ఘటనపై జూన్ 18వ తేదీన ప్రధాన మంత్రి మోదీ చేసిన ప్రసంగంతోపాటు, విదేశాంగ శాఖ ప్రతినిధి శ్రీవాస్తవ చేసిన వ్యాఖ్యలను చైనాలోని ప్రధాన సోషల్ మీడియా సైట్లు తొలగించాయి. వీబో, వుయ్‌చాట్ సైట్లలో వీటిని తమకు కనిపించకుండా చేశారని చైనాలోని భారత దౌత్యాధికారులు తెలిపారు.
భారత్, చైనాల మధ్య రెండో విడత చర్చలు
సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా భారత్, చైనాల మధ్య రెండో విడత లెఫ్ట్‌నెంట్ జనరల్ స్థాయి చర్చలు జూన్ 22న జరిగాయి. తూర్పు లద్దాఖ్‌లోని చూశుల్ సెక్టార్‌లో చైనా భూభాగంలోని మోల్డో వద్ద ఈ చర్చలు జరిగాయి. 2020, జూన్ 6న జరిగిన తొలి విడత చర్చల్లో కుదిరిన ఒప్పందాల అమలు సహా ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసం పెరిగేందుకు చేపట్టాల్సిన పలు చర్యలపై ఈ భేటీలో చర్చించారు. అన్ని ప్రాంతాల నుంచి మే 4 నాటి యథాతథ స్థితికి చైనా బలగాలు వెనుదిరగాలని భారత్ డిమాండ్ చేసింది.
హరీందర్ సింగ్ నేతృత్వంలో...
తాజా చర్చల్లో భారత ప్రతినిధి బృందానికి 14వ కార్ఫ్స్ కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా బృందానికి టిబెట్ మిలటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ నేతృత్వం వహించారు. గల్వాన్ లోయ సహా అన్ని వివాదాస్పద ప్రాంతాల నుంచి దళాలను ఉపసంహరించుకోవాలని 2020, జూన్ 6న ఇదే ప్రదేశంలో జరిగిన చర్చల్లో ఇరుదేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అయితే అయితే, ఆ తరువాత జూన్ 15న గల్వాన్ లోయలో ఇరుదేశాల జవాన్ల మధ్య తీవ్రస్థాయిలో హింసాత్మక ఘర్షణలు జరిగి, భారీగా ప్రాణ నష్టం సంభవించింది.
వేగంగా రోడ్ల నిర్మాణం...
చైనాతో తీవ్రస్థాయిలో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో చైనాతో సరిహద్దుల్లో నిర్మిస్తున్న 73 రోడ్డు ప్రాజెక్టుల పురోగతిపై కేంద్రప్రభుత్వం జూన్ 22న సమీక్ష జరిపింది. వాటిలో 32 ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, బోర్డర్ రోడ్‌స ఆర్గనైజేషన్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్‌లతో కేంద్ర హోం శాఖ ఈ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్, చైనాల మధ్య రెండో విడత చర్చలు
ఎప్పుడు : జూన్ 22
ఎవరు : భారత్-చైనా సైన్యాధికారులు
ఎక్కడ : తూర్పు లద్దాఖ్‌లోని చూశుల్ సెక్టార్‌లో చైనా భూభాగంలోని మోల్డో వద్ద
ఎందుకు : సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు
రష్యా పర్యటనలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్
రష్యాలో మూడు రోజుల పర్యటనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జూన్ 22న రష్యా రాజధాని మాస్కో వెళ్లారు. పర్యటనలో భాగంగా ఆయన రష్యా సైనికాధికారులతో విసృ్తతంగా చర్చలు జరపనున్నారు. చైనాతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో చేపట్టిన ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
విక్టరీ డే పెరేడ్‌లో...
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలపై సోవియెట్ సేనల విజయానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగే కవాతు(విక్టరీ డే పెరేడ్)లో రాజ్‌నాథ్ పాల్గొననున్నారు. విక్టరీ డే పెరేడ్‌లో భారత్, చైనా సహా 11 దేశాలకు చెందిన సైనిక బలగాలు పాల్గొననున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రష్యాలో మూడు రోజుల పర్యటనకు రక్షణ మంత్రి
ఎప్పుడు : జూన్ 22
ఎవరు : రాజ్‌నాథ్ సింగ్
ఎందుకు : రష్యా సైనికాధికారులతో చర్చలు జరిపేందుకు, రష్యా విక్టరీ డే పెరేడ్‌లో పాల్గొనేందుకు
సరిహద్దు ఉద్రిక్తతలపై భారత్, చైనా ఏకాభిప్రాయం
యుద్ధ మేఘాలు కమ్ముకున్న దశ నుంచి ఉద్రిక్తతలను తగ్గించుకునే దిశగా భారత్, చైనా కీలకమైన ముందడుగు వేశాయి. తూర్పు లద్దాఖ్‌లోని అన్ని వివాదాస్పద, ఘర్షణాత్మక ప్రదేశాల నుంచి వెనుదిరగాలని ఏకాభిప్రాయానికి వచ్చాయి. రెండు దేశాల లెఫ్ట్‌నెంట్ జనరల్ స్థాయి అధికారుల మధ్య జూన్ 23న జరిగిన చర్చల సందర్భంగా ఈ నిర్ణయానికి వచ్చాయి. తూర్పు లద్దాఖ్‌లోని చైనా భూభాగంలో ఉన్న మోల్డా వద్ద ఈ చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో భారత ప్రతినిధి బృందానికి 14వ కార్ఫ్స్ కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా బృందానికి టిబెట్ మిలటరీ డిస్టిక్ట్ ్రకమాండర్ మేజర్ జనరల్ ల్యూ లిన్ నేతృత్వం వహించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సరిహద్దు ఉద్రిక్తతలపై భారత్, చైనా ఏకాభిప్రాయం
ఎప్పుడు : జూన్ 23
ఎవరు : భారత్, చైనా లెఫ్ట్‌నెంట్ జనరల్ స్థాయి అధికారుల
ఎక్కడ : తూర్పు లద్దాఖ్‌లోని చైనా భూభాగంలో ఉన్న మోల్డా
దౌత్య సిబ్బందిని తగ్గించుకోండి: భారత్
ఢిల్లీలోని పాకిస్తాన్ దౌత్య సిబ్బంది గూఢచర్యానికి పాల్పడుతున్నారని, ఉగ్ర సంస్థలతో సంబంధాలు సాగిస్తున్నారని భారత్ పేర్కొంది. దౌత్యకార్యాలయం సిబ్బందిలో 50 శాతం మందిని తగ్గించుకోవాలని పాకిస్తాన్‌ను కోరింది. ఇస్లామాబాద్‌లోని భారత దౌత్య కార్యాలయం సిబ్బందిని సగానికి తగ్గించుకోనున్నట్లు జూన్ 23న ప్రకటించింది. భారత్ ఇందుకు సంబంధించి పాక్‌కు వారం గడువిచ్చింది.
అమానుషంగా...
ఇస్లామాబాద్‌లోని ఇద్దరు భారత అధికారుల పట్ల ఇటీవల పాక్ అమానుషంగా వ్యవహరించిందని భారత్ తెలిపింది. 2020, మే 31వ తేదీన పాక్ హైకమిషన్ కార్యాలయంలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు గూఢచర్యం, ఉగ్రవాదం విషయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడగా వారిని బహిష్కరించినట్లు పేర్కొంది.
రష్యా విక్టరీ పరేడ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్
రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ సమక్షంలో రాజధాని మాస్కోలోని చరిత్రాత్మక రెడ్ స్క్వేర్‌లో జూన్ 24న జరిగిన రష్యా విక్టరీ డే 75వ వార్షికోత్సవ పరేడ్‌కు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. 1941-1945 మధ్య వీరోచితంగా జరిగిన యుద్ధంలో సోవియట్ ప్రజల విజయానికి గుర్తుగా నిర్వహించిన ఈ పరేడ్‌లో రష్యా సైనిక దళాలతోపాటు 75 మంది భారత సైనికులు ముందుకు నడిచారు. మరో 17 దేశాలకు చెందిన సైనికులు కూడా పాలుపంచుకున్నారు. ఈ పరేడ్‌ను ఏటా మే 9న నిర్వహిస్తారు. కరోనా కారణంగా ఈఏడాది జూన్‌లో నిర్వహించారు.
భారత త్రివిధ దళాలకు చెందిన 75 మంది సైనికుల బృందం రష్యా విక్టరీ డే పరేడ్‌లో పాల్గొనడం పట్ల తాను ఎంతగానో గర్విస్తున్నానని రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు. కార్యక్రమంలో రాజ్‌నాథ్‌తోపాటు రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్, వైస్ అడ్మిరల్ హరి కుమార్, భారత రాయబారి డి.బి.వెంకటేశ్ వర్మ పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రష్యా విక్టరీ డే 75వ వార్షికోత్సవ పరేడ్‌కు హాజరు
ఎప్పుడు : జూన్ 24
ఎవరు : భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఎక్కడ : మాస్కో, రష్యా
ఎందుకు : 1941-1945 మధ్య వీరోచితంగా జరిగిన యుద్ధంలో సోవియట్ ప్రజల విజయానికి గుర్తుగా ఈ పరేడ్ నిర్వహించారు.
నేపాల్ మ్యాప్ సవరణ బిల్లుకు ఆమోదం
భారత భూభాగాలైన లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును ఆ దేశ పార్లమెంట్‌లో దిగువసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్‌ను సవరిస్తూ ప్రభుత్వం జూన్ 13న దిగువసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా పార్టీ-నేపాల్, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ కూడా మద్దతు తెలిపాయి. సభకు హాజరైన 258 మంది సభ్యులూ ఈ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు.
చట్టంగా మారాలంటే..
దిగువ సభ ఆమోదం పొందిన తాజా బిల్లు నేషనల్ అసెంబ్లీకి వెళుతుంది. ఆమోదం అనంతరం అక్కడి నుంచి అధ్యక్షుడి సంతకంతో చట్టంగా మారుతుంది. ఆ మేరకు రాజ్యాంగంలో సవరణలు జరుగుతాయి. దీనిద్వారా నేపాల్ జాతీయ చిహ్నంలోని దేశ రాజకీయ మ్యాప్‌లో మార్పులు చోటుచేసుకుంటాయి. అన్ని అధికార పత్రాల్లో ఈ మ్యాప్ ఉంటుంది.
అంగీకారయోగ్యం కాదు: భారత్
తమ భూభాగాలను కూడా కలుపుకుంటూ రూపొందించిన రాజకీయ మ్యాప్‌ను నేపాల్ పార్లమెంట్ ఆమోదించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత్ స్పష్టం చేసింది. అవి నేపాల్‌లోని వని చెప్పేందుకు చారిత్రక సత్యాలు, ఆధారాలు లేవని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఇతరుల ప్రోద్బలంతోనే నేపాల్ ఇలా వ్యవహరిస్తోందని ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే పరోక్షంగా చైనానుద్దేశించి పేర్కొన్నారు.
వివాదం ఎందుకు తలెత్తింది?
లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలతో కలిపి 2019 నవంబర్‌లో భారత్ రాజకీయ మ్యాప్ విడుదల చేసింది. దీంతోపాటు ఉత్తరాఖండ్‌లోని దార్చులా ప్రాంతాన్ని లిపులేఖ్‌తో కలిపే 80 కిలోమీటర్ల పొడవైన వ్యూహాత్మకంగా కీలకమైన రహదారిని మే 18వ తేదీన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. అప్పటి నుంచి నేపాల్ అభ్యంతరాలు మొదలయ్యాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేపాల్ మ్యాప్ సవరణ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : జూన్ 13
ఎవరు : నేపాల్ ప్రభుత్వం
ఎందుకు : భారత భూభాగాలైన లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు నేపాల్ మ్యాప్‌లో భాగంగా చూపేందుకు
ఇండో-చైనా సరిహద్దుల్లో హింసాత్మక ఘర్షణలు
ఇండో-చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య జూన్ 15న రాత్రి జరిగిన తీవ్రస్థాయి హింసాత్మక ఘర్షణల్లో రెండు దేశాలకు భారీగా ప్రాణ నష్టం జరిగింది. ముఖాముఖీ పోరాటంలో రాళ్లు, ఇనుప రాడ్‌లతో చైనా సైనికులు దాడి చేశారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘర్షణల కారణంగా 20 మంది భారతీయ సైనికులు అమరులైనట్లు జూన్ 16న రాత్రి భారత ఆర్మీ ప్రకటించింది. ఘటనాస్థలి నుంచి రెండు దేశాల సైనికులు వెనక్కు వెళ్లారని పేర్కొంది. చైనాకి చెందిన 43 మంది సైనికులు భారత సైనికుల దాడిలో చనిపోయి ఉండొచ్చని సమాచారం.
తెలుగువాడి వీర మరణం
చైనా సైనికులతో ఘర్షణలో భారత సైన్యానికి చెందిన కల్నల్ సంతోశ్ బాబు అమరులయ్యారు. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోశ్ గాల్వన్ లోయ ప్రాంతంలో 16 బిహార్ రెజిమెంట్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు.
45 ఏళ్ల తరువాత..
రెండు దేశాల పరస్పర దాడుల్లో భారతీయ సైనికులు చనిపోయిన ఘటన 45 సంవత్సరాల తరువాత మళ్లీ ఇప్పుడే చోటు చేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తులుంగ్ లా ప్రాంతంలో 1975లో చైనా జరిపిన ఆకస్మిక దాడిలో నలుగురు భారత జవాన్లు చనిపోయారు.
భారత్, చైనా సరిహద్దులు ఇలా ..
- భారత్, చైనా సరిహద్దుల్ని మూడు సెక్టార్‌ల కింద విభజించారు. వీటిలో పశ్చిమ సెక్టార్ ఎప్పుడూ ఉద్రిక్తతలకి, చొరబాట్లకి కేంద్ర బిందువుగా ఉంటోంది.
- కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి 1,597 కి.మీ. ప్రాంతాన్ని పశ్చిమ సెక్టార్ అంటారు.
- హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో 545 కి.మీ. పొడవునా మధ్య సెక్టార్ ఉంది.
- తూర్పు సెక్టార్‌లో 1,346 కి.మీ. మేర సరిహద్దు ఉంది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దుగా ఈ సెక్టార్ ఉంది.
చైనా తీరు ఏకపక్షం: భారత్
సరిహద్దుల్లో యధాతథ స్థితిని మార్చేందుకు చైనా ఏకపక్షంగా చేసిన ప్రయత్నం కారణంగానే తీవ్రస్థాయి హింసాత్మక ఘర్షణ చోటు చేసుకుందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఉన్నత స్థాయిలో ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని చైనా గౌరవించి ఉంటే.. రెండు దేశాల సైనికులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది కాదని పేర్కొంది. వాస్తవాధీన రేఖకు ఇవతలి(భారత్) వైపుననే భారత్ చేపట్టే అన్ని కార్యకలాపాలు ఉంటున్నాయని స్పష్టం చేసింది.
భారత్‌దే తప్పు: చైనా
జూన్ 15న భారత దళాలు వాస్తవాధీన రేఖను రెండుసార్లు దాటి వచ్చి, తమ సైనికులపై దాడులు చేసి రెచ్చగొట్టారని చైనా ఆరోపించింది. దాంతో రెండు దేశాల సైనికులు బాహాబాహీకి దిగే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. ‘గతంలో అంగీకారానికి వచ్చిన ఏకాభిప్రాయానికి కట్టుబడి ఉండాలని, తమ దళాలు సరిహద్దు దాటకుండా చూసుకోవాలని, పరిస్థితులు విషమించేలా ఏకపక్ష చర్యలకు దిగకుండా చూసుకోవాలని భారత్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావొ లిజియాన్ వ్యాఖ్యానించారు.
భారత్‌కు అమెరికా క్షమాపణలు
అమెరికాలో పోలీసుల దౌర్జన్యానికి, జాతి వివక్షకు వ్యతిరేకంగా జరుగుతన్న ఆందోళనల్లో భారతీయ దౌత్య కార్యాలయం వద్ద ఉన్న గాంధీజీ విగ్రహం ధ్వంసమైంది. జూన్ 2వ తేదీ రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చునని అమెరికాలో భారత దౌత్యకార్యాలయ సిబ్బంది భావిస్తున్నారు. ఈ అంశంపై అమెరికా విదేశీ వ్యవహారాల శాఖకు సమాచారం అందించామని, స్థానిక పోలీసు అధికారులు సంఘటనపై విచారణ ప్రారంభించారని అధికారులు తెలిపారు. శాంతి, అహింసలకు మారుపేరుగా భావించే గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడంపై భారత్‌లో అమెరికా రాయబారి కెన్ జుస్టర్ క్షమాపణలు కోరారు.
గూగుల్ రూ.210 కోట్లు విరాళం
అమెరికాలో పోలీసుల దౌర్జన్యానికి బలైన ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్‌కు నివాళులు అర్పించాలని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులకు రాసిన లేఖలో కోరారు. జాతివివక్షపై జరిగే పోరుకు గూగుల్ సుమారు రూ.210 కోట్లు విరాళంగా ఇవ్వనుందన తెలిపారు. 2020, మే 25న మినియాపలిస్(అమెరికా)లోని ఒక పోలీస్ ఆఫీసర్ తన మోకాలితో తొక్కిపట్టి ఉంచినప్పుడు ఊపిరి ఆడక జార్జి ఫ్లాయిడ్ మృతి చెందడంతో తాజా ఆందోళనలు జరుగుతున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌కు అమెరికా క్షమాపణలు
ఎప్పుడు : జూన్ 4
ఎందుకు : ఆందోళనల కారణంగా అమెరికాలో భారతీయ దౌత్య కార్యాలయం వద్ద ఉన్న గాంధీజీ విగ్రహం ధ్వంసమైనందున
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఏడు ఒప్పందాలు
భారత్, ఆస్ట్రేలియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య బంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. అత్యంత కీలకమైన రక్షణ రంగం సహా ఏడు ఒప్పందాలు కుదిరాయి. భారత ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ మధ్య జూన్ 4న ఆన్‌లైన్ సదస్సు జరిగింది. కోవిడ్ నేపథ్యంలో ఇరువురు నేతలు ఆన్‌లైన్ ద్వారా చర్చలు జరిపారు.
ఎమ్‌ఎల్‌ఎస్‌ఏపై సంతకాలు...
తాజా సదస్సు సందర్భంగా మిలటరీ స్థావరాల్లో పరస్పర సహకారానికి వీలుగా ది మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ (ఎమ్‌ఎల్‌ఎస్‌ఏ)పై మోదీ, మారిసన్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో రక్షణ రంగంలో పరస్పరం సహకారం అందించుకుంటూనే ఇరు దేశాలు ఒకరి మిలటరీ స్థావరాలు మరొకరు వినియోగించుకునే వీలు ఉంటుంది. ఇకపై మరమ్మతులు, సైనికుల అవసరాలను తీర్చే సామగ్రి సరఫరా వంటి వాటి కోసం ఇరు దేశాలు ఒకరి మిలటరీ స్థావరాన్ని మరొకరు వినియోగించుకోవచ్చు.
డిక్లరేషన్ ఆవిష్కరణ...
ఎమ్‌ఎల్‌ఎస్‌ఏ ఒప్పందంతో పాటుగా సైబర్ టెక్నాలజీ, ఖనిజాలు తవ్వకాలు, మిలటరీ టెక్నాలజీ, వృత్తి విద్యా కోర్సులు, జల వనరుల నిర్వహణ వంటి అంశాల్లో ద్వైపాక్షిక సహకారం అందించుకోవడానికి భారత్, ఆస్ట్రేలియా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అలాగే ఇండో పసిఫిక్ తీర ప్రాంతం భద్రతపై ఇరు పక్షాలు దృష్టి సారించాయి. ‘‘షేర్‌డ్ విజన్ ఫర్ మ్యారీ టైమ్ కోపరేషన్ ఇన్ ది ఇండో పసిఫిక్’’అన్న పేరుతో ఒక డిక్లరేషన్‌ను ఆవిష్కరించాయి.
ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వానికి మద్ధతు
అణు సరఫరా గ్రూపు (ఎన్‌ఎస్‌జీ)లో భారత్ సభ్యత్వానికి ఆస్ట్రేలియా సంపూర్ణ మద్దతుని ప్రకటించింది. అలాగే ఐరాస భద్రతా మండలిలో భారత్‌ని శాశ్వత సభ్యదేశంగా చేయడానికి మద్దతునిస్తామని చెప్పింది. సదస్సులో మోదీ మాట్లాడుతూ... కరోనా సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. గుజరాతీ కిచిడి, భారతీయ సమోసా, మాంగో చెట్నీల గురించి మోదీ, మారిసన్ సరదాగా సంభాషించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్, ఆస్ట్రేలియా మధ్య ఏడు ఒప్పందాలు
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : భారత ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్
ఎందుకు : ఎమ్‌ఎల్‌ఎస్‌ఏ ఒప్పందంతో పాటుగా సైబర్ టెక్నాలజీ, ఖనిజాలు తవ్వకాలు, మిలటరీ టెక్నాలజీ, వృత్తి విద్యా కోర్సులు, జల వనరుల నిర్వహణ వంటి అంశాల్లో
సానుకూలంగా భారత్-చైనా చర్చలు
భారత్, చైనా సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో జూన్ 6న రెండు దేశాల సైనికాధికారుల మధ్య ఉన్నత స్థాయి చర్చలు సానుకూలంగా ముగిశాయి. వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలో చైనా భూభాగంలోని చెషుల్ సెక్టార్ మాల్దోలో జరిగిన ఈ చర్చలకు భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వం వహించగా చైనా పక్షాన టిబెట్ మిలటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ హాజరయ్యారు.
తాజా చర్చల విషయమై భారత విదేశాంగ శాఖ జూన్ 7న స్పందిస్తూ... లదాఖ్‌లోని గాల్వాన్ లోయ, పాంగోంగ్ త్సో, గోగ్రా ప్రాంతాల్లో సరిహద్దులకు సమీపంలో తలెత్తిన విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భారత్, చైనా అంగీకారానికి వచ్చినట్లు తెలిపింది. రెండు దేశాల మధ్య అమలవుతున్న ద్వైపాక్షిక ఒప్పందాలు, మార్గదర్శకాలకు లోబడి చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఏకాభిప్రాయం కుదిరిందని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సానుకూలంగా భారత్-చైనా చర్చలు
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : భారత్-చైనా సైన్యాధికారులు
ఎక్కడ : మాల్దో, చెషుల్ సెక్టార్, చైనా భూభాగం
ఎందుకు : భారత్, చైనా సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో
సరిహద్దుపై ‘థర్డ్ పార్టీ’ ప్రమేయం వద్దు: చైనా
భారత్-చైనా మధ్య ప్రస్తుతం తలెత్తిన సరిహద్దు వివాదాన్ని పరిష్కరించే విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తానంటూ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను చైనా తిరస్కరించింది. భారత్-చైనా నడుమ నెలకొన్న భేదాభిప్రాయాలను పరిష్కరించుకునేందుకు ‘థర్డ్ పార్టీ’ ప్రమేయం అక్కర్లేదని కుండబద్దలు కొట్టింది. ట్రంప్ ప్రతిపాదనపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జవో లిజియాన్ మే 29న మాట్లాడుతూ.. తమ మధ్య ఉన్న వివాదాల విషయంలో మూడో వ్యక్తి ప్రమేయాన్ని భారత్-చైనా ఎంతమాత్రం కోరుకోవడం లేదని తేల్చి చెప్పారు.
ఉద్రిక్తతలపై చర్చించుకోలేదు
తూర్పు లడఖ్‌లో చైనాతో ప్రస్తుతం కొనసాగుతున్న మిలటరీ ఉద్రిక్తతలపై తాను, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే మాట్లాడుకున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను కేంద్ర ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు ఖండించాయి. ఈ విషయంలో ట్రంప్-మోదీ ఇటీవల చర్చించుకోలేదని స్పష్టం చేశాయి. ఏప్రిల్ 4న ట్రంప్-మోదీ మధ్య హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రల విషయంలో మాత్రమే సంభాషణ జరిగిందని పేర్కొన్నాయి.
జీ-7 దేశాల సదస్సుపై మోదీ, ట్రంప్ చర్చలు
జీ-7 దేశాల సదస్సు, కరోనా మహమ్మారి సహా పలు అంశాలపై భారత ప్రధానమంత్రి మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూన్ 2న ఫోన్‌లో చర్చించారు. జీ 7 కూటమికి అమెరికా అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో.. ఇందుకు సంబంధించి ట్రంప్ ప్రణాళికపై చర్చించాం. కోవిడ్-19 మహమ్మారి, పలు ఇతర అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి’ అని మోదీ ట్వీట్ చేశారు. కరోనా అనంతర ప్రపంచ నిర్మాణంలో భారత్, అమెరికా సంబంధాలు కీలకమైన పునాదిగా నిలుస్తాయన్నారు. జీ-7 దేశాల సదస్సుకు హాజరుకావాలని మోదీని ట్రంప్ ఈ సందర్భంగా ఆహ్వానించారు.
మిలటరీని దింపుతా: ట్రంప్
ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్‌ఫ్లాయిడ్ హత్యోదంతంపై అమెరికాలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రాలు ఈ ఉద్యమాలను అణచివేయడంలో విఫలమైతే సైన్యాన్ని రంగంలోకి దింపేందుకూ వెనుకాడనని అధ్యక్షుడు ట్రంప్ జూన్ 1న ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీ-7 దేశాల సదస్సుపై చర్చలు
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : భారత ప్రధానమంత్రి మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్