Skip to main content

జూలై 2020 ద్వైపాక్షిక సంబంధాలు

ఇజ్రాయెల్ రక్షణ మంత్రితో రాజ్‌నాథ్ చర్చలు
Current Affairs ఇజ్రాయెల్ రక్షణ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ బెంజమిన్ గంట్జ్‌తో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌జూలై 24న టెలిఫోన్ ద్వారా చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య పూర్తిస్థాయిలో రక్షణ, భద్రత సంబంధాలను విసృ్తతం చేసుకోవడంతోపాటు తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితుల నేపథ్యంలో ప్రాంతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ముఖ్యంగా, ఇప్పటికే కుదిరిన ఆయుధ కొనుగోళ్ల ఒప్పందాల అమలును వేగిర పరచడం, ఇజ్రాయెల్‌నుంచి తక్షణం అందాల్సిన వివిధ రకాల ఆయుధాలు, పేలుడు సామగ్రిపైనా వారు సంభాషించారు. ఇజ్రాఝెల్‌నుంచి క్షిపణులు, డ్రోన్లు, మిలటరీ హార్డ్ వేర్‌కొనుగోలు చేసే దేశాల్లో భారత్‌ది మొదటిస్థానం.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఇజ్రాయెల్ రక్షణ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ బెంజమిన్ గంట్జ్‌తోటెలిఫోన్ ద్వారా చర్చలు
ఎప్పుడు:జూలై 24
ఎవరు: భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
ఎందుకు:రెండు దేశాల మధ్య రక్షణ, భద్రత సంబంధాలను విస్తృతం చేసుకోవడంతోపాటు తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితుల నేపథ్యంలో ప్రాంతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు

యూఎస్ నుంచి పొసీడన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు కొనుగోలు
చైనాతో సరిహద్దు వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో భారత సైన్యం అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకోవడంతో ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అమెరికా నుంచి మరో 6 లాంగ్‌రేంజ్ పొసీడన్-8ఐ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేసేందుకు సన్నద్ధమైంది. 6 ప్రిడేటర్-బి ఆర్మ్‌డ్ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు ప్రణాళిక తయారు చేస్తోంది. 6 పొసీడన్-8ఐ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం 1.8 బిలియన్ డాలర్లు(రూ.13,400 కోట్లు) వెచ్చించనున్నారు. ఈ మేరకు అభ్యర్థన లేఖను అమెరికా ప్రభుత్వానికి పంపించినట్లు భారత రక్షణ శాఖ వెల్లడించింది. పొసీడన్-8ఐ ఎయిర్‌క్రాఫ్ట్‌లను సరిహద్దుల్లో, సముద్ర ఉపరితలంపై నిఘా కోసం ఉపయోగిస్తారు. ఇందులో రాడార్లు, ఎలక్ట్రో ఆప్టిక్ సెన్సార్లు ఉంటాయి. భారత సైన్యం ఇప్పటికే ఎనిమిది అత్యాధునిక పొసీడన్-8ఐ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఉపయోగిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మరో 6 లాంగ్‌రేంజ్ పొసీడన్-8ఐ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలుకు సన్నద్ధం
ఎప్పుడు : జూలై 25
ఎవరు : భారత్
ఎందుకు : చైనాతో సరిహద్దు వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో

అంబాలా వైమానిక స్థావరానికి రఫేల్ విమానాలు
భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్సు నుంచి బయలుదేరాయి. 2016లో భారత ప్రభుత్వం 36 అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్సుతో రూ.59 వేల కోట్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం.. మొదటి విడతలో భాగంగా జూలై 27న ఫ్రాన్సులోని మెరిగ్నాక్ వైమానిక కేంద్రం నుంచి 5 రఫేల్ యుద్ధ విమానాలు భారత్‌కు బయలుదేరాయి. ఇవి జూలై 29వ తేదీన పంజాబ్‌లోని అంబాలా వైమానిక స్థావరానికి చేరుకోనున్నాయి. మార్గమధ్యంలో యూఏఈలోని అల్‌ధఫ్రా ఎయిర్‌బేస్‌లో జూలై 27న దిగాయి.
రఫేల్ ప్రత్యేకతలు..

 

  • ఫ్రాన్స్ కు చెందిన డసో ఏవియేషన్ సంస్థ ఈ విమానాలను తయారు చేస్తోంది.
  • 2019, అక్టోబర్‌లో మొదటి రఫేల్ జెట్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఫ్రాన్సు పర్యటన సందర్భంగా డసో అందజేసింది.
  • శక్తివంతమైన ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం రఫేల్ జెట్లకు ఉంది. గాలిలో నుంచి గాలిలోకి ప్రయోగించగలిగే మెటియోర్, స్కాల్ప్ క్షిపణులను ఇది తీసుకెళ్లగలదు.
  • క్షిపణి వ్యవస్థలతోపాటు ఈ జెట్లలో భారత్ కోరిన విధంగా..ఇజ్రాయెలీ హెల్మెట్ మౌంటెడ్ డిస్‌ప్లే, రాడార్ వార్నింగ్ రిసీవర్లు, లో-బ్యాండ్ జామర్లు, 10 గంటల ఫ్లైట్ డేటా రికార్డింగ్, ఇన్‌ఫ్రా రెడ్ సెర్చ్, ట్రాకింగ్ సిస్టమ్స్ వంటి అదనపు ఏర్పాట్లున్నాయి.
  • మొత్తం భారత్‌కు వచ్చే 36 రఫేల్ విమానాల్లో 30 యుద్ధ విమానాలు(ఒకటే సీటుండేది) కాగా, 6 శిక్షణ విమానాలు రెండు సీట్లుండేవి. ఈ తేడా తప్పితే రెండింటి సామర్థ్యం ఒక్కటే.
  • ఒక స్క్వాడ్రన్ రఫేల్ జెట్లను అంబాలా ఎయిర్ బేస్‌లో. మరో స్క్వాడ్రన్‌ను బెంగాల్‌లోని హసిమారా బేస్‌లోనూ ఉంచనున్నారు. వీటి పరిరక్షణ, నిర్వహణ ఏర్పాట్లకు ఐఏఎఫ్ రూ.400 కోట్లు వెచ్చించింది.
  • చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా తూర్పు లద్దాఖ్ సెక్టార్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి భారత్ సన్నద్ధత సామర్థ్యాన్ని పెంచేందుకు రఫేల్‌లను మోహరించనున్నారు.


పాకిస్తాన్ పార్లమెంట్‌లో జాధవ్ ఆర్డినెన్స్
గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలపై మరణ శిక్ష ఎదుర్కొంటున్న భారతీయుడు కుల్‌భూషణ్ జాధవ్‌కు సంబంధించిన ఒక ఆర్డినెన్స్ ను జూలై 27న పాకిస్తాన్ పార్లమెంట్ దిగువ సభలో ప్రవేశపెట్టారు. జాధవ్‌కు ఉరిశిక్ష విధిస్తూ పాక్ మిలటరీ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇస్లామాబాద్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలుకు ఈ ఆర్డినెన్స్ వీలు కల్పిస్తుంది. జాధవ్‌కు ఉరిశిక్ష విధిస్తూ పాక్ మిలటరీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ భారత్ వేసిన పిటిషన్‌పై అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ఆర్డినెన్స్ ను పాక్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆ ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చిన 60 రోజుల్లోగా జాధవ్ ఇస్లామాబాద్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది.
గురుద్వారాను మసీద్‌గా..
భాయ్ తారు సింగ్‌జీ మరణం తర్వాత పాకిస్తాన్‌లోని లాహోర్‌లో 1745 ఏడాది నిర్మించిన ఆ గురుద్వారాను షాహిద్ గంజ్ మసీదుగా మార్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. దీనిపై లాహోర్‌లోని పాకిస్తాన్ హైకమిషన్‌లో జూలై 27న భారత్ తీవ్ర నిరసన వ్యక్తంచేసిందని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కుల్‌భూషణ్ జాధవ్‌కు సంబంధించి ఆర్డినెన్స్
ఎప్పుడు : జూలై 27
ఎవరు : పాకిస్తాన్ ప్రభుత్వం
ఎందుకు : జాధవ్‌కు ఉరిశిక్ష విధిస్తూ పాక్ మిలటరీ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇస్లామాబాద్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలుకు

మరో 47 చైనా యాప్‌లపై నిషేధం
భారత్, చైనా సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో దేశ భద్రతకు, సార్వభౌమాధికారానికీ, సమగ్రతకు నష్టం వాటిల్లే ప్రమాదముందని భావించిన భారత ప్రభుత్వం జూలై 27న మరో 47 చైనా మొబైల్ యాప్స్‌పై నిషేధం విధించింది. అయితే ఈ 47 యాప్‌లు గతంలో నిషేధానికి గురైన యాప్‌ల నకలు రూపాలు అని కేంద్రం తెలిపింది. 2020, జూన్ 29న కేంద్ర ప్రభుత్వం 59 చైనా యాప్‌లను నిషేధించింది. దీంతో ఇప్పటి వరకు నిషేధం విధించిన చైనా మొబైల్ యాప్‌ల సంఖ్య 106కి చేరింది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని మొత్తం 275 చైనా యాప్‌లపై కేంద్రం నిఘాపెట్టింది. చైనా నుంచి పనిచేసే అన్ని టెక్ కంపెనీలనూ, చైనా యాజమాన్యంలోని కంపెనీలనూ ‘నేషనల్ ఇంటెలిజెన్స్ లా ఆఫ్ 2017’నియంత్రిస్తుంది. ఈ చట్టం ప్రకారం ఈ యాప్‌లు సేకరించే సమాచారం మొత్తం చైనా ప్రభుత్వానికి చేరుతుంది. ఇది అన్ని ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 47 చైనా మొబైల్ యాప్స్‌పై నిషేధం
ఎప్పుడు : జూలై 27
ఎవరు : భారత ప్రభుత్వం
ఎక్కడ : భారత్
ఎందుకు : దేశ భద్రతకు, సార్వభౌమాధికారానికీ, సమగ్రతకు నష్టం వాటిల్లే ప్రమాదముందని

కరోనా కిట్ అభివృద్ధిపై భారత్‌కు ఇజ్రాయెల్ బృందం
కేవలం 30 సెకండ్లలో ఫలితాన్ని వెల్లడించే ర్యాపిడ్ కరోనా టెస్టింగ్ కిట్ అభివృద్ధి కోసం ఇజ్రాయెల్ రక్షణ శాఖకు చెందిన ఆర్‌అండ్‌డీ శాస్త్రవేత్తల బృందం ప్రత్యేక విమానంలో జూలై 27న భారత్‌కు చేరుకుంది. టెస్టింగ్ కిట్ అభివృద్ధి విషయంలో ఈ బృందం భారత్ చీఫ్ సైంటిస్టు కె.విజయ్ రాఘవన్, డీఆర్‌డీవోతో కలిసి పనిచేయనుంది. కరోనాపై కలిసి పోరాడుదామని భారత్, ఇజ్రాయెల్ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.
తుది పరీక్షల్లో అమెరికా వ్యాక్సిన్
అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్(ఎన్‌ఐహెచ్), మోడెర్నా సంస్థలు కలిసి సంయుక్తంగా కరోనా వ్యాక్సిన్ తయారీకి శ్రీకారం చుట్టాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సిన్ ప్రయోగమని ఎన్‌ఐహెచ్ ప్రతినిధులు చెప్పారు. తుది పరీక్షలు జూలై 27న ప్రారంభమయ్యాయి. 30 వేల మంది స్వచ్ఛంద కార్యకర్తలకు వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌కు ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల బృందం
ఎప్పుడు : జూలై 27
ఎందుకు : కేవలం 30 సెకండ్లలో ఫలితాన్ని వెల్లడించే ర్యాపిడ్ కరోనా టెస్టింగ్ కిట్ అభివృద్ధి కోసం

విమాన సర్వీసుల ప్రారంభంపై ఒప్పందాలు
Current Affairs అంతర్జాతీయ విమాన సర్వీసులను మళ్లీ ప్రారంభించే దిశగా భారత ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. విమాన సర్వీసులను ప్రారంభించేందుకు వీలుగా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీలతో ప్రత్యేక ద్వైపాక్షిక ఒడంబడికలను కుదుర్చుకుంది. త్వరలో యూకేతోనూ ఈ తరహా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. ఈ వివరాలను విమానయాన మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి జూలై 16న వెల్లడించారు. అంతర్జాతీయ సరీ్వసులపై భారత్‌ ఇప్పటికే యూఏఈతో ఒప్పందం కుదుర్చుకుందని మంత్రి పేర్కొన్నారు. కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో దీపావళి నాటికి దేశీయ ట్రాఫిక్‌ కరోనాముందున్న స్థాయితో పోలిస్తే.. 55 శాతానికి చేరుకుంటుందని ఆశిస్తున్నామని తెలిపారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి: అమెరికా, ఫ్రాన్స్, జర్మనీలతో ద్వైపాక్షిక ఒప్పందం
ఎప్పుడు: జూలై 15
ఎవరు: భారత్‌
ఎందుకు: అంతర్జాతీయ విమాన సరీ్వసులను మళ్లీ ప్రారంభించే

జాధవ్‌ను స్వేచ్ఛగా మాట్లాడనివ్వలేదు: భారత్‌
గూఢచర్యం ఆరోపణలపై పాకిస్తాన్ నిర్బంధంలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాధవ్‌ను కలుసుకునేందుకు తమ దౌత్యాధికారులకు స్వేచ్ఛాయుత, బేషరతు అనుమతి ఇవ్వలేదని భారత్‌ జూలై 16న ఆరోపించింది. జాధవ్‌ను కలుసుకునేందుకు వెళ్లిన అధికారులకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించిందని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు.
జూలై 20 వరకు మాత్రమే..
పాకిస్థాన్ సైనిక కోర్టు జాదవ్‌కు విధించిన మరణ శిక్షపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయడానికి 2020, జూలై 20 వరకు మాత్రమే గడువున్న తరుణంలో జూలై 16న జాదవ్‌ను కలుసుకోవడానికి భారత అధికారులకు పాక్‌ అనుమతించింది. పాకిస్తాన్ మిలటరీ కస్టడీలో ఉన్న జాదవ్‌ను కలుసుకున్న అధికారులు రెండు గంటల సేపు చర్చించారు. రివ్యూ పిటిషన్కు సంబంధించి ఆయన నుంచి లిఖితపూర్వక అనుమతి తీసుకుందామని భావిస్తే అక్కడి అధికారులు అడ్డుపడ్డారని శ్రీవాస్తవ తెలిపారు.

ఆయుర్వేద మందులపై అమెరికన్ల పరిశోధనలు
Current Affairs ఆయుర్వేదం మందులపై పరిశోధనలు ప్రారంభించేందుకు భారత్‌లోని ఆయుర్వేద వైద్యులు, శాస్త్రవేత్తలతో అమెరికన్ శాస్త్రవేత్తలు కలిసి పనిచేయనున్నారు. ఈ విషయాన్ని వాషింగ్టన్‌లోని భారతీయ దౌత్యవేత్త తరన్‌జీత్ సింగ్ సంధూ తెలిపారు. భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తలతో జూలై 8న ఆన్‌లైన్ సమావేశం నిర్వహించిన తరన్‌జీత్ ఈ మేరకు వెల్లడించారు. ఉమ్మడి పరిశోధనల ద్వారా ఆయుర్వేదానికి ప్రాచుర్యం కల్పించాలని ఇరుదేశాల శాస్త్రవేత్తలు నిర్ణయించారన్నారు. కోవిడ్ చికిత్సకువాడే ఆయుర్వేద మందులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారని పేర్కొన్నారు. కోవిడ్ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు ఇండో యూఎస్ సైన్స్ టెక్నాలజీ ఫోరమ్ ప్రయత్నిస్తోందని తరన్‌జీత్ వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆయుర్వేద మందులపై పరిశోధనలు
ఎప్పుడు : జూలై 9
ఎవరు : భారతీయ, అమెరికన్ శాస్త్రవేత్తలు
ఎందుకు : ఆయుర్వేదానికి ప్రాచుర్యం కల్పించాలని

భారత్‌కు అపాచీ, చినూక్ హెలికాప్టర్ల అందజేత పూర్తి
భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌కు 22 అపాచీ, 15 చినూక్ హెలికాప్టర్ల అందజేత పూర్తి చేసినట్లు అమెరికా విమానయాన సంస్థ బోయింగ్ ప్రకటించింది. ఒప్పందం ప్రకారం అపాచీ యుద్ధ హెలికాప్టర్లలోని చివరి ఐదింటిని ఇటీవల భారత వైమానిక దళానికి అందజేసినట్లు జూలై 10న బోయింగ్ సంస్థ వెల్లడించింది.
సరిహద్దుల్లో శాంతికి అంగీకారం
వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి పూర్తిస్థాయిలో శాంతి నెలకొనేలా చర్యలు తీసుకోవాలని భారత్, చైనా ఒక అంగీకారానికి వచ్చాయి. తూర్పు లద్దాఖ్‌లో సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. ఇరు దేశాల దౌత్య ప్రతినిధులు మరోసారి జూలై 10న ఆన్‌లైన్ ద్వారా చర్చలు జరిపారు. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతిస్థాపన కోసం సరిహద్దుల్లో సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవడానికి ఇరు దేశాల ప్రతినిధులు అంగీకరించారు. మరోవైపు భారత్, చైనా సరిహద్దుల్లో పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జూలై 10న అమెరికా రక్షణ మంత్రి మార్క్ టీ ఎస్పర్‌తో చర్చలు జరిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారత్‌కు అపాచీ, చినూక్ హెలికాప్టర్ల అందజేత పూర్తి
ఎప్పుడు : జూలై 10
ఎవరు : అమెరికా విమానయాన సంస్థ బోయింగ్

రైల్వే ప్రాజెక్టు నుంచి భారత్‌ను తప్పించిన ఇరాన్
చాబహర్ పోర్టు నుంచి జహెదాన్ వరకు రైల్వే లైన్ ప్రాజెక్టును సొంతంగానే చేపట్టాలని ఇరాన్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రాజెక్టు నుంచి భారత్‌ను తప్పించింది. భారత్ నుంచి నిధుల రాకలో ఆలస్యం వల్లే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్ ఆర్థిక సాయంతో ఈ ప్రాజెక్టు పూర్తిచేయాలని నాలుగేళ్ల క్రితం ఇండియా-ఇరాన్-అఫ్ఘానిస్తాన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఆ ఒప్పందాన్ని ఇరాన్ పక్కన పెట్టింది.
2022 నాటికి...
చాబహర్ పోర్టు-జహెదాన్ రైల్వే లైన్‌ను 2022 మార్చినెల నాటికి పూర్తి చేయాల్సి ఉంది. దీనికోసం ‘ఇరానియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఫండ్’ నుంచి 400 మిలియన్ డాలర్లు తీసుకోనున్నారు.
అమెరికా ఆంక్షలతో...
అఫ్ఘనిస్తాన్, దక్షిణాసియా దేశాలతో వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటులో భాగంగా ఇరాన్‌లో చాబహర్ పోర్టు అభివృద్ధికి భారత్ సహకరిస్తోంది. అలాగే చాబహర్ పోర్టు-జహెదాన్ రైల్వేలైన్ నిర్మాణానికి 1.6 బిలియన్ డాలర్లు అందజేస్తామని, నిర్మాణ పనుల్లో సహరిస్తామని ఇండియా హామీ ఇచ్చింది. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. అయితే, ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించడంతో పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చాబహర్ పోర్టు-జహెదాన్ రైల్వే ప్రాజెక్టు నుంచి భారత్‌ను తప్పించిన ఇరాన్
ఎప్పుడు : జూలై 14
ఎందుకు : భారత్ నుంచి నిధుల రాకలో ఆలస్యం వల్ల

15వ ఈయూ- ఇండియా సదస్సు
స్వేచ్ఛాయుత వాణిజ్యంలో దీర్ఘకాలంగా నెలకొన్న విభేదాలను పరిష్కరించడానికి అత్యున్నత స్థాయి చర్చలు జరపాలని భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) నిర్ణయించాయి. రక్షణ, అణు ఇంధనశక్తి, ఆరోగ్య రంగాల్లో పరస్పరం సహకరించుకునేలా సంబంధాలను బలోపేతం చేయాలని, దానికి పంచవర్ష ప్రణాళికను రూపొందించాలని ఇరుపక్షాలు ఒక అంగీకారానికి వచ్చాయి. జూలై 15న జరిగిన 15వ ఈయూ- ఇండియా సదస్సు వీడియో సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. ఈయూలో ఉన్న 27 దేశాలతో సత్సంబంధాల ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 15వ ఈయూ- ఇండియా సదస్సు
ఎప్పుడు : జూలై 15
ఎందుకు : వాణిజ్యం, రక్షణ, ఇంధనశక్తి వంటి అంశాల్లో చర్చించేందుకు

రష్యా అధ్యక్షుడితో ప్రధాని మోదీ చర్చలు
Current Affairs
కరోనా సంక్షోభం, వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం.. తదితర అంశాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జూలై 2న ఫోన్‌లో చర్చించారు. కోవిడ్-19 అనంతరం ప్రపంచం ఎదుర్కొనే సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని, 2020 ఏడాది చివర్లో జరిగే వార్షిక ద్వైపాక్షిక సదస్సును విజయవంతం చేసే దిశగా సంప్రదింపులను మరింత విసృ్తతం చేయాలని తీర్మానించారు. భారత్‌లో జరిగే ఈ సదస్సులో పాల్గొనాలని పుతిన్‌ను మోదీ ఆహ్వానించారు. భారత్‌తో అన్ని రంగాల్లో ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందన్న పుతిన్.. ఆ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలు
ఎప్పుడు : జూలై 2
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఫోన్
ఎందుకు : కరోనా సంక్షోభం, వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం వంటి అంశాలపై చర్చించేందుకు

చైనా విద్యుత్ పరికరాలను దిగుమతి చేసుకోం
సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా నుంచి భారత్ విద్యుత్ పరికరాలను దిగుమతి చేసుకోబోదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ స్పష్టం చేశారు. అలాగే, చైనా, పాకిస్తాన్‌ల నుంచి వచ్చే పరికరాల దిగుమతులను కేవలం తనిఖీల ఆధారంగా అనుమతించేది లేదని పేర్కొన్నారు. తనిఖీల తర్వాతైనా అవసరమైతే అనుమతులు రద్దు చేస్తామన్నారు. రాష్ట్రాల విద్యుత్ శాఖల మంత్రులతో జూలై 3న జరిగిన వర్చువల్ సమావేశంలో ఆయన ఈ విషయాలు తెలిపారు.
సమావేశంలో మంత్రి ఆర్‌కే సింగ్ మాట్లాడుతూ... ‘భారత్ రూ. 71,000 కోట్ల విలువ చేసే విద్యుత్ పరికరాలను దిగుమతి చేసుకుంది. ఇందులో రూ.21,000 కోట్ల మేర చైనా నుంచి దిగుమతయ్యాయి. చైనా, పాకిస్తాన్‌ల నుంచి ఏదీ కొనుగోలు జరిపే ప్రసక్తే లేదు. దిగుమతి చేసుకున్న వాటిల్లో (చైనా నుంచి) ఏ మాల్‌వేర్ ఉందో ట్రోజన్ హార్స్ ఉందో (వైరస్‌లు). వీటి సాయంతో వారు అక్కడెక్కణ్నుంచో మన విద్యుత్ వ్యవస్థలను చిన్నాభిన్నం చేయొచ్చు’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చైనా విద్యుత్ పరికరాలను దిగుమతి చేసుకోం
ఎప్పుడు : జూలై 3
ఎవరు : కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్
ఎందుకు : సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో

చైనా దిగుమతులకు ముందస్తు అనుమతి తప్పనిసరి
చైనా, పాకిస్తాన్ వంటి దేశాల నుంచి విద్యుత్ పరికరాల దిగుమతులకు ముందస్తుగా అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేస్తూ కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. భారత్‌తో సరిహద్దులున్న దేశాలు. ముఖ్యంగా చైనా నుంచి దిగుమతులను తగ్గించే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం విద్యుత్ సరఫరా వ్యవస్థలో వినియోగించేందుకు దిగుమతి చేసుకున్న అన్ని రకాల యంత్రాలు, పరికరాలు, విడిభాగాలతో మాల్‌వేర్, ట్రోజన్లు, సైబర్ ముప్పులాంటివి పొంచి ఉన్నాయేమో తెలుసుకునేందుకు, భారత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేవా అని చూసేందుకు దేశీయంగా పరీక్షించడం జరుగుతుంది. విద్యుత్ శాఖ నిర్దేశించిన అధీకృత ల్యాబొరేటరీల్లో టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చైనా, పాకిస్తాన్ విద్యుత్ పరికరాల దిగుమతులకు ముందస్తుగా అనుమతి తప్పనిసరి
ఎప్పుడు : జూలై 3
ఎవరు : కేంద్ర విద్యుత్ శాఖ
ఎందుకు : మాల్‌వేర్, ట్రోజన్లు, సైబర్ ముప్పులాంటివి పొంచి ఉన్నాయేమో తెలుసుకునేందుకు

బలగాల ఉపసంహరణకు మరికొన్ని రోజులు
గల్వాన్ లోయలోని భారత్, చైనా సైన్యాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాల నుంచి ఇరుదేశాల బలగాల ఉపసంహరణ ముగిసేందుకు మరికొన్ని రోజులు పడుతుందని ఆర్మీ వర్గాలు జూలై 7న వెల్లడించాయి. పెట్రోలింగ్ పాయింట్ 15 హాట్‌స్ప్రింగ్‌‌స వద్ద ఉపసంహరణ ప్రక్రియ జూలై 7నే పూర్తి కావచ్చని, గొగ్రా ప్రాంతంలో మాత్రం మరి కొన్ని రోజులు పట్టవచ్చని తెలిపాయి.
సాధ్యమైనంత త్వరగా...
ఇరుదేశాల ఆర్మీ కమాండర్ స్థాయి అధికారుల మధ్య మూడు విడతలుగా జరిగిన చర్చలు, ఆ తరువాత భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిల మధ్య జూలై 5న జరిగిన చర్చల నేపథ్యంలో.. ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాలను సాధ్యమైనంత త్వరగా ఉపసంహరించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా, బలగాలు, వాహనాలు, ఇతర సామగ్రి ఉపసంహరణ కార్యక్రమం జూలై 6న ప్రారంభమైంది.
పీపీ 14 నుంచి...
‘ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు.. రెండు దేశాల సైన్యాలు ఘర్షణాత్మక ప్రదేశాల నుంచి 1 నుంచి 1.5 కిలోమీటర్ల వరకు వెనక్కు వెళ్లాలి. అలాగే, భవిష్యత్ కార్యాచరణ కోసం చర్చలు కొనసాగించాలి’ అని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. గల్వాన్ లోయలోని పీపీ 14 నుంచి చైనా బలగాలు వెనక్కు వెళ్లాయని, టెంట్స్‌ను తొలగించాయని తెలిపాయి.

రివ్యూ పిటిషన్‌కు జాదవ్ అంగీకరించలేదు: పాక్
గూఢచర్య ఆరోపణలపై పాకిస్తాన్ జైల్లో ఉన్న మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ తనకు విధించిన మరణశిక్షపై రివ్యూపిటిషన్ దాఖలు చేయడానికి అంగీకరించలేదనీ, తాను గతంలో పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌కే పరిమితం కావాలని భావిస్తున్నారంటూ పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఉగ్రవాదం, గూఢచర్యం ఆరోపణలతో జాదవ్‌కి 2017లో పాక్ మిలిటరీ కోర్టు మరణశిక్ష విధించింది. జాదవ్‌ని కలిసేందుకు మరోమారు అవకాశం ఇస్తున్నట్టు పాకిస్తాన్ మీడియా రిపోర్టు చేసింది. కుల్‌భూషణ్ కేసులో ఐసీజే తీర్పుని పాటిస్తున్నామని మేలో పాకిస్తాన్ వెల్లడించింది.
పచ్చి మోసం: భారత్
జాదవ్ తన మరణశిక్షపై అప్పీల్‌కు వెళ్ళేందుకు నిరాకరించారన్న పాక్ వాదన పచ్చి మోసమని భారత్ పేర్కొంది. రివ్యూపిటిషన్ వేయకుండా ఉండేందుకు, తనకున్న చిట్టచివ్వరి న్యాయపరమైన అవకాశాన్ని వాడుకోనివ్వకుండా జాదవ్‌పై పాకిస్తాన్ ఒత్తిడి చేసిందని స్పష్టమౌతోందని, ఇది నిర్లజ్జాకరమైన చర్య అని భారత విదేశాంగ శాఖ మండిపడింది.

Published date : 31 Jul 2020 03:38PM

Photo Stories