అక్టోబర్ 2020 ద్వైపాక్షిక సంబంధాలు
భారత్-అమెరికాల మధ్య ప్రారంభమైన 2+2 మంత్రిత్వ స్థాయి చర్చల్లో కీలక ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదిరింది. సమాచార మార్పిడి, సహకార ఒప్పందం (బెకా)పై ఇరు దేశాల నేతలు సంతకాలు చేశారు. హైదరాబాద్ హౌస్‌లో అక్టోబర్ 27వ తేదీన జరిగిన మూడవ 2+2 మంత్రిత్వ స్ధాయి చర్చల్లో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. బెకా ఒప్పందంతో అమెరికా సైనిక శాటిలైట్స్ ద్వారా కీలక సమాచారం, ఇమేజ్‌లను భారత్ పొందే వెసులుబాటు కలుగుతుంది.
2+2 చర్చలు, బెకా అంటే.. ?
ఒక దేశ రక్షణ, విదేశీ మంత్రులు మరో దేశ రక్షణ, విదేశీ మంత్రులతో జరిపే చర్చలను టు ప్లస్ టు చర్చలంటారు. ఒక దేశం తనకు అత్యంత కీలకమని భావించే మరో దేశంతో ఇలాంటి సమావేశాలు జరుపుతుంది. రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకునేందుకు ఈ చర్చలు కీలకంగా ఉంటాయి. తాజా సమావేశాల్లో భారత్ బెకా(బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్) కోసం ఎదురుచూస్తోంది. శాటిలైట్ సమాచార మార్పిడి ఈ బెకాలో కీలకం. ఈ ఒప్పందం కుదిరితే యూఎస్ జియో శాటిలైట్ ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇండియా వాడుకునే వీలుంటుంది. 2002లో అమెరికాతో భారత్ జిఎస్‌ఓఎంఐఏ(జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్) కుదుర్చుకుంది. ఇందులో భాగంగా లాజిస్టికల్ ఎక్స్చేంజ్ మెమొరాండమ్ అగ్రిమెంట్(లెమొవా)ను 2016లో, కమ్యూనికేషన్, కంపాటబిలిటీ సెక్యూరిటీ అగ్రిమెంట్(కామ్‌కాసా)ను 2018లో పూర్తి చేసుకుంది. బెకా పూర్తయితే 2002 అగ్రిమెంట్ దశలన్నీ పూర్తయినట్లవుతుంది.
ఏ రెండు దేశాల మధ్య బెకా రక్షణ ఒప్పందం కుదిరింది?
ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును నిలువరించేందుకు, దక్షిణాసియాలో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో... భారత్, అమెరికా దేశాల మధ్య కీలకమైన 2+2 మంత్రిత్వ స్థాయి చర్చలు జరిగాయి. అక్టోబర్ 27న న్యూఢిల్లీలో జరిగిన ఈ చర్చల్లో అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌పాంపియో, అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్, భారత్ తరఫున విదేశాంగ, రక్షణ మంత్రులు జైశంకర్, రాజ్‌నాథ్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. భారత్, అమెరికాల మధ్య ఇవి మూడో విడత 2+2 చర్చలు. చర్చల సందర్భంగా అణు శక్తి, సహజవాయువు, చమురు, అంతరిక్షం, ఆరోగ్యం, సైబర్ సెక్యూరిటీ, రక్షణ రంగ వాణిజ్యం, ఇరుదేశాల మధ్య ప్రజా సంబంధాలు.. తదితర అంశాలపై ఇరుదేశాల నేతలు చర్చించారు. ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఎదురయ్యే అన్ని రక్షణ సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కొంటామని ఒక సంయుక్త ప్రకటనను వెలువరించాయి. మరోవైపు అమెరికా రక్షణ మంత్రి ఎస్పర్, విదేశాంగ మంత్రి పాంపియో భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు.
బెకా రక్షణ ఒప్పందం
- భారత్, అమెరికా 2+2 చర్చల సందర్భంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాల విస్తరణలో కీలకమైన నాలుగు ఒప్పందాల్లో చివరిదైన ‘బేసిక్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ కో ఆపరేషన్‌అగ్రిమెంట్(బీఈసీఏ-బెకా)’ ఒప్పందం కుదిరింది. అత్యాధునిక మిలటరీ సాంకేతికత, అత్యంత రహస్య భౌగోళిక ఉపగ్రహ సమాచారం, ఇతర కీలక సమాచారాన్ని అమెరికా భారత్‌కు అందించేందుకు ఈ ఒప్పందం తోడ్పడుతుంది.
- నాలుగు కీలక ఒప్పందాల్లో మొదటిదైన ‘జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్(జీఎస్‌ఓఎంఐఏ)’ 2002లో కుదిరింది. ఇది భారత్‌తో అమెరికా పంచుకున్న రహస్య సమాచారాన్ని సంరక్షించడం కోసం చేపట్టిన చర్యలకు సంబంధించిన ఒప్పందం.
- 2016లో రెండో ఒప్పందం ‘లాజిస్టిక్స్ ఎక్స్‌చేంజ్ మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్(ఎల్‌ఈఎంఓఏ)’ కుదిరింది. రవాణాకు, మరమ్మతులకు ఇరుదేశాల సైన్యం పరస్పరం సైనిక కేంద్రాలను ఉపయోగించుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందం ఇది.
- 2018లో మూడో ఒప్పందం ఇరుదేశాలు ‘కమ్యూనికేషన్స్ కంపాటిబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్(సీఓఎంసీఏఎస్‌ఏ)’పై సంతకాలు చేశాయి. భారత్‌కు అత్యున్నత మిలటరీ సాంకేతికతను అమ్మేందుకు, రెండు దేశాల సైన్యాల మధ్య సహకారానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది.
- చివరగా, రెండు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల సమక్షంలో అక్టోబర్ 27న బెకా కుదిరింది.
క్విక్ రివ్వూ :
ఏమిటి : బేసిక్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ కో ఆపరేషన్ అగ్రిమెంట్ (బీఈసీఏ-బెకా) ఒప్పందంపై సంతకాలు
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : అమెరికా, భారత్ రక్షణ, విదేశాంగ శాఖల మంత్రులు
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : అత్యాధునిక మిలటరీ సాంకేతికత, అత్యంత రహస్య భౌగోళిక ఉపగ్రహ సమాచారం, ఇతర కీలక సమాచారాన్ని అమెరికా భారత్‌కు అందించేందుకు
పరిశోధన రంగంలో ఈయూతో ఒప్పందం చేసుకున్న దక్షిణాసియా దేశం?
సామాజిక శాస్త్రాల పరిశోధన రంగంలో పరస్పరం సహకరించుకోవడం కోసం ఉద్దేశించిన ఒప్పందంపై అక్టోబర్ 28న భారత్, ఐరోపా సమాఖ్య (ఈయూ)లు సంతకాలు చేశాయి. ఒప్పంద పత్రాలపై భారత సామాజిక శాస్త్రాల పరిశోధన మండలి సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ వీరేంద్ర కుమార్ మల్హోత్రా, ఈయూ రాయబారి యుగోఅస్టుటో సంతకాలు చేశారు. భారత్, ఈయూ పరిశోధకుల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు ఈ ఒప్పందం సహకరిస్తుంది.
ఢిల్లీ యూనివర్సిటీ వీసీ సస్పెండ్..
ఢిల్లీ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్ లర్(వీసీ) యోగేశ్ త్యాగిని సస్పెండ్ చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అక్టోబర్ 28న ఉత్తర్వులు జారీ చేశారు. విధుల నిర్వహణలో ఆయన వైఫల్యం చెందినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరపాలని రాష్ట్రపతి ఆదేశించినట్లు కేంద్ర విద్యా శాఖ వర్గాలు తెలిపాయి. సాక్ష్యాధారాలు, రికార్డులను తారుమారు చేయకుండా ఉండడం కోసమే యోగేశ్ త్యాగిపై రాష్ట్రపతి సస్పెన్షన్ వేటు వేసినట్లు వెల్లడించాయి.
క్విక్ రివ్వూ :
ఏమిటి : ఐరోపా సమాఖ్య (ఈయూ)తో ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 28
ఎవరు : భారత్
ఎందుకు : సామాజిక శాస్త్రాల పరిశోధన రంగంలో పరస్పరం సహకరించుకోవడం కోసం
మయన్మార్‌కు భారత్ అందించనున్న జలాంతర్గామి పేరు?
మయన్మార్ నౌకా దళానికి ‘ఐఎన్‌ఎస్ సింధువీర్(s58)’ అనే జలాంతర్గామిని అందించాలని భారత్ నిర్ణయించింది. దీంతో మయన్మార్ నౌకాదళంలో తొలి జలాంతర్గామిగా సింధువీర్ నిలవనుంది. దక్షిణాసియా ప్రాంతంలో అన్ని దేశాల భద్రత, వృద్ధి కోసం చేపట్టిన ‘సాగర్’ దార్శనికతలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. ‘‘కిలో తరగతికి చెందిన ఐఎన్‌ఎస్ సింధువీర్‌ను మయన్మార్‌కు ఇవ్వనున్నాం. పొరుగు దేశాల స్వయం సమృద్ధి, సామర్థ్య పెంపునకు చర్యలు చేపడతాం’’ అని శ్రీవాస్తవ పేర్కొన్నారు. డీజిల్-విద్యుత్‌తో పనిచేసే కిలో తరగతి జలాంతర్గామిని శత్రువుపై మెరుపు దాడి చేసేందుకు ఉపయోగిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మయన్మార్ నౌకా దళానికి భారత్ అందజేయనున్న జలాంతర్గామి పేరు
ఎప్పుడు : అక్టోబర్ 15
ఎవరు : ఐఎన్‌ఎస్ సింధువీర్(s58)
ఎందుకు : దక్షిణాసియా ప్రాంతంలో అన్ని దేశాల భద్రత కోసం
వాషింగ్టన్ యూనివర్సిటీతో భారత్ బయోటెక్ ఒప్పందం
ప్రాణాంతక మహమ్మారి కరోనాను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం మరిన్ని ప్రయత్నాలు మొదలుపెట్టింది. భారత్ బయోటెక్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలు ఇప్పటికే రెండు వ్యాక్సిన్ల ప్రయోగాలు కొనసాగిస్తూండగా.... తాజాగా ఈ రెండు సంస్థలు వేర్వేరుగా రెండు సరికొత్త వ్యాక్సిన్ల ప్రయోగాలకు సిద్ధమయ్యాయి.. ముక్కు ద్వారా అందించే ఈ రెండు కొత్త వ్యాక్సిన్లపై ప్రయోగాలు త్వరలో మొదలవుతాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అక్టోబర్ 18న తన సండే సంవాద్ కార్యక్రమంలో ప్రకటించారు.
వాషింగ్టన్ వర్సిటీతో ఒప్పందం
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ కోవిడ్-19 నియంత్రణ కోసం మొత్తం నాలుగు రకాల టీకాలను అభివృద్ధి చేస్తూండగా.. ఇందులో ఒకటైన కోవాగ్జిన్ ఇప్పటికే రెండు దశల మానవ ప్రయోగాలను పూర్తి చేసుకుంది. మిగిలిన మూడు వ్యాక్సిన్లలో ఒకటి భారత వైద్య పరిశోధన సమాఖ్య సహకారంతో తయారవుతోంది. ఈ కొత్త వ్యాక్సిన్ కోసం వాషింగ్టన్ యూనివర్సిటీ, సెయింట్ లూయిస్ యూనివర్శిటీలతో భారత్ బయోటెక్ ఒప్పందాలు కుదుర్చుకుంది.
పుట్టగొడుగులతో రోగనిరోధక శక్తి ఔషధం
పుట్టగొడుగులతో తయారుచేసిన రోగనిరోధక శక్తి పెంపు ఔషధం త్వరలోనే మార్కెట్‌లోకి రాబోతోంది. కరోనా నేపథ్యంలో ఈ ఔషధాన్ని తీసుకొస్తున్నట్లు క్లోన్‌డీల్స్, ఆంబ్రోసియా ఫుడ్ ఫామ్ సంస్థలు తెలిపాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వాషింగ్టన్ యూనివర్సిటీ, సెయింట్ లూయిస్ యూనివర్శిటీలతో ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 19
ఎవరు : భారత్ బయోటెక్
ఎందుకు : కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి కోసం
భారత్, అమెరికాల మధ్య 2+2 మంత్రిత్వ స్థాయి చర్చలు
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమైన లక్ష్యంగా భారత్, అమెరికాల మధ్య 2+2 మంత్రిత్వ స్థాయి చర్చలు భారత్‌లో అక్టోబర్ 27న జరగనున్నాయి. అంతర్జాతీయ సంబంధాలు, రక్షణ, భద్రత.. తదితర రంగాల్లో ఇరుదేశాల మధ్య బంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. చర్చల్లో భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొంటారు. అమెరికా తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ పాల్గొంటారు. ఇరుదేశాల మధ్య ఈ మంత్రిత్వ స్థాయి చర్చలు జరగడం ఇది మూడోసారి కానుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్, అమెరికాల మధ్య 2+2 మంత్రిత్వ స్థాయి చర్చలు
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : ఎస్ జైశంకర్, రాజ్‌నాథ్ సింగ్, పాంపియో, మార్క్ ఎస్పర్
ఎక్కడ : భారత్
ఎందుకు : ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమైన లక్ష్యంగా
టోక్యో యూనివర్సిటీతో జట్టు కట్టిన భారత ఐటీ సేవల దిగ్గజం?
పరిశ్రమపై సంయుక్తంగా అధ్యయనం చేసేందుకు టోక్యో యూనివర్సిటీతో (యూటోక్యో) చేతులు కలిపినట్లు ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అక్టోబర్ 21న వెల్లడించింది. వ్యాపార, సామాజిక సవాళ్లను డిజిటల్ టెక్నాలజీల ద్వారా అధిగమించే మార్గాలపై ఈ ఒప్పందం ద్వారా అధ్యయనం చేయనున్నారు. ఇది ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న అనేక సవాళ్ల పరిష్కారానికే కాకుండా, భారత్-జపాన్ సంబంధాలను మరింత మెరుగుపర్చేందుకు, ఇరు దేశాల వృద్ధికి దోహదపడగలదని యూటోక్యో ప్రెసిడెంట్ మకొటో గొనొకమి తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టోక్యో యూనివర్సిటీతో జట్టు కట్టిన భారత ఐటీ సేవల దిగ్గజం
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)
ఎందుకు : వ్యాపార, సామాజిక సవాళ్లను డిజిటల్ టెక్నాలజీల ద్వారా అధిగమించే మార్గాలపై అధ్యయనం చేసేందుకు
ప్రధాని మోదీ పాల్గొన్న ఇన్వెస్ట్ ఇండియా-2020 సదస్సు ప్రధాన లక్ష్యం?
భారత్-కెనడా మధ్య వ్యాపార సంబంధాలు మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా అక్టోబర్ 8న జరిగిన ఇన్వెస్ట్ ఇండియా-2020 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో పాల్గొని ప్రసంగించారు. ఇటీవల చేపట్టిన కార్మిక, వ్యవసాయ సంస్కరణలు భారత్‌లో వ్యాపారం చేయడాన్ని మరింత సులభతరం చేస్తాయని ప్రధాని అన్నారు. శక్తివంతమైన ప్రజాస్వామ్యం, రాజకీయ స్థిరత్వం, వ్యాపారానికి అనుకూలమైన విధానాలతో విదేశీ వ్యాపారులకు భారత్ అసమాన పెట్టుబడి కేంద్రంగా నిలిచిందని పేర్కొన్నారు.
50 బిలియన్ డాలర్లకుపైగా...
భారత్‌లో విదేశీ పెట్టుబడుల్లో కెనడా 20వ స్థానంలో ఉంది. 600లకుపైగా కెనడా కంపెనీలు భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇవి 50 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు చేశాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇన్వెస్ట్ ఇండియా-2020 సదస్సు
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : భారత్-కెనడా మధ్య వ్యాపార సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు
ఏ ఒప్పందం ద్వారా స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్న వ్యక్తుల వివరాలను భారత్ అందుకుంది?
విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనంపై పోరులో భారత ప్రభుత్వం మరింత పురోగతి సాధించింది. ఆటోమేటిక్ సమాచార మార్పిడి ఒప్పందం (ఏఈవోఐ) ద్వారా స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్న వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన వివరాల రెండో సెట్‌ను అక్టోబర్ 9న అందుకుంది. ఏఈవోఐ కింద 2019 సెప్టెంబర్‌లో స్విట్జర్లాండ్ నుంచి మొదటి సెట్‌ను భారత్ అందుకుంది. పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నుల్లో ఆర్థిక వివరాలను సక్రమంగా వెల్లడించారా లేదా అన్నది పన్ను అధికారులు పరిశీలించడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది.
86 దేశాలతో...
తాజాగా 2020 ఏడాది భారత్ సహా 86 దేశాలతో ఆర్థిక ఖాతాల వివరాలను స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌టీఏ) పంచుకుంది. ఈ దేశాలతో గతేడాది స్థాయిలోనే సుమారు 31 లక్షల అకౌంట్ల సమాచార మార్పిడి జరిగిందని ఎఫ్‌టీఏ తెలిపింది. వీటిల్లో భారతీయ పౌరులు, సంస్థల ఖాతాల సంఖ్య గణనీయంగా ఉందని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్న వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన వివరాలు భారత్‌కు అందజేత
ఎప్పుడు : అక్టోబర్ 9
ఎవరు : స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌టీఏ)
ఎందుకు : ఆటోమేటిక్ సమాచార మార్పిడి ఒప్పందం (ఏఈవోఐ) కింద
చైనా, భారత్ ఏడో విడత మిలటరీ చర్చలు
తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సడలింపు కోసం ఇరుదేశాల మిలటరీ అధికారుల మధ్య తూర్పు లద్దాఖ్‌లోని చూశుల్ సెక్టార్‌లో అక్టోబర్ 12న ఏడో విడత చర్చలు జరిగాయి. ఈ చర్చలు సానుకూలంగా, నిర్మాణాత్మకంగా జరిగాయని రెండు దేశాలు అక్టోబర్ 13న ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. బలగాల ఉపసంహరణపై లోతైన, నిజాయితీతో కూడిన చర్చ జరిగిందని పేర్కొన్నాయి. అయితే, ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై ఈ చర్చల్లో ఎటువంటి కచ్చితమైన సానుకూల ఫలితం మాత్రం వెలువడలేదు.
12 గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో భారత ప్రతినిధులకు 14 కార్ప్స్ కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ హరిందర్ సింగ్, చైనా ప్రతినిధులకు దక్షిణ జిన్‌జియాంగ్ మిలటరీ డిస్ట్రిక్ట్ మేజర్ జనరల్ లియూ లిన్ సారథ్యం వహించారు.
‘లద్దాఖ్’ను అంగీకరించం
కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌ను, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాన్ని చైనా గుర్తించబోదని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లు భారత్‌లో అంతర్భాగమని, వాటి గురించి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఇప్పటికే పలుమార్లు భారత్, చైనాను హెచ్చరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చైనా, భారత్ ఏడో విడత మిలటరీ చర్చలు
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : లెఫ్ట్‌నెంట్ జనరల్ హరిందర్ సింగ్, మేజర్ జనరల్ లియూ లిన్
ఎక్కడ : చూశుల్ సెక్టార్, తూర్పు లద్దాఖ్, భారత్
ఎందుకు : తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సడలింపు కోసం