Skip to main content

అక్టోబర్ 2017 ద్వైపాక్షిక సంబంధాలు

ఇటలీ ప్రధాని భారత పర్యటన
Current Affairs
ఇటలీ ప్రధాని పాలో జెంటిలోని రెండు రోజుల భారత పర్యటన కోసం అక్టోబర్ 29న న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన జెంటిలోని ద్వైపాక్షిక వాణిజ్యం, విద్యుత్ సహా పలు రంగాల్లో సహకారానికి సంబంధించి విసృ్తతమైన చర్చలు జరిపారు. అనంతరం రైల్వే భద్రత, విద్యుత్, సంయుక్త పెట్టుబడుల ప్రోత్సాహం తదితర ఆరు ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి.
2018 మార్చిలో ఇటలీతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలకు 70 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఓ లోగోను విడుదల చేశారు. ఇరుదేశాల మధ్య ప్రస్తుతం 8.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 57 వేల కోట్లు) ద్వైపాక్షిక వ్యాపారం జరుగుతోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇటలీ ప్రధాని భారత పర్యటన
ఎప్పుడు : అక్టోబర్ 30 - 31
ఎవరు : పాలో జెంటిలోని
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం

ఫ్రాన్స్ రక్షణ మంత్రి భారత్ పర్యటన
ఫ్రాన్స్ రక్షణ శాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ భారత పర్యటనలో భాగంగా అక్టోబర్ 27న రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వ్యూహాత్మకంగా కీలకమైన ఇండో-పసిఫిక్ ప్రాంతంలో రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

యూఎస్ విదేశాంగ మంత్రి పర్యటన
భారత పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లెర్సన్ అక్టోబర్ 25న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో భేటీ అయ్యారు. ఉగ్రవాదం, ద్వైపాక్షిక సంబంధాలు, ఉత్తర కొరియా, హెచ్-1బీ వీసాలు, దక్షిణాసియాపై ట్రంప్ విధానం సహా పలు అంశాలపై చర్చలు జరిపారు.

అఫ్గాన్ అధ్యక్షుడు అషఫ్ర భారత పర్యటన
ఒక రోజు పర్యటనకు భారత్ వచ్చిన అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అషఫ్రఘనీ అక్టోబర్ 24న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అఫ్గాన్ అవసరాల కు అనుగుణంగా అక్కడి రక్షణ, పోలీసు దళాలకు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మోదీ హామీ ఇచ్చారు. పర్యటనలో భాగంగా ఘనీ ఢిల్లీలోని వివేకానంద అంతర్జాతీయ ఫౌండేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

ఆసియాన్ రక్షణ మంత్రుల సదస్సు
ఆసియాన్ దేశాల రక్షణ మంత్రుల నాలుగో సదస్సు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో అక్టోబర్ 24న ముగిసింది. ఈ సందర్భంగా ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) తీవ్రవాద అనుకూల శక్తులను సమర్థంగా నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని ఆగ్నేయాసియా దేశాల సంఘం(ఆసియాన్) నిర్ణయించింది. ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ఈ సదస్సులో భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.

భారత్ - రష్యా సంయుక్త సైనిక విన్యాసాలు
Current Affairs రక్షణ రంగంలో మరింత సహకారంలో భాగంగా భారత్ - రష్యాలు అక్టోబర్ 19 నుంచి 11 రోజుల పాటు సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం అన్న అంశంపై 'ఇంధ్ర-2017' పేరుతో రష్యాలో చేపట్టే ఈ విన్యాసాల్లో త్రివిధ దళాలు పాల్గొంటాయి. సెర్గీవిస్కీలోని 249వ కంబైండ్ ఆర్మీ రేంజ్, వ్లాదివోస్తోక్ లోని జపాన్ సముద్రాల్లో ఈ విన్యాసాలు నిర్వహిస్తారు. భారత్ తరపున 350 మంది ఆర్మీ, 80 మంది వైమానిక సిబ్బంది, రెండు ఐఎల్ -76 విమానాలు, నౌకదళానికి చెందిన ఒక యుద్ధ నౌక, ఒక సహాయక నౌక పాల్గొంటాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇంధ్ర - 2017 సైనిక విన్యాసాలు
ఎప్పుడు : అక్టోబర్ 19 నుంచి 30
ఎవరు : భారత్ - రష్యా
ఎక్కడ : రష్యాలో
ఎందుకు : రక్షణ రంగంలో మరింత సహకారం కోసం

జపాన్‌తో భారత్ టీఐటీపీ ఒప్పందం
యువతను టెక్నికల్ ఇంటర్న్స్‌గా జపాన్‌కు పంపేందుకు భారత్ ఆ దేశంతో టెక్నికల్ ఇంటర్న్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్(TITP)పై సహకార ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు అక్టోబర్ 17న టోక్యోలో జరిగిన సమావేశంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, జపాన్ మంత్రి కత్సునోబు కాటో ఒప్పందంపై సంతకం చేశారు. దీని ప్రకారం జపాన్‌లో 3 నుంచి 5 ఏళ్ల పాటు ఉపాధి శిక్షణ కోసం భారత్ ఔత్సాహిక యువతీ యువకులను ఆ దేశం పంపిస్తుంది.
జపాన్‌తో ఈ తరహా ఒప్పందం కుదుర్చుకున్న మూడో దేశం భారత్. జపాన్ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆ దేశంలో 2016 చివరి నాటికి వివిధ దేశాలకు చెందిన 2.3 లక్షల మంది టెక్నికల్ ఇంటర్న్స్‌గా ఉపాధి శిక్షణ పొందుతున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జపాన్‌తో భారత్ టీఐటీపీ ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎందుకు : ఉపాధి శిక్షణ కోసం యువతను జపాన్‌కు పంపేందుకు

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తొలి విదేశీ పర్యటన
Current Affairs
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తొలి విదేశీ పర్యటనలో అక్టోబర్ 4న తూర్పు ఆఫ్రికా దేశం జిబూతీని సందర్శించారు. ఆ దేశ అధ్యక్షుడు ఒమర్ గ్యులేహ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విదేశాంగ కార్యాలయ స్థాయి ద్వైపాక్షిక సంప్రదింపులు నెలకొల్పుకునే ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. 2015లో యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్న యెమెన్ నుంచి భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఆపరేషన్ రాహత్’లో జిబూతీ అందించిన తోడ్పాటుకు కోవింద్ కృతజ్ఞతలు తెలిపారు. నౌకా వాణిజ్య, సౌర విద్యుత్ రంగాల్లో పరస్పర సహకారంపై కోవింద్, ఒమర్ చర్చించారు. జిబూతీని సందర్శించిన తొలి భారతీయ నేత కోవింద్ కావడం గమనార్హం. జిబూతీలో చైనా తన విదేశీ సైనిక స్థావరాన్ని నెలకొల్పిన నేపథ్యంలో భారత రాష్ట్రపతి అక్కడ పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇథియోపియాతో రెండు ఒప్పందాలు: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇథియోపియా పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు ములాతు తెషోమేతో అడిస్ అబాబాలో చర్చలు జరిపారు. వాణిజ్యం, సమాచార-ప్రసార రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు బలపడేలా ఇరువురి సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్‌ఏ)లో ఇథియోపియా భాగస్వామి కావడం పట్ల భారత్ కృతజ్ఞతలు తెలిపింది. భారత్- ఇథియోపియా 70 ఏళ్ల దౌత్య సంబంధాలు’ అనే పుస్తకాన్ని ఇరువురూ విడుదల చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత రాష్ట్రపతిమొదటివిదేశీ పర్యటన
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : రామ్‌నాథ్ కోవింద్

భారత్-ఈయూ 14వ సదస్సు
ఉగ్రవాదంపై పోరుకు ఒకరికొకరు సహకరించుకోవాలని భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) నిర్ణయించాయి. ఈ మేరకు అక్టోబర్ 6న న్యూఢిల్లీలో జరిగిన భారత్-ఈయూ 14వ సదస్సులో ఇరు పక్షాలు ఒక ప్రకటన (డిక్లరేషన్)ను విడుదల చేశాయి. సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ ఫ్రాన్సిజెక్ టస్క్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్ క్లాడ్ జంకర్ పాల్గొన్నారు.
వాణిజ్యం, భద్రత వంటి ప్రధాన అంశాల్లో భాగస్వామ్యం పెంపొందించుకోవడం; రోహింగ్యా సంక్షోభం, కొరియా ద్వీపకల్పంలోని ఉద్రిక్త పరిస్థితులతో పాటు వివిధ ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై నేతలు విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. మూడు ఒప్పందాలపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. వీటిలో అంతర్జా తీయ సౌర కూటమికి సంబంధించిన ఒడంబడిక కూడా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 6
ఎవరు : ప్రధాని మోదీ, ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్ ఫ్రాన్సిజెక్ టస్క్
ఎక్కడ : భారత్-ఈయూ 14వ సదస్సు, న్యూఢిల్లీ
ఎందుకు : ఉగ్రవాదం, అతివాదంపై ఉమ్మడి పోరుకు

బంగ్లాదేశ్‌కు రూ.29,250 కోట్ల రుణంపై ఒప్పందం
బంగ్లాదేశ్‌లో మౌలిక వసతులు, సామాజిక అభివృద్ధికి భారత్ రూ.29,250 కోట్ల రుణం ఇచ్చేందుకు సంబంధించిన ఒప్పందంపై ఇరు దేశాలు అక్టోబర్ 4న సంతకాలు చేశాయి. భారత్, బంగ్లా ఆర్థిక మంత్రులు అరుణ్ జైట్లీ, అబుల్ మాల్ అబ్దుల్ ముహిత్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

భారత్‌కు ఏఐఐబీ, ఏడీబీ 655 కోట్ల రుణం
Current Affairs
భారత్‌లో విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గించడంతో పాటు సౌర, పవన విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి బీజింగ్ కేంద్రంగా పనిచేసే ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్(ఏఐఐబీ), మనీలాలోని ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ) రూ.655.63 కోట్ల(100 మిలియన్ డాలర్లు) రుణం అందించనున్నాయి. ఏఐఐబీ, ఏడీబీలు చెరో 50 మిలియన్ డాలర్ల చొప్పున ఈ రుణాన్ని ఇవ్వనున్నాయి. ఏఐఐబీ, ఏడీబీలు సంయుక్తంగా రుణాలు జారీ చేయడం ఇది నాలుగోసారి.
చైనా నేతృత్వంలో దాదాపు 100 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 2016లో ఏర్పాటైన ఏఐఐబీలో చైనా 26.06% పెట్టుబడితో మెజారిటీ వాటాదారుగా ఉండగా, భారత్ 7.5 శాతంతో రెండో స్థానంలో ఉంది. రష్యా 5.93%, జర్మనీ 4.5శాతం పెట్టుబడితో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌కు రూ.655 కోట్ల రుణం
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : ఏఐఐబీ, ఏడీబీ

భారత్‌కు మళ్లీ అమెరికా ‘చమురు’
అమెరికా నుంచి ముడి చమురుతో బయలుదేరిన తొలి ఓడ ఒడిశా లోని పారదీప్ ఓడరేవుకు అక్టోబర్ 2న చేరింది. అతి పెద్ద ముడి చమురు రవాణా ఓడ ‘వీఎల్‌సీసీ ఎమ్‌టీ న్యూ ప్రాస్పెరిటీ’ ద్వారా 1.6 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు అందినట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) తెలిపింది. మరో 3.95 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు కోసంయూఎస్‌ను కోరినట్లు ప్రకటించింది. భారత్-యూఎస్ వాణిజ్య సంబంధాల్లో ప్రధానంగా చమురు-గ్యాస్ రంగాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. హైడ్రోకార్బన్ రంగాన్ని పటిష్టపరిచేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ నెలలో జరిపిన అమెరికా పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది.
1975లో అమెరికా చమురు ఎగుమతులను నిలిపివేసింది. దాదాపు 42 ఏళ్ల తర్వాత మళ్లీ ఎగుమతులు ప్రారంభించింది. ఇలా సుదీర్ఘ విరామం అనంతరం అమెరికా నుంచి తొలిసారిగా చమురు దిగుమతులు చేసుకుంటున్న దేశాల్లో ఒకటిగా భారత్ కూడా నిల్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా నుంచి భారత్‌కు చమురు
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎందుకు : చమురు-గ్యాస్ రంగాల్లో ఒప్పందంలో భాగంగా
Published date : 14 Oct 2017 12:52PM

Photo Stories