ఆగష్టు 2019 ద్వైపాక్షిక సంబంధాలు
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మక్రాన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన ఈ సమావేశంలో జమ్మూకశ్మీర్ అంశంతోపాటు ద్వైపాక్షిక, రక్షణ, ఉగ్రవాద నిర్మూలన వంటి అంశాలపై ఇరువురు నేతలు విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మక్రాన్ మాట్లాడుతూ.. కశ్మీర్ విషయంలో మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని.. అది పూర్తిగా భారత్-పాక్ ద్వైపాక్షిక అంశమని స్పష్టం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మక్రాన్‌తో భేటీ
ఎప్పుడు : ఆగస్టు 22
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : పారిస్, ఫ్రాన్స్
భారత్‌కు బాల్డిక్ దేశాల మద్దతు
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు బాల్టిక్ దేశాలైన లాత్వియా, లిథువేనియా, ఎస్టోనియా దేశాలు పూర్తి మద్దతు ప్రకటించాయి. ఐదు రోజుల పాటు ఈ దేశాల్లో పర్యటించిన భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఈ దేశాల అధినేతలు ఈ మేరకు హామీ ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరు విషయంలోనూ ఈ మూడు దేశాలు భారత్‌కు మద్దతిచ్చాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు
ఎప్పుడు : ఆగస్టు 22
ఎవరు : లాత్వియా, లిథువేనియా, ఎస్టోనియా
అమెరికా అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ
ఫ్రాన్స్ లోని బియార్రిట్జ్‌లో ఆగస్టు 24 నుంచి 26 వరకు జరిగిన జీ-7 దేశాల శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌తో మోదీ భేటీ అయ్యారు. ఆగస్టు 26న జరిగిన ఈ సమావేశంలో కశ్మీర్ పరిణామాలతోపాటు, ఇంధనం, వాణిజ్యం, సైనిక అంశాలు వంటి పలు విషయాలపై ఇరువురు నేతలు చర్చించారు. కశ్మీర్ విషయంలో మూడో దేశం మధ్యవర్తిత్వానికి ఎటువంటి అవకాశం లేదని ఈ సందర్భంగా మోదీ స్పష్టం చేశారు.
జీ-7 దేశాల సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, సెనెగల్ అధ్యక్షుడు మాకీ సాల్‌తోనూ మోదీ వేర్వేరుగా సమావేశమయ్యారు. ద్వెపాక్షిక సంబంధాల బలోపేతం, సహకారం, ఉగ్రవాదంపై పోరాటం వంటి అంశాలపై వారితో చర్చించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : బియార్రిట్జ్, ఫ్రాన్స్
భూటాన్ ప్రధానితో మోదీ సమావేశం
భూటాన్ ప్రధాని లోటే షెరింగ్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. భూటాన్ రాజధాని థింపూలో ఆగస్టు 17న జరిగిన ఈ భేటీలో పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు విసృ్తత చర్చలు జరిపారు. అంతరిక్ష పరిశోధన, విమానయానం, ఐటీ, విద్యుత్, విద్యారంగానికి సంబంధించి ఇరు దేశాలు 10 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. భూటాన్ భారత్‌కు ఎప్పుడూ విశ్వసనీయ పొరుగుదేశమేనని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. మరోవైపు భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్‌చుక్‌తో కూడా మోదీ భేటీ అయ్యారు.
గ్రౌండ్ ఎర్త్ స్టేషన్ ప్రారంభం
భూటాన్‌లో దక్షిణాసియా ఉపగ్రహ వినియోగం కోసం ఇస్రో సహాయంతో అభివృద్ధి చేసిన గ్రౌండ్ ఎర్త్ స్టేషన్, సాట్కామ్ నెట్‌వర్క్‌ను మోదీ, షెరింగ్ కలిసి ప్రారంభించారు. అలాగే సిమ్తోఖా జొంగ్ వద్ద భూటాన్‌లో రూపే పే కార్డును మోదీ ప్రారంభించారు. మరోవైపు మాంగ్దేచు జలవిద్యుత్ కర్మాగారాన్ని ప్రారంభించిన మోదీ, ఐదు దశాబ్దాల భారత-భూటాన్ జలవిద్యుత్ సహకారాన్ని గుర్తుచేసే స్టాంపులను కూడా విడుదలచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భూటాన్ ప్రధాని లోటే షెరింగ్‌తో సమావేశం
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : థింపూ, భూటాన్
రాయల్ యూనివర్సిటీ ఆఫ్ భూటాన్‌లో మోదీ
భూటాన్ రాజధాని థింపూలోని ‘రాయల్ యూనివర్సిటీ ఆఫ్ భూటాన్’లో ఆగస్టు 18న నిర్వహించిన ఓ కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. భవిష్యత్ తరాలపై ప్రభావం చూపగలరీతిలో అద్భుతాలు చేయగల శక్తిసామర్థ్యాలు భూటాన్ యువతలో ఉన్నాయని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. నైపుణ్యవంతులైన యువత భూటాన్‌ను సరికొత్త ఎత్తుకు తీసుకెళుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతరిక్ష రంగంలోనూ భారత్ భూటాన్‌తో సంబంధాలను పటిష్టం చేసుకుంటోందని చెప్పారు. థింపూ గ్రౌండ్ స్టేషన్ ఆఫ్ సౌత్‌ఏసియా శాటిలైట్‌ను ప్రారంభించామన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విద్యార్థులనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం
ఎప్పుడు : ఆగస్టు 18
ఎక్కడ : రాయల్ యూనివర్సిటీ ఆఫ్ భూటాన్, థింపూ, భూటాన్
ట్రంప్‌తో ప్రధాని మోదీ చర్చలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 19న ఫోన్‌లో పలు అంశాలపై చర్చలు జరిపారు. దాదాపు 30 నిమిషాల పాటు సాగిన ఈ సంభాషణలో మోదీ మాట్లాడుతూ.. దక్షిణాసియాలో శాంతిస్థాపన కోసం ఉగ్రవాదం, హింసలేని వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరముందన్నారు. ఉగ్రబాటను వీడి పేదరికం, నిరక్షరాస్యత, వ్యాధులపై పోరాడే ఏ దేశానికైనా భారత్ పూర్తి సహాయసహకారాలు అందజేస్తుందని స్పష్టం చేశారు.
ఆర్టికల్ 370 రద్దుతో భారత ప్రభుత్వాన్ని ఫాసిస్టు, జాత్యహంకారిగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభివర్ణించడం తెల్సిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌తో మోదీ ఫోన్‌లో మాట్లాడారు. దీంతో ఇమ్రాన్ ఖాన్‌కు ఫోన్‌చేసిన ట్రంప్ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.
అఫ్గాన్‌కు అండగా నిలుస్తాం..
అఫ్గానిస్తాన్‌లో శాంతి, సుస్థిరత, భద్రత కోసం అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని మోదీ తెలిపారు. ఆగస్టు 19న అఫ్గానిస్తాన్ 100వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో అఫ్గాన్ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో చర్చలు
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : భారత్-పాకిస్తాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో
ఫ్రాన్స్ పర్యటనకు ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్రే మోదీ ఆగస్టు 22న రెండు రోజుల పాటు ఫ్రాన్స్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో మోదీ భేటీ కానున్నారు. రక్షణ, అణు శక్తి, సముద్రం, ఉగ్రవాదం వంటి అంశాలపై మేక్రాన్‌తో మోదీ చర్చించనున్నారని కేంద్ర ఆర్థిక సంబంధాల కార్యదర్శి టీఎస్ తిరుమూర్తి ఆగస్టు 19న తెలిపారు. మరోవైపు 2019, ఆగస్టు 23న పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.
ఫ్రాన్స్ పర్యటన అనంతరం మోదీ యూఏఈ, బహ్రెయిన్‌లకు వెళ్లనున్నారు. అనంతరం 25న తిరిగి ఫ్రాన్స్ కు వచ్చి జీ7 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొననున్నారు.
బ్రిటన్ ప్రధాని జాన్సన్‌తో మోదీ సంభాషణ
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 20న ఫోన్‌లో సంభాషించారు. లండన్‌లోని భారత హై కమిషన్ కార్యాలయం బయట భారత స్వాత్రంత్య దినోత్సవాలప్పుడు జరిగిన హింసాత్మక ఘటనకు తాను చింతిస్తున్నట్లు మోదీతో జాన్సన్ అన్నారు. భారత హై కమిషన్, ఆ కార్యాలయ ఉద్యోగులకు భద్రత కల్పిస్తామని జాన్సన్ హామీనిచ్చారు.
కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని పాకిస్తానీ సంఘాలు, కశ్మీర్, సిక్కు వేర్పాటువాద బృందాల సభ్యులు లండన్‌లోని భారత హైకమిషన్ ఎదుట ర్యాలీ చేశాయి. దీంతో భారత అనుకూల బృందాలూ ర్యాలీ చేపట్టడంతో గొడవలు జరిగి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో ఫోన్‌లో సంభాషణ
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : భారత హై కమిషన్ కార్యాలయం బయట భారత స్వాత్రంత్య దినోత్సవాలప్పుడు జరిగిన హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో
లాత్వియా అధ్యక్షుడితో ఉపరాష్ట్రపతి భేటీ
లాత్వియా అధ్యక్షుడు ఎగ్లిస్ లెవిట్స్‌తో భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు భేటీ అయ్యారు. లాత్వియా రాజధాని రిగాలో ఆగస్టు 20న జరిగిన ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఆయుర్వేదం, యోగాపై లాత్వియా ప్రజలు ఆసక్తి చూపిస్తుండటాన్ని వెంకయ్య అభినందించారు. మరోవైపు లాత్వియా ప్రధానమంత్రి క్రిస్‌జానిస్ కారిన్స్ తోనూ ఉపరాష్ట్రపతి చర్చలు జరిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లాత్వియా అధ్యక్షుడు ఎగ్లిస్ లెవిట్స్‌తో భేటీ
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : రిగా, లాత్వియా
కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి సిద్ధం : ట్రంప్
జమ్మూకశ్మీర్ సమస్య పరిష్కారం కోసం భారత్-పాకిస్తాన్‌ల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ స్టు 21న ప్రకటించారు. ఫ్రాన్స్ లోని బియార్రిట్జ్‌లో త్వరలో జరగనున్న జీ7 సదస్సు సందర్భంగా కశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చిస్తానని తెలిపారు.
ద్వైపాక్షికమే: బ్రిటన్ ప్రధాని
జమ్మూకశ్మీర్ అన్నది భారత్-పాకిస్తాన్‌ల ద్వైపాక్షిక సమస్య మాత్రమేనని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు. ఈ సమస్యను ఇరుదేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జమ్మూకశ్మీర్ సమస్య పరిష్కారం కోసం భారత్-పాకిస్తాన్‌ల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధం
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఎస్టోనియా అధ్యక్షురాలితో ఉపరాష్ట్రపతి భేటీ
ఎస్టోనియా అధ్యక్షురాలు కెర్‌స్టి కాల్‌జులైడ్‌తో భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు భేటీ అయ్యారు. ఎస్టోనియా రాజధాని టాలిన్‌లో ఆగస్టు 21న జరిగిన ఈ సమావేశంలో టీ, ఈ-గవర్నెన్స్, సైబర్ భద్రత వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. వాణిజ్య రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని తీర్మానించారు. ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎస్టోనియా అధ్యక్షురాలు కెర్‌స్టి కాల్‌జులైడ్‌తో భేటీ
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు
ఎక్కడ : టాలిన్, ఎస్టోనియా
సంరతా ఎక్స్‌ప్రెస్ సేవలు నిలుపుదల
ఆర్టికల్ 370 రద్దు చేస్తూ భారత్ నిర్ణయం తీసుకోవడంతో సంరతా ఎక్స్‌ప్రెస్ సేవలను నిలిపేస్తున్నట్లు పాకిస్తాన్ రైల్వే మంత్రి రషీద్ ఆగస్టు 8న ప్రకటించారు. అయితే సంరతా సర్వీసు కొనసాగుతుందని భారత అధికారులు స్పష్టత ఇచ్చారు. 1971లో భారత్-పాకిస్తాన్‌ల మధ్య జరిగిన యుద్ధం తర్వాత సిమ్లా ఒప్పందంలో భాగంగా సంరతా ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు 1976 జూలై 22న ప్రారంభమయ్యాయి. పాక్‌లోని లాహోర్, భారత్‌లోని ఢిల్లీ మధ్య ఈ రైలు నడుస్తుంది. లాహోర్ నుంచి ప్రతి సోమవారం, గురువారం బయల్దేరుతుంది. ఢిల్లీ నుంచి ప్రతి బుధవారం, ఆదివారం బయల్దేరుతుంది. ఈ రెండు రైళ్లు కూడా అట్టారీ స్టేషన్ వరకు వెళ్తాయి.
మరోవైపు భారతీయ సినిమాల ప్రదర్శనపై దేశవ్యాప్తంగా నిషేధం విధిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సంరతా ఎక్స్‌ప్రెస్ సేవలు నిలుపుదల
ఎప్పుడు : ఆగ స్టు 8
ఎవరు : పాకిస్తాన్
ఎందుకు : ఆర్టికల్ 370 రద్దు చేస్తూ భారత్ నిర్ణయం తీసుకోవడంతో
థార్ ఎక్స్‌ప్రెస్, లాహోర్ బస్ నిలిపివేత
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి పాకిస్తాన్‌లోని కరాచీ మధ్య నడిచే థార్ ఎక్స్‌ప్రెస్ రైలును, ఢిల్లీ-లాహోర్ మధ్య నడిచే బస్సు సర్వీసును పాకిస్తాన్ నిలిపివేసింది. ఈ విషయాన్ని పాక్ సమాచార శాఖ మంత్రి మురాద్ సయీద్ ఆగస్టు 9న ప్రకటించారు. అయితే థార్ ఎక్స్‌ప్రెస్ నిలిపివేతకు సంబంధించి తమకు ఎటువంటి సమాచారం లేదని భారత రైలే్వైశాఖ జోధ్‌పూర్ డివిజన్ అధికార ప్రతినిధి గోపాల్‌శర్మ తెలిపారు.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ థార్ ఎక్స్‌ప్రెస్, లాహోర్ బస్‌ను నిలిపివేసింది. ఇప్పటికే సంరతా ఎక్స్‌ప్రెస్‌ను పాకిస్తాన్ నిలిపివేసిన విషయం తెలిసిందే.
జమ్మూకశ్మీర్‌పై భారత్‌కు రష్యా మద్దతు
జమ్మూకశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలకు రష్యా మద్దతు ప్రకటించింది. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి రద్దు, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం వంటివి భారత రాజ్యాంగానికి లోబడే జరిగాయని ఆగస్టు 10న ర ష్యా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారత్, పాక్‌ల మధ్య సంబంధాలు సాధారణ స్థాయికి రావాలని కోరుతున్నామంది. ఇందుకోసం రెండు దేశాలు తమ మధ్య ఉన్న విభేదాలను సిమ్లా ఒప్పందం, లాహోర్ ప్రకటనపాతిపదికన రాజకీయంగా, దౌత్యపరంగా పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నామని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జమ్మూకశ్మీర్‌పై భారత్‌కు మద్దతు
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : రష్యా
ఢిల్లీ-లాహోర్ బస్ సర్వీసు రద్దు
ఢిల్లీ-లాహోర్ బస్ సర్వీసును రద్దు చేస్తున్నట్లు ఆగస్టు 12న భారత్ ప్రకటించింది. జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు అనంతరం లాహోర్-ఢిల్లీ బస్ సర్వీసులను పాకిస్తాన్ రద్దు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ తెలిపింది. ఇప్పటికే భారత్-పాక్‌ల మధ్య నడిచే సంరతా ఎక్స్‌ప్రెస్, థార్ ఎక్స్‌ప్రెస్‌లను పాకిస్తాన్ రద్దు చేసిన విషయం తెలిసిందే. 1999 ఫిబ్రవరిలో ఢిల్లీ-లాహోర్ బస్ సర్వీసు ప్రారంభమైంది. అయితే 2001లో భారత పార్లమెంటు భవనంపై దాడి జరిగిన తర్వాత బస్సు సర్వీసులను నిలిపివేయడం జరిగింది. అనంతరం 2003 జూలైలో బస్సు సర్వీసు పునఃప్రారంభమైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఢిల్లీ-లాహోర్ బస్ సర్వీసు రద్దు
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : భారత్
ఎందుకు : లాహోర్-ఢిల్లీ బస్ సర్వీసులను పాకిస్తాన్ రద్దు చేసిన నేపథ్యంలో
భారత్-చైనా అత్యున్నత సమావేశంలో జై శంకర్
చైనా రాజధాని బీజింగ్‌లో ఆగస్టు 12న జరిగిన భారత్-చైనా అత్యున్నత కమిటీ(సాంస్కృతిక, ప్రజా సంబంధాలు) సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైనా ఉపాధ్యక్షుడు వాంగ్ క్విషన్, విదేశాంగ మంత్రి వాంగ్ యీతో జై శంకర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో జై శంకర్ మాట్లాడుతూ... భారత్, చైనా మధ్య ఉండే భిన్నాభిప్రాయాలు ఘర్షణగా మారకూడదని తెలిపారు. ఓ దేశపు సమస్యలపై మరో దేశం ఎలా స్పందిస్తుందన్న విషయంపైనే భవిష్యత్తులో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు.
భారత్-చైనా అత్యున్నత కమిటీ(సాంస్కృతిక, ప్రజా సంబంధాలు) సమావేశం సందర్భంగా భారత్, చైనా నాలుగు ఒప్పందాలు కదుర్చుకున్నాయి. సాంస్కృతిక, ప్రజా సంబంధాలు బలోపేతానికి దోహదపడే ఈ ఒప్పందాలపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సంతకాలు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్-చైనా అత్యున్నత కమిటీ(సాంస్కృతిక, ప్రజా సంబంధాలు) సమావేశం
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్
ఎక్కడ : బీజింగ్, చైనా
జాధవ్‌ను కలుసుకోవచ్చు : పాక్
పాకిస్తాన్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌ను భారత దౌత్యాధికారులు కలుసుకోవచ్చని భారత విదేశాంగశాఖకు పాకిస్తాన్ ఆగస్టు 1న సమాచారమిచ్చింది. దీంతో జాధవ్‌కు న్యాయసహాయం పొందే అవకాశం దక్కింది. గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలపై పాక్ సైనిక కోర్టు జాధవ్‌కు వేసిన మరణశిక్షను పునః పరిశీలించాలని ఇటీవల అంతర్జాతీయ కోర్టు చెప్పింది.
న్యాయ సహాయం అంటే..
1963 వియన్నా ఒప్పందం ప్రకారం రెండు స్వతంత్ర దేశాల మధ్య న్యాయ సహాయ సంబంధాలు ముఖ్యం. వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36 ప్రకారం ఏదైనా దేశం విదేశీ వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుంటే వారి హక్కుల్ని కాపాడడానికి ఆలస్యం చేయకుండా అరెస్ట్‌కు సంబంధించిన విషయాన్ని ఆ దేశ రాయబార కార్యాలయానికి సమాచారం అందించాలి. అరెస్ట్‌కి కారణాలు వివరించాలి. తనకు లాయర్ కావాలని నిర్బంధంలోని వ్యక్తి కోరితే ఆ ఏర్పాటు చేయాల్సిందే.
పాక్‌లో భారత రాయభారి బహిష్కరణ
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దుచేయడంపై పాకిస్తాన్ ప్రతీకార చర్యలకు దిగింది. పాక్‌లో పనిచేస్తున్న భారత రాయబారి అజయ్ బిసారియాను పాకిస్తాన్ తమ దేశం నుంచి బహిష్కరించింది. అలాగే భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలన్నింటినీ తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అధ్యక్షతన ఆగస్టు 7న జరిగిన జాతీయ భద్రతా కమిటీ(ఎన్‌ఎస్‌సీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం భారత రాయబారి అజయ్ బిసారియా ఇస్లామాబాద్‌లో పనిచేస్తుండగా, భారత్‌లో పాక్ రాయబారి మొయిన్-ఉల్-హక్ ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. మరోవైపు జమ్మూకశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఐక్యరాజ్యసమితి, భద్రతా మండలి దృష్టికి తీసుకెళతామని పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత రాయబారి అజయ్ బిసారియా బహిష్కరణ
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : పాకిస్తాన్ ప్రభుత్వం
ఎక్కడ : పాకిస్తాన్
ఎందుకు : జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దుచేయడంతో
కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన
జమ్మూకశ్మీర్ ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై తాము ఆందోళన చెందుతున్నామని ఐక్యరాజ్యసమితి తెలిపింది. దీనివల్ల రాష్ట్రంలో మానవహక్కుల ఉల్లంఘనలు మరింత తీవ్రమవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇరుపక్షాలు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఐరాస ప్రధాన కార్యదర్శి గ్యుటెరస్ ఆగస్టు 7న తెలిపారు. మరోవైపు భారత్-పాక్ మధ్య మిలటరీ ఉద్రిక్తత తలెత్తకుండా సత్వరం చర్చలు జరపాల్సిన అవసరముందని అమెరికా అభిప్రాయపడింది.