Skip to main content

Telangana: రాష్ట్రానికి 12 స్వచ్ఛ అవార్డులు..ఏఏ విభాగాల్లో అంటే..?

స్వచ్ఛ సర్వేక్షన్‌లో తెలంగాణకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పలు విభాగాల్లో రాష్ట్రం 12 అవార్డులను కైవసం చేసుకుంది.
Swachh Survekshan Awards 2021
Swachh Survekshan Awards 2021

కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ నవంబర్‌ 20వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షన్‌ – 2021 అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ర్యాంకులు పొందిన రాష్ట్రాలు, పట్టణాలకు కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి, సహాయ మంత్రి కౌశల్‌ కిషోర్, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ భగేల్‌లతో కలసి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్‌ మిషన్‌ – అర్బన్‌ 2.0 లో భాగంగా ‘క్లీనెస్ట్‌ సిటీస్‌ ఆఫ్‌ ఇండియా ర్యాంకింగ్స్‌’ను విడుదల చేశారు. ఈ ర్యాంకింగ్స్‌లో ఇండోర్‌ నగరం తొలిస్థానంలో, సూరత్‌ ద్వితీయ స్థానంలో, విజయవాడ మూడో స్థానంలో నిలిచాయి. సఫాయి మిత్ర సురక్ష చాలెంజ్‌లో తెలంగాణకు రెండో స్థానం లభించింది. ఛత్తీస్‌గఢ్‌ సీఎం భగేల్‌ చేతుల మీదుగా రాష్ట్ర మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవిందకుమార్‌ అవార్డు అందుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో లక్ష లోపు జనాభా కలిగిన మున్సిపాలిటీల్లో సిరిసిల్లకు క్లీనెస్ట్‌ మున్సిపాలిటీ అవార్డు దక్కింది. ఈ అవార్డును సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కళా చక్రపాణి, కమిషనర్‌ సమ్మయ్యలు అందుకున్నారు. అలాగే సిద్దిపేట మున్సిపాలిటీకి లభించిన బెస్ట్‌ ‘సెల్ఫ్‌ సస్టైనబిలిటీ సిటీ ’అవార్డును కమిషనర్‌ రమణాచారి అందుకున్నారు. 50 వేల జనాభా విభాగంలో నిజాంపేట్‌ మున్సిపాలిటీకి ‘ఇన్నోవేషన్‌ అండ్‌ బెస్ట్‌ ప్రాక్టీసెస్‌’, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి ‘ఫాస్టెస్ట్‌ మూవర్‌ సిటీ’అవార్డులు దక్కాయి. 25 వేల లోపు జనాభా విభాగంలో ఘట్కేసర్‌ మున్సిపాలిటీకి ‘క్లీనెస్ట్‌ సిటీ’హుస్నాబాద్‌ మున్సిపాలిటీకి ‘ఫాస్టెస్ట్‌ మూవర్‌ సిటీ’, కోస్గి మున్సిపాలిటీకి ‘ఇన్నోవేషన్‌ అండ్‌ బెస్ట్‌ ప్రాక్టీసెస్‌’పురస్కారాలు దక్కాయి. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌కు బెస్ట్‌ ‘సెల్ఫ్‌ సస్టైనబిలిటీ కంటోన్మెంట్‌’అవార్డు దక్కింది. గ్రేటర్‌ హైదరాబాద్‌కు గార్బేజ్‌ ఫ్రీ సిటీ, స్వచ్ఛ సురక్ష అవార్డులు దక్కాయి. కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ‘సఫాయి మిత్ర చాలెంజ్‌’అవార్డు లభించింది. సిద్దిపేటకు పురస్కారం లభించడంపై మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తంచేశారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ క్లీనెస్ట్‌ సిటీ విభాగంలో జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. గార్బేజ్‌ ఫ్రీ సిటీ రేటింగ్‌లో విజయవాడకు ఫైవ్‌ స్టార్‌ ర్యాంకు, విశాఖపట్నం, కడప, తిరుపతిలకు త్రీస్టార్‌ ర్యాంకులు దక్కాయి.  
స్వచ్ఛ సర్వేక్షన్‌ ర్యాంకింగ్స్‌లో తెలంగాణకు పదో స్థానం..  
స్వచ్ఛ సర్వేక్షణ్‌ –2021 ర్యాంకింగ్స్‌లో 13 రాష్ట్రాలకు చెందిన వందకు పైగా అర్బన్‌ లోకల్‌ బాడీస్‌ (యూఎల్‌ బీ)కిగానూ తెలంగాణ 1,570 పాయింట్లతో 10వ ర్యాంక్‌లో నిలిచింది. ఛత్తీస్‌గఢ్‌ (4,175), మహారాష్ట్ర(2,845), మధ్యప్రదేశ్‌ (2,570), గుజరాత్‌ (2,570), ఆంధ్రప్రదేశ్‌ (2,480) పాయింట్లతో తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి.

Published date : 22 Nov 2021 05:35PM

Photo Stories