Skip to main content

నవంబర్ 2019 అవార్డ్స్

ఎల్‌అండ్‌టీ సీఈవోకు జేఆర్‌డీ టాటా అవార్డు
Current Affairs
దేశీయ ఇన్‌ఫ్రా దిగ్గజం లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్‌అండ్‌టీ) సీఈవో, ఎండీ ఎస్‌ఎన్ సుబ్రమణియన్‌కు ప్రతిష్టాత్మక ‘ఐఐఎం-జేఆర్‌డీ టాటా’ అవార్డు లభించింది. కేరళలోని కోవలంలో నవంబర్ 21న జరిగిన కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం, సహజ చమురు, ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా సుబ్రమణియన్ ఈ అవార్డును అందుకున్నారు. మెటలర్జికల్ ఇండస్ట్రీస్ విభాగంలో ఉత్తమ కార్పొరేట్ గవర్నెన్స్ కు గాను సుబ్రమణియన్‌కు ఈ అవార్డు దక్కింది. 2007లో టాటా స్టీల్ నెలకొల్పిన ఐఐఎం-జేఆర్‌డీ టాటా అవార్డును పొందిన వారిలో రతన్ టాటా, ఈ శ్రీధరన్, సజ్జన్ జిందాల్‌లు ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఐఎం-జేఆర్‌డీ టాటా అవార్డు విజేత
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : ఎల్‌అండ్‌టీ సీఈవో, ఎండీ ఎస్‌ఎన్ సుబ్రమణియన్
ఎక్కడ : కోవలం, కేరళ
ఎందుకు : మెటలర్జికల్ ఇండస్ట్రీస్ విభాగంలో ఉత్తమ కార్పొరేట్ గవర్నెన్స్ కు గాను

తెలంగాణకు స్టేట్ ఆఫ్ ద స్టేట్స్ అవార్డు
సుపరిపాలనకు గానూ ఇండియా టుడే ఏటా ఇచ్చే స్టేట్ ఆఫ్ ద స్టేట్స్ కాన్‌క్లేవ్-2019 అవార్డు తెలంగాణకు దక్కింది. ఢిల్లీలో నవంబర్ 22న జరిగిన కార్యక్రమంలో కేంద్ర పర్యావరణం, అటవీశాఖ, సమాచార, ప్రసార శాఖ, భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చేతుల మీదుగా టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఆర్థిక, సామాజిక, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్టేట్ ఆఫ్ ద స్టేట్స్ కాన్‌క్లేవ్-2019 అవార్డు విజేత
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : తెలంగాణ
ఎందుకు : సుపరిపాలనకు గానూ

డీఆర్‌డీఓ చైర్మన్‌కి రాయల్ ఏరోనాటికల్ ఫెలోషిప్
భారత రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) చెర్మన్ గుండ్రా సతీష్‌రెడ్డికి లండన్‌కి చెందిన రాయల్ ఏరోనాటికల్ సొసైటీ గౌరవ ఫెలోషిప్ లభించింది. ఏరోనాటికల్ ఆర్ట్ సైన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో ఆయన సేవలకు గాను ఈ అవార్డు ప్రకటించినట్లు ఏరోనాటికల్ సొసైటీ నవంబర్ 26న తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఈ ఏరోనాటికల్ సొసైటీలో భారతీయుడొకరికి ఈ ఘనత దక్కడం వందేళ్లలో ఇదే తొలిసారి. ఏరోస్పేస్ రంగంలో ఈ ఫెలోషిప్‌ను నోబెల్ పురస్కారానికి సమానంగా పరిగణిస్తారు. ఈ ఫెలోషిప్‌ను తొలిసారిగా 1917లో ప్రదానం చేశారు. విమానాన్ని కనిపెట్టిన రైట్ సోదరుల్లో ఒకరైన ఆర్విల్ రైట్‌కు అది దక్కింది. ఆ తర్వాత ఏరోస్పేస్ రంగంలో ఈ ఫెలోషిప్‌ను ఇస్తున్నారు. 2019 సంవత్సరానికి సతీశ్ రెడ్డికి దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాయల్ ఏరోనాటికల్ సొసైటీ గౌరవ ఫెలోషిప్
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : డీఆర్‌డీఓ చెర్మన్ గుండ్రా సతీష్‌రెడ్డి
ఎందుకు : ఏరోనాటికల్ ఆర్ట్ సైన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో సేవలకుగాను

ఏపీఎస్‌ఎస్‌డీసీకి అసోచామ్ జాతీయ అవార్డు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)కు అసోచామ్ జాతీయ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో నవంబర్ 27న జరిగిన ‘స్కిల్ ఇండియా సమ్మిట్ అండ్ అవార్డ్స్’ కార్యక్రమంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ చేతులమీదుగా ఏిపీఎస్‌ఎస్‌డీసీ సీజీఎం డాక్టర్ రవికుమార్ ఈ అవార్డును అందుకొన్నారు. ఉత్తమ నైపుణ్య శిక్షణ ఇస్తున్న రాష్ట్రాల కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచి ఈ అవార్డును దక్కించుకుంది. మరోవైపు భారీ స్థాయిలో నైపుణ్య శిక్షణ ఇస్తున్న విశాఖపట్నంలోని హెచ్‌పీసీఎల్ ప్రభుత్వరంగ సంస్థల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించింది.
నైపుణ్య శిక్షణ ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించడంతో పాటు శిక్షణలో ఉత్తమ విధానాలు అవలంబిస్తున్న రాష్ట్రాలకు అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) సంస్థ ఏటా అవార్డులు అందజేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అసోచామ్ జాతీయ అవార్డు విజేత
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ
ఎందుకు : ఉత్తమ నైపుణ్య శిక్షణ ఇస్తున్న రాష్ట్రాల కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచినందుకు

ఆంధ్రప్రదేశ్‌కు రెండు ఇండియాటుడే’ అవార్డులు
Current Affairs
ప్రముఖ మీడియా సంస్థ ఇండియాటుడే ఏటా నిర్వహించే స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ అవార్డుల్లో 2019కి గాను ఆంధ్రప్రదేశ్ రెండు అవార్డులను గెలుచుకుంది. వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పన, శాంతి భద్రతలు, ప్రభుత్వ పరిపాలన, వ్యాపార వాతావరణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని పెద్ద రాష్ట్రాల్లో సమ్మిళితవృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని ఎంపిక చేశారు. పెద్ద రాష్ట్రాల్లో వైద్యం, పర్యాటక రంగాల్లో అత్యున్నత పురోగతి సాధించినందుకు గాను రాష్ట్రం అవార్డును కైవసం చేసుకుంది. నవంబర్ 22న న్యూఢిల్లీలో జరిగే ‘ఇండియా టుడే స్టేట్ ఆఫ్ ది స్టేట్స్’ కాన్‌క్లేవ్-2019లో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆంధ్రప్రదేశ్‌కు రెండు ఇండియాటుడే అవార్డులు
ఎందుకు: వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పన, శాంతి భద్రతలు, ప్రభుత్వ పరిపాలన, వ్యాపార వాతావరణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని..
ఎక్కడ: న్యూఢిల్లీ

జ్యోతిగౌడ్‌కు బెస్ట్ బ్రెయిలీ’ అవార్డు
బేగంపేట మయూరీ మార్గ్‌లోని ‘దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్’ కరస్పాండెంట్ ఎ.జ్యోతిగౌడ్‌కు ‘బెస్ట్ బ్రెయిలీ ప్రింటింగ్ ప్రెస్ ఇన్ ది కంట్రీ-2019’ అవార్డు దక్కింది. అంధ విద్యార్థుల కోసం ఆమె చేస్తున్న కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కరించనుంది. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3న ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆమె అవార్డును అందుకోనున్నారు. సాధారణ చిన్నారులతో సమానంగా అంధ విద్యార్థులు ఉన్నతంగా రాణించాలనే ఉద్దేశంతో బ్రెయిలీ లిపిలో ఆమె వేల సంఖ్యలో పుస్తకాల ప్రచురణ చేశారు. గత 27 ఏళ్లుగా పాఠ్యపుస్తకాలతోపాటు ఆధ్యాత్మిక గ్రంథాలు, సందేశాత్మక, మహనీయుల చరిత్రలనూ బ్రెయిల్ లిపిలో అందించారు. తెలంగాణ, ఏపీతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న అంధు లకు ఈ పుస్తకాలను ఉచితంగా అందించారు. రామాయణం, మహాభారతం, భగవద్గీత, బైబిల్, ఖురాన్, జనరల్ నాలెడ్‌‌జ బుక్స్, కథల పుస్తకాలు, సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్, వివేకానంద వంటి మహనీయుల చరిత్ర విశేషాలను తెలియజేస్తూ ఇంగ్లిష్ భాషలో బ్రెయిలీ లిపిలో పుస్తకాలను ప్రచురించి దేశవ్యాప్తంగా లైబ్రరీలకు అందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ‘దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్’ కరస్పాండెంట్ ఎ.జ్యోతిగౌడ్‌కు ‘బెస్ట్ బ్రెయిలీ ప్రింటింగ్ ప్రెస్ ఇన్ ది కంట్రీ-2019’ అవార్డు
ఎవరు: ఎ.జ్యోతిగౌడ్
ఎందుకు: అంధ విద్యార్థుల కోసం ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా

అక్కినేని జాతీయ అవార్డు’లకు శ్రీదేవి, రేఖలను ఎంపిక
2018, 2019 సంవత్సరాలకు ‘అక్కినేని జాతీయ అవార్డు’లకు శ్రీదేవి, రేఖలను ఎంపిక చేశారు. హైదరాబాద్‌లో నవంబర్ 17న జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి చిరంజీవి చేతులమీదుగా రేఖ తీసుకోగా, శ్రీదేవి అవార్డును ఆమె భర్త బోనీకపూర్ స్వీకరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ‘అక్కినేని జాతీయ అవార్డు’లకు శ్రీదేవి, రేఖలను ఎంపిక
ఎప్పుడు: నవంబర్ 17, 2019
ఎవరు: శ్రీదేవి, రేఖ
ఎక్కడ: హైదరాబాద్

నారా నాగేశ్వరరావుకు జాతీయ పురస్కారం
సాక్షి, హైదరాబాద్: దివ్యాంగులకు విశిష్ట సేవలందించిన వ్యక్తులు,సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అందించే అవార్డులకు రాష్ట్రానికి చెందిన నారా నాగేశ్వరరావు ఎంపికయ్యారు. నేషనల్ రోల్‌మోడల్ కేటగిరీలో ఆయనకు ఈ పురస్కారం దక్కింది. డిసెంబర్ 3న ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకోనున్నారు. నాగేశ్వరరావు రంగారెడ్డి జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యుడిగా, వికలాంగుల హక్కుల చట్టం-2016 నియమావళి కమిటీ సభ్యుడిగా పని చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: నారా నాగేశ్వరరావుకు జాతీయ పురస్కారం
ఎవరు: నారా నాగేశ్వరరావ
ఎందుకు: దివ్యాంగులకు విశిష్ట సేవలందించినందుకు

తెలంగాణకు స్వచ్ఛ సర్వేక్షణ్ పురస్కారం
మెరుగైన పారిశుద్ధ్య విధానాల అమలు, ఫలితాల సాధనకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్రానికి 2019 ఏడాదికిగానూ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డు లభించింది. ఢిల్లీలో నవంబర్ 19న జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి సదానందగౌడ చేతుల మీదుగా తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ముఖ్యంగా సర్పంచుల చొరవతోనే ఈ ఘనత సాధ్యమైందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణకు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డు 2019
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి సదానందగౌడ
ఎందుకు : మెరుగైన పారిశుద్ధ్య విధానాల అమలు, ఫలితాల సాధనకు గుర్తింపుగా
.
అటన్‌బరోకు ఇందిరాగాంధీ శాంతి బహుమతి
ప్రకృతి శాస్త్రవేత్త, ప్రముఖ బ్రాడ్‌కాస్టర్ సర్ డేవిడ్ అటన్‌బరోకు ఇందిరాగాంధీ శాంతి బహుమతి-2019 లభించింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని అంతర్జాతీయ జ్యూరీ ఈ అవార్డు విజేతను ఎంపిక చేసింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్టు నవంబర్ 19న ఓ ప్రకటనలో ఈ విషయం వెల్లడించింది. బ్రిటన్‌కు చెందిన 93 ఏళ్ల అటన్‌బరో జీవవైవిధ్యాన్ని కాపాడుకునేందుకు ఎంతో కృషి చేశారు. ప్రకృతి సంపదపై ఎన్నో పుస్తకాలు రాశారు.
మరోవైపు 2018 సంవత్సరానికి గాను ప్రకటించిన ‘ఇందిరాగాంధీ శాంతి బహుమతి’ని ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్’(సీఎస్‌ఈ) సారథి సునీతా నారాయణ్‌కు నవంబర్ 19న ప్రదానం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇందిరాగాంధీ శాంతి బహుమతి-2019కి ఎంపిక
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : సర్ డేవిడ్ అటన్‌బరో
ఎందుకు : జీవవైవిధ్యాన్ని కాపాడుకునేందుకు ఎంతో కృషి చేసినందుకు

తెలంగాణ శాస్త్రవేతకు లూయీస్ పాశ్చర్ అవార్డు
పట్టు పరిశ్రమలో పరిశోధనలతో విశేష కృషి చేసిన తెలంగాణ శాస్త్రవేత్త డాక్టర్ తాళ్లపల్లి మొగిలి జపాన్‌లోని అంతర్జాతీయ పట్టు కమిషన్ నుంచి ప్రతిష్ఠాత్మక ‘లూయీస్ పాశ్చర్ అవార్డు’ను అందుకున్నారు. జపాన్‌లోని సుకుబా నగరంలో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం చర్లపల్లికి చెందిన తాళ్లపల్లి మొగిలి కాకతీయ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పొందారు. మల్బరీలో కొత్త వంగడాల అభివృద్ధిలో ఆయన విశేష కృషి చేశారు. 30 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వ పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లూయీస్ పాశ్చర్ అవార్డు విజేత
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : తెలంగాణ శాస్త్రవేత్త డాక్టర్ తాళ్లపల్లి మొగిలి
ఎక్కడ : సుకుబా, జపాన్
ఎందుకు : పట్టు పరిశ్రమలో పరిశోధనలతో విశేష కృషి చేసినందుకు

పెటా పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా విరాట్ కోహ్లి
పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ ఎనిమల్స్ (పెటా) భారత కెప్టెన్ విరాట్ కోహ్లిని పర్సన్ ఆఫ్ ద ఇయర్-2019 అవార్డుకు ఎంపిక చేసింది. శాకాహార ప్రోత్సాహకులను, జంతుజాల ప్రేమికులను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. కోహ్లి రాజస్తాన్‌లోని అంబర్ కోట వద్ద మాల్తి అనే ఏనుగును హింసించడాన్ని నిరసిస్తూ పెటాకు లేఖ రాశాడు. మూగ జీవాలపట్ల కరుణ చూపాలని తన అభిమానులకు సందేశం ఇచ్చాడు. జంతువులను కొనుగోలు చేయడం కంటే దత్తత తీసుకోవాలని సూచించాడు. బెంగళూరులోని జంతు సంరక్షణ కేంద్రాన్ని తరచూ సందర్శిస్తూ వాటి బాగోగులకు తన వంతు చేయూత అందిస్తున్నాడు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న పెటా కోహ్లిని పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికచేసింది.
గతంలో భారత్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్, సుప్రీం కోర్టు మాజీ జస్టిస్ పనికర్ రాధాకృష్ణన్, బాలీవుడ్ నటీమణులు అనుష్క శర్మ, హేమ మాలిని, జాక్వలైన్ ఫెర్నాండెజ్, హీరో మాధవన్‌లు ‘పెటా’ పర్సన్ ఆఫ్ ఇయర్ అవార్డులకు ఎంపికయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పెటా పర్సన్ ఆఫ్ ద ఇయర్-2019 అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : భారత కెప్టెన్ విరాట్ కోహ్లి

సీసీఎంబీ సైంటిస్ట్ మంజులకు ఇన్ఫోసిస్ ప్రైజ్
Current Affairs
జీవశాస్త్ర రంగంలో చేసిన పరిశోధనలకు గుర్తింపుగా ఇచ్చే ‘ఇన్ఫోసిస్ ప్రైజ్-2019’కు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ మంజులా రెడ్డి ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద బంగారు పతకం, ప్రశంసాపత్రంతో పాటు లక్ష డాలర్ల నగదు బహుమతి అందిస్తారు. బ్యాక్టీరియాలోని కణకవచాల నిర్మాణానికి సంబంధించిన ఆవిష్కరణలకు గాను మంజులా రెడ్డికి ఈ ప్రైజ్ దక్కింది.
జీవశాస్త్రాలతోపాటు ఇంజనీరింగ్, కంప్యూటర్ సెన్సైస్, హ్యుమానిటీస్, గణిత, భౌతిక, సామాజిక శాస్త్రాల్లో అద్భుత పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలను దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఏటా అవార్డుతో సత్కరిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇన్ఫోసిస్ ప్రైజ్-2019కి ఎంపిక
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : సీసీఎంబీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ మంజులా రెడ్డి
ఎందుకు : బ్యాక్టీరియాలోని కణకవచాల నిర్మాణానికి సంబంధించిన ఆవిష్కరణలకు గాను

ప్రముఖ శాస్త్రవేత్త చిరంజీవికి ఫిక్కి అవార్డు
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ తోట చిరంజీవికి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ (ఎఫ్‌ఐసీసీఐ) అవార్డు లభించింది. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఏటా పెట్రో కెమికల్ సెక్టారులో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డులను బహూకరిస్తుంది. 2019 ఏడాదికి ‘సస్టైనబిలిటీ అవార్డ్ ఫర్ బెస్ట్ గ్రీన్ ప్రొడక్ట్’ కింద డాక్టర్ చిరంజీవి ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత పెట్రోలియం, కెమికల్స్ లిమిటెడ్ (నోయిడా)లో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా డాక్టర్ చిరంజీవి పనిచేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎఫ్‌ఐసీసీఐ-సస్టైనబిలిటీ అవార్డ్ ఫర్ బెస్ట్ గ్రీన్ ప్రొడక్
ఎప్పుడు : నవంబర్ 9
ఎవరు : ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ తోట చిరంజీవి
ఎందుకు : పెట్రో కెమికల్ సెక్టారులో విశేష కృషి చేసినందుకు

ఎమెస్కో సంస్థకు లోక్‌నాయక్ పురస్కారం
తెలుగుభాషాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ఎమెస్కో సంస్థకు లోక్‌నాయక్ ఫౌండేషన్ అవార్డు అందజేయనున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నవంబర్ 10న ప్రకటించారు. 2020 జనవరి 18న విశాఖపట్నంలోని వుడా బాలల థియేటర్‌లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఎమెస్కో ప్రధాన కార్యనిర్వాహకుడు డి.విజయ కుమార్‌కు ఈ పురస్కారం కింద రూ.2 లక్షల నగదు, ప్రశంసాపత్రాన్ని అందజేస్తామన్నారు.
మరోవైపు విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్యకు జీవన సాఫల్య పురస్కారం కింద రూ.లక్ష నగదు అందజేస్తామని యార్లగడ్డ వివరించారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ ద్వారా అందజేసే పురస్కార మొత్తాన్ని రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచినట్లు చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లోక్‌నాయక్ ఫౌండేషన్ అవార్డు
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : ఎమెస్కో సంస్థ

ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టుకు స్వర్ణశక్తి అవార్డు
రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టుకు స్వర్ణశక్తి అవార్డు 2018-19 లభించింది. ఎన్టీపీసీ సంస్థ ఆవిర్భావ వేడుకల సందర్భంగా నవంబర్ 9న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్, ఎన్టీపీసీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ గురుదీప్ సింగ్ చేతుల మీదుగా ఈ అవార్డును ఎన్టీపీసీ తెలంగాణ, రామగుండం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డాక్టర్ కులకర్ణి అందుకున్నారు. ఎన్టీపీసీ సంస్థ విద్యుత్ అవసరాల కోసం నిర్మిస్తున్న స్టేజ్-1 తొలిదశ ప్రాజెక్టు నిర్మాణంలో రక్షణ, భద్రత చర్యలను పటిష్టంగా అమలు చేస్తున్న క్రమంలో ఈ అవార్డు లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వర్ణశక్తి అవార్డు 2018-19 విజేత
ఎప్పుడు : నవంబర్ 9
ఎవరు : రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు
ఎందుకు : ఎన్టీపీసీ ప్రాజెక్టు నిర్మాణంలో రక్షణ, భద్రత చర్యలను పటిష్టంగా అమలు చేస్తున్న క్రమంలో

ప్రముఖ కవి వేణు సంకోజుకు కాళోజీ పురస్కారం
ప్రముఖ కవి, సుప్రసిద్ద సాహితీవేత్త వేణు సంకోజుకు కాళోజీ స్మారక పురస్కారం లభించింది. కాళోజీ ఫౌండేషన్ ఆధ్వర్యాన వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో నవంబర్ 13న జరిగిన కార్యక్రమంలో వేణుకు ఈ అవార్డును ప్రదానం చేశారు. కాళోజీ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు ఎస్.జీవన్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కవి రామాచంద్రమౌళి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, కాకతీయ యూనివర్సిటీ విశ్రాంతాచార్యులు డాక్టర్ కాత్యాయనీవిద్మహే పాల్గొన్నారు.

రామజోగయ్యశాస్త్రికి గురజాడ పురస్కారం
సినీ గేయ రచయిత, సాహితీవేత్త రామజోగయ్యశాస్త్రి గురజాడ విశిష్ట పురస్కారానికి ఎంపికయ్యారు. గురజాడ 104వ వర్ధంతిని పురస్కరించుకుని నవంబర్ 30న ఈ పురస్కారం అందజేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాళోజీ స్మారక పురస్కారం
ఎప్పుడు : నవంబర్ 13
ఎవరు : కవి, సుప్రసిద్ద సాహితీవేత్త వేణు సంకోజు

నటుడు రజనీకాంత్‌కు గోల్డెన్ జూబ్లీ అవార్డు
Current Affairs
ప్రముఖ నటుడు రజనీకాంత్‌కు ‘ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డు’ లభించింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేవకర్ నవంబర్ 2న ప్రకటించారు. 50వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) 2019 అవార్డుల కార్యక్రమంలో రజనీకాంత్‌కు గోల్డెన్ జూబ్లీ అవార్డును ప్రదానం చేయనున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ సినిమాకు చేసిన విశేష కృషికి గుర్తింపుగా రజనీకాంత్‌కు ఈ అవార్డు దక్కింది. మరోవైపు విదేశీ నటి కేటగిరీలో ఫ్రెంచ్ నటి ఇసాబెల్లె హప్పెర్ట్‌కు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రదానం చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
2019, నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో గోల్డెన్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డుల కార్యక్రమం జరగనుంది. ఈ చలన చిత్రోత్సవంలో వివిధ దేశాలకు చెందిన 250 సినిమాలను ప్రదర్శిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డు విజేత
ఎప్పుడు : నవంబర్ 2
ఎవరు : ప్రముఖ నటుడు రజనీకాంత్
ఎందుకు : భారతీయ సినిమాకు చేసిన విశేష కృషికి గుర్తింపుగా

సుదర్శన్ పట్నాయక్‌కు ఇటాలియన్ గోల్డెన్ అవార్డ్
భారత్‌కి చెందిన చెందిన ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ ప్రతిష్ఠాత్మక ‘ఇటాలియన్ గోల్డెన్ శాండ్ ఆర్ట్ అవార్డు-2019’కు ఎంపికయ్యారు. 2019, నవంబర్ 13 నుంచి 18 వరకు ఇటలీలో నిర్వహించనున్న ‘ఇంటర్నేషనల్ స్కోరా నా శాండ్ నేటివిటీ’ కార్యక్రమంలో పట్నాయక్‌కు ఈ అవార్డును అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారత్ తరపున పట్నాయక్ నేతృత్వం వహించనున్నారు. సుదర్శన్ పట్నాయక్ సేవలకు గానూ భారత ప్రభుత్వం ఆయనను 2014లో నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో గౌరవించిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇటాలియన్ గోల్డెన్ శాండ్ ఆర్ట్ అవార్డు-2019కు ఎంపిక
ఎప్పుడు : నవంబర్ 2
ఎవరు : ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్

విశిష్ట సేవకులకు వైఎస్సార్ లైఫ్‌టైమ్ అవార్డులు
వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన, ప్రజలకు విశిష్ట సేవలు అందించిన వారిని గుర్తించి ప్రోత్సహించడం లక్ష్యంగా ‘వైఎస్సార్ లైఫ్‌టైమ్ అవార్డు’లను ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ నవంబర్ 6న ఉత్తర్వులు జారీచేసింది. ఈ పురస్కారం కింద రూ.10 లక్షల నగదు బహుమతితోపాటు ముఖ్యమంత్రి చేతుల మీదుగా జ్ఞాపికను ఇచ్చి సత్కరిస్తారు.
వైఎస్సార్ లైఫ్‌టైమ్ అవార్డులు-విధి విధానాలు
  • 2020 సంవత్సరం నుంచి ప్రతియేటా ఈ అవార్డులు ఇస్తారు.
  • ఏడాదికి వంద అవార్డులు మించకుండా ఇస్తారు.
  • ప్రతియేటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న, గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ఈ పురస్కారాలను ముఖ్యమంత్రి ప్రదానం చేస్తారు.
  • సోషల్ వర్క్, ప్రజావ్యవహారాలు, సైన్స్, ఇంజినీరింగ్, వ్యాపార వాణిజ్య రంగాలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెద్య రంగం, కళలు, సాహిత్యం, విద్య, ప్రజాసేవ, క్రీడారంగంతోపాటు సంస్కృతి, మానవ హక్కులు, వన్యప్రాణుల పరిరక్షణ తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు.
కమిటీ ద్వారా ఎంపిక
వైఎస్సార్ లైఫ్‌టైమ్ పురస్కారాల కోసం వచ్చిన దరఖాస్తులను సెలక్షన్ కమిటీ పరిశీస్తుంది. ఈ కమిటీని ఏటా ముఖ్యమంత్రి నియమిస్తారు. ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) అధ్యక్షతన గల ఈ కమిటీలో ముఖ్యమంత్రి సిఫార్సు చేసిన మూడు శాఖల కార్యదర్శులు సభ్యులుగానూ, సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్) మధ్య స్థాయి అధికారి కన్వీనరుగాను ఉంటారు. అవార్డుల బహూకరణకు రెండు నెలల ముందు ఈ కమిటీ సిఫార్సులు స్వీకరిస్తుంది. వచ్చిన నామినేషన్లను ఈ కమిటీ పరిశీలించి ఎవరెవరికి అవార్డులు ఇవ్వాలో జాబితా తయారుచేసి ముఖ్యమంత్రికి సిఫార్సు చేస్తుంది. ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విశిష్ట సేవకులకు వైఎస్సార్ లైఫ్‌టైమ్ అవార్డులు
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన, ప్రజలకు విశిష్ట సేవలు అందించిన వారిని గుర్తించి ప్రోత్సహించడం లక్ష్యంగా

ఎల్ అండ్ టీకి సీఐవో స్మార్ట్ ఇన్నోవేటర్ అవార్డు
ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ సంస్థ (ఎంఆర్‌హెచ్‌ఎల్)కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘డైనమిక్ సీఐవో స్మార్ట్ ఇన్నోవేటర్ అవార్డు’ లభించింది. ఇటీవల బెంగళూరులో జరిగిన ఎంటర్‌ప్రైజ్ ఇన్నోవేషన్ సదస్సు-2019లో ఎల్ అండ్ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ తరఫున ఐటీ, ఎంటర్‌ప్రెజైస్ హెడ్ అనిర్బన్ సిన్హా ఈ అవార్డును అందుకున్నారు. క్లౌడ్ ఆధారిత మానవ వనరుల వ్యవస్థ ‘డార్విన్ బాక్స్ హెచ్‌ఆర్‌ఎంఎస్’ను అమలు చేసినందుకుగాను ఎల్ అండ్ టీకి ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డైనమిక్ సీఐవో స్మార్ట్ ఇన్నోవేటర్ అవార్డు విజేత
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ సంస్థ (ఎంఆర్‌హెచ్‌ఎల్)
ఎందుకు : క్లౌడ్ ఆధారిత మానవ వనరుల వ్యవస్థ ‘డార్విన్ బాక్స్ హెచ్‌ఆర్‌ఎంఎస్’ను అమలు చేసినందుకుగాను

నిర్మల్ జిల్లాకు డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ అవార్డు
తెలంగాణలోని నిర్మల్ జిల్లాకు కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ అందించే ‘డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్-2019’ అవార్డు లభించింది. న్యూఢిల్లీలోని లలిత్ హోటల్‌లో నవంబర్ 6న నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సురేష్ ప్రభు చేతుల మీదుగా నిర్మల్ కలెక్టర్ ప్రశాంతి ఈ అవార్డును అందుకున్నారు. నిర్మల్ జిల్లాలో రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు ప్రయోగాత్మకంగా రైతుయంత్ర యాప్‌ను అమలులోకి తీసుకువచ్చారు. ఈ యాప్ విజయవంతం కావడంతో జిల్లాకు ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నిర్మల్ జిల్లాకు ‘డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్-2019’ అవార్డు
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ
ఎందుకు : రైతుయంత్ర యాప్ విజయవంతం కావడంతో
Published date : 27 Nov 2019 04:38PM

Photo Stories