Skip to main content

Megastar Chiranjeevi: చిరంజీవికి అరుదైన గౌరవం.. మోదీ ప్ర‌త్యేక అభినంద‌న‌లు

ప్రఖ్యాత సినీ నటుడు, నిర్మాత చిరంజీవి (67)కి అరుదైన గౌరవం దక్కింది. న‌వంబ‌ర్ 20న గోవాలో ప్రారంభమైన 53వ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ)లో ‘ఇండియా ఫిలిం పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌–2022’అవార్డుకు చిరంజీవిని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ప్రకటించారు.

ఈ సంద‌ర్భంగా చిరంజీవికి ట్విట్టర్‌లో అభినందనలు తెలియపారు. నాలుగు దశాబ్దాల సినీ జీవితంలో 150కిపైగా చిత్రాల్లో నటించారని, గొప్ప డ్యాన్సర్‌గా అభిమానులను అలరించారని కొనియాడారు. అద్భుతమైన నటనతో ప్రజల హృదయాలను గెలుచుకున్నారంటూ చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపించారు. 1978లో సినీ రంగంలో అడుగుపెట్టిన చిరంజీవి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. 2006లో దేశంలో మూడో అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మభూషణ్‌’ చిరంజీవిని వరించింది. ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. చిరంజీవి 2012 నుంచి 2014 వరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా సేవలందించారు.  

చిరంజీవిని అభినందించిన మోదీ.. 

Chiranjeevi-Modi


చిరంజీవికి ఇండియన్‌ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ - 2022 అవార్డు రావడం పట్ల భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో ట్వీట్‌  చేశారు. ట్వీట్‌లో మోదీ ప్రస్తావిస్తూ..  'చిరంజీవి ఒక విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానం, ఆదరణ చూరగొన్నారు'. అంటూ పోస్ట్ చేశారు. ఇఫి వేడుకలు న‌వంబ‌ర్‌ 29 వరకు జరగనున్నాయి. మంచి కంటెంట్‌తో రూపుదిద్దుకున్న దాదాపు 280 చిత్రాలను ఇక్కడ ప్రదర్శించనున్నారు. సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన ప్రముఖులకు పురస్కారాలు అందిస్తారు.
➤ సూపర్‌ స్టార్‌ కృష్ణ ఇక‌లేరు.. ఈయ‌న‌ కెరీర్‌ను మలుపుతిప్పింది ఇక్క‌డే..

Published date : 21 Nov 2022 03:25PM

Photo Stories