Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 31st కరెంట్ అఫైర్స్
Rozgar Mela: 10 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి: ప్రధాని మోదీ
గాందీనగర్: దేశంలోని యువతకు 10 లక్షల ఉద్యోగాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. యువతకు ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య కూడా పెరుగుతుందని చెప్పారు. రాబోయే నెలల్లో జాతీయ, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల స్థాయిల్లో మరిన్ని ఉద్యోగ మేళాలు నిర్వహిస్తామన్నారు. గుజరాత్ ప్రభుత్వం అక్టోబర్ 29న గాంధీనగర్‌లో ‘ఉద్యోగమేళా’ ప్రారంభం సందర్భంగా ఆయన ఈ మేరకు ఒక వీడియో సందేశం పంపించారు. ధంతెరాస్ సందర్భంగా నిర్వహించిన జాతీయ స్థాయి ఉద్యోగమేళాలో 75 వేల మందికి నియామక పత్రాలను అందజేసినట్లు ప్రధాని పేర్కొన్నారు. 2022లో 35 వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వాలన్న లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా సాధించిందని చెప్పారు.
UNSC: ఉగ్ర ‘టూల్‌కిట్’లో సోషల్ మీడియా
ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సంస్థలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యథేచ్ఛగా వాడుకుంటున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికలు ఉగ్రవాదుల టూల్‌కిట్‌లో ముఖ్యమైన సాధనాలుగా మారిపోయాయని చెప్పారు. ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్, క్రిప్టో–కరెన్సీ వంటి నూతన సాంకేతికతలను ముష్కరులు దుర్వినియోగం చేయకుండా అంతర్జాతీయంగా కఠిన చ్యలు చేపట్టాలని, ఇందుకోసం ప్రపంచదేశాలు గట్టి ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్సీ) ఆధ్వర్యంలో అక్టోబర్ 29న ఢిల్లీలో జరిగిన కౌంటర్–టెర్రరిజం కమిటీ(సీటీసీ) ప్రత్యేక సమావేశంలో జైశంకర్ మాట్లాడారు. భద్రతా మండలిలోని 15 సభ్యదేశాల ప్రతినిధులు, పలువురు అంతర్జాతీయ నిపుణులు ఈ భేటీకి హాజరయ్యారు. ఉగ్ర చర్యలపై యూఎన్‌ఎస్సీ భారత్‌లో సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి.
ప్రపంచ మానవాళికి పెనుముప్పు
ఉగ్రవాదాన్ని అణచివేయడానికి భారత్ అంకితభావంతో కృషి చేస్తోందని జైశంకర్ పునరుద్ఘాటించారు. ‘ఐక్యరాజ్యసమితి ఫండ్ ఫర్ కౌంటర్–టెర్రరిజం’కు ఈ ఏడాది భారత్ స్వచ్ఛందంగా 5 లక్షల డాలర్లు ఇవ్వబోతోందని ప్రకటించారు. గత రెండు దశాబ్దాలుగా సాంకేతికంగా ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు చేరవేయడానికి, లక్ష్యాలపై దాడులు చేయడానికి ఉగ్రవాద సంస్థలు, వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలు మానవ రహిత విమానాలు, డ్రోన్లు వాడుతుండడం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారిందన్నారు. ఉగ్రవాదం ప్రపంచ మానవాళికి పెద్ద ముప్పుగా పరిణమించిందని చెప్పారు.
Also read: Weekly Current Affairs (Persons) Bitbank: CRPF డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
గ్లోబల్ యాక్షన్ కావాలి: గుటేరస్
ఉగ్రవాద సంస్థలు ఆధునిక టెక్నాలజీని వాడుకోకుండా కట్టడి చేయాలని, ఇందుకోసం ప్రపంచ దేశాలన్నీ ఉమ్మడిగా కృషి (గ్లోబల్ యాక్షన్) చేయాలని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఒక సందేశాన్ని పంపారు. ఉగ్రవాద కార్యకలాపాల కోసం కొత్త టెక్నాలజీని వాడుకోవడం వేగంగా పెరుగుతోందని ఐక్యరాజ్యసమితిలో భారతదేశ ప్రతినిధి రుచిరా కాంబోజ్ చెప్పారు. ‘ఢిల్లీ డిక్లరేషన్’ను 15 సభ్యదేశాల ప్రతినిధులు ఆమోదించారు. ఉగ్ర సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రైవేట్ రంగం, పౌర సమాజంతో కలిసి పనిచేయాలని ప్రభుత్వాలకు కౌంటర్–టెర్రరిజం కమిటీ పిలుపునిచి్చంది.
ఉగ్రవాదాన్ని ఉపేక్షించవద్దు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
భారత్ కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాద బాధిత దేశమేనని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఉగ్రవాద చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించడానికి వీల్లేదని తేలి్చచెప్పారు. ఉగ్రవాదులకు ప్రేరణ ఏదైనప్పటికీ వారి కార్యకలాపాలను అరికట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ముష్కర శక్తుల ఆట కట్టించే విషయంలో ప్రపంచ దేశాలకు భారత్ మార్గదర్శిగా కొనసాగాలని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆధ్వర్యంలో జరిగిన కౌంటర్–టెర్రరిజం కమిటీ(సీటీసీ) సమావేశాన్ని ఉద్దేశించిన ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. ఉగ్రవాదంపై భారత్ అలుపెరుగని పోరాటం సాగిస్తోందని ఉద్ఘాటించారు. భారత్ ఉగ్రవాదం బారినపడిందని పేర్కొన్నారు.
Longest trains: ప్రపంచంలోనే అతిపొడవైన స్విస్ ప్రయాణికుల రైలు
జెనీవా: ప్రపంచంలోనే అతి పొడవైన ప్రయాణికుల రైలు తమదేనంటూ స్విట్జర్లాండ్‌కు చెందిన రేషియన్ రైల్వే కంపెనీ ప్రకటించింది. 100 బోగీలతో 1.9 కిలోమీటర్ల పొడవైన ఈ రైలును ఆల్ఫ్స్ పర్వతాల గుండా అల్బులా/బెర్నీనా మార్గంలో నుంచి ప్రీడా నుంచి బెర్గ్యున్ వరకు అక్టోబర్ 29న విజయవంతంగా నడిపినట్లు తెలిపింది. సుమారు 25 కిలోమీటర్ల ప్రయాణానికి గంట సమయం పట్టిందని వివరించింది. పర్వతాల దిగువన మెలికలు తిరుగుతూ ఉండే 22 టన్నెళ్లు, 48 వంతెనల మీదుగా సాగే సుందరమైన ఈ మార్గాన్ని 2008లో యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చిందని తెలిపింది. 175వ వార్షిక ఆవిర్భావ ఉత్సవాలు జరుపుకుంటున్న స్విస్ రైల్వేల ఇంజినీరింగ్ ప్రతిభను చాటేందుకే ఈ ప్రయత్నాన్ని చేపట్టినట్లు రేషియన్ రైల్వే డైరెక్టర్ రెనాటో ఫసియాటి చెప్పారు. ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు.
Also read: Top 10 నింగిని తాకే నగరాలు
Russia: ఉక్రెయిన్ నుంచి ఎగుమతి ఒప్పందం రద్దు చేస్తాం
కీవ్: ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతికి సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేయబోతున్నట్లు రష్యా రక్షణ శాఖ అక్టోబర్ 29న ప్రకటించింది. రష్యా దండయాత్ర ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ నుంచి ప్రపంచ దేశాలకు ఆహార ధాన్యాల ఎగుమతి నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో ఉక్రెయిన్ నుంచి ఎగుమతులకు రష్యా అంగీకరించింది. ఈ మేరకు ఉక్రెయిన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద ఉక్రెయిన్ 9 మిలియన్ టన్నులకుపైగా ఆహార ధాన్యాలను విదేశాలకు ఎగుమతి చేసింది. దీనివల్ల పలు దేశాల్లో ఆహారం ధరలు దిగివచ్చాయి. ఉక్రెయిన్‌పై ప్రతీకారంగానే ఎగుమతుల ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇది అమల్లోకి వస్తే ఉక్రెయిన్ నుంచి ఎగుమతులు మళ్లీ ఆగిపోవడం ఖాయం.
ISRO: సీఈ20 ఇంజన్ పరీక్ష విజయవంతం
సూళ్లూరుపేట: ఎల్‌వీఎం3–ఎం3 రాకెట్ ప్రయోగానికి సంబంధించి క్రయోజనిక్ దశలో ఉపయోగపడే కొత్త ఇంజన్‌ను(సీఈ–20) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) విజయవంతంగా పరీక్షించింది. సీఈ–20 ఇంజన్ భూస్థిర పరీక్షను నిర్వహించినట్టుగా ఇస్రో అక్టోబర్ 29న ప్రకటించింది. తమిళనాడు రాష్ట్రం మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్(ఐపీఆర్‌సీ) ఈ పరీక్షకు వేదికగా నిలిచింది. ఈ నెల 22న నిర్వహించిన ఎల్‌వీఎం3–ఎం2 రాకెట్ ప్రయోగం ద్వారా లండన్ శాటిలైట్ కమ్యూనికేషన్ల సంస్థ ‘వన్‌వెబ్’కు చెందిన 36 ఉపగ్రహాలను భూమికి 601 కిలోమీటర్లు ఎత్తులోని లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వన్‌వెబ్‌కు చెందిన మరో 36 శాటిలైట్లను వచ్చే ఏడాది జనవరి–ఫిబ్రవరిలో ఎల్‌వీఎం3–ఎం3 రాకెట్ ద్వారా ప్రయోగించాల్సి ఉంది. ఈ ఉపగ్రహాలను వదిలిపెట్టాల్సిన కక్ష్య తక్కువ దూరంలో ఉండడంతో క్రయోజనిక్ దశలో నింపే 25 టన్నుల ఇంధనంలో 5 టన్నుల భారాన్ని, ఖర్చును తగ్గించేందుకు సీఈ–20 పేరిట నూతనంగా క్రయోజనిక్ ఇంజన్‌ను డిజైన్ చేశారు. సుమారు 25 సెకండ్లపాటు మండించి ఈ ఇంజన్ సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. దీన్ని ఎల్‌వీఎం3 రాకెట్ ప్రయోగాల కోసమే రూపొందించినట్లు ఇస్రో వెల్లడించింది. జీఎస్‌ఎల్‌వీ మార్క్–2 రాకెట్ ప్రయోగాలకు సీఈ–12.5, జీఎస్‌ఎల్‌వీ మార్క్–3 ప్రయోగాలకు సీఈ–25, వాణిజ్యపరంగా ఎల్‌వీఎం3 ప్రయోగాలకు సీఈ–20.. అనే మూడు రకాల క్రయోజనిక్ ఇంజన్లు అందుబాటులోకి రావడం విశేషం.
Also read: ISRO LVM 3 - M2 ప్రయోగం విజయవంతం
Flying car: మరో మూడేళ్లలో ‘ఎగిరే కారు’
వాషింగ్టన్: గాల్లో ప్రయాణించే కారు.. ఈ వార్త కొత్తదేమీ కాకపోయినా ఇలాంటి వాహనం ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇతర కంపెనీల కంటే తామే ముందుగా ఎగిరే కారును మార్కెట్‌లోకి తీసుకురావాలని అమెరికాలో కాలిఫోరి్నయా రాష్ట్రంలోని శాన్ మాటియోలో ఉన్న అలెఫ్ ఏరోనాటిక్స్ అనే సంస్థ తీవ్రంగా కృషి చేస్తోంది. మరో మూడేళ్లలోపే మార్కెట్‌లోకి తీసుకొస్తామని చెబుతోంది. గాలిలో ప్రయాణించే కారు తయారీలో అలెఫ్ ఏరోనాటిక్స్ ఇంజనీర్లు నిమగ్నమయ్యారు. ఈ కారులో 8 ప్రొపెలర్స్, చుట్టూ జల్లెడ లాంటి బాడీ ఉంటుందని చెబుతున్నారు. ఇది నిలువుగా గాల్లోకి ఎగురుతుంది. నిర్దేశిత ఎత్తుకు చేరుకున్న తర్వాత 90 డిగ్రీలు మళ్లుతుంది. అనంతరం వేగంగా గాల్లో దూసుకెళ్తుంది. ఎగిరే కారు ధర 3 లక్షల డాలర్లు (రూ.2.47 కోట్లు) ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రత్యేకంగా రన్‌వే అవసరం లేదని, సాధారణ రోడ్లపై కూడా ఈ కారును టేకాఫ్ చేయొచ్చని ఇంజనీర్లు వెల్లడించారు. గాలిలో గంటకు 260 మైళ్ల (418.429 కిలోమీటర్లు) వేగంతో ప్రయాణిస్తుందని చెప్పారు. ఇది పూర్తిగా విద్యుత్‌తో నడిచే ఎలక్ట్రిక్ కారు. 2025 నుంచి విక్రయాలు ప్రారంభించనున్నారు.
Also read: Ballistic Missile: బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన అరిహంత్
ISRO: సౌర, అంతరిక్ష రంగాల్లో భారత్ అద్భుతాలు.. ప్రపంచమే అబ్బురంగా చూస్తోంది: మోదీ
న్యూఢిల్లీ: ‘‘సౌర, అంతరిక్ష రంగాల్లో భారత్ అద్భుతాలు చేస్తోంది. ఆ రంగాల్లో మనం సాధిస్తున్న విజయాలను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతోంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 36 ఉపగ్రహాలను ఇస్రో ఒకేసారి విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించడాన్ని దేశానికి యువత ఇచ్చిన ప్రత్యేక దీపావళి కానుకగా అభివర్ణించారు. అక్టోబర్ 29న నెలవారీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘స్వయంసమృద్ధి దిశగా మా ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది తాజా తార్కాణం. ఒకప్పుడు మనకు క్రయోజనిక్ రాకెట్లు ఇచ్చేందుకు నిరాకరించారు. కానీ మన శాస్త్రవేత్తలు దాన్ని సవాలుగా తీసుకుని దేశీయ పరిజ్ఞానం సాయంతోనే వాటిని నిర్మించి చూపించారు. ఇప్పుడు పుంఖానుపుంఖాలుగా ఉపగ్రహాలను పంపి చూపుతున్నారు. ఫలితంగా ప్రపంచ అంతరిక్ష వాణిజ్య మార్కెట్ల భారత్ పెద్ద శక్తిగా నిలిచింది. అంతరిక్షంలోనూ ప్రైవేటు రంగానికి తలుపులు తెరవడంతో కొత్త స్టార్టప్‌లు పుట్టుకొచ్చి విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి’’ అన్నారు.
Also read: DRDO: ‘అగ్ని ప్రైమ్’ క్షిపణి పరీక్ష విజయవంతం
మోదెరా స్ఫూర్తి: ప్రపంచమంతా పర్యావరణహిత సౌర విద్యుత్ కేసి మళ్లుతోందని మోదీ అన్నారు. ‘‘పీఎం కుసుమ్ యోజన ద్వారా ఎంతోమంది ఇళ్లపై సోలార్ ప్లాంట్లు పెట్టుకున్నారు. కరెంటు బిల్లులు తగ్గించుకోవడంతో పాటు మిగులు విద్యుత్‌ను విక్రయించి లాభపడుతున్నారు. గుజరాత్‌లోని మోదెరా దేశంలో తొలి సోలార్ గ్రామంగా నిలిచింది. ఈ స్ఫూర్తితో దేశమంతటా సూర్యగ్రామ్‌లు వెలుస్తాయి. ఇది త్వరలోనే భారీ ప్రజా ఉద్యమంగా మారడం ఖాయం’’ అని జోస్యం చెప్పారు.
Also read: Weekly Current Affairs (Science & Technology) Bitbank: పశ్చిమ కనుమలలో పర్పుల్-బ్లూ రంగులో ఏ పువ్వులు వికసిస్తాయి?
European C-295: తయారీ హబ్‌గా భారత్
వడోదర: రవాణా విమానాల తయారీలో భారత్ అగ్రగామిగా మారబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్‌లోని వడోదరలో రూ.22 వేల కోట్లతో యూరోపియన్ సి–295 మధ్యతరహా రవాణా విమానాల తయారీ కేంద్రానికి ఆయన అక్టోబర్ 29న శంకుస్థాపన చేశారు. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) కోసం ఈ విమానాలను తయారు చేయబోతున్నారు. ప్రపంచంలో భారత్ అతిపెద్ద తయారీ హబ్‌గా అవతరించిందని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా తెలిపారు. దేశంలో ఆర్థిక సంస్కరణ విషయంలో నూతన చరిత్రను రాస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు స్థిరంగా, దార్శనికతతో కూడి ఉన్నాయన్నారు. కొత్త మైండ్‌సెట్, కొత్త వర్క్‌కల్చర్‌తో ఇండియా ముందడుగు వేస్తోందని చెప్పారు. పెద్ద పెద్ద వాణిజ్య విమానాలు కూడా మన దేశంలో తయారయ్యే రోజులను మనం చూడబోతున్నామని తెలిపారు. ‘మేక్ ఇన్ ఇండియా’తోపాటు ‘మేక్ ఫర్ వరల్డ్’ అనేదే మన నినాదమని వివరించారు. సి–295 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో భారత వైమానిక దళం బలోపేతం కావడంతోపాటు మనదేశంలో విమానయాన రంగానికి ప్రోత్సాహం లభిస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
Also read: SpaceX: యూరప్ అంతరిక్ష ప్రయోగాలకు స్పేస్ ఎక్స్ దన్ను
National Open U23 Athletics Championships: స్వర్ణం నెగ్గిన అనూష
జాతీయ ఓపెన్ అండర్–23 అథ్లెటిక్స్ మీట్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి మల్లాల అనూష స్వర్ణ పతకాన్ని సాధించింది. బిలాస్‌పూర్‌లో జరుగుతున్న ఈ టోరీ్నలో అక్టోబర్ 29న జరిగిన మహిళల ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో అనూష 12.79 మీటర్ల దూరం దూకి విజేతగా నిలిచింది.
National Open Under-23 Athletics Championshipలో నందినికి స్వర్ణం
బిలాస్‌పూర్: జాతీయ ఓపెన్ అండర్–23 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అథ్లెట్ అగసార నందిని స్వర్ణ పతకం సాధించింది. అక్టోబర్ 30న జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును నందిని 13.73 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది.
Also read: Weekly Current Affairs (Sports) Bitbank: రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ T20 2022లో ఏ జట్టు గెలిచింది?
Indian Super League (ISL): హైదరాబాద్ ఎఫ్‌సీ ‘హ్యాట్రిక్’
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఫలితంగా 10 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. అక్టోబర్ 29న సొంత మైదానం జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 1–0 గోల్ తేడాతో గోవా ఎఫ్‌సీని ఓడించింది.
హైదరాబాద్ తరఫున ఏకైక గోల్‌ను సివెరియో 11వ నిమిషంలో నమోదు చేశాడు.
French Open double title: విజేత సాత్విక్–చిరాగ్ జోడీ
అక్టోబర్ 30నముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాత్విక్, చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర) టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. 49 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 21–19తో లూ చింగ్ యావో–యాంగ్ పో హాన్ (చైనీస్ తైపీ) జోడీపై నెగ్గింది. విజేతగా నిలిచిన సాత్విక్–చిరాగ్ జోడీకి 49,950 డాలర్ల (రూ. 41 లక్షల 10 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 11 వేల ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
ఈ ఏడాది సాత్విక్–చిరాగ్ జోడీ ఇండియా ఓపెన్ టైటిల్‌తోపాటు కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP