Skip to main content

State Investment Meeting in AP: ఏపీలో భారీగా ఉద్యోగావకాశాలు.. రూ.23,985 కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌ సిగ్నల్‌

సాక్షి, ఎడ్యుకేషన్‌: ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌ రెడ్డి అధ్యక్షతన సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డ్‌ (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. కడప జిల్లాలో రూ.8,800 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ ఏర్పాటు చేయనున్న స్టీల్‌ ప్లాంట్‌ ప్రతిపాదనకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.
CM YS Jagan

అదానీ గ్రీన్‌ ఎనర్జీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ ఏర్పాటు చేయనున్న పంప్డ్‌ హైడ్రోస్టోరేజీ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. మొత్తంగా రూ.23,985 కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌ సిగ్నల్‌ తెలిపింది. కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో ఏర్పాటుచేయనున్న జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ లిమిటెడ్‌కు ఎస్‌ఐపీబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో భాగంగా ఆ కంపెనీ రెండు విడతల్లో మొత్తంగా రూ. 8,800 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. మొదటి విడతలో రూ.3,300 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 

మొదటి దశలో ఏడాదికి 1 మిలియన్‌ టన్నుల స్టీల్‌ ఉత్పత్తులు, రెండో విడతలో ఏడాదికి 2 మిలియన్‌ టన్నుల స్టీల్‌ ఉత్పత్తులు. మొత్తంగా ఏడాదికి 3 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యంతో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పనులను త్వరగా ప్రారంభించాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. వెనకబడ్డ రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చే ప్రక్రియలో ఇదొక గొప్ప ప్రయత్నమని సీఎం జగన్‌ అన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిసుందని, ప్లాంట్‌ ద్వారా అనేక అనుబంధ పరిశ్రమలు వస్తాయని.. తద్వారా రాయలసీమ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సీఎం తెలిపారు. 
జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ వివరాలు ఇలా...
జేఎస్‌ డబ్ల్యూ  గ్రూప్‌ మొత్తంగా 22 బిలియన్‌ డాలర్ల కంపెనీ. స్టీల్, ఎనర్జీ, తయారీ, సిమెంటు, పెయింటింగ్‌ రంగాల్లో కంపెనీ విస్తరించి ఉంది. ఏడాదికి 27 మిలియన్‌ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేస్తోంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో  జేఎస్‌ డబ్ల్యూకి  కర్మాగారాలున్నాయి. 
అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ రూ. 6,330 కోట్ల పెట్టుబడి
1600 మెగావాట్ల ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌
అలాగే 1600 మెగావాట్ల పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ పవర్‌ ప్రాజెక్టుకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో భాగంగా అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌  రూ. 6,330 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ప్రత్యక్షంగా 4 వేల మందికి ఉపాధి లభించనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదకోటలో వేయి మెగావాట్లు, అనకాపల్లి, విజయనగరం జిల్లాల పరిధిలో రైవాడ వద్ద 600 మెగావాట్ల ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. 2024 డిసెంబర్లో ప్రారంభించిం నాలుగేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడాదికి 4,196 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయనున్నారు. 
రూ. 8,855 కోట్ల హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టుకు ఎస్‌ఐపీబీ ఆమోదం
ఎర్రవరం, సోమశిల వద్ద షిర్డీసాయి ఎలక్ట్రికల్‌ లిమిటెడ్‌ రెండు ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. తద్వారా 2100 మెగావాట్ల ఉత్పత్తి జరగనుంది. ఎర్రవరం వద్ద 1200 మెగావాట్ల ప్రాజెక్టు, 900 మెగావాట్ల రెండో ప్రాజెక్ట్‌ సోమశిల వద్ద ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది జులైలో ప్రారంభమై విడతల వారీగా ఐదేళ్లలో అంటే డిసెంబర్‌ 2028 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 2100 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

Published date : 12 Dec 2022 07:11PM

Photo Stories