Skip to main content

AP CM YS Jagan: ఇది మీ ప్రభుత్వం.. మీరు లేకపోతే నేను లేను.. ఇంకా ఉద్యోగుల‌కు

సాక్షి, అమరావతి: ‘ఈ ప్రభుత్వం మీది.. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోండి.. మీరు లేకపోతే నేను లేను’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులనుద్దేశించి వ్యాఖ్యానించారు.
AP CM YS Jagan Mohan Reddy
AP CM YS Jagan Mohan Reddy

పీఆర్‌సీకి సంబంధించి తాము లేవనెత్తిన పలు అంశాలకు ప్రభుత్వం అంగీకరించటంతో ఆందోళనను విరమించిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు... ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మీ అందరినీ సంతోషంగా చూడటం చాలా ఆనందం కలిగించిందన్నారు. ‘‘మీ అందరికీ వినయపూర్వకంగా మరోసారి ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈ ప్రభుత్వం మీది. ఆ విషయం మనసులో ఉంచుకోండి.

ప్రజలకు మంచి చేయడానికి ఈ రోజు నేను నాలుగడుగులు ముందుకు వేయగలుగుతున్నానంటే మీ అందరి సహకారంతోనే. ఎందుకంటే కరోనా ప్రభావం వల్ల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు తెలుసు. ఇప్పుడున్న ఒమిక్రాన్‌ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో ఎవరికీ తెలియదు. ఈ నేపథ్యంలో మీరు ఆశించిన రీతిలో ఇవ్వలేకపోయి ఉండొచ్చు. కానీ మనసా.. వాచా.. కర్మణా.. ఎంత మేర మేలు చేయగలుగుతామో అన్ని రకాలుగా చేశాం. మొత్తంగా మీ పక్షాన నిలబడటానికి అన్ని రకాలుగా తాను సన్నద్ధంగా ఉన్నానన్నది కచ్చితంగా గుర్తు పెట్టుకోండి’’ అని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

వీటికి తావు ఉండకూడదు.. ఎందుకంటే..? 
ఉద్యోగుల్లోకి, ఉద్యమాల్లోకి రాజకీయాలు వస్తే, ఉన్న వాతావరణం చెడిపోతుంది. రాజకీయాలకు తావుండకూడదు. ఏ సమస్య ఉన్నా రండి. అనామలీస్‌ కమిటీ కూడా ఉంది. ఉద్యోగుల సమస్యలపై ముగ్గురు మంత్రులు, సీఎస్, రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్‌తో ఏర్పాటయిన హైపవర్‌ కమిటీ భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. ఏ సమస్య ఉన్నా, వారికి చెప్పుకోవచ్చు. ప్రభుత్వం అంటే మనది. ఉద్యోగులూ ఇందులో భాగమే. ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకునే మార్గం ఉంది. అంత దూరం పోవాల్సిన అవసరం లేకుండా కూడా పరిష్కారం చేయొచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. మీ అందరికీ ఇదే నా అభ్యర్థన. 

నాతో టచ్‌లో..
► నిన్న చర్చల సమయంలో మంత్రుల కమిటీ నాతో టచ్‌లో ఉంది. నా ఆమోదంతోనే వాటన్నింటినీ కూడా మంత్రుల కమిటీ మీకు చెప్పింది. ఆ నిర్ణయాలు మీకు సంతృప్తినిచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 
► ఐఆర్‌ ఇచ్చిన 30 నెలల కాలానికి గాను, 9 నెలల కాలాన్ని సర్దుబాటు నుంచి మినహాయించాం. అలా చేయటం వల్ల ప్రభుత్వంపై రూ.5,400 కోట్లు అదనంగా భారం పడుతోంది. హెచ్‌ఆర్‌ఏను జనవరి నుంచి వర్తింపజేయడం వల్ల అదనంగా మరో రూ.325 కోట్లు భారం పడుతోంది. మొత్తం రూ.5,725 కోట్లు అదనపు భారం. 
► ఇది కాకుండా ప్రతి సంవత్సరం రికరింగ్‌ వ్యయం రూపేణా మార్పు చేసిన హెచ్‌ఆర్‌ఏ వల్ల రూ.800 కోట్లు, అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ వల్ల మరో రూ.450 కోట్లు, సీసీఏ రూపంలో మరో రూ.80 కోట్లు ఈ మొత్తం కలిపితే రూ.1,330 కోట్లు భారం పడుతోంది.  
► ఇంతకు ముందు పీఆర్సీ ప్రకారం రూ.10,247 కోట్లు ఏటా పెరుగుతుందనుకుంటే.. దానికి ఈ రూ.1,330 కోట్లు రికరింగ్‌. అంటే మొత్తంగా రూ.11,577 కోట్లు భారం. ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఇంకా భారం పడుతుంది. పరిస్థితులు మీకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ వివరాలు చెబుతున్నాను.  

ఆర్థిక పరిస్థితి బాగుంటే..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రూ.5,725 కోట్లు మీ పోస్ట్‌ రిటైర్మెంట్‌కు ఇస్తున్నాం. మీరు ఈ ప్రతిపాదనలకు అంగీకరించినందుకు ధన్యవాదాలు. ఇంత పెద్ద మొత్తం ఒక్కసారి ఇవ్వాలంటే చాలా కష్టం. మనమంతా ఒక్కటిగా కలిసి ముందుకెళదాం. పరిస్థితులు ఇలా ఉండకపోయి ఉంటే.. మీ అందర్నీ మరింత సంతోషపెట్టేవాడిని. మీరంతా నా దగ్గరకు చాలా సంతోషంగా వచ్చే పరిస్థితులుండేవి. దురదృష్టవశాత్తు అలాంటి పరిస్థితులు లేవు. 

ఒక ఉద్యోగస్తుడు రిటైర్‌ అయ్యాక..
భావోద్వేగాలకు ఎప్పుడూ దయచేసి తావు ఇవ్వకండి. ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకుని పరిష్కరించుకుందాం. సీపీఎస్‌ మీద అన్ని వివరాలు తీసుకుని గట్టిగా పని చేస్తున్నాం. ఇవాళ మీరు కొత్త పద్ధతిలో తీసుకుంటున్న పెన్షన్‌ బాగా పెరిగేలా చూస్తాను. ఒక ఉద్యోగస్తుడు రిటైర్‌ అయ్యాక.. గతంలో ఎవ్వరూ చేయని విధంగా జగన్‌ గొప్ప మేలు చేశాడు అనే పరిస్థితి రావాలి. అదే జగన్‌ ప్రభుత్వం మీకు చేయబోయే గొప్ప మేలు. అంత దూరం ఆలోచిస్తూ ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. ప్రస్తుతం సీపీఎస్‌లో ఉన్న పరిస్థితికి భిన్నంగా మీకు ఏ విధంగా మంచి చేయాలనే దానిపై చాలా అధ్యయనం చేస్తున్నాం.

ఎందుకంటే ఈ రోజు మీకు జరిగిపోతుంది.  రిటైర్‌ అయ్యాక ఇబ్బందులు ఎదురవ్వచ్చు. ఆ పరిస్థితి రాకుండా ఒక మంచి పరిష్కారంతో వస్తాం. ఇందులో మిమ్మల్ని భాగస్వాములను చేస్తాను. ఏ రకంగా మేలు చేయగలుగుతాం అన్నది చర్చిస్తాం. అన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నాం. రోస్టర్‌ విధానంలో ఎవరిని నియమించామో వాళ్లందరి పట్ల సానుకూలంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశాం. దీనిపై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాం. 

30 వేల మంది టీచర్లకు..
30 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇస్తున్నాం. ఈ జూన్‌ నాటికి ఎస్జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తున్నాం. పిల్లలు బాగా చదవాలంటే మొత్తం అన్ని సబ్జెక్టులు ఒకే టీచర్‌ చెప్పే ఇవాళ్టి పరిస్థితి  మారాలి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్స్‌ ఉండేలా చూస్తున్నాం. సబ్జెక్టుల వారీగా టీచర్లను తీసుకువస్తున్నాం. దీనివల్ల ఒక టీచర్‌ ఒక సబ్జెక్ట్‌ మీద తన ధ్యాస అంతా పెట్టగలుగుతాడు. ప్రిపేర్‌ అయి బాగా చెప్పగలుగుతాడు. ఇంగ్లిష్‌ మీడియం వైపు అడుగులు వేశాం. బైలింగువల్ టెక్ట్స్‌ బుక్స్‌.. అంటే ఒకపేజీ తెలుగు, పక్క పేజీలో అదే ఇంగ్లిష్‌లో ఉండటం వల్ల పిల్లలు సులభంగా అర్థం చేసుకుంటారు. టీచర్ల కెపాసిటీ పెరుగుతుంది.  

ఇకపై పదవీ విరమణ వయసు... 
ఒక మంచి సానుకూల వాతావరణం దిశగా అడుగులు పడుతున్నాయి. అందరు కలిసికట్టుగా భావితరాలకు మంచి రాష్ట్రాన్ని అందిద్దాం. ఎక్కడైనా తక్కువ చేస్తున్నాం అనిపించినప్పుడు.. అలా ఉండకూడదని కొన్ని చర్యలు తీసుకున్నాం. దీంట్లో భాగంగానే రిటైర్‌మెంట్‌ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం. దానివల్ల 24 నెలల జీతం రూపేణా మరో చోట మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మీరు అడగకపోయినా చేశాం. ఎంఐజీ ఇళ్ల స్థలాల విషయంలో కూడా మీరు అడగకపోయినా నిర్ణయం తీసుకున్నాం.  
   
ఆదాయం పెరగకపోగా..
రాష్ట్ర ఆదాయాలు బాగా పడిపోయాయి. 2018–19లో రాష్ట్ర ఆదాయం రూ.62 వేల కోట్లు. మామూలు పరిస్థితుల్లో అయితే 2019–20లో అది 15 శాతం పెరిగి రూ.72 వేల కోట్లు అయ్యుండాలి. కానీ ఒక్కశాతం  కూడా పెరగకపోగా తగ్గి రూ.60 వేల కోట్లకు పడిపోయింది. 2020–21లో మళ్లీ 15%పెరిగితే అంటే రూ.72 వేల కోట్ల మీద మరో 15 శాతం పెరిగితే రూ.84 వేల కోట్లు కావాలి. అలాంటి పరిస్థితులు ఉండి... అప్పుడు మన చర్చలు సాగుతుంటే పరిస్థితి మరోరకంగా ఉండేది. కానీ 2020–21లో కూడా ముందటి సంవత్సరంకన్నా ఒక్క రూపాయి కూడా పెరగకుండా రాష్ట్రాదాయం రూ.60 వేల కోట్లలోపే ఉండిపోయింది. మరోవైపు జీతాల బిల్లు మాత్రం ఏటేటా పెరుగుతూ వస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమమ్‌ టైం స్కేలు వర్తింపచేశాం.

అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, హోంగార్డులు, శానిటేషన్‌ వర్కర్ల జీతాలు అన్ని రకాలుగా పెంచాం. వీటన్నింటి వల్ల 2018–19లో ఉన్న రూ.52 వేల కోట్ల శాలరీ బిల్లు ఈ ఏడాది రూ.67 వేల కోట్లకు పెరిగింది. తాజా నిర్ణయాలతో ఇప్పుడు మళ్లీ సుమారు రూ.11 వేల కోట్లు అదనంగా పడుతోంది. అంటే రూ.78వేల కోట్లకు చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో మన చర్చలు జరిగాయన్నది ప్రతి ఒక్కరం గుర్తుంచుకోవాలి. నా అంత ఉదారంగా ఎవరూ ఉండరు. నేను మనస్ఫూర్తిగా నమ్మేది ఒక్కటే. మీరు లేకపోతే నేను లేను అని. అనేక పథకాలు పారదర్శకంగా, అవినీతి లేకుండా బటన్‌ నొక్కి ప్రజలకు ఇవ్వగలుగుతున్నామంటే అది మీ వల్లే సాధ్యపడుతోంది. మీరు చేయలేకపోతే వ్యవస్థలో సాధ్యం కాదు. మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా జరుగుతుంది.   

ఈ ప్రభుత్వం ఎప్పుడూ మీతో ఉంటుంది. మీ కోసం శ్రద్ధ తీసుకునే, మీరు చెప్పేది వినడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే ప్రభుత్వం ఇది. మీ సమస్యలను పరిష్కరించే ప్రభుత్వం మీకు ఉందన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకోండి. ఒకచోట కాకపోతే మరో చోట మేలు చేయాలన్న ఆలోచనతో పలు నిర్ణయాలు తీసుకున్నామనే విషయాన్ని గమనించండి. మీరు రిటైర్‌ అయ్యాక కూడా బాగా జీవించేందుకు ఏం చేస్తే బావుంటుందో లోతుగా అధ్యయనం చేస్తున్నాం. ఆ విషయాలన్నీ మీతో చర్చించాకే అడుగులు ముందుకు వేస్తాం.   
                                                                                           – ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

సీఎం మా ఆవేదన అర్థం చేసుకున్నారు..

AP PRC Committee


రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల ఆవేదనను సీఎం వైఎస్‌ జగన్‌ పెద్ద మనసుతో అర్థం చేసుకుని, సమస్యలను సానుకూలంగా పరిష్కరించారని పీఆర్సీ సాధన సమితి నేతలు ప్రశంసించారు. మంత్రివర్గ ఉప సంఘంతో శుక్ర, శనివారాల్లో జరిపిన చర్చలు సఫలీకృతమవడంతో శనివారం రాత్రి పీఆర్సీ సాధన సమితి సమ్మెను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. ఆదివారం పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, కె.వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, కె.సూర్యనారాయణ, ప్రసాద్‌ తదితరులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంతో సమావేశమై కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు.

పీఆర్సీ ప్రకటనతో..
మంత్రుల కమిటీ సిఫార్సుల మేరకు సీఎం హెచ్‌ఆర్‌ఏ శ్లాబులను పెంచారని, సీసీఏ (సిటీ కాంపెన్‌సేటరీ అలవెన్సు) కొనసాగించడంతో పాటు పెన్షనర్లకు అడిషనల్‌ క్వాంటమ్‌ పెన్షన్‌ ఇవ్వడానికి అంగీకరించారని తెలిపారు. దీని వల్ల రూ.1,330 కోట్ల భారం ఖజానాపై పడుతుందన్నారు. పీఆర్సీ ప్రకటనతో రూ.10,247 కోట్లు.. తాజాగా మంత్రుల కమిటీ ప్రతిపాదనలను సీఎం ఆమోదించడం ద్వారా అదనంగా రూ.1,330 కోట్లు వెరసి రూ.11,577 కోట్ల భారం ఖజానాపై పడుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నప్పుడు ఎవరూ అడగకుండానే సీఎం 27% ఐఆర్‌ ఇచ్చారని గుర్తు చేశారు. కరోనా ప్రభావం వల్ల రాష్ట్ర ఆదాయం ఏటా రూ.20 వేల కోట్ల మేర తగ్గిందని.. దానివల్ల ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ను 23%కి మించి ఇవ్వలేకపోతున్నామని సీఎం ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు అర్థం చేసుకోవాలని కోరారు. 

ఉద్యోగుల మనోభావాలను సీఎం గౌరవించారు
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల మనోభావాలను సీఎం గౌరవించి.. సమస్యలను సానుకూలంగా పరిష్కరించినందుకు కృతజ్ఞతలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించినంత మేరకు సీఎం చేయగలిగినంత చేశారు. ఫిట్‌మెంట్‌ మినహా మిగతా సమస్యలను పరిష్కరించారు. భవిష్యత్‌లో ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చించి.. పరిష్కరించడానికి మంత్రుల కమిటీని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తామని చెప్పడం అభినందనీయం. మేము మంత్రుల కమిటీతో చర్చించేందుకు అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో కలిసి కమిటీని ఏర్పాటు చేస్తాం. ప్రతి నెలా ఒక రోజున ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై.. సమస్యలపై చర్చిస్తానని సీఎం చెప్పారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే నిర్ణయాల్లో సంఘాల నేతలకు భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు. మంత్రుల కమిటీ సిఫార్సులను ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆమోదించి.. ఇప్పుడు భిన్నంగా మాట్లాడటం తగదు. 
                                                      – బొప్పరాజు వెంకటేశ్వర్లు, రెవెన్యూ సర్వీసెస్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు

సీఎం చేయగలిగినంత చేశారు..
గత నెల 7న సీఎం వైఎస్‌ జగన్‌ పీఆర్సీ ప్రకటన చేశాక ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు ఉద్యమం చేయడం వెనుక ఆవేదనను అర్థం చేసుకున్నందుకు సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు. పీఆర్సీ సాధన సమితితో చర్చించి.. మంత్రుల కమిటీ చేసిన సిఫార్సులను సీఎం ఆమోదించారు. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు పెంచారు. అడిషనల్‌ క్వాంటమ్‌ పెన్షన్‌ ఇచ్చేందుకు అంగీకరించారు. రూ.5,400 కోట్లకుపైగా ఐఆర్‌ రికవరీని రద్దు చేశారు. సీపీఎస్‌ రద్దుకు మార్చి 31 నాటికి రోడ్‌ మ్యాప్‌ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడంపై స్పష్టత ఇచ్చారు.
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులు 

ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు చర్చించేందుకు మంత్రుల కమిటీని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి నెలా ఒక రోజు ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమవుతానని సీఎం చెప్పారు. కరోనా మహమ్మారి ప్రభావం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్లే ఉద్యోగులు ఆశించిన మేరకు ప్రయోజనం చేకూర్చలేకపోతున్నానని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించిన మేరకు ఉద్యోగులకు సీఎం వైఎస్‌ జగన్‌ చేయగలిగినంతా చేశారు. మంత్రుల కమిటీ సిఫార్సులకు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆమోదం తెలిపి, సంతకాలు కూడా చేసి.. ఇప్పుడు భిన్నంగా మాట్లాడటం సరి కాదు. కష్టకాలంలోనూ సమస్యలను సానుకూలంగా పరిష్కరించిన అంశాన్ని  గుర్తించాలి.               
                                               –బండిశ్రీనివాసరావు,ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు, పీఆర్సీ సాధన సమితి నేత

Published date : 07 Feb 2022 03:38PM

Photo Stories