Skip to main content

Microsoft: ప్రపంచంలోనే అతి పెద్దడేటా సెంటర్ మన హైదరాబాద్‌లనే.. ప్రత్యక్షంగా పరోక్షంగా 15 లక్షల మందికి..

టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. అమెరికా వెలుపల అతి పెద్ద డేటాసెంటర్‌ని ఇండియాలో నెలకొల్పేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.
microsoft data center
microsoft data center in hyderabad

ఈ డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభిస్తామని మైక్రోసాఫ్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌ అనంత్‌ మహేశ్వరి 2022 మార్చి 7న ప్రకటించారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుకు సంబంధించి ఇటీవల కాలంలో వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా వాటిని నిజం చేస్తూ ఈ సంస్థ నుంచి ప్రకటన వెలువడింది. 

2025 నాటికి..
ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌కి పునే, ముంబై, చెన్నైలలో డేటా సెంటర్లు ఉన్నాయి. వీటికి అదనంగా నాలుగో డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో స్థాపించనున్నారు. 2025 నాటికి తొలి దశ ప్రారంభం అవుతుంది. అనంతరం దశల వారీగా విస్తరిస్తూ పోతామని అనంత్‌ మహేశ్వరి తెలిపారు. ఈ డేటా సెంటర్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే అమెరికాలోని రేమండ్‌లో ఉన్న డేటాసెంటర్‌ కంటే పెద్దది అవుతుందన్నారు.

ప్రత్యక్షంగా పరోక్షంగా 15 లక్షల మందికి..

Jobs


మైక్రోసాఫ్ట్‌ ఇండియాలో పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2016 నుంచి 2020 వరకు మైక్రోసాఫ్ట్‌ ఇండియా నుంచి 9.5 బిలియన్‌ డాలర్ల రెవెన్యూ వచ్చింది. దీని వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 15 లక్షల మందికి ఉపాధి లభించింది. ఇందులో ఐటీ సెక్టార్‌లో కొత్తగా 1.69 లక్షల మందికి కొలువులు వచ్చాయి.

50 ఎకరాల్లో రూ.15 వేల కోట్ల పెట్టుబడితో..
రాష్ట్ర ఐటీ రంగానికి మరింత ఊపు రానుంది. డేటా సెంటర్ల రంగంలో దేశంలోని ప్రధాన నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్‌లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ ముందుకు వచ్చింది. శంషాబాద్‌ ప్రాంతంలో 50 ఎకరాల్లో రూ.15 వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్‌ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్‌ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్‌ మధ్య కొన్ని నెలల పాటు జరిగిన సంప్రదింపులు కొలిక్కి వచ్చాయి.  

పెట్టుబడులకు గమ్యస్థానంగా..
మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్‌ ద్వారా తొలి విడతలో సుమారు 300 మంది నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయని సమాచారం. అయితే డేటా సెంటర్‌ సామర్ధ్యం, విస్తీర్ణం తదితర పూర్తి వివరాలను వచ్చే నెలలోనే మైక్రోసాఫ్ట్‌ ప్రకటిస్తుంది. ఐటీ, ఫార్మా రంగాల్లో ఇప్పటికే సత్తా చాటుతున్న హైదరాబాద్‌ క్రమంగా ఆధునిక సాంకేతిక పెట్టుబడులకు కూడా గమ్యస్థానంగా మారుతోంది. ఇప్పటికే క్లౌడ్‌ కంప్యూటింగ్, స్పేస్‌ టెక్నాలజీతో పాటు ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), బ్లాక్‌చెయిన్‌ వంటి ఆధునిక ఐటీ సాంకేతికతలో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్న సంగతి తెలిసిందే. 

సుమారు లక్షా 11 వేల కోట్ల రూపాయలకు..

microsoft data center


ప్రస్తుతం భారత్‌లో 57.8 కోట్ల మొబైల్‌ ఫోన్ల వినియోగదారులు ఉండగా, మొబైల్‌ ఫోన్లు, వైర్‌లెస్‌ డేటా వినియోగంలో 20 శాతం వార్షిక వృద్ధిరేటు నమోదవుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో డేటా సెంటర్ల రంగం మార్కెట్‌ ఈ ఏడాది చివరి నాటికి సుమారు లక్షా 11 వేల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా. డేటా సెంటర్ల రంగంలో ఇప్పటికే ఏడు శాతం వాటా కలిగి ఉన్న తెలంగాణ, వచ్చే ఏడాది చివరి నాటి 9.5 శాతం వాటా సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఫ్లిప్‌కార్ట్, కంట్రోల్‌ ఎస్, నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ), ఎస్టీ టెలీమీడియా వంటి సంస్థలు ఇప్పటికే డేటా సెంటర్లను ఏర్పాటు చేశాయి. 

నిర్మాణంలో అమెజాన్‌.. 
మరోవైపు హైదరాబాద్‌లో రూ.20,761 కోట్లతో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌) 2020 నవంబర్‌లో ప్రకటించింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అమెజాన్‌ డేటా సెంటర్లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించే అవకాశముంది. మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు తర్వాత రాష్ట్రానికి పెట్టుబడులు మరింత ఊపందుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అన్ని విధాలా అనుకూలంగా హైదరాబాద్‌..
ప్రభుత్వ సానుకూల విధానాలు, ప్రోత్సాహకాలు, ఐటీ నిపుణుల లభ్యత, భౌగోళిక పరిస్థితులు హైదరాబాద్‌లో డేటా సెంటర్ల ఏర్పాటుకు అత్యంత అనుకూలంగా మారాయి.
                                                    – జయేశ్‌ రంజన్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి

డేటా సెంటర్‌ అంటే.. ?

Data


డేటా సెంటర్లలో సమాచారాన్ని భద్రపరుస్తారు. ఐటీ కార్యకలాపాలు, వ్యాపార, వాణిజ్య కార్యకలా పాల నిర్వహణలో ఈ సెంటర్ల పాత్ర కీలకం. మొబైల్‌ డేటా వినియోగం పెరుగుతున్న కొద్దీ వినియోగదారుల సమాచారాన్ని భద్ర పరచడంలో ఐటీ రంగంలో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీ ప్రాధాన్యత పెరుగు తోంది. క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో విని యోగదారుల సమాచారాన్ని భద్రపరిచేం దుకు భారీ ఎత్తున డేటా సెంటర్ల అవసరం పెరుగుతోంది. దీంతో ఈ సెంటర్ల నిర్మాణానికి ఐటీ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. భారీ విస్తీర్ణంలో నిర్మించే డేటా సెంటర్ల నిర్మాణం, నిర్వహణ కూడా ప్రస్తుతం ఒక పెట్టుబడి, ఉద్యోగాల కల్పనకు అవకాశమున్న రంగంగా మారింది.

Published date : 07 Mar 2022 07:00PM

Photo Stories