New Agricultural Degree College: కొత్తగా వ్యవసాయ డిగ్రీ కళాశాల
త్రిపురారం: మండలంలోని కంపాసాగర్ గ్రామ పంచాయతీ పరిధిలో కొత్తగా వ్యవసాయ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే కంపాసాగర్‌లో 2007 నుంచి వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లొమా కళాశాల కొనసాగుతుండగా ఇప్పడు వ్యవసాయ డిగ్రీ కళాశాల ఏర్పాటు కానుండడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ భూమిలోనే ఏర్పాటు చేసే అవకాశం
కంపాసాగర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 125, 126లో సుమారు 305 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో గతంలోనే 25 ఎకరాల భూమిని లెదర్ డెవలప్‌మెంట్ ఇండ్రస్టీయల్ కార్పొరేషన్‌కు కేటాయించారు.
మరో 15 ఎకరాలకుపైగా బాబుసాయిపేట, కంపాసాగర్, త్రిపురారం గ్రామాలకు శ్మశాన వాటికలకు, మరికొంత 6.30 ఎకరాల భూమిని త్రిపురారం డంపింగ్ యార్డ్‌కు, నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాం నిర్మాణానికి, తెలంగాణ మోడల్ స్కూల్‌కు కేటాయించారు.
ఈ ప్రభుత్వ భూమిలోనే 2005లో 281 ఎకరాల్లో వ్యవపాయ పరిశోధన స్థానం ఏర్పాటైంది. ఇందులోనే సుమారు 50 ఎకరాల భూమిని 2011లో కృషి విజ్ఞాన కేంద్రం కంపాసాగర్‌కు కేటాయించారు. ప్రస్తుతం సుమారు 230 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండడంతో ఇందులో వ్యవసాయ పరిశోధన స్థానం హెడ్ లింగయ్య ఆధ్వర్యంలో నూతన వరి వంగడాల ఉత్పత్తి, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టం, రైతులకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
అయితే వ్యవసాయ డిగ్రీ కళాశాలకు ఐసీఆర్ నామ్ ప్రకారం సుమారు 50 ఎకరాల భూమి అవసరం ఉండడం.. ఇక్కడ ప్రభుత్వ భూమి ఉండడంతో ఇక్కడే వ్యవసాయ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇక్కడే డిగ్రీ కళాశాల ఎందుకంటే..
2005వ సంవత్సరంలో కంపాసాగర్‌లో వ్యవసాయ పరిశోధన స్థానం ప్రారంభించి శాస్త్రవ్తేలు నూతన వరి వంగడాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇక్కడ తయారైన కొత్త వండగాలను ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తగా మార్కెటింగ్ చేస్తున్నారు.
వ్యవసాయ పరిశోధన స్థానంతో పాటు కృషి విజ్ఞాన కేంద్రం కూడా ఇక్కడే ఉంది. దీంతో కంపాసాగర్‌లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు పంటల సాగులో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. నూతన వంగడాల అభివృద్ధి జరగడంతో పాటు కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగే శిక్షణ కార్యక్రమాలు విద్యార్థులకు అందుబాటులో ఉండడం వల్ల తరగతి గది పాఠాలతో పాటు క్షేత్ర స్థాయిలో అభ్యసన కార్యక్రమాలను చేపట్టవచ్చనే ఉద్దేశంతో గతంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలోనే గతంలో కూడా ఇక్కడ వ్యవసాయ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్ ప్రభుత్వం భావించింది. కానీ, కార్యరూపం దాల్చలేదు. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక ఇక్కడే వ్యవసాయ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.