Treasury and Accounts: సాఫ్ట్‌వేర్ పొరపాట్లు.. ఉద్యోగుల పాట్లు
సాఫ్ట్‌వేర్ లోపాలు ఉద్యోగులకు శాపాలుగా మారాయి. నిధుల కొరతతో ప్రతి రూపాయి విడుదల కోసం ఆర్థికశాఖ ఆచీతూచి నిర్ణయాలు తీసుకుంటుంటే ఇక్కడ మాత్రం రూ.12 కోట్లను పెన్షనర్ల అకౌంట్లలో జమచేసింది. ప్రతినెలా వారికి ఇవ్వాల్సిన పెన్షన్ కంటే అధికంగా చెల్లించింది. ఇందుకు ప్రధానకారణం కాలంచెల్లిన సాఫ్ట్‌వేర్ కారణమని తేల్చారు.
పెన్–13 నుంచి ఇంపాక్ట్ సాఫ్ట్‌వేర్‌గా మార్పు జరిగిన అనంతరం పెన్షన్ డేటాలో లోపాలున్నాయని పలు జిల్లాల నుంచి డైరెక్టరేట్‌కు ఫిర్యాదులొచ్చాయి. అయినా సరిదిద్దకపోవటం వల్ల ఒక నంబర్ టైప్ చేస్తే, మరో నంబర్ అటోమెటిక్‌గా అప్‌లోడ్ కావటంతో చాలాకాలంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పెన్షనర్ల ఖాతాలకు వాస్తవ పెన్షన్ కంటే ఎక్కువగా చెల్లించారు. ప్రస్తుతం వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ను థర్డ్‌పార్టీ తనిఖీ లేకుండానే నేరుగా తమపై రుద్దారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
క్రమశిక్షణాచర్యలంటూ సిబ్బందికి హెచ్చరికలు:
తాము చెల్లించిన ఎక్కువ మొత్తాన్ని తిరిగి చెల్లించాలంటూ తాజాగా ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ అధికారులు పెన్షనర్లకు నోటీసులు పంపుతున్నారు. మరోవైపు అధికచెల్లింపులు చేసిన సిబ్బందిపై క్రమశిక్షణాచర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తుండటంతో ట్రెజరీస్ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. లోపాలు, అధిక చెల్లింపుల విషయాన్ని తాము అనేకమార్లు డైరెక్టరేట్ దృష్టికి తీసుకుపోయినా, కనీస నివారణచర్యలు తీసుకోకుండా తమపై క్రమశిక్షణాచర్యలు తీసుకోవాలని చూస్తే ఆందోళన చేస్తామని ట్రెజరీస్ అకౌంట్స్ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. పెన్షనర్లు కూడా తాము ఇప్పుడు చెల్లించలేమన్న నిస్సహాయతను వ్యక్తం చేస్తుండటంతో డైరెక్టరేట్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.