Skip to main content

Fee Reimbursement: నత్తనడకన ఉపకార దరఖాస్తులు

సాక్షి, హైదరాబాద్‌: పోస్టుమెట్రిక్‌ విద్యార్థులకు అమలు చేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియకు స్పందన కరువైంది.
Sluggish grant applications, Stipends, FeeReimbursement, EducationSchemes

ఈ పథకాల కింద దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించి రెండు నెలలు దాటినా ఇప్పటివరకు కనీసం పావువంతు మంది విద్యార్థులు కూడా ఈపాస్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదని తెలుస్తోంది. కోర్సు పూర్తయ్యే వరకు విద్యార్థులు ఏటా క్రమం తప్పకుండా ఈ దరఖాస్తులు సమర్పించడం తప్పనిసరి.. కాలేజీ యాజమాన్యం సైతం చొరవ తీసుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తుల నమోదు ప్రక్రియను పూర్తి చేయించాలి.

2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి 12.65 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకుంటారని సంక్షేమ శాఖలు అంచనా వేశాయి. కానీ ఇప్పటివరకు 2.5 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. అధికారిక అంచనాతో పోలిస్తే 20 శాతం మాత్రమే దరఖాస్తులు సమర్పించడం గమనార్హం. 

చదవండి: Samineni Koteswara Rao: ప్రభుత్వ విద్యార్థులకు ఉపకార వేతనాలు

వచ్చే నెలాఖరుతో ముగియనున్న గడువు..: ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు డిసెంబర్‌ నెలాఖరుతో ముగియనుంది. దరఖాస్తు ప్రారంభ సమయంలోనే నాలుగు నెలల పాటు గడువు ఇవ్వనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. గడువు పెంపు ఉండదని స్పష్టం చేసింది. ఈమేరకు కాలేజీ యాజమాన్యాలకు సర్క్యులర్లు సైతం జారీ చేసింది.

విద్యార్థులు ఈపాస్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా చొరవ తీసుకోవాలని కాలేజీ యాజమాన్యాలకు సూచించింది. కానీ క్షేత్రస్థాయిలో కాలేజీ యాజమాన్యాలు కనీసం పట్టించుకోవడం లేదు. ఒక విద్యార్థి కోర్సు ముగిసే వరకు ప్రతి సంవత్సరం ఈపాస్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.

కొత్తగా కోర్సులో చేరే విద్యార్థి ఈపాస్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తుకు సంబంధించిన వివరాలను సమర్పించాలి. ఇప్పటికే కోర్సులో చేరి తదుపరి సంవత్సరం చదివే విద్యార్థి రెన్యువల్‌ కేటగిరీలో దరఖాస్తు సమర్పించాలి. విద్యార్థి వివరాలు కాలేజీ యాజమాన్యం వద్ద అందుబాటులో ఉండడంతో యాజమాన్యమే ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని నియమించి దరఖాస్తు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయవచ్చు. కానీ యాజమాన్యాలు అలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో దరఖాస్తు ప్రక్రి య నెమ్మదిగా సాగుతోంది. గతేడాది దరఖాస్తు ప్రక్రియను దాదాపు ఏడు నెలల పాటు కొనసాగించారు. గడువు ముగిసినప్పటికీ పూర్తిస్థాయిలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘా ల కోరిక మేరకు ప్రభుత్వం గత ఏడాది మూడు సార్లు గడువును పొడిగించింది.

కానీ ఈ ఏడాది పొడిగింపు ప్రక్రియ ఉండదని, నిర్దేశించిన సమయానికి దరఖాస్తు సమర్పించాలని సూచించినప్పటికీ స్పందన అంతంతమాత్రంగానే ఉంది. మరో నెలన్నరలో దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియను గడువులోగా పూర్తి చే యాలంటూ తాజాగా జిల్లాస్థాయిలో సంక్షేమ శాఖల అధికారులు కాలేజీ యాజమాన్యాలకు నోటీసులు ఇస్తున్నారు. 
 

Published date : 11 Nov 2023 11:52AM

Photo Stories