Skip to main content

Integrated Education: సమ్మిళిత విద్యకు శ్రీకారం...విద్యార్థులందరికీ ఉపకారం

శేఖర్, గోపాల్‌ ఇద్దరూ ఒకే పాఠశాలలో 6వ తరగతి విద్యార్థులు. శేఖర్‌ చదువులో ముందంజలో ఉంటే గోపాల్‌కు వచ్చేవి అత్తెసరు మార్కులే.
Integrated Education
సమ్మిళిత విద్యకు శ్రీకారం...విద్యార్థులందరికీ ఉపకారం

ఇద్దరికీ పాఠాలు చెప్పేది ఒకే టీచర్‌ అయినా వారిలో ప్రమాణాలు వేర్వేరుగా ఉంటున్నాయి. ఇలా వెనుకంజలో ఉండే విద్యార్థులను గతంలో పట్టించుకోకపోవడంతో వారు పైతరగతులకు వెళ్లేకొద్దీ మరింత వెనుకబడిపోతున్నారు. ఇప్పుడు వెనుకబడిన విద్యార్థులను ఇతర విద్యార్థులతో సమానంగా తీర్చిదిద్దేందుకు విద్యాశాఖ ప్రత్యేకంగా సమ్మిళిత విద్యాప్రణాళికను అమలు చేయనుంది. ప్రైవేటు కార్పొరేట్‌ పాఠశాలల్లో బాగా చదివే విద్యార్థులను ఒక సెక్షన్లో పెట్టి వారిని మరింతగా సానబెడుతూ ఇతర విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా అక్కడి విద్యార్థుల్లో సమగ్రాభివృద్ధి కొరవడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో బాగా చదివే వారిని ప్రోత్సహిస్తూనే వెనుకబడిన వారిని ముందుకు తెచ్చేందుకు సమ్మిళిత విద్యావిధానం ద్వారా ప్రత్యేక కార్యాచరణను చేపడుతున్నారు. 

సర్వేలు ప్రామాణికంగా.. 
విద్యార్థులు ఏయే అంశాల్లో వెనుకబడి ఉంటున్నారో వివిధ సర్వే నివేదికల్లోని అంశాలు ఇప్పటికే వెల్లడిస్తున్నాయి. నేషనల్‌ అచీవ్‌మెంటు సర్వే (ఎన్‌ఏఎస్‌ – నాస్‌), ఆంధ్రప్రదేశ్‌ స్టూడెంట్‌ లెర్నింగ్‌ అచీవ్‌మెంటు సర్వే (ఏపీఎస్‌ఎల్‌ఏఎస్‌ – ఏపీ స్లాస్‌), యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌ (ఏఎస్‌ఈఆర్‌ – అసర్‌) విభాగాలు 2012, 2015, 2016, 2017, 2018 విద్యాసంవత్సరాల్లో వేర్వేరు తరగతుల్లో విద్యాప్రమాణాలపై సర్వేలు నిర్వహించాయి. వీటితోపాటు విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేసేముందు విద్యాశాఖ బేస్‌లైన్‌ అసెస్‌మెంటు టెస్టు నిర్వహిస్తోంది. దీనిద్వారా కింది తరగతిలోని అంశాల్లో విద్యార్థులు ఎక్కడ వెనుకబడి ఉన్నారో గుర్తించి పైతరగతుల ప్రారంభంలో వాటిని సరిచేసేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. వీటితోపాటు విద్యాసంవత్సరంలో విద్యార్థుల వెనుకబాటును ఎప్పటికప్పుడు గుర్తించి అందుకు కారణాలను కూడా విశ్లేషించి వాటిపై చర్యలు తీసుకోవడం ద్వారా వారిని కూడా ఇతర విద్యార్థులతో సమానంగా తీర్చిదిద్దనున్నారు. 

వెనుకబడిన విద్యార్థుల వర్గీకరణ 
వెనుకబాటుకు గురయ్యే విద్యార్థులను 10 విభాగాలుగా వర్గీకరించి వారిని ఇతర విద్యార్థులతో సమానంగా తీర్చిదిద్దనున్నారు. ఇందుకు పాఠశాలల స్థాయిలోనే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకుంటారు.

వెనుకంజలో ఉన్న విద్యార్థుల విభాగాలు..

  1. అభ్యసనంలో వెనుకబడిన పిల్లలు: కొందరు పిల్లలు కూడికలు, తీసివేతలు, గుణకారం సరిగా రాకపోవడంతో అభ్యసనంలో వెనుకబడుతున్నారు.
  2. ప్రజ్ఞావంతులైన పిల్లలు: ఉపాధ్యాయుడు సగటు విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని పిల్లలందరికీ అభ్యసన ప్రక్రియలను కలి్పస్తారు. ప్రతిభావంతులైన పిల్లలు వీటిని తొందరగా పూర్తిచేసి మిగతా పిల్లలు పూర్తిచేయడం కోసం వేచి చూస్తుంటారు. క్రమేణా వీరు నిరుత్సాహానికి గురై మిగతా పిల్లలకు దూరంగా ఉండే ప్రమాదం ఏర్పడుతోంది.
  3. తరచుగా బడికి గైర్హాజరయ్యే పిల్లలు: కొందరు పిల్లలు బడికి తరచు గైర్హాజరు కావడం వల్ల అభ్యసన కృత్యాల్లో ఉత్సాహంగా పాల్గొనలేకపోతున్నారు. ముందురోజు ఏం జరిగిందో వీరికి తెలియదు. ఫలితంగా తరగతిగదిలో మౌనంగా కూర్చొంటారు. దీంతో మరింత వెనుకబడి క్రమంగా బడికి దూరమయ్యే ప్రమాదం ఉంది.
  4. బహుభాషా నేపథ్యంగల పిల్లలు: కొన్ని ఆవాస ప్రాంతాలలో వేర్వేరు భాషలు మాట్లాడే కుటుంబాలుంటాయి. మాతృభాష, బోధనభాష వేర్వేరుగా ఉండడం వల్ల భావనలు, పదజాలం అర్థం చేసుకోవడంలో అభ్యసన సమస్యలు ఎదురవుతుంటాయి.
  5. వలస కుటుంబాల పిల్లలు: కొందరు తరచుగా వలస వెళ్లి పిల్లల పట్ల చిన్న చూపు ప్రదర్శిస్తుంటారు. ఉపాధ్యాయులు సైతం.. వీరు కొద్దిరోజులే ఉంటారు.. అనే భావనతో వీరి అభ్యసనం, చదువు, పరీక్షలు, నోటుపుస్తకాలు మొదలైన వాటిపై శ్రద్ధ చూపరు. ఫలితంగా వీరు అసంతృప్తితో ఉండి చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంది.
  6. బాలికలు: చాలా పాఠశాలల్లో బాలికలను కొన్ని పనులకే పరిమితం చేస్తున్నారు. కొన్ని పనులను వీరు చేయలేరు అని భావిస్తుంటారు. ప్రయోగాల నిర్వహణ, ప్రాజెక్టులు, నివేదికల రూపకల్పనలో బాలురనే ఎక్కువ భాగస్వాములను చేస్తుండడం వల్ల బాలికల్లో న్యూనతాభావం కలుగుతుంది. పలు సంప్రదాయ ఆంక్షల దృష్ట్యా బాలికల భాగస్వామ్యం క్రమేణా తగ్గిపోతోంది. ఈ రకంగా నిరుత్సాహానికి గురైన బాలికలు బడికి దూరమయ్యే ప్రమాదం ఉంది.
  7. భావోద్వేగ, ప్రవర్తన సమస్యలున్న పిల్లలు: కొందరు పిల్లలకు భావోద్వేగాలు అదుపులో ఉండకపోవడం వల్ల చిన్నచిన్న కారణాలతో విపరీతంగా కోపం తెచ్చుకోవడం, భయపడడం, ఏడవడం చేస్తుంటారు. ఆందోళన, ఒత్తిడికి గురవుతుంటారు. కొందరు పిల్లల ప్రవర్తన విచిత్రంగా, అసాధారణంగా ఉంటుంది. ఈ పిల్లలంటే మిగతా పిల్లలకు భయం. అందువల్ల తరగతి, పాఠశాల కార్యక్రమాలు, ఆటల్లో వీరిని చేర్చుకోవడానికి ఎవరూ ముందుకు రారు.
  8. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు: బుద్ధిమాంద్యం, వినికిడి లోపం, దృష్టిలోపం, సెరిబ్రల్‌ పాల్సీ, శారీరక వైకల్యం, అభ్యసన సమస్యలు.. ఇలా మొత్తం 21 వరకు సమస్యలున్నాయి. ఈ సమస్యలున్న పిల్లలు వ్యక్తిగత, జట్టు కృత్యాల్లో చురుగ్గా పాల్గొనలేరు. తోటి పిల్లలు, ఉపాధ్యాయుడి సహకారం లేకపోతే వీరు నేర్చుకోలేరు.
  9. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ ఆరోగ్య సమస్యలున్న పిల్లలు: పాఠశాల కార్యక్రమాలు, అభ్యసన ప్రక్రియల్లో తోటి పిల్లలు వీరి సహచర్యాన్ని కోరుకోకపోవడంతో వీరు పాఠశాలకు దూరం అయ్యే ప్రమాదం ఉంది.
  10. బడిలో చేరిన బాలకార్మికులు, గిరిజన, సంచార తెగల పిల్లలు: వయసు, భాష, అలవాట్లు, ఆచారాలు, వేషధారణలలో మిగతా పిల్లలకంటే భిన్నంగా ఉంటారు. వీరి నేపథ్యాన్ని, సంస్కృతిని అర్థం చేసుకోకపోతే, స్థాయికి తగిన అభ్యసన కృత్యాలు కలి్పంచకపోతే వారు బడికి దూరమయ్యే ప్రమాదం ఉంది.


విద్యార్థుల వెనుకబాటుపై సర్వేల నివేదికల ప్రకారం.. 
అసర్‌ నివేదిక 

  • 3వ తరగతి విద్యార్థుల్లో 22.4 శాతం మంది మాత్రమే చదవగలుగుతున్నారు.
  • 3వ తరగతి విద్యార్థుల్లో 38.4 శాతం మంది మాత్రమే గణితంలో తీసివేతలు చేయగలుగుతున్నారు.
  • 5వ తరగతి విద్యార్థులు 39.3 శాతం మంది మాత్రమే భాగాహారాలు చేయగలుగుతున్నారు.
  • 8వ తరగతి విద్యార్థుల్లో 52.4% మందికి గణితంలో డివిజన్‌ అంశాలు రావు.

ఏపీ స్లాస్‌ నివేదిక (2018) 

  • విద్యార్థుల్లో పఠన, గ్రహణ నైపుణ్యాలు చాలా అధ్వానంగా ఉన్నాయి.
  • భాషలకు సంబంధించిన సామర్థ్యాల విషయంలో 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థుల్లో ప్రమాణాలు 63.5 శాతం నుంచి 49.40 శాతం వరకు అధోపతనంలో ఉన్నాయి.
  • మేథమెటిక్స్‌లో ఇవే తరగతుల్లో 69.55% నుంచి 39.30% మేర దిగజారి ఉన్నాయి.


నాస్‌ నివేదిక 
పదో తరగతిలోని విద్యార్థులు భాషల్లో
43 శాతం మంది, ఆంగ్లంలో 43 శాతం మంది, మేథమెటిక్స్‌లో 41 శాతం మంది, సైన్సులో 41 శాతం మంది, సోషల్‌ స్టడీస్‌లో 43 శాతం మంది మాత్రమే కొంతమేర సామర్థ్యాలను సాధించి ఉన్నారు. వారిలోనూ ఏమేరకు సామర్థ్యాలు ఉన్నాయో సర్వే తేల్చింది.

 

సబ్జెక్టు

0–35%

36–50%

మేథ్స్‌

51.05

22.36

సైన్సు

42.42

33.69

సోషల్‌ స్టడీస్‌

36.16

34.72

ఇంగ్లిష్‌

41.94

24.86

లాంగ్వేజ్‌

15.83

26.37

 

 

అందరికీ సమానమైన విద్య 
పాఠశాలలో చేరిన విద్యార్థులందరికీ వివక్ష లేకుండా మానసిక, అంగవైకల్యం, ప్రత్యేక అవసరాలుగల పిల్లలు, సామాజికంగా వెనుకబడినవారు, పట్టణాలకు దూరంగా ఉండే వివిధ వర్గాల పిల్లలు.. ఇలా అందరికీ సమానమైన నాణ్యమైన విద్యను అందించడమే సమ్మిళిత విద్య ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషల్‌ ఇన్‌స్ట్రక్టర్లను నియమించింది. వీరు పాఠశాల సముదాయం కేంద్రంగా పనిచేస్తారు. అవసరమైన వారికి ఇళ్లకు వెళ్లి విద్యను అందించడంతోపాటు వారి వైకల్యాలను అధిగమించి వారి పనులు చేసుకోగలిగేలా తగిన శిక్షణ ఇస్తారు. 
– డాక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి, డైరెక్టర్, ఎస్సీఈఆర్టీ

Published date : 03 Sep 2021 04:58PM

Photo Stories