‘పదవీ విరమణ వయసు పెంపును మాకూ అమలు చేయండి’
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంపును ఎయిడెడ్, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ విద్యాసంస్థల్లోని సిబ్బందికి కూడా వర్తింపచేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, కె.కులశేఖరరెడ్డి ప్రభుత్వానికి విన్నవించారు.
ఈ మేరకు ఏప్రిల్ 21న పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌కు వినతిపత్రం అందించినట్లు తెలిపారు. అలాగే బదిలీల్లో తీవ్ర శారీరక వైకల్యం కల వారికి ప్రాధాన్యమివ్వాలని కోరారు.
ఒప్పంద ఉద్యోగుల సర్వీసు పొడిగింపుపై హర్షం
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ డిపార్టుమెంట్లలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల సర్వీసును 2023, మార్చి 31 వరకు పొడిగిస్తూ జీవో నం.94ను ప్రభుత్వం విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. అలాగే, ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు విద్యాశాఖలో అర్హులైన వివిధ ఉపాధ్యాయ, అధ్యాపకులను వెంటనే రెగ్యులర్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
Published date : 22 Apr 2022 03:07PM