MBBS Education: పల్లె నాడి పట్టే మెడికో

- ఎంబీబీఎస్‌లో గ్రామాల దత్తతకు ఎన్‌ఎంసీ సిఫార్సు
- సిలబస్‌లో ప్రత్యేకంగాపాఠ్యాంశాలు చేర్చాలని కేంద్రానికి సూచన
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ కోర్సులో గ్రామాలు/ప్రజల దత్తత కార్యక్రమాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) సిఫా ర్సు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యారోగ్య సౌకర్యాలను మరింతగా అందుబాటులోకి తీసుకురావ డం, అదే సమయంలో వైద్య విద్యార్థుల్లో వివిధ వ్యాధులు, క్షేత్రస్థాయి అంశాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొంది. సమాజంలో ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపర్చడానికి ఇది తోడ్పడుతుందని స్పష్టం చేసింది. ఈ అంశంపై ఎన్‌ఎంసీకి చెందిన యూజీ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ (యూజీఎంఈడీ) ఒక నివేదికను రూపొందించింది. అందులో కీలక సిఫార్సులు చేసింది. కేంద్ర ప్రభుత్వం దీనిని ఆమోదిస్తే త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉండనుంది.
క్షేత్రస్థాయికి వెళ్లేలా..
ఎన్‌ఎంసీ సిఫార్సుల ప్రకారం.. ఒక్కో బ్యాచ్ ఎంబీ బీఎస్ విద్యార్థులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవా లి. బ్యాచ్‌లోని ఒక్కో విద్యార్థికి ఐదు నుంచి ఏడు కుటుంబాలను కేటాయిస్తారు. వారు ఆ కుటుంబా ల్లోని వారి ఆరోగ్య పరిస్థితులను గుర్తించి, ఏవైనా సమస్యలు వస్తే ప్రాథమిక సలహా ఇవ్వాలి. ప్రతి 25 మంది విద్యార్థుల బృందాన్ని పర్యవేక్షించడానికి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటారు. వారికి స్థానిక ఆశా కార్యకర్తల సాయం అందించేలా ఏర్పాటు చేస్తారు. విద్యార్థులు రెండు వారాలకోసారి ఆయా గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది. కోర్సు తొలి ఏడాదిలో కనీసం 10 సార్లయినా గ్రామాలను సందర్శించాలి. వారు గ్రామా ల్లో గడిపే సమయాన్ని కోర్సులో భాగంగానే పరిగణిస్తారు. విద్యార్థులకు ఆచరణాత్మక శిక్షణ అందేలా పాఠ్యాంశాలు, సిలబస్‌ను రూపొందిస్తారు. ఇక ఈ దత్తత కార్యక్రమంతో విద్యార్థులు క్షేత్రస్థాయికి వెళతారు. ఎంబీబీఎస్ తొలి ఏడాది కోర్సు నుంచే ప్రజలతో మమేకమవుతారు.
Also read: Swedish Audio Brand: సోలార్ విద్యుత్ ఆధారిత హెడ్‌ఫోన్స్‌ను రూపొందించిన తొలి సంస్థ?
గ్రామాల ఆరోగ్యానికి..
గ్రామాలను దత్తత తీసుకోవడం వల్ల ఎంబీబీఎస్ విద్యార్థులు క్షేత్రస్థాయిలో స్వయంగా ప్రజల ఆరో గ్య సమస్యలు, వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి వీలుంటుంది. ఇదివారిలో సామాజిక బాధ్యత, అవగాహన పెరగడానికి తోడ్పడనుంది. సరైన ఆహార అలవాట్లు, వ్యక్తిగత పరిశుభ్రత, అనారోగ్యం బారినపడకుండా తీసుకోవాలి్సన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించే వీలు కలుగుతుంది. ఒక్కో విద్యార్థికి ఏడు కుటుంబాల వరకు బాధ్యత ఇవ్వడం వల్ల.. ఆయా కుటుంబాల్లోని వారిలో ఎవరికైనా, ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. తక్షణమే టెలి మెడిసిన్ పద్ధతిలో అవసరమైన వైద్య సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. అవసరమైతే తాము చదివే మెడికల్ కాలేజీకి రమ్మనడానికి, ఏదైనా ఆస్పత్రికి రిఫర్ చేయడానికి వీలుంటుంది. ఇలా మరెన్నో ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దత్తత తీసుకున్న గ్రామాలకు పదుల సంఖ్యలో వైద్య విద్యార్థులు వచ్చిపోవడం, సలహాలు సూచనలు ఇవ్వడం వల్ల ఆయా గ్రామాలు ఆరోగ్యంగా మారుతాయని చెప్తున్నారు.
Also read: NEET 2021: కౌన్సెలింగ్ విధివిధానాలు.. అవసరమైన సర్టిఫికెట్లు.. సీట్లు తదితర వివరాలు..
33 కాలేజీలు.. 20 వేల మంది విద్యార్థులు
రాష్ట్రంలో ప్రస్తుతం 10 ప్రభుత్వ, 23 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మొత్తంగా 165 బ్యాచ్‌ల్లో కలిపి దాదాపు 20 వేల మంది ఎంబీబీఎస్ విద్యార్థులు ఉంటారు. వీరితోపాటు ఆయుష్, డెంటల్ విద్యార్థులకు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ప్రవేశపెడితే మరో ఐదారు వేల మంది అవుతారు. ఇంతమందికి గ్రామాల దత్తత బాధ్యత ఇస్తే ప్రజలకు మంచి ఆరోగ్య సేవలు అందుతాయని.. విడతల వారీగా కొత్త గ్రామాల్లోనూ వైద్య చైతన్యం వస్తుందని నిపుణులు చెప్తున్నారు.
స్థానిక వ్యాధులను గుర్తించే వీలు
‘‘ఎంబీబీఎస్ విద్యార్థులకు గ్రామాలను దత్తత ఇచ్చేలా పాఠ్యాంశాన్ని రూపొందిం చడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఎన్‌ఎంసీ సిఫార్సుతో విద్యార్థులకు ప్రయోజనం కలగడమే కాకుండా.. గ్రామాల్లోని కుటుంబాలకు వైద్య సలహాలు అందడానికి తోడ్ప డుతుంది. స్థానికంగా వచ్చే వ్యాధులను గుర్తించడానికి వీలవుతుంది. క్షేత్రస్థాయిలో ఎంబీబీఎస్‌లోనే ఇలాంటి పరిశీలన వల్ల వైద్య విద్యార్థుల్లో సామాజిక, ఆర్థిక, వైద్య, ఆరోగ్యపరమైన అంశాలు అభివృద్ధి చెందుతాయి.
– డాక్టర్ హెప్సిబా, మెడికల్ ఆఫీసర్, హైదరాబాద్
Click here for more Education News