Skip to main content

Indian Army Lieutenant Mudda Abhishek Reddy Success Story : ఒకే ఒక్క‌డు.. చిన్న వ‌య‌స్సులోనే లెఫ్ట్‌నెంట్ హోదా.. తొలి ప్ర‌య‌త్నంలోనే గ్రాండ్‌ స‌క్సెస్..

దేశం కోసం పనిచేసే అవ‌కాశం రావడం చాలా త‌క్కువ మందికే ఉంటుంది. ఈ ఉద్యోగంలో ఉన్న తృప్తి దేనిలోనూ ఉండదు. అది కూడా ఇండియ‌న్ ఆర్మీలో క‌మిష‌న్డ్ ఆఫీస‌ర్‌గా అత్యున్న స్థాయి అయితే ఆ ఆనందాలకు అవ‌ధులే ఉండ‌వ్‌.
Satisfaction in Service, Limitless Joy,ndian Army Lieutenant Abhishek Reddy Success Story Telugu News, in
Indian Army Lieutenant Mudda Abhishek Reddy Success Story

ఇందులో సంతోష‌మే.. కాదు క‌ష్టాలు కూడా ఉంట‌య్‌. తమ బతుకునే ఫణంగా పెట్టి తన కోసం, తన కుటుంబం కోసం కాకుండా దేశం కోసం ఉద్యోగం చేస్తుంటారు కొందరు. పుట్టిన ఊరికి, కన్నవారికి దూరంగా.. ఎండా, వానను లెక్క చేయకుండా చలికి వణుకుతూ అనుక్షణం ఎదురయ్యే ప్రమాదాలతో సహజీవనం చేస్తూ దేశసేవకు తమ జీవితాలను అంకితం చేస్తుంటారు మ‌న వీర సైనికులు. వారే మన భారత వీర‌ సైనికులు. దేశ ర‌క్ష‌ణ‌లో త్యాగానికి నిదర్శనంగా నిలుస్తున్న నిజమైన దేశ భక్తులు వీరే. స‌రిగ్గా ఇదే ఆలోచ‌న‌తో.. దేశానికి సేవ చేయాల‌నే ఒక బ‌ల‌మైన సంక‌ల్పంతో ఇండియ‌న్ ఆర్మీలో క‌మిష‌న్డ్ ఆఫీస‌ర్‌గా ప్ర‌వేశించారు.. లెఫ్ట్‌నెంట్ హోదా సాధించిన ముద్ద‌ అభిషేక్ రెడ్డి.

11 నెల‌ల పాటు క‌ఠోర‌ సైనిక శిక్ష‌ణ పొంది..
అభిషేక్‌రెడ్డి.. దేశం కోసం సేవ చేయ‌డం ఒక వ‌రం అంటున్నాడు. అలాగే ఇలాంటి మంచి అవ‌కాశం నాకు ద‌క్కినందుకు చాలా సంతోషంగా ఉందంటున్నాడు. ఈయన తొలి ప్ర‌య‌త్నంలోనే జాతీయ స్థాయిలో యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించే కంబైడ్ డిపెన్స్ స‌ర్వీస్ (CDS) ప‌రీక్ష క‌ష్ట‌మైన స‌ర్వీస్ సెల‌క్ష‌న్ బోర్డ్ ఇంట‌ర్వ్యూలో రెండో ర్యాంక్ సాధించి.. ఆ త‌ర్వాత మెడిక‌ల్ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించాడు. ఆ త‌ర్వాత 11 నెల‌ల పాటు క‌ఠోర‌ సైనిక శిక్ష‌ణ పొంది.. సెప్టెంబ‌ర్ 9వ తేదీన‌ లెఫ్ట్‌నెంట్ హోదా అధికారిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నాడు. ఈ నేప‌థ్యంలో ముద్ద‌ అభిషేక్ రెడ్డి స‌క్సెస్ స్టోరీ మీకోసం.. 

కుటుంబ నేప‌థ్యం : 

UPSC CDS Ranker Family

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అన్న‌మ‌య్య జిల్లా చిట్వేలి మండ‌లం మైల‌ప‌ల్లే గ్రామానికి చెందిన ముద్ద ర‌వికుమార్‌రెడ్డి, రాధారెడ్డి దంప‌తుల ఏకైక కుమారుడు అభిషేక్ రెడ్డి.

తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం..
కంబైడ్ డిపెన్స్ స‌ర్వీస్ (సీడీఎస్‌)కు ఎంపిక అవ్వ‌డం అత్యంత క‌ఠిన‌త‌రం.  ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్ఎస్ సాధించ‌డం కంటే కూడా ఇది చాలా క‌ష్టం. ఇటువంటి క‌ష్ట‌మైన పోటీలో మొద‌టి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం సాధిండం.. అందులో జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్ సాధించ‌డం చాలా గొప్ప‌ విష‌యం. 2021లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎంపికైన ఒకేఒక్క‌డు ఈయ‌న‌.

ఈ నెల‌లోనే.. లెఫ్ట్‌నెంట్ హోదాతో..
తండ్రి ఆశ‌య సాధ‌న కోసం ఆహారాత్రులు క‌ష్ట‌ప‌డి క‌ఠోర‌మైన శ్ర‌మ‌తో సీడీఎస్‌కు ఎంపికై ఈ సెప్టెంబ‌ర్‌ నెల‌లోనే చెన్నైలో జ‌ర‌గనున్న పాసింగ్ అవుట్ పేరేడ్‌లో లెఫ్ట్‌నెంట్ హోదాలో ఉద్యోగంలో చేర‌నున్నాడు అభిషేక్ రెడ్డి. ఈ సుదీర్ఘ‌మైన ప్ర‌యాణంలో అత్యంత క‌ఠిన‌మైన సీడీఎస్ శిక్ష‌ణ సెఫ్టెంబ‌ర్‌లో పూర్తి కానుంది. చెన్నైలో జ‌రిగే పాసింగ్ అవుట్ పెరేడ్‌లో 350 మంది సైనికులకు అధికారిగా, త‌న త‌ల్లిదండ్రుల‌చే స్టార్స్ పెట్టించుకుని ఉన్న‌త సైనిక అధికారుల ముందు లెఫ్ట్‌నెంట్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నాడు. ఇది ఈయ‌న జీవితంలో ఒక అపూర్వఘ‌ట్టం కానుంది.

ఆంధ్ర త‌రుపున రంజీ ప్రాబ‌బుల్స్‌కు..

commissioned officer success stories in telugu

చిన్ననాటి నుంచి క్రికెట్ అంటే అభిషేక్‌కు చాలా ఇష్టం.. ఇదే జీవితం అనుకున్నాడు. దీని కోసం హైద‌రాబాద్‌లో కోచింగ్ కూడా తీసుకున్నాడు. అలాగే ఆంధ్ర త‌రుపున రంజీ ప్రాబ‌బుల్స్‌కు ఎంపిక‌య్యాడు. తుది జ‌ట్టులో స్థానం పొంద‌లేక‌పోయ్యాడు. హైద‌రాబాద్ క్రికెట్ అకాడ‌మీ(HCA), ఆంధ్ర క్రికెట్ అకాడ‌మీ(ACA)ల‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. అలాగే ఈయ‌న‌ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గానే బ‌రిలో దిగేవాడు. అంత‌ర్ జిల్లా స్థాయి పోటీల్లో అత్యున్న‌త ప్ర‌తిభ క‌న‌బ‌రిచి ప‌రుగుల వ‌ర‌ద పారించేవాడు. 

కీల‌క మ‌లుపు ఈ స‌మ‌యంలోనే..
క‌రోనా స‌మ‌యంలో వ‌చ్చిన‌ ఖాళీ స‌మ‌యాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు. ప్ర‌తి విష‌యం.. ప్ర‌తి స‌మ‌యం మ‌న‌కు అవ‌కాశాన్ని ఇస్తుందంటారు. స‌రిగ్గా ఈయ‌న విష‌యంలో అదే జ‌రిగింది. ఈయ‌న‌ తండ్రి మిల‌ట‌రీలో నాన్ క‌మిష‌న్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేశాడు. కార్గిల్ యుద్దంలో సింగ‌ల్ Cipherగా అత్య‌త్త‌మ‌ సేవ‌లు అందించి.. త‌మ సైన్యంలోని ఉన్న‌తాధికారుల నుంచి ప్ర‌శంస‌లు పొందాడు. దీంతో అభిషేక్‌కు.. తండ్రి ద్వారా సంక్ర‌మించిన జీన్స్‌ సైన్యం వైపు వెళ్లేలా చేసింది.

ఇండియ‌న్ మిలట‌రీ డ్రెస్‌లో ఉండే గౌర‌వం, విలువ‌లు అత‌నిని అమితంగా ఆక‌ర్షించింది. ఇండియ‌న్ మిల‌ట‌రీలో అత్యున్న‌తాధికారి కావాలంటే.. సీడీఎస్ ప‌రీక్ష స‌రైంద‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఈ ల‌క్ష్యం కోసం ప్ర‌య‌త్నం చేసి తొలి ప్ర‌య‌త్నంలోనే.. రెండు తెలుగు రాష్ట్రాల గౌరవం నిల‌బెట్టాడు. తెలుగు ప్ర‌జ‌లు గర్వించేలా..ఇండియ‌న్ మిలిట‌రీలో అత్యున్న‌త ఉద్యోగం సాధించాడు.

ఇది నాకు గొప్ప వ‌రం..
దేశం కోసం సేవ చేయ‌డం ఒక వ‌రం. ఇలాంటి మంచి అవ‌కాశం నాకు ద‌క్కినందుకు చాలా సంతోషంగా ఉందంటున్నాడు అభిషేక్‌రెడ్డి. అలాగే నాకు చిన్న‌నాటి నుంచి త్రివ‌ర్ణ ప‌తాకం అంటే అమిత‌మైన‌ ఇష్టం. అలాగే నాన్న కూడా సైన్యంలో ప‌నిచేశాడు. నేను ముందుగా ఎంపిక చేసుకున్న క్రికెట్‌లో పూర్తి స్థాయిలో అవ‌కాశం పొంద‌లేక‌పోయాను. ఆ స‌మ‌యంలోనే త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ధ‌రించే అవ‌కాశం.. దేశానికి సేవ చేయ‌డానికి సీడీఎస్ ప‌రీక్ష‌లో ఎంపిక కావాల‌ని నిర్ణ‌యించుకున్నాను. దీనిలో విజ‌యం సాధించ‌డం కోసం తీవ్రం క‌ష్ట‌ప‌డి చ‌దివాను. నేను ప‌డ్డ క‌ష్టానికి తొలి ప్ర‌య‌త్నంలో జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్ సాధించాను.

వీళ్ల స‌హాకారం మ‌రువ‌లేనిది..

commissioned officer success stories

ఇంత మంచి విజ‌యం రావ‌డం నాకు నిజంగా చెప్ప‌లేనంత సంతోషంగా ఉంది. అలాగే నా దేశానికి సేవ చేసే అదృష్టం రావ‌డం నాకు ఇంకా సంతోషంగా ఉంది. నేను ఎంచుకున్న మార్గంలో ముందుకు వెళ్లేందుకు స‌హాక‌రించి.. నాకు పూర్తి స్వేఛ్చ‌ను ఇచ్చారు మా త‌ల్లిదండ్రులు. నా దేశం నాకేమిచ్చింది.. అని కాకుండా.. దేశానికి నేను ఏమి ఇచ్చాను.. అన్న‌దే ముఖ్యం. ముఖ్యంగా దేశంలో ఉన్న యువ‌త ఈ విధంగా ఆలోచిస్తే.. దేశానికి మనం ఎంతో కొంత సేవ చేసిన వాళ్లం అవుతాం.

చిన్న‌ప్పుడు నుంచి వీడికి ప‌ట్టుద‌ల ఎక్కువే.. : ముద్ద ర‌వికుమార్‌రెడ్డి
నా కుమారుడు అభిషేక్ రెడ్డికి చిన్న‌ప్పుడు నుంచే ప‌ట్టుద‌ల ఎక్క‌వే. ఏదైన అనుకుంటే.. సాధించే వ‌ర‌కు దానిని వ‌ద‌ల‌డు. అలాగే చ‌దువుల్లోనే మంచి మార్కులు సాధించే వాడు. అభిషేక్.. క్రికెట్‌ను త‌న కెరీర్‌గా ఎంచుకుంటే.. మేము అడ్డు చెప్ప‌కుండా పోత్సాహించాం. అలాగే నువ్వు ఏ రంగం ఎంచుకున్న ఆ రంగంలో ముందుడాల‌న్న‌దే మా ల‌క్ష్యం అని చెప్పాం.

అభిషేక్ విజ‌యంలో త‌ల్లిదే సింహ‌భాగం..
నేను సైన్యంలో ప‌నిచేస్తున్న స‌మ‌యంలో అభిషేక్ పూర్తి బాధ్య‌త‌లు నా భార్య రాధారెడ్డి చూసుకున్నారు. అభిషేక్‌ను అనుక్షణం ప్రోత్స‌హిస్తూ.. బాగోగులు చూసుకున్న ఖ్యాతి మా భార్య‌కే ద‌క్కుతుంది. వీడి విజ‌యంలో నా భార్య పాత్ర సింహ‌భాగం. ఈ రోజు మా కుమారుడు ఇండియ‌న్ ఆర్మీలో లెఫ్ట్‌నెంట్ హోదా ఉద్యోగం సాధించినందుకు నిజం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే దేశానికి సేవ చేసే అదృష్టం మా కుమారుడికి వ‌చ్చినందుకు.. అలాగే నా వార‌స‌త్వం తీసుకున్నందుకు ఒక తండ్రిగా నాకు చాలా గ‌ర్వంగా ఉంద‌న్నాడు.

Published date : 06 Sep 2023 07:45AM

Photo Stories