Skip to main content

ఉద్యోగాలు ఈ ఏడాది ఆశాజనకంగానే..

కరోనా పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్నాయి. వివిధ రంగాల్లోని సంస్థలు తమ కార్యకలాపాలు పూర్వస్థితికి చేరుకునేలా ప్రయత్నాలు చేస్తున్నాయి.
campus placement drive 2021
Campus Placement Drive 2021

థర్డ్‌ వేవ్‌పై సెప్టెంబర్‌ చివరికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాతే కంపెనీలు రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్స్‌ చేపట్టే వీలుందని ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్లు పేర్కొంటున్నారు. వాస్తవానికి సంస్థలు.. ప్రతి ఏటా అక్టోబర్‌ లేదా నవంబర్‌లో క్యాంపస్‌ డ్రైవ్స్‌ ప్రక్రియ ప్రారంభిస్తుంటాయి. ఈ ఏడాది కూడా ఎప్పటి మాదిరిగానే అక్టోబర్, నవంబర్‌లో పూర్తిస్థాయిలో ప్లేస్‌మెంట్స్‌ మొదలయ్యే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ తాజా ట్రెండ్స్‌..అవకాశాలు కల్పిస్తున్న రంగాలు.. డిమాండింగ్‌ నైపుణ్యాలు తదితర అంశాలపై విశ్లేషణ.. 


ప్రస్తుతం పలు ఇన్‌స్టిట్యూట్స్‌లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు క్యాంపస్‌ డ్రైవ్స్‌ ప్రక్రియ క్రమేణా మొదలవుతోంది. గతేడాది కరోనా కారణంగా క్యాంపస్‌ ఎంపికల్లో జాప్యం జరిగింది. ఆ బ్యాచ్‌ విద్యార్థులకు ఈ ఏడాది మే, జూన్‌ వరకు నియామకాలు జరిగాయి. దీంతో అలాంటి జాప్యం ఈసారి తలెత్తకుండా ఉండేందుకు.. కొన్ని కంపెనీలు ఆగస్టు మొదటి వారం నుంచే క్యాంపస్‌ డ్రైవ్స్‌ మొదలుపెట్టాయి. ఆ సంస్థలు ఎక్కువగా కస్టమర్‌ సపోర్ట్, బీపీఓ వంటి ఉద్యోగాలనే భర్తీ చేస్తున్నాయని.. వీరికి వార్షిక వేతనం మూడు లక్షల వరకు ఉంటోందని ఓ ప్లేస్‌మెంట్‌ అధికారి తెలిపారు. అవే సంస్థలు ఉన్నత స్థాయి కొలువుల భర్తీ కోసం ఐఐటీలు, ఎన్‌ఐటీలకు వెళ్తాయన్నారు. ఈ ప్రక్రియ సదరు ఇన్‌స్టిట్యూట్‌ల క్యాలెండర్‌ ప్రకారం నవంబర్‌ నుంచి మొదలవుతుందని పేర్కొన్నారు.

ఆఫర్లు.. ఆచితూచి
ఈ సంవత్సరం సంస్థలు క్యాంపస్‌ డ్రైవ్స్‌ యథావిధిగా మొదలు పెట్టినా.. ఆచితూచి ఆఫర్లు ఇచ్చే అవకాశముందని పలు ఇన్‌స్టిట్యూట్‌ల క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది కంపెనీలు క్యాంపస్‌ డ్రైవ్స్‌ నిర్వహించి.. అభ్యర్థులను ఎంపిక చేసినప్పటికీ.. ఆఫర్‌ లెటర్లు, జాయినింగ్‌ ఆర్డర్స్, అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇవ్వడంలో జాప్యం చేశాయి. ఇదే పరిస్థితి ఈ ఏడాది కూడా కొనసాగుతుందా?అంటే..భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే నియామక ప్రణాళికలను ప్రకటించిన కంపెనీలు..క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్‌ నిర్వహణ, ఆఫర్లు, అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇవ్వడంలో జాప్యం చేసే ఆస్కారం లేదని చెబుతున్నారు. 

ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌ల వైపు..
సంస్థలు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌కే పెద్దపీట వేయడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. అంటే.. ఐఐఎంలు, ఐఐటీలు, నిట్‌లు వంటి జాతీయ స్థాయి ఇన్‌స్టిట్యూట్‌లు; రాష్ట్రాల స్థాయిలో క్యాంపస్‌ కళాశాలలు, పేరున్న కాలేజీల వైపు మొగ్గు చూపే పరిస్థితి కనిపిస్తోంది. 2020–21లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ప్రముఖ బి–స్కూల్స్, టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో 90 శాతం మేరకు క్యాంపస్‌ ఆఫర్లు లభించగా.. ద్వితీయ, తృతీయ శ్రేణి ఇన్‌స్టిట్యూట్స్‌ విద్యార్థులు క్యాంపస్‌ ఆఫర్లు లభించక.. ఉద్యోగాన్వేషణలో ఎంతో ఆందోళన చెందారు. కాబట్టి ఈ సంవత్సరం స్థానిక ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థులు.. ఉద్యోగాన్వేషణలో ఆఫ్‌–క్యాంపస్ రిక్రూట్స్‌మెంట్స్‌ కోసం కూడా సన్నద్ధంగా ఉండాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇందుకోసం సదరు సంస్థలు నిర్వహించే ఓపెన్‌ కాంపిటీషన్‌ టెస్ట్‌ల వివరాలు తెలుసుకుంటూ.. వాటిలో విజయం సాధించేందుకు కృషి చేయాలంటున్నారు. 

ఈ రంగాలదే హవా..
ఈ ఏడాది ప్లేస్‌మెంట్స్‌ డ్రైవ్స్‌లో.. ఐటీ, హెల్త్‌కేర్, రిటైల్, ఈ–కామర్స్, ఎడ్‌టెక్, ఫిన్‌టెక్, కన్సల్టింగ్, సైబర్‌ సెక్యూరిటీ, గేమింగ్, అనలిటిక్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ విభాగాల్లో ఎక్కువ అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. దాంతో ఇంజనీరింగ్, టెక్నికల్, మేనేజ్‌మెంట్‌ కోర్సుల విద్యార్థులు అవకాశాలను అందుకోవడంలో కొంత ముందంజలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. 

డిజిటల్‌ నైపుణ్యాలు..
ఇప్పుడు ఎక్కడ చూసినా డిజిటల్‌ నైపుణ్యాల హవా కొనసాగుతోంది. సంస్థలు కార్యకలాపాల నిర్వహణలో 4.0 ఇండస్ట్రీ నైపుణ్యాలు, ఆటోమోషన్‌ వైపు అడుగులు వేస్తున్నాయి. దీంతో ఏఐ–ఎంఎల్, డేటాసైన్స్, డేటా మేనేజ్‌మెంట్‌ నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది. ఇటీవల నియామక ప్రణాళికలు ప్రకటించిన ఐటీ సంస్థలు.. ఆటోమేషన్‌పై ప్రత్యేక దృష్టిసారించినట్లు ప్రకటించడం ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. కాబట్టి విద్యార్థులు ఆయా టెక్‌ స్కిల్స్‌ సొంతం చేసుకొని.. క్యాంపస్‌ డ్రైవ్స్‌కు సిద్ధంగా ఉండాలని హెచ్‌ఆర్‌ నిపుణులు సూచిస్తున్నారు.

సంప్రదాయ కోర్సుల విద్యార్థులు ఇలా...
➤ బీఏ, బీకామ్, బీఎస్సీ వంటి సంప్రదాయ కోర్సుల విద్యార్థులు.. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను పెంచుకుంటే ఐటీ–బీపీఓ, డిజిటల్‌ మార్కెటింగ్, సోషల్‌ మీడియా, ఎడ్యుకేషన్‌ రంగాల్లో ఉద్యోగాలు దక్కించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కోర్సుల విద్యార్థులకు ఈ–కామర్స్‌ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. వీటిని అందుకునేందుకు ఆఫ్‌–క్యాంపస్‌ విధానంలో కృషి చేయాలని పేర్కొంటున్నారు. 
➤ ఇటీవల ప్రముఖ ఈ–కామర్స్‌ సంస్థ అమెజాన్‌.. డిగ్రీ, పీజీ అర్హతలున్న మూడు వేల మందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. 
➤ అదే విధంగా ఫ్లిప్‌కార్ట్‌ కూడా సప్లయ్‌ చైన్,రిటైల్‌ మార్కెటింగ్‌ విభాగాల్లో ఎనిమిది వేల మందికి అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొంది.
➤ లెన్స్‌కార్ట్‌ సంస్థ సైతం రెండు వేల మందిని నియమించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. 
➤ ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే.. సంప్రదాయ డిగ్రీ కోర్సుల విద్యార్థులకు ఐటీ–బీపీఓ, కాల్‌ సెంటర్స్, ఈ–కామర్స్‌ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలుగా చెప్పొచు. 

కీలక స్కిల్స్‌ ఇవే..
క్యాంపస్‌ నియామకాలైనా.. ఆఫ్‌–క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్‌ అయినా.. కమ్యూనికేషన్‌ స్కిల్స్, డెసిషన్‌ మేకింగ్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, క్రిటికల్‌ అనాలిసిస్, నెగోషియేషన్‌ స్కిల్స్‌ వంటి నైపుణ్యాలు కీలకంగా నిలుస్తున్నాయి. అభ్యర్థుల్లో సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌తోపాటు స్వతహాగా ఈ కీలక స్కిల్స్‌ ఉంటే నియామకాల్లో ముందంజలో నిలిచే అవకాశం ఉంటుంది.

వర్చువల్‌ ఎంపికలు ఇలా..
కంపెనీలు గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఎంపిక ప్రక్రియను వర్చువల్‌ విధానంలో నిర్వహించేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అంటే.. ఆన్‌లైన్‌ ఇంటర్వూ్యలు, ఆన్‌లైన్‌ రాత పరీక్షల ద్వారా నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నాయి. అందుకే విద్యార్థులు వర్చువల్‌ ఎంపిక విధానంపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం సీనియర్లు, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్ల సలహాలు తీసుకోవచ్చు.

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌–2021–22 ముఖ్యాంశాలు..
➤ టెక్, మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు కొంత మెరుగ్గా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌. 
➤ ఈ–కామర్స్, ఎడ్‌టెక్, ఫిన్‌టెక్, కన్సల్టింగ్, సైబర్‌ సెక్యూరిటీ, గేమింగ్, అనలిటిక్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ విభాగాల్లో ఎక్కువ నియామకాలు.
➤ డిగ్రీ కోర్సుల విద్యార్థులకు ఉపాధి వేదికలుగా ఈ–కామర్స్‌ సంస్థలు, మార్కెటింగ్, సోషల్‌ మీడియా, సప్లయ్‌ చైన్‌ విభాగాలు.
➤ సంప్రదాయ కోర్సుల అభ్యర్థులకు ఎడ్‌ టెక్‌ సంస్థల్లోనూ అవకాశాలు.
➤ మధ్య, దిగువ శ్రేణి ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థులకు ప్రధాన మార్గం ఆఫ్‌–క్యాంపస్‌ డ్రైవ్స్‌.

ఈ ఏడాది ఆశాజనకంగానే..
ఈ ఏడాది క్యాంపస్‌ డ్రైవ్స్‌ ఆశాజనకంగానే ఉంటాయని చెప్పొచ్చు. ఐఐటీల్లో క్యాంపస్‌ డ్రైవ్స్‌ నిర్వహించేందుకు సంస్థలు ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించాయి. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సంస్థలు ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లవైపే దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇతర ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థులు.. సోషల్‌ నెట్‌వర్కింగ్, ఆఫ్‌–క్యాంపస్‌ డ్రైవ్స్‌ ద్వారా ఉద్యోగాన్వేషణ సాగించొచ్చు.
                 –ప్రొఫెసర్‌ అభినవ్‌ కుమార్, ఫ్యాకల్టీ ఇంఛార్జ్, కెరీర్‌ సర్వీసెస్, ఐఐటీ–హైదరాబాద్‌

 

Published date : 01 Sep 2021 06:01PM

Photo Stories