Skip to main content

ఛాయిస్ మీది..కోర్సు మాది..

డిప్లొమా నుంచి పీహెచ్‌డీ వరకు.. రెగ్యులర్‌ మొదలు ఆన్‌లైన్, డిస్టెన్స్‌ విధానం దాకా.. ఎన్నో కోర్సులు.. మరెన్నో డిగ్రీలు! వాటిలో చేరే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. కొందరు వ్యక్తిగత కారణాలతో.. మరికొందరు కోర్సు ఇష్టంలేక మధ్యలోనే మానేస్తున్నారు.

ఒక వేళ పరిస్థితులు అనుకూలించి మళ్లీ కోర్సు కొనసాగించాలంటే.. అలాంటి అవకాశమే ఉండటంలేదు. దాంతో అప్పటి వరకు చదివిన చదువంతా ఉపయోగపడకుండా పోతోంది. ఇలాంటి వాటికి ఫుల్‌స్టాఫ్‌ పెట్టేందుకు ఇటీవల యూజీసీ(యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌) తెచ్చిన కొత్త విధానమే.. అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్‌(ఏబీసీ)!! ఈ విద్యాసంవత్సరం నుంచే ఏబీసీ విధానం అమలు చేయనున్న నేపథ్యంలో.. అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్‌ అంటే ఏంటి ఏమిటి.. దీనితో ప్రయోజనాలు.. అర్హత ప్రమాణాలపై కథనం... 

➤ ఇష్టం లేకపోయినా ఇంజనీరింగ్‌లో చేరి.. ఆశించిన విధంగా రాణించలేక.. ఆవేదనతో కాలం వెళ్లదీసే విద్యార్థులు మనకు నిత్యం కనిపిస్తూనే ఉంటారు.
➤ డిప్లొమా లేదా డిగ్రీలో అడుగుపెట్టి.. వ్యక్తిగత కారణాలతో మానేసి.. ఆపై బాధపడే విద్యార్థులనూ మనం చూస్తుంటాం.
➤ ఏదైనా ఒక కోర్సులో చేరి..ఆ ప్రోగ్రామ్‌తోపాటు తనకు ఆసక్తి ఉన్న మరో కోర్సు అభ్యసించాలని కోరుకునే విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువే.
➤ ఇలాంటి విద్యార్థులకు వెలుగు రేఖ..యూజీసీ–అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్‌!!
➤ ఉన్నత విద్యలో డ్రాప్‌ అవుట్‌ సంఖ్యను తగ్గించడం, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్‌కు ప్రోత్సాహంతోపాటు లైఫ్‌లాంగ్‌ లెర్నింగ్‌ అవకాశాలు కల్పించేందుకు అమల్లోకి తెచ్చిన కొత్త విధానమే..అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్‌(ఏబీసీ)!! ఈ విద్యా సంవత్సరం నుంచే ఏబీసీని అమలు చేసేందుకు యూజీసీ ఇటీవల మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. 

ఈ విద్యా సంవత్సరం నుంచే..
అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్‌ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని యూజీసీ తాజాగా దేశంలోని అన్ని యూనివర్సిటీలకు సూచించింది. 2021–22 నుంచే ఈ అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ప్రయోజనాలు విద్యార్థులకు లభించనున్నాయి.

అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్‌..
➤ యూజీసీ గుర్తింపు పొందిన విద్యాసంస్థలో చేరిన విద్యార్థి.. కోర్సులో భాగంగా తాను పొందిన క్రెడిట్స్‌ను డిజిటల్‌ విధానంలో భద్రపరచుకునేందుకు వీలు కల్పించే విధానమే.. అకడమిక్‌ క్రెడిట్‌ బ్యాంక్‌. విద్యార్థులు ఏబీసీ వెబ్‌సైట్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేసుకొని.. తాము చదువుతున్న కోర్సు వివరాలు, ఇప్పటి వరకు పొందిన క్రెడిట్స్‌ను నిక్షిప్తం చేసుకోవచ్చు. ఇలా అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్‌లో నిక్షిప్తమైన క్రెడిట్స్‌ను విద్యార్థులు ఎప్పుడైనా.. ఏ ఇన్‌స్టిట్యూట్‌లో చేరేందుకైనా.. వినియోగించుకోవచ్చు. 
➤ ఉదాహరణకు.. బీకాం చదువుతూ రెండో సంవత్సరంలో ఆపేసిన విద్యార్థి.. అప్పటి వరకు తాను పొందిన క్రెడిట్స్‌ అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్‌లో నిక్షిప్తం చేసుకోవచ్చు. భవిష్యత్తులో మళ్లీ బీకాం కోర్సును కొనసాగించాలనుకుంటే.. ఎక్కడైతే కోర్సును ఆపేశారో అక్కడి నుంచే మొదలు పెట్టొచ్చు. అప్పటికే ఏబీసీలో నిక్షిప్తమైన క్రెడిట్స్‌ను కొత్తగా చేరే ఇన్‌స్టిట్యూట్‌కు బదిలీ చేస్తారు. సదరు కాలేజీ అభ్యర్థి అప్పటికే బీకాంలో రెండేళ్లు పూర్తి చేసినట్లు గుర్తించి.. మూడో ఏడాదిలో నేరుగా ప్రవేశం కల్పిస్తుంది.
➤ ఉదాహరణకు మరో విద్యార్థి బీటెక్‌లో చేరి మొదటి సంవత్సరంలో మానేసి.. తనకు ఆసక్తి ఉన్న సైన్స్‌ కోర్సులో చేరాడు. అలాంటప్పుడు సదరు విద్యార్థి బీటెక్‌ మొదటి సంవత్సరంలో పొందిన క్రెడిట్స్‌ను కొత్తగా చేరిన సైన్స్‌ కోర్సుకు కలుపుతారు. ఇలా కొత్త ఇన్‌స్టిట్యూట్‌లో చేరాలనుకునే విద్యార్థులకు.. రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ వ్యవధి ఉన్న కోర్సుల విషయంలో ఒక సెమిస్టర్‌ మినహాయింపు ఇస్తారు.

చేరొచ్చు.. మారొచ్చు !
➤ యూజీసీ అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్‌ విధానంలో.. ఉన్నత విద్య కోర్సుల విద్యార్థులు తమ ఆసక్తికి అనుగుణంగా ఏ కోర్సులోనైనా, ఎప్పుడైనా చేరొచ్చు. ఎప్పుడైనా మానేయొచ్చు. మళ్లీ ఆ కోర్సును చదవాలనుకుంటే..తమకు దగ్గరిలోని గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లో చేరొచ్చు.
➤ ఉదాహరణకు ఒక యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలో బీఏలో చేరిన విద్యార్థి.. మొదటి సంవత్సరం పూర్తయ్యాక కోర్సు మానేసి.. మళ్లీ రెండేళ్ల తర్వాత అదే కోర్సులో చేరాలనుకుంటే నిస్సందేహంగా చేరొచ్చు. అంతేకాకుండా తాను మొదట బీఏలో చేరిన ఇన్‌స్టిట్యూట్‌లోనే చదవాలనే నిబంధన కూడా లేదు. తన వ్యక్తిగత పరిస్థితులకు అనుగుణంగా తనకు సమీపంలోని మరో గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లో రెండో సంవత్సరంలో చేరొచ్చు. అంతకుముందు పొందిన క్రెడిట్స్‌ను కొత్త ఇన్‌స్టిట్యూట్‌లో కోర్సులో కలిపేయొచ్చు. 

ఆన్‌లైన్, డిస్టెన్స్‌ కోర్సులకూ..
ఆన్‌లైన్, డిస్టెన్స్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థులు కూడా అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్స్‌ విధానం ద్వారా.. క్రెడిట్స్‌ను నిక్షిప్తం చేసుకొని బదిలీ చేసుకోవచ్చు. ఉదాహరణకు.. ప్రస్తుతం ఎన్‌పీటీఈఎల్, స్వయం వంటి పోర్టల్స్‌లో అనేక ఆన్‌లైన్‌ కోర్సులు మూక్స్‌ విధానంలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో నమోదు చేసుకున్న విద్యార్థులకు వారు పూర్తి చేసుకున్న కోర్సు వ్యవధి ఆధారంగా క్రెడిట్స్‌ను ఇస్తున్నారు. ఇలాంటి అభ్యర్థులు కొత్తగా ఏదైనా కోర్సులో చేరాలనుకునేటప్పుడు.. ఈ మూక్స్‌ విధానంలో పొందిన క్రెడిట్స్‌ను కొత్తగా చేరే కోర్సుకు కలుపుతారు. ఫలితంగా విద్యార్థులు కొత్తగా చేరే ప్రోగ్రామ్‌లో.. చదవాల్సిన సబ్జెక్ట్‌ల సంఖ్య తగ్గుతుంది. 

ప్రొఫెషనల్‌ కోర్సులకూ.. కానీ
అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్‌ విధానాన్ని ప్రొఫెషనల్‌ కోర్సులుగా పేర్కొనే ఇంజనీరింగ్, మెడికల్, లా తదితర కోర్సులకు కూడా వర్తింపజేయనున్నారు. ఈ కోర్సుల్లో ఈ విధానాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలంటే.. ఏఐసీటీఈ, ఎన్‌ఎంసీ, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాల ఆమోదం తప్పనిసరి. అలా ఆమోదం పొందిన విద్యార్థుల క్రెడిట్స్‌నే అకడమిక్‌ క్రెడిట్‌ బ్యాంక్‌లో నిక్షిప్తం చేస్తారు. 

సర్టిఫికెట్లు.. పలు రకాలుగా
➤ ఏబీసీ విధానంలో విద్యార్థులు తాము ఏదైనా ఒక కోర్సులో చేరి.. దాన్ని పూర్తి చేసుకున్న వ్యవధికి అనుగుణంగా సర్టిఫికెట్‌ పొందే అవకాశం లభించనుంది. నూతన జాతీయ విద్యా విధానంలో.. 10+2+4 విధానంలో ఉన్నత విద్య ఉండాలని పేర్కొన్నారు. అంటే.. బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులను నాలుగేళ్ల వ్యవధిలో నిర్వహించాలని సూచించారు. అంతేకాకుండా విద్యార్థుల అవసరాలు, ఆసక్తి అనుగుణంగా ఎర్లీ ఎగ్జిట్‌కు కూడా అవకాశం కల్పించాలన్నారు. ఏడాది తర్వాత మానేస్తే సర్టిఫికెట్, రెండేళ్ల తర్వాత మానేస్తే అడ్వాన్స్‌డ్‌ డిగ్రీ, మూడేళ్ల తర్వాత మానేస్తే బ్యాచిలర్‌ డిగ్రీ, నాలుగేళ్ల తర్వాత మానేస్తే రీసెర్చ్‌ డిగ్రీ సర్టిఫికెట్లు ఇవ్వాలని సూచించారు. 
➤ తాజాగా అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్‌ విధానంలోనూ నిర్దిష్టంగా మార్గదర్శకాలు జారీ చేశారు. దీని ప్రకారం.. విద్యార్థులు ఒక కోర్సులో పొందిన క్రెడిట్స్‌ ఆధారంగా డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్స్‌ను అందించనున్నారు. ఈ విధానంలో తాము పొందిన క్రెడిట్స్‌ ఆధారంగా మధ్యంతరంగా సర్టిఫికెట్స్‌ పొందితే.. అప్పటి వరకు పొందిన క్రెడిట్స్‌ కొనసాగవు. ఇలా మధ్యంతరంగా సర్టిఫికెట్లు పొందాలంటే.. అభ్యర్థులు తమ యూనివర్సిటీ నిబంధనలను అనుసరించి కనీసం 50 శాతం క్రెడిట్స్‌ సొంతం చేసుకోవాలి.

బ్యాచిలర్‌ ఆఫ్‌ లిబరల్‌ ఎడ్యుకేషన్‌ : 
అకడమిక్‌ క్రెడిట్‌ బ్యాంక్‌ విధానంలో.. విద్యార్థులకు లభించనున్న మరో ప్రయోజనం.. బ్యాచిలర్‌ ఆఫ్‌ లిబరల్‌ ఎడ్యుకేషన్‌ సర్టిఫికెట్‌ను పొందే అవకాశం. ఈ విధానంలో విద్యార్థులు తమ డొమైన్‌తో సంబంధం లేకుండా.. తమకు ఆసక్తి ఉన్న కోర్సులను పూర్తిస్థాయిలో చదివి నిర్దిష్ట క్రెడిట్స్‌ను పొంది.. సంబంధిత కోర్సులో డిగ్రీ సర్టిఫికెట్‌ పొందేందుకు ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి  సందర్భంలో సదరు విద్యార్థులకు బ్యాచిలర్‌ ఆఫ్‌ లిబరల్‌ ఎడ్యుకేషన్‌ పేరిట ఆయా యూనివర్సిటీ ప్రత్యేకంగా డిగ్రీని కూడా అందిస్తుంది.

క్రెడిట్స్‌ నిర్ణయం ఇలా..
➤ అకడమిక్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ విధానంలో... క్రెడిట్స్‌ ఇచ్చేందుకు నిర్దిష్ట ప్రమాణాలు పేర్కొన్నారు. వీటి ప్రకారం.. ఒక సెమిస్టర్‌ వ్యవధిలో.. ఒక వారంలో.. ఒక గంట థియరీ, ఒక గంట ట్యుటోరియల్, రెండు గంటల లేబొరేటరీ వర్క్‌ను క్రెడిట్స్‌గా పరిగణించనున్నారు. ఇంటర్న్‌షిప్‌ కోణంలో.. ఒక వారానికి ఒక క్రెడిట్‌ చొప్పున గరిష్టంగా ఆరు క్రెడిట్లు ఇవ్వనున్నారు.
➤ యూజీసీ ఏబీసీ విధానం ప్రకారం– ఇందులో నిక్షిప్తం చేసుకున్న క్రెడిట్స్‌ను గరిష్టంగా ఏడేళ్ల వరకు వినియోగించుకోవచ్చు. విద్యార్థులు ఈ వ్యవధిలోనే తాము పొందిన క్రెడిట్స్‌ను వినియోగించుకోవాలి. 

ఏబీసీ వెబ్‌పోర్టల్‌ : 
అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్స్‌ విధానాన్ని సమర్థంగా అమలు చేసేందుకు www.abc.gov.in పేరుతో వెబ్‌పోర్టల్‌ను కూడా ప్రారంభించారు. అర్హత కలిగిన ఇన్‌స్టిట్యూట్‌లు తమ విద్యార్థులు, వారు చదువుతున్న కోర్సులు, పొందిన క్రెడిట్స్‌ వివరాలను పొందుపరిచే అవకాశం ఉంది. ఇన్‌స్టిట్యూట్‌ ఒక విద్యార్థికి సంబంధించి క్రెడిట్స్‌ను నమోదు చేస్తే్త.. తర్వాత సదరు విద్యార్థి మరో ఇన్‌స్టిట్యూట్‌లో చేరేటప్పుడు.. ఆ క్రెడిట్స్‌ను కొత్త కాలేజీలో చేరే కోర్సుకు జమ చేసుకోవచ్చు. 

18 యూనివర్సిటీల నమోదు..
అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్స్‌కు సంబంధించి కొత్తగా ఏర్పాటు చేసిన వెబ్‌పోర్టల్‌లో ఇప్పటికే 18 యూనివర్సిటీలు తమ వివరాలు నమోదు చేసుకున్నాయి. వీటిలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, ఇఫ్లూ, జేఎన్‌యూ వంటి సెంట్రల్‌ యూనివర్సిటీలు, నిట్‌–అరుణాచల్‌ ప్రదేశ్‌ వంటి విద్యాసంస్థలు ఉన్నాయి. త్వరలోనే యూజీసీ నిర్దేశించిన అర్హతలున్న అన్ని యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు ఈ విధానంలో తమ వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశముంది. 

ఇన్‌స్టిట్యూట్‌ల ద్వారానే..
ఏబీసీ విధానంలో..విద్యార్థులు తమ క్రెడిట్స్‌కు సంబంధించిన వివరాలను తాము కోర్సు అభ్యసిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ ద్వారానే నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతి విద్యార్థికి విశిష్ట గుర్తింపు సంఖ్య(యునిక్‌ ఐడీ)ను కేటాయిస్తారు. ఈ గుర్తింపు సంఖ్యను వినియోగించి.. సదరు ఇన్‌స్టిట్యూట్స్‌ విద్యార్థులకు సంబంధించిన క్రెడిట్స్‌ను క్రెడిట్‌ బ్యాంక్‌లో పొందుపరుస్తాయి. ఇలా విద్యా సంస్థలు నమోదు చేసిన క్రెడిట్స్‌ వివరాలను విద్యార్థులు సైతం తమ యునిక్‌ ఐడీతో చూసుకోవచ్చు. 

నిర్దిష్ట గుర్తింపు : 
➤ అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్‌ విధానాన్ని వినిగించుకునే విద్యాసంస్థలకు నిర్దిష్ట ప్రమాణాలను యూజీసీ పేర్కొంది. 
➤ న్యాక్‌–ఏ గ్రేడ్‌ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లు.. ఏబీసీ విధానాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
➤ ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌కు న్యాక్‌ ఏ గ్రేడ్‌ గుర్తింపు లేకపోతే.. సదరు ఇన్‌స్టిట్యూట్‌ అందించే ప్రోగ్రా మ్‌లలో కనీసం మూడింటికి.. 675 స్కోర్‌తో ఎన్‌బీఏ గుర్తింపు ఉన్నా.. అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్‌లో నమోదు చేసుకోవచ్చు. 
➤ ఈ రెండూ లేకపోతే.. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌–100 జాబితాలో.. అదే విధంగా క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ లేదా టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకింగ్స్‌ జాబితాలో టాప్‌–1000లో నిలవాలి.
➤ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌ లేదా ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంపార్టెన్స్‌ జాబితాలో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లు కూడా అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్‌లో వివరాలు నమోదు చేసుకునే అర్హత కల్పించారు. 

అకడమిక్‌ క్రెడిట్‌ బ్యాంక్‌.. ముఖ్యాంశాలు
☛ విద్యార్థులకు ఫ్లెక్సిబుల్‌ లెర్నింగ్‌ అవకాశం. ఆసక్తి ఉన్న కోర్సులు అభ్యసించే అవకాశం.
☛ గరిష్టంగా ఏడేళ్ల వ్యవధిలో క్రెడిట్‌ బ్యాంక్‌లోని క్రెడిట్స్‌ను వినియోగించుకునే అవకాశం
☛ తాజాగా www.abc.gov.in పేరుతో వెబ్‌పోర్టల్‌ ఏర్పాటు.
☛ ఇప్పటికే ఈ వెబ్‌పోర్టల్‌లో 18 యూనివర్సిటీల నమోదు.
☛ త్వరలోనే మరిన్ని యూనివర్సిటీలు నమోదు చేసుకునే అవకాశం.

Published date : 14 Sep 2021 04:31PM

Photo Stories