స్కాలర్‌షిప్స్...అందుకోండిలా!
ముఖ్యమైన స్కాలర్‌షిప్స్...
ఇంటర్ మెరిట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ :
ప్రతిభ ఉండి ఆర్థిక వెసులుబాటు లేని విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడకూడదనే ఉద్దేశంతో రోజు వారీ ఖర్చుల కోసం కేంద్ర ప్రభుత్వం అందించే ఉపకారవేతనం.. ‘సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ స్కాలర్‌షిప్ ఫర్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్’. దేశవ్యాప్తంగా ఏటా 82 వేల మందికి ఈ స్కాలర్‌షిప్ అందిస్తారు. వీటిలో 41 వేల స్కాలర్‌షిప్స్ అమ్మాయిలకు, 41 వేల స్కాలర్‌షిప్స్ అబ్బాయిలకు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు 3,527; తెలంగాణకు 2,570; సీబీఎస్‌ఈ విద్యార్థులకు 5,413 స్కాలర్‌షిప్స్ అందుబాటులో ఉం టాయి.
ఎవరికి ఇస్తారు?
- ఇంటర్‌లో సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్ పూర్తిచేసుకొని... డిగ్రీ/పీజీ కోర్సుల్లో చేరే విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ అందుకునేందు కు అర్హులు. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి వృత్తి విద్యా కోర్సులకు కూడా స్కాలర్‌షిప్స్ అందిస్తారు. ఇంటర్మీడియెట్/10+2లో 80 పర్సంటైల్ కంటే పైన ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల లోపు ఉండాలి. కోర్సులో నిర్దేశిత మార్కులు సాధిస్తూ ఉంటేనే ఉపకార వేతనాన్ని కొనసాగిస్తారు.
ఆర్థిక సహకారం: డిగ్రీ మొదటి సంవత్సరం నుంచి పీజీ పూర్తిచేసే వరకు ఈ స్కాలర్‌షిప్ అందజేస్తారు. విద్యార్థుల రోజువారీ ఖర్చులకు సరిపడేలా డిగ్రీ స్థాయిలో ఏడాదికి రూ.10,000, పీజీలో ఏటా రూ.20,000 అందజేస్తారు. ఇతర ఉపకారవేతనాలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి ఆర్థిక సహాయం పొందే విద్యార్థులు ఈ పథకానికి అనర్హులు.
దరఖాస్తులు: ఏటా జూన్- జూలైలో దరఖాస్తు ప్రక్రి య ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్‌లో https://scholarships.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. డిగ్రీలో మూడేళ్లు, పీజీలో రెండేళ్ల పాటు ఉపకారవేతనాలు అందజేస్తారు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 31, 2018
వెబ్‌సైట్: https://scholarships.gov.in
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్(ఎన్‌ఎంఎంఎస్‌ఎస్):
ఆర్థిక పరిస్థితి సరిగాలేక ఎనిమిదో తరగతి తర్వాత చదువు మానేసే (డ్రాప్ అవుట్స్) విద్యార్థుల సంఖ్యను తగ్గించ డానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్కాలర్‌షిప్ పథకం.. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (ఎన్ ఎంఎంఎస్‌ఎస్). దీనిద్వారా ప్రతిభ ఉన్న విద్యార్థులు చదువును కొనసాగించేం దుకు ఆర్థిక సహకారం అందుతుంది.
అర్హతలు: తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్షన్న ర లోపు ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ సాయం తో నడిచే, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదివే విద్యా ర్థులు అర్హులు.
- ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు దర ఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీరు ఏడో తరగతిలో కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. అదే విధంగా తుది ఎంపిక జరిగే సమయానికి ఎనిమిదో తరగతిలోనూ కనీసం 55 శాతం మా ర్కులు పొందడం తప్పనిసరి.
- ఎన్‌వీఎస్, కేవీఎస్, సైనిక్ స్కూల్స్, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ స్కాల ర్‌షిప్‌నకు అనర్హులు.
ఎంత మొత్తం ఇస్తారు?
దేశ వ్యాప్తంగా ఏటా లక్ష మందికి ఎన్‌ఎంఎంఎస్‌ఎస్‌ను వర్తింపజేస్తారు. నెలకు రూ.500 చొప్పున సంవత్సరానికి రూ. 6000 అందిస్తారు.
ఎంపిక విధానం: ప్రతి రాష్ట్రంలో స్కాలర్‌షిప్‌నకు ఎంపిక ప్రక్రియలో భాగంగా మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (మ్యాట్), స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (శాట్) నిర్వహిస్తారు. ఇందులో కనీసం 40 శాతం మార్కులు తెచ్చుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ: దరఖాస్తు ప్రక్రియ సాధారణంగా ఆగస్టు/సెప్టెంబర్‌లో ప్రారంభమవు తుంది.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 2018, అక్టోబర్ 31.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://scholarships.gov.in
తొమ్మిదో తరగతి అమ్మాయిలకు స్కాలర్‌షిప్స్:
పాఠశాలల్లో అమ్మాయిల డ్రాప్ అవుట్ సంఖ్య తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకం.. నేషనల్ స్కీమ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ టు గర్ల్స్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఎన్‌ఎస్‌ఐజీఎస్‌ఈ).
అర్హతలు: ఎనిమిదో తరగతి పూర్తిచేసుకొని తొమ్మిదో తరగతిలో చేరే ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులు ఈ పథకానికి అర్హులు.
- కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో చదివే అన్ని కేటగిరీల అమ్మాయిలూ దరఖాస్తు చేసుకోవచ్చు.
- విద్యార్థినుల వయసు 16 ఏళ్ల లోపు ఉండాలి.
- ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల పరిధిలోని బడుల్లోని అమ్మాయిలు అర్హులు.
ఎంత మొత్తం?
ఎంపికైన విద్యార్థిని పేరిట రూ.3000 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తారు. వడ్డీతో కలిపి ఈ మొత్తాన్ని 18 ఏళ్లు నిండి, పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత విత్‌డ్రా చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దీనికి త్వరలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://scholarships.gov.in
ఇందిరాగాంధీ స్కాలర్‌షిప్ ఫర్ సింగిల్ గర్ల్ చైల్డ్ ఫర్ పీజీ ప్రోగ్రామ్స్:
వివిధ రాష్ట్రాల్లో లింగనిష్పత్తి చాలా దయనీయంగా ఉంది. ఆడపిల్లల చదువుకు నేటికీ సరైన ప్రాధాన్యం దక్కడం లేదు. దేశంలో మహిళల సాధికారతకు చదువు ఒక్కటే మార్గం. అందుకే అమ్మాయిలు ఉన్నత చదువుల దిశగా అడుగులు వేసేలా ప్రోత్సహించేందుకు ప్రవేశ పెట్టిన పథకం.. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇందిరా గాంధీ స్కాలర్‌షిప్ ఫర్ సింగిల్ గర్ల్ చైల్డ్. అమ్మాయిల చదువుతోపాటు చిన్న కుటుంబాలను ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య లక్ష్యం.
అర్హతలు:
- దరఖాస్తు చేసుకునే అమ్మాయి ఏకైక సంతాన మై ఉండాలి. తోబుట్టువులు ఉండకూడదు. ఒకవేళ కవలలు అయితే ఒక అమ్మాయి దరఖాస్తు చేసుకోవచ్చు.
- గుర్తింపు పొందిన, ప్రభుత్వ నిధులు పొందే యూనివర్సిటీలు/కాలేజీల్లో పీజీ మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థినులు మాత్రమే అర్హులు. వయసు 30 ఏళ్ల లోపు ఉండాలి.
- ప్రభుత్వ నిధులు పొందని డీమ్డ్ వర్సిటీలు, దూరవిద్యలో చేరేవారు అనర్హులు.
స్కాలర్‌షిప్ మొత్తం: దేశ వ్యాప్తంగా ఏటా కొత్తగా మూడువేల మందికి ఈ స్కాలర్‌షిప్‌వర్తింపజేస్తారు.
- ఎంపికైన వారికి సంవత్సరానికి రూ.36,200 చొప్పున.. రెండేళ్లపాటు అందిస్తారు.
దరఖాస్తు ప్రక్రియ: ఏటా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. దీనిప్రకారం నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.ugc.ac.in/sgc
వర్సిటీ ర్యాంకర్లకు స్కాలర్‌షిప్:
డిగ్రీలో యూనివర్సిటీ స్థాయిలో టాప్ ర్యాంకులు (మొదటి ర్యాంకు, రెండో ర్యాంకు) సాధించిన ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన స్కాలర్‌షిప్ స్కీమ్.. పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ ఫర్ యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్స్. ప్రతిభావంతులు ఉన్నత విద్యవైపు అడుగులు వేసేందుకు ఉద్దేశించిన పథకమిది.
అర్హతలు: అండర్ గాడ్యుయేషన్‌లో యూనివర్సిటీ స్థాయిలో మొదటి/రెండో ర్యాంకు సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/కాలేజీలో రెగ్యులర్ విధానంలో పీజీలో మొదటి సంవత్సరం కోర్సులో చేరి ఉండాలి.
- దూరవిద్యలో చేరిన వారికి అవకాశం లేదు. పీజీలో ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే వారికి ఈ స్కాలర్‌షిప్ పథకం వర్తించదు.
సబ్జెక్టులు: లైఫ్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్, కెమికల్ సెన్సైస్, ఎర్త్ సెన్సైస్, మ్యాథమెటికల్ సెన్సైస్, సోషల్ సెన్సైస్, కామర్స్, లాంగ్వేజెస్.
వయసు: 30 ఏళ్ల లోపు ఉండాలి.
స్కాలర్‌షిప్ మొత్తం: ఏటా దేశవ్యాప్తంగా కొత్తగా మూడు వేల మందికి ఈ స్కాలర్‌షిప్ పథకం వర్తింప జేస్తారు. ఎంపికై న వారికి నెలకు రూ.3,100 చొప్పున రెండేళ్ల పాటు స్కాలర్‌షిప్ అందిస్తారు.
దరఖాస్తు ప్రక్రియ: ఏటా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో నోటిఫికేషన్ వెలువడుతుంది. యూజీసీ వెబ్‌సైట్లోనూ ఈ నోటిఫికేషన్ ఉంటుంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.ugc.ac.in/urh
ప్రొఫెషనల్ పీజీ కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీలకు స్కాలర్‌షిప్స్:
వెనకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరేలా ప్రోత్సహించేందుకు ప్రవేశ పెట్టిన పథకం.. ‘పీజీ స్కాలర్‌షిప్స్ ఫర్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఫర్ ఎస్సీ, ఎస్టీ క్యాండేట్స్’. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, ఫార్మసీ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో పీజీలో చేరుతున్న ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ అందిస్తారు. ఏటా వెయ్యి మందికి ఈ స్కాలర్‌షిప్ పథకం వర్తింపజేస్తారు.
స్కాలర్‌షిప్ మొత్తం: ఎంఈ, ఎంటెక్ కోర్సుల్లో చేరే అభ్యర్థులకు నెలకు రూ.7,800, ఇతర కోర్సుల్లో ప్రవేశాలు పొందితే రూ.4,700 చెల్లిస్తారు. కోర్సు వ్యవధిని బట్టి రెండు లేదా మూడేళ్ల వరకు స్కాలర్‌షిప్‌ను కొనసాగిస్తారు.
అర్హులు: సంబంధిత కోర్సుల్లో డిగ్రీ పట్టా పొంది పీజీ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట వయోపరిమితి 45 ఏళ్లు. విద్యార్థుల స్కాలర్‌షిప్ కొనసాగించడానికి నిరంతరం విద్యార్థుల ప్రతిభను మూల్యాంకనం చేస్తారు. ప్రతి సెమిస్టర్‌లో నిర్దేశిత మార్కులు సాధించడం తప్పనిసరి. ఇతర ఉపకారవేతనాలు, ఫెలోషిప్స్ పొందే విద్యార్థులు ఈ పథకానికి అనర్హులు. దూరవిద్యలో చేరే విద్యార్థులు అనర్హులు.
వెబ్‌సైట్: https://www.ugc.ac.in/pgsprof
- వీటితోపాటు యూజీసీ ఇంకా ఎన్నో స్కాలర్‌షిప్స్, ఫెలోషిప్స్ అందిస్తుంది. https://www.ugc.ac.in/ugc&schemes వెబ్‌సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి స్కాలర్‌షిప్స్...
ప్రగతి స్కాలర్‌షిప్స్:
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) గుర్తింపు పొందిన కాలేజీల్లో డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో చేరే అమ్మాయిలకు ఎంహెచ్‌ఆర్‌డీ ప్రవేశ పెట్టిన పథకం.. ప్రగతి స్కాలర్‌షిప్ స్కీమ్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్. దీని అమలు బాధ్యతను ఏఐసీటీఈ చూస్తుంది.
- ఏటా 4000 మందికి స్కాలర్‌షిప్స్ అందిస్తారు. వీటిలో డిప్లొమా విద్యార్థినులకు 2000, డిగ్రీ విద్యార్థినులకు 2000 కేటాయించారు. సాంకేతిక విద్యతో మహిళా సాధికారతకు కృషిచేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ స్కాలర్‌షిప్ పథకాన్ని అమలుచేస్తోంది.యి
అర్హులు: డిప్లొమా/డిగ్రీ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా ప్రవేశాలు పొందిన అమ్మాయిలు అర్హులు. వారి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి. అర్హత పరీక్షలో మెరిట్ ఆధారంగా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. రిజర్వేషన్ నిబంధనలు వర్తిస్తాయి.
స్కాలర్‌షిప్ మొత్తం: ఎంపికై న విద్యార్థులకు ట్యూషన్ ఫీజు చెల్లించడానికి గరిష్టంగా రూ.30,000 ఇస్తారు. ఒకవేళ ట్యూషన్ ఫీజు రూ.30,000 లోపుంటే ఆ మొత్తాన్ని మాత్రమే అందిస్తారు. దీంతోపాటు నెలకు రూ.2,000 చొప్పున అందజేస్తారు. ఒకవేళ విద్యార్థులు ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపు పొందినా.. లేదా ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం నుంచి లబ్ధి పొందుతున్నా రూ.30,000 స్కాలర్‌షిప్ అందుతుంది. ఈ మొత్తాన్ని పుస్తకాలు, ల్యాప్‌టాప్ తదితరాలను కొనుగోలు చేసేందుకు; పోటీ పరీక్షలకు ఫీజు చెల్లించడానికి ఉపయోగించుకోవచ్చు.
వెబ్‌సైట్: www.aicte-pragati-saksham-gov.in
సక్షమ్ స్కాలర్‌షిప్స్:
పగతి స్కాలర్‌షిప్స్ మాదిరిగానే ఈ స్కాలర్‌షిప్స్ కూడా ఎంహెచ్‌ఆర్‌డీ పథకం. దీన్ని ఏఐసీటీఈ అమలు చేస్తుంది. ప్రగతి స్కాలర్‌షిప్ స్కీమ్ నిబంధనలే ఈ పథకానికీ వర్తిస్తాయి. ఏటా 1000 మంది దివ్యాంగులను ఎంపికచేసి, స్కాలర్‌షిప్స్ అందిస్తారు. వీటిలో 500 డిప్లొమా విద్యార్థులకు, 500 డిగ్రీ విద్యార్థులకు అందజేస్తారు.
వెబ్‌సైట్: www.aicte-pragati-saksham-gov.in
గేట్, జీప్యాట్ అర్హులకు నెలకు రూ.12,400:
దేశంలో సాంకేతిక అభివృద్ధికి కృషిచేస్తున్న ఏఐసీటీఈ.. ఆ దిశగా ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించడంలో ముందుంటోంది. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్), గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్)లో ఉత్తీర్ణత సాధించి, ఏఐసీటీఈ గుర్తింపున్న కాలేజీల్లో ఎంటెక్, ఎంఈ, ఎంఆర్క్, ఎంఫార్మసీ తదితర పీజీ కోర్సుల్లో చేరే విద్యార్థులకు నెలకు రూ.12,400 అందిస్తుంది. ప్రభుత్వ ఇతర పథకాల కింద ఆర్థిక సహాయం పొందే విద్యార్థులు ఈ స్కీమ్‌కు అనర్హులు.
- 2018-19 విద్యాసంవత్సరానికి పీజీ కోర్సుల్లో చేరిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 2018, ఆగస్టు 31.
వెబ్‌సైట్: https://www.aicte-india.org
- వీటితో పాటు ప్రేరణ-స్కీమ్ ఫర్ ప్రిపేరింగ్ ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఏఐసీటీఈ - ఐఎన్‌ఏఈ ట్రావెల్ గ్రాంట్ స్కీమ్, సమృద్ధి-స్కీమ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ ఫర్ సెట్టింగ్ స్టార్టప్స్, నేషనల్ డాక్టోరల్ ఫెలోఫిప్ తదితర మరెన్నో పథకాలను ఏఐసీటీఈ అమలు చేస్తుంది.
పూర్తి వివరాలకువెబ్‌సైట్: www.aicte-india.org/schemes