సెట్స్ -2019కి సన్నద్ధమవ్వండిలా..
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఇంటర్ విద్యార్థులు రాసే పరీక్ష ఎంసెట్. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్, అగ్రికల్చర్, బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫార్మసీ, ఫార్మా-డి తదితర కోర్సుల్లో ప్రవేశాలను ఎంసెట్ ద్వారా చేపడతారు. టీఎస్, ఏపీ ఎంసెట్ 2019 పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో ఉదయం, సాయంత్రం షిఫ్టుల్లో నిర్వహించనున్నారు.
ఎంసెట్ (ఇంజనీరింగ్): ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు రాయాల్సిన పరీక్ష ఇది. అర్హత.. ఇంటర్మీడియట్ ఎంపీసీ. ఎంసెట్ (ఇంజనీరింగ్) ప్రశ్న పత్రంలో మ్యాథమెటిక్స్ నుంచి 80, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి. మూడు గంటల సమయం అందుబాటులో ఉంటుంది. ఇందులో సాధించిన ర్యాంకు ఆధారంగా.. బీటెక్, బీటెక్ (డెయిరీ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ), బీటెక్(అగ్రికల్చర్ ఇంజనీరింగ్), బీఫార్మసీ తదితర కోర్సుల్లో చేరొచ్చు. తుది ర్యాంకుల రూపకల్పనలో ఎంసెట్ స్కోర్‌కు 75 శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇస్తారు.
ఎంసెట్(అగ్రికల్చర్): అగ్రికల్చర్ బీఎస్సీ, బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి రాయాల్సిన పరీక్ష ఇది. బైపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అర్హతతో దీనికి హాజరుకావొచ్చు. పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 40 చొప్పున ప్రశ్నలు; బయాలజీ (బోటనీ, జువాలజీ) నుంచి 80 ప్రశ్నలు ఉంటాయి.
ఈసెట్ :
పాలిటెక్నిక్, బీఎస్సీ(మ్యాథ్స్) పూర్తయ్యాక.. లేటరల్ ఎంట్రీ విధానంలో నేరుగా బీటెక్, బీఈ, ఫార్మసీ కోర్సుల్లో సెకండ్ ఇయర్‌లో చేరేందుకు రాయాల్సిన పరీక్ష ఈసెట్. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఫార్మసీ/బీఎస్‌సీ(మ్యాథ్స్) ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష విధానం :
ఈసెట్ మొత్తం 200 మార్కులకు జరుగుతుంది. డిప్లొమా,ఫార్మసీ, బీఎస్‌సీ మ్యాథమెటిక్స్ ఉత్తీర్ణులకు వేర్వేరుగా ఉంటుంది. డిప్లొమా ఉత్తీర్ణులకు నాలుగు విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. అవి.. మ్యాథమెటిక్స్-50 ప్రశ్నలు; ఫిజిక్స్-25 ప్రశ్నలు; కెమిస్ట్రీ-25 ప్రశ్నలు; ఇంజనీరింగ్ పేపర్ (అభ్యర్థి ఎంపిక చేసుకునే పేపర్)-100 ప్రశ్నలు. ఫార్మసీ ఉత్తీర్ణులకు ఫార్మాస్యుటిక్స్, ఫార్మాస్యుటికల్ కెమిస్ట్రీ, ఫార్మకోగ్నసీ, ఫార్మకాలజీ విభాగాల్లో 50 ప్రశ్నలు చొప్పున మొత్తం 200 ప్రశ్నలు. బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఉత్తీర్ణులకు మ్యాథమెటిక్స్ నుంచి 100 ప్రశ్నలు; అనలిటికల్ ఎబిలిటీ, కమ్యూనికేటివ్ ఇంగ్లిష్ నుంచి 50 ప్రశ్నలు చొప్పున ఉంటాయి.
పరీక్ష వ్యవధి: మూడు గంటలు.
పీఈసెట్ :
ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీఈసెట్) ద్వారా రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ) లేదా రెండేళ్ల డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్(డీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఫిజికల్ ఎడ్యుకేషన్ అనుబంధ కళాశాలల్లో చేరేందుకు పీఈసెట్ రాయాల్సి ఉంటుంది. బీపీఈడీ కోర్సుకు ఏదైనా మూడేళ్ల డిగ్రీ/తత్సమాన విద్య; డీపీఈడీ కోర్సులో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ /తత్సమాన విద్యలో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక :
బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో చేరేందుకు రాత పరీక్షలు ఉండవు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(400 మార్కులు), స్కిల్ టెస్ట్ ఇన్ గేమ్(100 మార్కులు) ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఫిజికల్ ఎఫిఫియన్సీ టెస్ట్‌లో వంద మీటర్ల పరుగు పందెం; షాట్ పుట్, 800 మీటర్ల పరుగు పందెం నిర్వహిస్తారు. వీటితోపాటు అభ్యర్థులు తమ ఆసక్తి మేరకు హైజంప్ లేదా లాంగ్‌జంప్‌లలో ఏదో ఒక ఈవెంట్‌లో ప్రతిభ చూపాలి. వంద మార్కులకు నిర్వహించే స్కిల్ టెస్ట్ ఇన్ గేమ్‌లో పదకొండు రకాల గేమ్స్‌లో ఏదో ఒకదాన్ని ఎంచుకొని అందులో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. ఈ రెండు భాగాల్లో ప్రతిభ ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి కౌన్సెలింగ్ ద్వారా సీట్లు భర్తీ చేస్తారు.
ఐసెట్ :
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో చేరేందుకు రాయాల్సిన పరీక్ష... ఈ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఎంబీఏ కోర్సుకు ఏదేని డిగ్రీలో ఉత్తీర్ణత సరిపోతుంది. కానీ ఎంసీఏ కోర్సుకు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్మీడియెట్ స్థాయిలో మ్యాథమెటిక్స్‌ను ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. ఫైనల్ ఇయర్ విద్యార్థులు అర్హులే. ఐసెట్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షలో.. అనలిటికల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీల నుంచి 75 ప్రశ్నలు చొప్పున, కమ్యూనికేషన్ ఎబిలిటీ నుంచి 50 ప్రశ్నలు.. మొత్తం 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. అభ్యర్థుల్లో విశ్లేషణ నైపుణ్యం, గణిత సామర్థ్యం పరీక్షించేలా ప్రశ్న పత్రం ఉంటుంది. ఇంగ్లిష్ గ్రామర్, రీడింగ్ కాంప్రెహెన్షన్, వొకాబ్యులరీపైనా ప్రశ్నలు ఉంటాయి.
లాసెట్ :
రాష్ట్ర స్థాయి న్యాయ కళాశాలల్లో చేరడానికి వీలు కల్పించే పరీక్ష.. లాసెట్(లా కామన్ ఎంట్రన్‌స టెస్ట్). మూడేళ్ల బీఎల్/ఎల్‌ఎల్‌బీ కోర్సు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ/బీఎల్ కోర్సుల్లో లాసెట్ ర్యాంక్ ద్వారా ప్రవేశం పొందొచ్చు. అదేవిధంగా ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన అభ్యర్థులు పీజీ చేయడానికి పీజీ లాసెట్ నిర్వహిస్తారు. లాసెట్ ద్వారా ఇంటర్ అర్హతతో ఐదేళ్ల లా కోర్సుకు, డిగ్రీ అర్హతతో మూడేళ్ల లా కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు:
ఐదేళ్ల లా కోర్సుకు 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్(10+2 విధానంలో) (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 40 శాతం మార్కులు సరిపోతాయి).. మూడేళ్ల లా కోర్సుకు ఏదైనా డిగ్రీని(10+2+3 విధానం) 45 శాతం మార్కులతో పూర్తి చేయాలి.
1) ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన వారు పీజీ లాసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష విధానం :
గంటన్నర వ్యవధిలో జరిగే పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలుంటాయి. ఒక్కోదానికి ఒక్కో మార్కు. మూడు విభాగాలుండే ప్రశ్నపత్రంలో పార్ట్-ఎలో జనరల్ నాలెడ్‌జ, మెంటల్ ఎబిలిటీపై 30 ప్రశ్నలు.. పార్ట్-బిలో కరెంట్ అఫైర్స్‌పై 30 ప్రశ్నలు.. పార్ట్-సిలో ఆప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లాపై 60 ప్రశ్నలుంటాయి. పీజీ లాసెట్‌ను 120 ప్రశ్నలతో నిర్వహిస్తారు. ఇందులో పూర్తిగా లా సబ్జెక్టుల నుంచే ప్రశ్నలు అడుగుతారు.
పీజీఈసెట్ :
ఇంజనీరింగ్‌లో పీజీ కోర్సుల్లో చేరడానికి పీజీఈసెట్ రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షను గేట్‌కు ప్రత్యామ్నాయ టెస్టుగా పరిగణించవచ్చు. ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మసీ, ఎంఆర్క్, తదితర పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి పీజీఈసెట్ (పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) నిర్వహిస్తారు. సంబంధిత బ్రాంచ్‌లో 50 శాతం మార్కులతో బీటెక్, బీఈ, బీఫార్మసీ, బీఆర్క్ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షలను ఆన్‌లైన్‌లో మూడు రోజుల్లో నిర్వహించనున్నారు.
పరీక్ష విధానం :
అభ్యర్థులు అర్హతల మేరకు సంబంధించిన స్పెషలైజేషన్ పరీక్షకు హాజరు కావాలి. ఇది 120 మార్కులకు రెండు గంటల వ్యవధిలో పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా పీజీ ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. పీజీ ఇంజనీరింగ్ సీట్ల భర్తీ క్రమంలో జాతీయ స్థాయిలో నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్), గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్(జీప్యాట్) ఉత్తీర్ణులకు మొదట ప్రాధాన్యం ఇస్తారు. తర్వాత మిగిలిన సీట్లను పీజీఈసెట్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు.
ఎడ్‌సెట్ :
ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునే అభ్యర్థులు చేరుతున్న కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ). బీఈడీలో చేరేందుకు ఎడ్‌సెట్ రాయాల్సి ఉంటుంది.
అర్హతలు :
మ్యాథమెటిక్స్ మెథడాలజీ: మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్‌గా బీఏ/బీఎస్సీ/బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు, ఇంటర్మీడియెట్ స్థాయిలో మ్యాథమెటిక్స్ చదివిన బీసీఏ ఉత్తీర్ణులు.
ఫిజికల్ సెన్సైస్: ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా అల్లైడ్ మెటీరియల్ సైన్స్ ఒక సబ్జెక్ట్‌గా బీఎస్సీ/బీటెక్/బీఈ ఉత్తీర్ణులు/ఇంటర్మీడియెట్‌లో ఫిజిక్స్ ఒక సబ్జెక్ట్‌గా చదివిన బీసీఏ ఉత్తీర్ణులు.
బయలాజికల్ సెన్సైస్: బోటనీ, జువాలజీ లేదా అనుబంధ లైఫ్ సైన్స్ సబ్జెక్ట్‌లు గ్రూప్ సబ్జెక్ట్‌లుగా బీఎస్సీ/బీఎస్సీ(హోంసైన్స్) ఉత్తీర్ణత. ఇంటర్మీడియెట్‌లో బయలాజికల్ సైన్స్ చదివిన బీసీఏ ఉత్తీర్ణులు.
సోషల్ స్టడీస్: బీఏ/ బీకాం/ బీబీఎం/బీబీఏ/బీసీఏ ఉత్తీర్ణులు.
ఇంగ్లిష్: బీఏ స్పెషల్ ఇంగ్లిష్/బీఏ లిటరేచర్/ఎంఏ ఇంగ్లిష్ ఉత్తీర్ణులు.
ఆయా కోర్సుల చివరి సంవత్సరం అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎడ్‌సెట్ తీరు ఇలా..
ఎడ్‌సెట్ మూడు పార్ట్‌లు(పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి)గా ఉంటుంది.
- ఇందులో పార్ట్-ఎ(జనరల్ ఇంగ్లిష్ 25 ప్రశ్నలు-25 మార్కులు); పార్ట్-బి(జనరల్ నాలెడ్జ్ 15 ప్రశ్నలు-15 మార్కులు; టీచింగ్ ఆప్టిట్యూడ్ 10 ప్రశ్నలు-10 మార్కులు)లు ఎడ్‌సెట్ అభ్యర్థులందరూ రాయాల్సిన విభాగాలు.
- పార్ట్-సిలో అభ్యర్థులు తమ ఆప్షనల్ సబ్జెక్ట్‌కు అనుగుణంగా పేపర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం పార్ట్-సిలోని అయిదు సబ్జెక్ట్ పేపర్స్‌ల్లో ఏదో ఒకదాన్ని అభ్యర్థి ఎంచుకోవాల్సి ఉంటుంది. పార్ట్-సి 100 మార్కులకు జరుగుతుంది. అవి..
ఫిజికల్ సెన్సైస్: 100 ప్రశ్నలు. ఇందులో ఫిజిక్స్ నుంచి 50; కెమిస్ట్రీ నుంచి 50 ప్రశ్నలుంటాయి. మార్కులు- 100.
బయలాజికల్ సెన్సైస్: 100 ప్రశ్నలు. ఇందులో బోటనీ నుంచి 50; జువాలజీ నుంచి 50 ప్రశ్నలు చొప్పున ఉంటాయి. మార్కులు-100.
సోషల్ స్టడీస్: 100 ప్రశ్నలు. ఇందులో జాగ్రఫీ నుంచి 35; హిస్టరీ నుంచి 30; సివిక్స్ నుంచి 15; ఎకనామిక్స్ నుంచి 20 ప్రశ్నలుంటాయి. మొత్తం మార్కులు - 100.
ఇంగ్లిష్: 100 ప్రశ్నలు- 100 మార్కులు.
గమనిక: ఆయా సెట్‌ల పూర్తిస్థాయి నోటిఫికేషన్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. పరీక్ష విధానం, అర్హతలు తదితర వివరాలన్ని గతేడాది ఆధారంగా తీసుకున్నవి.
తెలంగాణ సెట్‌ల తేదీలు..
సెట్ | పరీక్ష తేదీ | నిర్వహించే యూనివర్సిటీ |
ఎంసెట్ (ఇంజనీరింగ్) | 2019 మే 3, 4, 6 తేదీల్లో | జేఎన్‌టీయూ,హైదరాబాద్ |
ఎంసెట్ (అగ్రికల్చర్) | 2019 మే 8, 9 తేదీల్లో | జేఎన్‌టీయూ,హైదరాబాద్ |
ఈసెట్ | 2019 మే 11 | జేఎన్‌టీయూ, హైదరాబాద్ |
పీఈసెట్ | 2019 మే 15 | ఎంజీ యూనివర్సిటీ |
ఐసెట్ | 019 మే 23, 24 | కాకతీయ యూనివర్సిటీ |
లాసెట్ | 2019 మే 20 | ఉస్మానియా యూనివర్సిటీ |
పీజీఎల్‌సెట్ | 2019 మే 26 | ఉస్మానియా యూనివర్సిటీ |
పీజీఈసెట్ | 2019 మే 28 నుంచి 31 వరకు | ఉస్మానియా యూనివర్సిటీ |
ఎడ్‌సెట్ | 2019 మే 31 | ఉస్మానియా యూనివర్సిటీ |
ఆంధ్రప్రదేశ్ సెట్‌ల తేదీలు..:
సెట్ | పరీక్ష తేదీ | నిర్వహించే యూనివర్సిటీ |
ఎంసెట్ (ఇంజనీరింగ్) | ఏప్రిల్ 20-22 | జేఎన్‌టీయూ, కాకినాడ |
ఎంసెట్(అగ్రికల్చర్) | ఏప్రిల్ 24 | జేఎన్‌టీయూ,కాకినాడ |
ఈసెట్ | ఏప్రిల్ 19 | జేఎన్‌టీయూ, అనంతపురం |
పీఈసెట్ | మే 8-15 | నాగార్జున యూనివర్సిటీ |
ఐసెట్ | ఏప్రిల్ 26 | ఎస్వీ యూనివర్సిటీ |
లాసెట్ | మే 6 | ఎస్కే యూనివర్సిటీ |
పీజీఈసెట్ | మే 1-4 | ఆంధ్ర యూనివర్సిటీ |
ఎడ్‌సెట్ | మే 6 | ఎస్వీ యూనివర్సిటీ |