Skip to main content

రూ.35 వేల వరకు స్టైఫండ్‌తో పీహెచ్‌డీ పట్టా పొందే అవకాశం.. యూజీసీ నెట్‌లో విజయం సాధించండిలా..

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహించే యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ)– నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(యూజీసీ నెట్‌)–2021 పరీక్ష తేదీ దగ్గరపడుతోంది. మే 2వ తేదీ నుంచే పరీక్ష ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

దేశవ్యాప్తంగా లక్షల మంది పోస్టుగ్రాడ్యుయేట్‌ అభ్యర్థులు యూజీసీ నెట్‌కు దరఖాస్తు చేసుకుంటారు. ఈ పరీక్షలో విజయం సాధిస్తే.. పరిశోధనలు, ఉన్నత విద్యతో పాటు అధ్యాపక వృత్తికి మార్గం సుగమం అవుతుంది. అందుకే నెట్‌లో అర్హత సాధించాలని ఎంతోమంది ప్రతిభావంతులు ఉవ్విళ్లూరుతుంటారు. ఈ నేపథ్యంలో.. త్వరలో జరుగనున్న యూజీసీ నెట్‌లో టాప్‌ స్కోర్‌ సాధించేందుకు ఎగ్జామ్‌ టిప్స్‌..

యూజీసీ నెట్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఏటా రెండుసార్లు నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) జరుగుతుంది. ఇందులో సాధించిన స్కోరు జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌(జేఆర్‌ఎఫ్‌) కోసమైతే మూడేళ్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కోసమైతే జీవిత కాలం చెల్లుబాటవుతుంది. నెట్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులు.. పరీక్ష సరళిని తెలుసుకోవడం చాలా అవసరం. మే 2వ తేదీ నుంచి యూజీసీ నెట్‌ పరీక్ష ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి పరీక్ష విధానం, ప్రశ్నలు, మార్కులు, మార్కింగ్‌ స్కీమ్‌ గురించిన పూర్తి అవగాహనతో సిలబస్‌పై పట్టు సాధించాలి.

నెట్‌ పరీక్ష విధానం..
నెట్‌లో ప్రధానంగా రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌–1, పేపర్‌–2. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ విధానం (మల్టిపుల్‌ చాయిస్‌)లో అడుగుతారు. అంటే.. ఒక ప్రశ్నకు నాలుగు ఆప్షన్లు ఇచ్చి, వాటిలో సరైన జవాబును గుర్తించమంటారు.
పేపర్‌–1ను కామన్‌ పేపర్‌గా పేర్కొంటారు. ఇది దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ రాయాల్సిన పేపర్‌. ఇందులో ‘టీచింగ్‌/రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌’ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. వీటిని పూర్తి చేయడానికి గరిష్టంగా ఒక గంట సమయం ఉంటుంది. ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులు కేటాయించారు.
పేపర్‌–2లో ప్రశ్నలు అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి అడుగుతారు. ఈ పేపర్‌ మొత్తం 100 ప్రశ్నలు–200 మార్కులకు (ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు) జరుగుతుంది. ఈ పరీక్ష సమయం రెండు గంటలు. పరీక్షలో ప్రశ్నలకు ఎలాంటి చాయిస్‌ లేదు. అన్ని ప్రశ్నలకు జవాబులు గుర్తించడం తప్పనిసరి. రెండు పేపర్లకు కలిపి మొత్తం 150 ప్రశ్నలు–300 మార్కులు. మూడు గంటల సమయం కేటాయించారు.

పేపర్‌–1 కీలకం..
యూజీసీ నెట్‌లో మంచి స్కోరు సాధించాలని ప్రతి అభ్యర్థి తపన పడుతుంటారు. కాని ఎక్కువ మంది పేపర్‌–1ను నిర్లక్ష్యం చేస్తుంటారు. వాస్తవానికి అభ్యర్థి ర్యాంకును నిర్ణయించేది ఈ పేపరే. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ రాసే ఈ పేపర్‌లో.. టాపిక్స్‌ అన్నీ జనరల్‌ కావడం వల్ల ఇది అందరికీ సమానంగా ఉంటుంది. మొత్తం ఫలితాల్లో ఈ పేపర్‌ స్కోరుకు అధిక ప్రాధాన్యం ఉంది. నెట్‌ పరీక్షలో నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం లేదు. కాబట్టి సరైన మార్గంలో పేపర్‌–1 కోసం కష్టపడితే.. మంచి స్కోరు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రస్తుత సమయంలో పేపర్‌–1లో ముఖ్యమైన టాపిక్స్‌ను పునశ్చరణ చేసుకోవడం మేలు.

10 టాపిక్స్‌.. 50 ప్రశ్నలు..
పేపర్‌–1ను ‘జనరల్‌ పేపర్‌’గా పిలుస్తారు. ఇందులో మొత్తం పది యూనిట్లు ఉంటాయి. ప్రతి యూనిట్‌కు సమాన వెయిటేజీ ఉంటుంది. యూనిట్స్‌ ప్రకారం చూస్తే.. పీపుల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌; లాజికల్‌ రీజనింగ్‌; టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌; రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌; కమ్యూనికేషన్‌; ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ(ఐసీటీ); హయ్యర్‌ ఎడ్యుకేషన్‌: గవర్నెన్స్‌, పాలసీ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌; రీడింగ్‌ కాంప్రహెన్షన్‌; రీజనింగ్‌ (మ్యాథ్స్‌తో కలిపి); డేటా ఇంటర్‌ప్రిటేషన్‌.. ఉంటాయి. వీటిలో ప్రతి అంశం నుంచి ఐదు ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం 50 ప్రశ్నలకు 100 మార్కులకు పేపర్‌ ఉంటుంది. పరీక్ష రాసే అభ్యర్థులు ఇప్పటికే టాపిక్స్‌ ప్రకారం సిలబస్‌ పూర్తి చేసి ఉంటారు. ఇప్పుడు రాసుకున్న నోట్స్‌ను సీరియస్‌గా రివిజన్‌ చేయడం మంచిది. పరీక్ష ఆన్‌లైన్‌లో ఉంటుంది. కాబట్టి నిర్దేశిత సమయం ప్రకారం పాత ప్రశ్న పత్రాలను సాధన చేయాలి.

పునశ్చరణ..
గతంలో యూజీసీ నిర్వహించిన నెట్‌ పేపర్లలో ప్రశ్నల సరళిని, టాపిక్స్‌ వెయిటేజీని విశ్లేషించాలి. అందుకోసం గత పేపర్లను పరిశీలించడం అవసరం. దీనివల్ల మరింతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అంశాలేవో తెలుస్తుంది. పరీక్ష సిలబస్, పరీక్ష సరళి, టాపిక్స్‌ ప్రాధాన్యం తెలుసు కాబట్టి.. ఇప్పుడున్న తక్కువ సమయంలో దృష్టిపెట్టాల్సిన అంశాలతో జాబితా రూపొందించుకోవాలి. ప్రస్తుతం మొత్తం సిలబస్‌ను మళ్లీ పరిశీలించడానికి తగినంత సమయం ఉండదు. కాబట్టి ఇప్పటికే రాసుకున్న రన్నింగ్‌ నోట్స్‌ను చదవడం మంచిది. పరీక్షకు వెళ్లే వరకు వీలైనన్నిసార్లు అదే నోట్స్‌ను, కాన్సెప్ట్స్‌ను పునశ్చరణ చేయాలి. దీనివల్ల ఎక్కడైనా ఒకటి రెండు అంశాలను మరిచిపోయినా తిరిగి గుర్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. పేపర్‌–2 అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్‌పై ఉంటుంది. దానిపై ఎంత బాగా పట్టుంటే.. అంత మంచి స్కోరు సాధించేందుకు ఉయోగపడుతుంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ugcnet.nta.nic.in

నెట్‌తో అవకాశాలు...
యూజీసీ నెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రయోజనాలు అనేకం. ముఖ్యంగా యూజీసీ నెట్‌ అర్హతతో ఉన్నత విద్యా సంస్థల్లో పీహెచ్‌డీ వంటి కోర్సుల్లో చేరిన విద్యార్థులు జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిద్వారా జేఆర్‌ఎఫ్‌ స్కాలర్‌గా నెలకు రూ.31,000 (మొదటి రెండేళ్లు), ఆ తర్వాత నెలకు సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (ఎస్‌ఆర్‌ఎఫ్‌) రూ.35,000 (రెండేళ్లు) పొందుతారు.

    • యూజీసీ నెట్‌తో మరో మంచి కెరీర్‌ అవకాశం ‘అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌’. నెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో లెక్చరర్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
    • ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ), రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, హ్యూమన్‌ రిసోర్స్, ఫైనాన్స్‌ వంటి విభాగాల్లో నియామకాల్లో యూజీసీ నెట్‌ అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం లభిస్తుంది.
Published date : 21 Apr 2021 01:42PM

Photo Stories