Skip to main content

పరిశోధనలకు..@ ఐఐఎస్సీ

శాస్త్ర విద్య, పరిశోధనలకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ- బెంగళూరు) పెట్టింది పేరు. అత్యుత్తమ ప్రమాణాలతో అంతర్జాతీయస్థాయి ర్యాంకింగ్స్‌లో సత్తా చాటుతున్న ఐఐఎస్సీ.. వినూత్న కోర్సులు అందిస్తూ ముందుకు సాగుతోంది.
తాజాగా ఐఐఎస్సీ నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (రీసెర్చ్) పోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నేపథ్యంలో అర్హతలు, ఎంపిక విధానం, కోర్సు ప్రత్యేకతలు తదితర వివరాలు..
ఏటా అండర్ గ్రాడ్యుయేట్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల ద్వారా యువత పెద్ద ఎత్తున ఉన్నత విద్యా వ్యవస్థలోకి ప్రవేశిస్తోంది. దేశాభివృద్ధిలో వీరి పాత్ర అత్యంత కీలకం. ఈ క్రమంలో అత్యుత్తమ నైపుణ్యాలున్న మానవ వనరులను అందించి, దేశ ప్రగతిలో గుణాత్మక మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఐఐఎస్సీ 2011లో నాలుగేళ్ల వ్యవధితో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (రీసెర్చ్) పోగ్రామ్‌ను ప్రారంభించింది.

అర్హతలు :
మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టులతో 2018లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన వారు, 2019 పరీక్షలకు హాజరైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలకు అదనంగా బయాలజీ, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ తదితర సబ్జెక్టులను చదివిన వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు అర్హత పరీక్షలో ప్రథమ శ్రేణి లేదా 60 శాతం మార్కులు/తత్సమాన గ్రేడ్‌తో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులు ఉత్తీర్ణులైతే సరిపోతుంది.

ఎంపిక విధానం :
  • కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై)/జేఈఈ మెయిన్/ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్‌డ్/నీట్-యూజీలో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ (జనరల్ కేటగిరీ)/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రిజర్వేషన్ వర్తిస్తుంది.
కోర్సులో భాగంగా అందుబాటులో ఉన్న స్పెషలైజేషన్లు..
1. బయాలజీ
2. కెమిస్ట్రీ
3. ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్
4. మెటీరియల్స్
5. మ్యాథమెటిక్స్
6. ఫిజిక్స్

దరఖాస్తు విధానం :
  • అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దర ఖాస్తు ఫీజు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీల అభ్యర్థులకు రూ.250. ఆన్‌లైన్ పేమెంట్-నెట్ బ్యాంకింగ్, వీసాకార్డు/మాస్టర్ కార్డు, డెబిట్/క్రెడిట్ కార్డు ద్వారా ఫీజు చెల్లించొచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 30, 2019
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.iisc.ac.in

ప్రత్యేకం:
తొలి నుంచి ఐఐఎస్సీ కోర్సుల రూపకల్పన, బోధన, పరిశోధనల పరంగా ప్రత్యేకతను నిలుపుకుంటోంది. దీనికి నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (రీసెర్చ్) కోర్సును ఉదాహరణగా చెప్పొచ్చు. కోర్ సైన్సు, ఇంటర్ డిసిప్లినరీ అంశాలను సమపాళ్లలో చేర్చి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కరిక్యులంను రూపొందించారు. దీంతో కోర్సు అనంతరం అభ్యర్థులు అకడమిక్, పరిశ్రమ అవకాశాలను అందుకోవడంలో ముందుంటున్నారు. బ్యాచిలర్ డిగ్రీని విజయవంతంగా పూర్తిచేసుకొన్న అభ్యర్థులకు ఐఐఎస్సీ ఉన్నత విద్య పరంగా మాస్టర్ ఆఫ్ సైన్స్ పోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పిస్తుంది. ఈ విధానంలో అభ్యర్థులు అయిదో సంవత్సరం ఐఐఎస్సీలో చదివి, ఎంఎస్సీ డిగ్రీ పట్టా అందుకోవచ్చు.

ఇంటర్ డిసిప్లినరీ :
ఐఐఎస్సీ.. విద్యార్థులను సైన్సులో నిష్ణాతులుగా తీర్చిదిద్దేలా ఈ కోర్సును రూపొందించింది. అదే సమయంలో కరిక్యులంలో ఇంజనీరింగ్, సోషల్ సైన్స్, హ్యుమానిటీస్ అంశాలకు ప్రాధాన్యం కల్పించారు. సైన్సులో స్పెషలైజేషన్ అందిస్తూనే ఇతర సబ్జెక్టులను ఎంపిక చేసుకునేలా విద్యార్థులను ప్రోత్సహిస్తారు. ఇలాంటి విధానం వల్ల కోర్సు ఆసాంతం ఇంటర్ డిసిప్లినరీ విధానంలో సాగేందుకు అవకాశం ఏర్పడింది. కోర్సులో భాగంగా ఏడాదిన్నర పాటు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంజనీరింగ్, హ్యుమానిటీస్‌లోని బేసిక్స్‌పై బోధన సాగుతుంది. తర్వాత కాలంలో పూర్తిస్థాయి స్పెషలైజేషన్ అమలుచేస్తారు. ఈ సమయంలో విద్యార్థులకు స్పెషలైజేషన్‌తోపాటు నచ్చిన ఎలక్టివ్ కోర్సును ఎంచుకునేందుకు అవకాశం కల్పించారు. విద్యార్థులు నాలుగో సంవత్సరంలో ఫ్యాకల్టీ పర్యవేక్షణలో రీసెర్చ్ ఓరియెంటెడ్ ప్రాజెక్టుల్లో నిమగ్నమవుతారు.

బోధన :
రీసెర్చ్, బోధన, శిక్షణలో అపార అనుభవం కలిగిన బోధనా సిబ్బంది అండర్ గ్రాడ్యుయేట్ పోగ్రామ్‌కు అందుబాటులో ఉంటారు. కోర్సు నిర్వహణలో పర్యవేక్షణ, ట్యుటోరియల్స్ తదితరాలు విద్యార్థి అకడమిక్ జీవితంలో కీలకంగా వ్యవహరిస్తాయి.

క్యాంపస్‌లో సౌకర్యాలు..
  • అత్యుత్తమ సౌకర్యాలతో అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా హాస్టల్ వసతి ఉంటుంది.
  • క్యాంపస్‌లోని జింఖానా గ్రౌండ్‌లో జరిగే సాంస్కృతిక, ఎక్స్‌ట్రా కరిక్యులర్ కార్యకలాపాల్లో పాలుపంచుకొనే అవకాశం ఉంటుంది.
  • ఆరోగ్య కేంద్రం ద్వారా విద్యార్థులు; బోధన, బోధనేతర సిబ్బందికి ఆరోగ్య సేవలు అందుతాయి.
  • జేఆర్‌డీ టాటా మెమోరియల్ లైబ్రరీలో ఎన్నో విలువైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
  • ప్రముఖ సంస్థలు క్యాంపస్ నియామకాలు చేపడుతున్నాయి. ప్రాంగణ నియామకాల్లో విద్యార్థులకు సహకరించేందుకు ప్రత్యేకంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్ కేంద్రం ఉంది.
ముఖ్యాంశాలు..
  • తొలి మూడు సెమిస్టర్లలో విద్యార్థులకు శాస్త్రీయ, గణిత, ఇంజనీరింగ్ బేసిక్స్‌పై అవగాహన కల్పిస్తారు. లేబొరేటరీ, ప్రాక్టికల్ కార్యకలాపాల్లో విద్యార్థులను పాల్గొనేలా చేస్తూ ఆయా అంశాలు బోధిస్తారు.
  • నాలుగో సెమిస్టర్ నుంచి విద్యార్థి స్పెషలైజేషన్‌ను చదవాల్సి ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ, మెటీరియల్స్, ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
  • మేజర్ స్ట్రీమ్స్ అన్నీ ఇంటర్ డిసిప్లినరీ విధానంలో కొనసాగుతాయి. స్పెషలైజేషన్ అధ్యయన సమయంలో ఇతర స్ట్రీమ్స్ నుంచి కొన్ని కోర్సులను ఎంచుకొని చదవొచ్చు. ఈ విధానం వల్ల విద్యార్థులకు విస్తృత నైపుణ్యాలు, పరిజ్ఞానం సొంతమవుతుంది.
  • విద్యార్థులకు నచ్చిన స్పెషలైజేషన్లు, కాంబినేషన్ కోర్సులను ఎంచుకొనే స్వేచ్ఛ ఉంటుంది.
  • చివరి రెండు సెమిస్టర్లలో స్పెషలైజేషన్‌కు సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్‌లో విద్యార్థులు పాల్గొంటారు.
  • విద్యార్థులకు సంవత్సరం పాటు రీసెర్చ్ ప్రాజెక్టులో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ అంశమే బ్యాచిలర్ సైన్స్ పోగ్రామ్‌ను పరిశోధన, ఇంటర్ డిసిప్లినరీ కోణాల్లో ప్రత్యేకంగా నిలుపుతోంది. ఈ తరహా విధానంతో ఆధునిక పోస్ట్ గ్రాడ్యుయేట్, వొకేషనల్ ప్రమాణాలకు అనుగుణంగా కోర్సు కొనసాగుతోంది.
Published date : 14 Mar 2019 02:53PM

Photo Stories