Skip to main content

నిట్‌ల్లో ఎంటెక్‌కు సీసీఎంటీ.. కౌన్సెలింగ్ ప్ర‌క్రియ ఇలా..

సెంట్రలైజ్డ్‌ కౌన్సెలింగ్‌ ఫర్‌ ఎంటెక్‌/మాస్టర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌/మాస్టర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌.. సంక్షిప్తంగా సీసీఎంటీ! గేట్‌ స్కోర్‌ సాధించి.. ఎన్‌ఐటీలు, నిర్దేశిత ట్రిపుల్‌ ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సాంకేతిక విద్యా సంస్థల్లో.. ఎంటెక్, ఎంఆర్క్, ఎంప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు మార్గం!

సీసీఎంటీ ద్వారా ఇంటి నుంచే ఒక్క ఆన్‌లైన్‌ అప్లికేషన్‌తో అన్ని పార్టిసిపేటింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో తమకు అర్హత ఉన్న కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2021–22 విద్యా సంవత్సరంలో ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లలో అడ్మిషన్‌ కోసం.. సీసీఎంటీ–2021 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో.. సీసీఎంటీ విధి విధానాలు.. కౌన్సెలింగ్‌ ప్రక్రియ.. అర్హతలు.. అందుబాటులో ఉన్న సీట్లు తదితర వివరాలతో ప్రత్యేక కథనం..

దేశ వ్యాప్తంగా ఉన్న 31 ఎన్‌ఐటీలు, 11 ట్రిపుల్‌ ఐటీలు, 15 ఇతర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో ఎంటెక్‌ /ఎంఆర్క్‌/ఎంప్లాన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు కేంద్రీకృత విధానంలో జరిగే ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియే.. సీసీఎంటీ! గేట్‌లో ఉత్తీర్ణత సాధించి ఆయా ఇన్‌స్టిట్యూట్‌లలో చేరాలనుకుంటున్న విద్యార్థులంతా తప్పనిసరిగా సీసీఎంటీ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ దరఖాస్తు నుంచి సీటు కేటాయింపు, సీటు లభించిన ఇన్‌స్టిట్యూట్‌కు సమ్మతి తెలియజేయడం అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. దీంతో గేట్‌ ఉత్తీర్ణులకు చాలా వరకు వ్యయ ప్రయాసల నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్పొచ్చు.

సీట్ల సంఖ్య..
సీసీఎంటీ ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ద్వారా దేశంలోని అన్ని నిట్‌ల్లోని10,278 ఎంటెక్‌ సీట్లు, పదకొండు ట్రిపుల్‌ ఐటీల్లోని 728 ఎంటెక్‌ సీట్లు, పలు సెంట్రల్‌ యూనివర్సిటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లలోని 2,143 సీట్లను భర్తీ చేస్తారు. అంటే.. సీసీఎంటీ ద్వారా గేట్‌ ఉత్తీర్ణులు 13,149 సీట్లకు ఒకే దరఖాస్తుతో పోటీ పడి.. ప్రవేశం ఖాయం చేసుకునే అవకాశం లభిస్తోంది.

అర్హతలుంటేనే.. అవకాశం

  • గేట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా సీసీఎంటీ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. వీరు 2019, 2020, 2021ల్లో ఏదో ఒక సంవత్సరంలో గేట్‌ స్కోర్‌ సాధించాలి.
  • ఎంటెక్‌ కోర్సులకు బీటెక్‌/బీఈ తత్సమాన కోర్సుల్లో 6.5 జీపీఏ లేదా 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్‌సీ/ఎస్‌టీ/పీడబ్ల్యూడీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 6 జీపీఏ లేదా 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి.
  • ఈ కోర్సుల చివరి సంవత్సరం ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారు సెప్టెంబర్‌ 30లోపు సర్టిఫికెట్లు సొంతం చేసుకోవాలి.
  • ముందుగా గేట్‌–2019 స్కోర్‌ పొందిన వారిని పరిగణనలోకి తీసుకుంటారు. తర్వాత గేట్‌–2020 స్కోర్‌ను, చివరగా గేట్‌–2021లో స్కోర్‌ పొందిన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటారు.
  • ఒకే సంవత్సరంలో గేట్‌ రాసి, ఒకే విధమైన స్కోర్‌ పొందిన అభ్యర్థుల విషయంలో గేట్‌లో వంద మార్కులకుగాను అత్యధిక మార్కులు పొందిన వారికి తొలి ప్రాధాన్యం ఇస్తారు.

సీసీఎంటీ కౌన్సెలింగ్‌ ఇలా..

  • ముందుగా సీసీఎంటీ వెబ్‌సైట్‌లో లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ క్రియేట్‌ చేసుకోవాలి.
  • వాటి ఆధారంగా సీసీఎంటీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యాక.. గేట్‌ స్కోర్, అకడెమిక్‌ మార్కులు, వ్యక్తిగత వివరాలు ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లో పొందుపర్చాలి.
  • ఈ ప్రక్రియ పూర్తయ్యాక..అభ్యర్థులు అందుబాటులో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లు, సీట్ల వివరాలు చూసి.. తమ ఆసక్తికి అనుగుణంగా ప్రాథమ్యతల వారీగా ఛాయిస్‌ ఫిల్లింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాలి.
  • ఇలా అభ్యర్థులు పేర్కొన్న ప్రాథమ్యతలు, వారు గేట్‌లో పొందిన స్కోర్లు, అకడమిక్‌ మార్కులను పరిగణనలోకి తీసుకొని.. సీటు కేటాయిస్తారు.
  • మొత్తం మూడు సాధారణ రౌండ్లు, రెండు స్పెషల్‌ రౌండ్లలో సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుంది.

ఛాయిస్‌ ఫిల్లింగ్‌.. ఎన్ని సార్లయినా..
కోర్సు, ఇన్‌స్టిట్యూట్‌ పరంగా తమ ప్రాథమ్యతలను పేర్కొంటూ.. ఛాయిస్‌ ఫిల్లింగ్‌ చేసే క్రమంలో అభ్యర్థులు ఆయా రౌండ్లకు నిర్దేశించిన తేదీల్లో ఎన్నిసార్లయినా ఛాయిస్‌లను మార్చుకోవచ్చు. నిర్దేశిత రౌండ్‌ చివరి తేదీన చివరిసారిగా పేర్కొన్న ప్రాథమ్యాలనే.. సీట్ల కేటాయింపులో పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థులు ఎప్పటికప్పుడు తాము పేర్కొన్న ఛాయిస్‌లను లాక్‌ చేసి.. సేవ్‌ చేసుకుంటూ ఉండాలి.

ఇంకా చ‌ద‌వండి : part 2: రౌండ్ల వారీగా సీట్ల కేటాయింపు.. సీసీఎంటీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ ఇలా..

Published date : 15 Jun 2021 06:08PM

Photo Stories