Skip to main content

నీట్+ ఇంటర్ పరీక్షల... ప్రిపరేషన్ ఒక్కటే!

ఎంబీబీఎస్/బీడీఎస్‌తోపాటు వైద్యవిద్య సంబంధిత కోర్సుల్లో దేశవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష..నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు..సంక్షిప్తంగా నీట్!
తాజాగా నీట్ యూజీ-2020 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. వైద్య విద్య అభ్యసించాలని కలలు కనేవారు మేలో నిర్వహించనున్న నీట్‌లో సత్తా చాటడం తప్పనిసరి. అదే సమయంలో మార్చిలో జరిగే ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్ష(ఐపీఈ)లను విజయవంతంగా రాయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో.. నీట్ ఔత్సాహికులకు ఉపయోగపడేలా ఐపీఈ, నీట్ సంయుక్త ప్రిపరేషన్ ప్రణాళిక...

నీట్ ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులు దీర్ఘకాలిక పటిష్ట ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే... నీట్ సిలబస్ విస్తృతంగా ఉంటుంది. కాబట్టి సిలబస్‌ను టైమ్ టేబుల్‌కు అనుగుణంగా విభజించుకొని చదవాలి. నిర్దిష్ట సమయంలో సిలబస్‌ను పూర్తిచేసేలా ముందుకు కదలాలి. అభ్యర్థులకు స్వీయ సామర్థ్యాలపై స్పష్టత ఉండాలి. ఆ దిశగా వాస్తవిక దృక్పథంతో ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. ప్రిపరేషన్ పరంగా రోజూ చిన్నచిన్న లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. టాపిక్స్‌ను విభజించుకొని అధ్యయనం చేయాలి. ప్రతి సబ్జెక్టుకూ సమానంగా సమయం వెచ్చించాలి.

సిలబస్‌కు అనుగుణంగా..
అభ్యర్థులు ముందుగా నీట్ సిలబస్‌ను సమగ్రంగా అధ్యయనం చేయాలి. సిలబస్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ప్రిపరేషన్‌కు ఉపక్రమించాలి. సిలబస్‌లో పేర్కొన్న వాటికి అదనంగా ఇతర అంశాలను చదవాల్సిన అవసరం లేదు. నీట్, బోర్డ్ సిలబస్‌లో కొన్ని కామన్ టాపిక్స్ ఉన్నాయి. ఆయా అంశాలను బోర్డు ఎగ్జామ్స్ కోణంలో ప్రిపేరవ్వాలి. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. కేవలం నీట్ సిలబస్‌లోనే ఉన్న అంశాలకు ప్రత్యేక సమయం కేటాయించాలి.

ప్రశ్నల వైరుద్యం :
ఇంటర్ బోర్డు ప్రశ్నలు, నీట్‌లో అడిగే ప్రశ్నల తీరులో తేడా ఉంటుంది. నీట్‌లో ప్రశ్నలను సూటిగా కాకుండా.. అభ్యర్థి అప్లికేషన్ దృక్పథాన్ని పరీక్షించేలా అడుగుతారు. కాబట్టి ప్రశ్నల తీరుపై అవగాహన పెంచుకునేందుకు నమూనా పరీక్షలను ఎక్కువగా ప్రాక్టీసు చేయాలి. తద్వారా మెరుగైన స్కోరు సాధించవచ్చు.
ఇంటర్ పరీక్షలకు నెల రోజుల ముందు వరకు నీట్ ప్రిపరేషన్‌ను సమాంతరంగా కొనసాగించొచ్చు. ఇంటర్ పరీక్షలకు ఒక నెల సమయం ఉందనగా.. నీట్ ప్రిపరేషన్ పూర్తిగా పక్కనబెట్టి బోర్డు పరీక్షలపై దృష్టిపెట్టాలి.

నీట్ సిలబస్... ముఖ్యాంశాలు
ఫిజిక్స్ :
  • ఫిజిక్స్‌లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలంటే.. సాధన చాలా ముఖ్యం. ప్రాబ్లమ్స్‌ను ఒకటికి నాలుగుసార్లు సొల్యూషన్స్ చూడకుండా సొంతంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రశ్నలను తరచూ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఫిజిక్స్ కష్టమైన సబ్జెక్ట్ అనే భయం దూరమవుతుంది.
  • ఆప్టిక్స్, మెకానిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రానిక్ డివెజైస్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మోడరన్ ఫిజిక్స్ చాప్టర్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో అధ్యాయానికి చివర ఇచ్చిన ప్రశ్నలను సాధించాలి. అవకలనం, సమాకలనం అనువర్తనాలపై పట్టు సాధించాలి. నీట్‌లో ఇంటర్ రెండు సంవత్సరాల సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పాఠ్యాంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. పైన పేర్కొన్న చాప్టర్లతోపాటు మిగిలిన పాఠ్యాంశాలను అధ్యయనం చేయాలి.

కెమిస్ట్రీ :
జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మోల్ కాన్సెప్ట్, కెమికల్ బాండింగ్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కోఆర్డినేషన్ కాంపౌండ్, ఈక్విలిబ్రియమ్, పాలిమర్‌లు, బయోమాలిక్యూల్స్, పరమాణు నిర్మాణం, సాలిడ్ స్టేట్, ద్రావణాలు, సర్ఫేజ్ కెమిస్ట్రీ తదితరాలను ముఖ్య పాఠ్యాంశాలుగా పేర్కొవచ్చు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో.. ఐసోమెరిసమ్, సమ్మేళనాల తయారీ, ధర్మాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. కెమిస్ట్రీలో విద్యార్థులు చర్యలు, సమీకరణాలు మర్చిపోతుంటారు. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు పునఃశ్చరణ చేయాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో వివిధ మూలకాలు, వాటి సమ్మేళనాల ధర్మాలను అధ్యయనం చేయాలి.

బయాలజీ :
  • నీట్‌లో బయాలజీకి అధిక వెయిటేజీ ఉంటుంది. కాబట్టి ఇందులో సాధించే స్కోరు నీట్ ర్యాంకును నిర్దేశిస్తుందనడంలో సందేహం లేదు. బయాలజీలో ఫిజియాలజీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, మార్ఫాలజీ, జెనిటిక్స్ అండ్ ఎవల్యూషన్, సెల్ బయాలజీ, బయోటెక్నాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్‌లను ముఖ్య చాప్టర్లుగా పేర్కొనవచ్చు.
  • నీట్ గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. హ్యూమన్ ఫిజియాలజీ, ఎకాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్‌‌స, రీప్రొడక్షన్, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్‌హెరిటన్‌‌స యూనిట్ల నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది. అభ్యర్థులు ప్రిపరేషన్ పరంగా ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకంలోని పటాలపై దృష్టిపెట్టాలి. ఆర్గాన్‌‌స ఫిజియాలజీకి సంబంధించి తార్కిక ప్రశ్నలు వస్తున్నారుు. కాబట్టి కాన్సెప్టులపై పట్టు సాధించాలి. ఎకాలజీలో ఆర్గనైజేషన్‌‌స అండ్ పాప్యులేషన్, ఎకోసిస్టమ్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. వీటితోపాటు బయోడైవర్సిటీ, ఎన్విరాన్‌మెంట్ ఇష్యూస్ పాఠ్యాంశాలను అధ్యయనం చేయాలి.
  • ప్లాంట్ ఫిజియాలజీలో ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్, మొక్కల హార్మోన్లు, ట్రాన్‌‌సపోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్ చాప్టర్లను ప్రిపేరవ్వాలి. సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్‌‌సలో కణవిభజన(సమ విభజన, క్షయకరణ విభజన)లోని వివిధ దశల్లో జరిగే మార్పులు, కణచక్రం తదితరాలను చదవాలి. బయోమాలిక్యూల్స్ నుంచి కంటెంట్ సంబంధిత ప్రశ్నలు వస్తారుు. రీప్రొడక్షన్ నుంచి దాదాపు 10 ప్రశ్నల వరకు అడుగుతున్నారు. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థను బాగా అధ్యయనం చేయాలి. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్‌హెరిటన్‌‌సలో.. రెప్లికేషన్, ట్రాన్‌స్క్రిప్షన్, ట్రాన్‌‌సలేషన్, రెగ్యులేషన్‌లపై దృష్టిపెట్టాలి.

ప్రాక్టీస్‌తోనే టాప్ స్కోర్...
  నీట్ ప్రిపరేషన్ పరంగా పాఠ్యాంశాలను చదవడం ఎంత ముఖ్యమో.. నిరంతరం ప్రాక్టీస్ చేయడం కూడా అంతే ప్రధానం అని గుర్తించాలి. సరైన ప్రాక్టీస్ లేకుంటే.. చదివిన అంశాలు సైతం మర్చిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రాక్టీస్‌కు సంబంధించి కింది పద్ధతులను అనుసరించాలి. పాత నీట్ ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. ప్రశ్నపత్రాల సాధనలో చేస్తున్న తప్పులను గుర్తించి విశ్లేషించుకోవాలి. కష్టసాధ్యంగా అనిపించే ప్రశ్నలను గుర్తించి.. వాటిని రివిజన్ సమయంలో తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. సులభంగా ఉన్న ప్రశ్నలను సైతం రివిజన్ చేయాలి.

 ప్రామాణిక మెటీరియల్ : 
 నీట్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులు ప్రామాణిక మెటీరియల్ లేదా బుక్స్‌ను అనుసరించాలి. ఈ దిశగా ఫ్యాకల్టీ, నిపుణులు, సీనియర్లను సంప్రదించాలి. నీట్ పరీక్ష పూర్తిగా ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ చుట్టూ తిరుగుతుంది. కాబట్టి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను చదవడం తప్పనిసరి. పుస్తకాల్లో ముఖ్యమైన అంశాలను గుర్తించాలి. వాటిని రివిజన్ సమయంలో ప్రత్యేకంగా చదవాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడే ముఖ్య ప్రశ్నలను గుర్తించాలి.

 ఊహలొద్దు..
 నీట్ విజయంలో కచ్చితత్వం కీలకంగా నిలుస్తుంది. కాబట్టి తెలియని ప్రశ్నలకు సమాధానాలను ఊహించి రాసేందుకు ప్రయత్నించొద్దు. పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంది. కాబట్టి ఊహించిన సమాధానం తప్పయితే ఒక మార్కు కోల్పోతారు. దానికంటే సదరు ప్రశ్నను ప్రయత్నించకపోవడమే ఉత్తమం.

 షార్ట్ నోట్స్ : 
 ప్రిపరేషన్ సమయంలో షార్ట్ నోట్స్ రూపొందించుకోవాలి. దీనివల్ల సమయం ఆదా అవడంతోపాటు ముఖ్య అంశాలపై ఏకాగ్రత నిలిపేందుకు అవకాశం లభిస్తుంది. నీట్ బయాలజీ ప్రిపరేషన్‌కు సంబంధించి ఫ్లోచార్ట్‌లు, డయాగ్రమ్స్, షార్ట్ కట్స్‌ను ఉపయోగించాలి.

 మాక్ టెస్టులు :
 మాక్ టెస్టులకు హాజరవ్వాలి. ఇలా చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరగడంతోపాటు పరీక్ష పరంగా స్వీయ సామర్థ్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేయొచ్చు. మాక్‌టెస్టులో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రిపరేషన్ వ్యూహాలను మార్చుకోవాలి. బలహీనంగా ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. పరీక్షకు నెల రోజుల సమయం ఉందనగా కొత్త చాప్టర్లు, అంశాల జోలికి పోకూడదు. ఆ సమయంలో చదివిన అంశాలనే రివిజన్ చేస్తుండాలి.

 ఆరోగ్యమే మహాభాగ్యం :
 పరీక్షకు ప్రిపేరయ్యే అభ్యర్థులు శారీరక, మానసిక ఆరోగ్యాలపై దృష్టిపెట్టాలి. మంచి సమతుల ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. రోజూ వ్యాయామం చేయాలి. ఆరు నుంచి ఏడు గంటల పాటు తప్పనిసరిగా నిద్రపోవాలి. ప్రిపరేషన్ పరంగా సానుకూల దృక్పథం ప్రదర్శించాలి. తద్వారా సానుకూల ఫలితాలను పొందేందుకు అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని అతి విశ్వాసంగా మారకుండా చూసుకోవాలి. కష్టపడి చదివితే విజయం దానంతట అదే వస్తుందని గుర్తించాలి.
 
 నీట్ యూజీ -2020 నోటిఫికేషన్ వివరాలు..
 నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)..నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్)-2020కు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య కళాశాలల్లోని అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) మెడికల్ కోర్సులు ఎంబీబీఎస్/ బీడీఎస్‌ల్లో ప్రవేశం లభిస్తుంది. దీంతోపాటు వైద్య సంబంధిత కోర్సులైన బీఏఎంఎస్/బీఎస్‌ఎంఎస్/బీయూఎంఎస్/బీహెచ్‌ఎంఎస్‌ల్లోనూ ప్రవేశాలు కల్పిస్తారు.
 - నీట్‌లో బయాలజీ(బోటనీ, జువాలజీ), ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి మొత్తం 180 ప్రశ్నలు అడుగుతారు. సాధారణంగా బోటనీ, జువాలజీల నుంచి 45 చొప్పున.. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 45 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు కేటాయించారు. అంటే.. నీట్ పరీక్ష 180 ప్రశ్నలకు గాను మొత్తం 720 మార్కులకు జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.
 
 అర్హత: 10+2/ఇంటర్మీడియెట్ బైపీసీ.
 వయసు: 17-25 ఏళ్ల మధ్య ఉండాలి.
 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
 దరఖాస్తులకు చివరితేది: 31.12.2019
 దరఖాస్తు ఫీజు: రూ.1500
 పరీక్ష తేది: 03.05.2019
 పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.ntaneet.nic.in
Published date : 20 Dec 2019 04:27PM

Photo Stories