Skip to main content

ఈ కోర్సులతో కొలువుకు ధీమా.. దరఖాస్తు చేసుకోండిలా..

శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ రంగంలోకి ప్రవేశించాక సాగు విధానాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. దీంతో వ్యవసాయ, అనుబంధ రంగాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ రంగంలో ఉద్యోగ,ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి.
ఇటీవల హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ 2020-21 విద్యా సంవత్సరానికి అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్ విభాగాలకు సంబంధించిన డిగ్రీ స్థాయి కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఆయా వ్యవసాయ కోర్సులు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక కథనం...

అగ్రి కోర్సుల భర్తీ ప్రక్రియ..
తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు వివిధ అగ్రికల్చరల్ కోర్సులు నిర్వహిస్తున్నాయి. ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ప్రతీ ఏటా ప్రత్యేక కౌన్సెలింగ్ ద్వారా సీట్లు భర్తీ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ... 2020-21 విద్యా సంవత్సరానికిగానూ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్ విభాగాలకు సంబంధించి డిగ్రీ స్థాయి కోర్సుల్లో సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

సీట్లు భర్తీచేసే యూనివర్సిటీలు
{ఫొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ(పీజేటీస్‌ఏయూ), పి.వి.నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ.

సీట్ల వివరాలు..
  • బీఎస్సీ అగ్రికల్చర్ (హానర్స్-4ఏళ్లు)-432+ 75 (పేమెంట్ సీట్లు)
  • బీవీఎస్సీ అండ్ ఏహెచ్(ఐదున్నర ఏళ్లు)-158 సీట్లు
  • బీఎఫ్‌ఎస్సీ(నాలుగేళ్లు)-36(దీంట్లో 25 సీట్లు తెలంగాణ లోని వనపర్తి జిల్లా పెంబేర్ కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్‌లోనివి. కాగా మిగతా 11 ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ముతుకూరు కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్‌లోనివి)
  • బీఎస్సీ(హానర్స్) హార్టికల్చర్ (నాలుగేళ్లు)-130+20 (పేమెంట్ సీట్లు)
బీఎస్సీ అగ్రికల్చర్..
  • అగ్రికల్చర్ కోర్సుల్లో ఎక్కువ మంది ఎంపిక చేసుకునే కోర్సు.. బీఎస్సీ అగ్రికల్చర్. ఈ కోర్సు కాలవ్యవధి నాలుగేళ్లు. ఇందులో చేరిన విద్యార్థులకు సాగులో ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం ఎలాగో నేర్పిస్తారు.
  • అర్హతలు: ఇంటర్మీడియెట్ బైపీసీ విద్యార్థులు అర్హులు. తెలంగాణ స్టేట్ ఎంసెట్-2020లో ర్యాంకు ఆధారంగా ప్రవేశం లభిస్తుంది.
  • ఉన్నత విద్య పరంగా బీఎస్సీ అగ్రికల్చర్ అభ్యర్థులు ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ దిశగా అడుగులు వేయొచ్చు.
  • ఉపాధి అవకాశాలు: ఈ కోర్సులు పూర్తిచేసి వ్యవసాయ రంగంలో పరిశోధనల దిశగా అడుగులు వేయొచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని ఎరువులు, రసాయనాలు, విత్తన ఉత్పాదక సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందవచ్చు. బ్యాంకులు, బీమా సంస్థలు, టీచింగ్‌లోనూ కెరీర్ సొంతం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి వ్యవసాయశాఖలో అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లుగా ఉద్యోగావకాశాలు సంపాదించవచ్చు.
బీవీఎస్సీ అండ్ ఏహెచ్..
  • వైద్య విద్యను అభ్యసించాలనే ఆసక్తి ఉండి, వివిధ కారణాలతో మెడిసిన్‌లో చేరలేని వారికి ప్రత్యా మ్నాయంగా నిలుస్తున్న కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ(బీవీఎస్సీ, ఏహెచ్). కోర్సు వ్యవధి ఐదున్నరేళ్లు.
  • ఈ కోర్సులో చేరేందుకు ఇంటర్మీడియెట్ బైపీసీ ఉత్తీర్ణులై ఉండాలి. దాంతోపాటు తెలంగాణ స్టేట్ ఎంసెట్ -2020లో ర్యాంకు సాధించాలి.
  • కోర్సు స్వరూపం: బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సులో భాగంగా ముఖ్యంగా జంతువులలో వచ్చే వ్యాధులు, నివారణ చర్యలు, పశువుల గర్భధారణ పద్ధతులు వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు.
  • ఉద్యోగావకాశాలు: ఈ కోర్సును పూర్తిచేసుకున్న అభ్యర్థులు ప్రభుత్వ, ప్రైవేట్ పశు వైద్య కేంద్రాలు, పశుసంవర్ధక శాలలు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జంతు ప్రదర్శనశాలలు, డెయిరీ ఫామ్స్, గోట్ అండ్ షీప్ ఫామ్స్‌లో ఉద్యోగావకాశాలు పొందవచ్చు.
  • బీవీఎస్సీ అండ్ ఏహెచ్ అభ్యర్థులు.. ఉన్నత విద్య పరంగా పీజీ, పీహెచ్‌డీ స్థాయి కోర్సుల్లో చేరే వీలుంది.
బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్(బీఎఫ్‌ఎస్సీ)..
  • చేపల పెంపకంపై ప్రత్యేక శిక్షణనిచ్చే కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్. కోర్సు కాల వ్యవది నాలుగేళ్లు.
  • ఇంటర్మీడియెట్ బైపీసీ పూర్తి చేసిన వారు బీఎఫ్‌ఎస్సీలో చేరేందుకు అర్హులు. తెలంగాణ స్టేట్ ఎంసెట్ -2020లో ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
  • ఉద్యోగావకాశాలు: ఈ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు ఆక్వాకల్చర్, ఆక్వారీసెర్చ్ సెంటర్స్‌లో ఉద్యో గావకాశాలు పొందవచ్చు.
బీఎస్సీ హార్టికల్చర్..
  • అగ్రికల్చరల్ సైన్సులో ఒక భాగం.. హార్టికల్చర్. మొక్కల పెంపకం, కూరగాయలు, పండ్ల సాగు, నర్సరీలు, తోటలు, ఉద్యాన వనాలు, పాలీ హౌస్‌లు, గ్రీన్ హౌజ్‌ల నిర్వహణపై ఆసక్తి ఉన్న వారు ఈ కోర్సుల్లో చేరొచ్చు.
  • ఇంటర్ బైపీసీ చదివిన అభ్యర్థులు ఈ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులు. తెలంగాణ స్టేట్ ఎంసెట్ -2020లో ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
  • ఉద్యోగాలు: ఈ కోర్సు పూర్తిచేసిన వారికి స్టేట్ హార్టికల్చర్ మిషన్, నాబార్డ్ సహా పలు బ్యాంకుల్లో మంచి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ప్రైవేట్ డ్రిప్ ఇరిగేషన్ సంస్థలు, స్వచ్చంద సంస్థలు, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో హార్టికల్చర్ గ్రా డ్యుయేట్లకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వీరు ప్రాజెక్ట్ మేనేజర్,గార్డెనర్, ఫోర్‌మ్యాన్, హార్టికల్చరిస్టు, హార్టికల్చర్ ఎడ్యుకేషన్ సూపర్‌వైజర్,ప్రొఫెసర్, సైంటిస్టుగా పనిచేసే అవకాశం లభిస్తుంది.
  • ఉన్నత విద్య: హార్టికల్చర్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు ఉన్నత విద్య పరంగా ఎంఎస్సీ హార్టికల్చర్, పీహెచ్‌డీలు చేసే అవకాశం ఉంది. పీజీ స్థాయిలో ఫ్రూట్ సైన్స్, వెజిటెబుల్ సైన్స్, ఫ్ల్రోరికల్చర్, ప్ల్రాంటేషన్, స్పైసెస్ ప్రత్యేక అంశాలుగా ఎంఎస్సీ విద్యను అభ్యసించవచ్చు.
కెరీర్‌కు తిరుగులేదు..
అగ్రికల్చర్, అనుబంధ కోర్సులను అభ్యసించిన విద్యార్థు లు మంచి భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు. వ్యవసా య రంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా అగ్రి కల్చర్ యూనివర్సిటీలు పాఠ్య ప్రణాళికల్లో మార్పులుచేర్పులు చేస్తున్నాయి. ప్రాక్టికల్ నాలెడ్జ్‌కు ప్రాధాన్యత పెంచుతూ.. బోధన పద్దతుల్లో మార్పులు తెస్తున్నాయి. కోర్సు చివరి సంవత్సరంలో జరిగే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉజ్వల కెరీర్ అవకాశాలు అందుకునే వీలుంది.

ముఖ్యమైన సమాచారం
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేదీ : 16.11.2020
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : www.pjtsau.edu.in
Published date : 16 Nov 2020 01:57PM

Photo Stories