Skip to main content

ఐటీఐతో చిన్న వయస్సులోనే ఉద్యోగం పొందే అవకాశం!

ఐటీఐ.. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్. చిన్న వయసులోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందాలనుకునే వారికి అద్బుతమైన అవకాశం! పదోతరగతి విద్యార్హతతో ఏడాది లేదా రెండేళ్ల కాలవ్యవధి కలిగిన ఐటీఐ కోర్సుల్లో చేరొచ్చు.

 కోర్సు పూర్తయ్యాక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందే వీలుంటుంది. 2020 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఐటీఐ ఆన్‌లైన్ అడ్మిషన్స్ 2020 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఐటీఐ కోర్సుల్లో చేరేందుకు అర్హతలు, ప్రవేశ విధానం.. ఉపాధి అవకాశాలపై ప్రత్యేక కథనం... 

 30 ట్రేడులు.. 40వేల సీట్లు..

ఐటీఐ విద్యకు సంబంధించి తెలంగాణలో 63 ప్రభుత్వ, 208 ప్రైవేట్ కాలేజీల్లో.. దాదాపు 40వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. 23 ఇంజనీరింగ్, 7 నాన్ ఇంజనీరింగ్ ట్రేడుల్లో ఐటీఐ శిక్షణను ఇస్తున్నాయి. 

 

అర్హతలు:

  1.     పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతలో ఉత్తీర్ణత సాధించిన వారై ఉండాలి.
  2.     ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు పెయింటర్ జనరల్, వైర్‌మ్యాన్, కార్పెంటర్, మెటల్ వర్కర్ ట్రేడుల్లో ప్రవేశం కల్పిస్తారు. 

 

వయసు..

 ఐటీఐ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులకు 14ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.

 

దరఖాస్తు విధానం..

 తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గతేడాది నుంచే ఆన్‌లైన్ విధానంలో ప్రవేశాలకు ప్రభుత్వం అనుమతించింది. ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ తప్పనిసరి. 

 

ఎంపిక ప్రక్రియ..

 ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేసుకున్న అభ్యర్థులు.. ఐటీఐలు, ట్రేడ్ ఆప్షన్‌లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి.. మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ఐటీఐ కాలేజీలను, ట్రేడ్లను ఖరారు చేస్తారు. అనంతరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్‌కు హాజరై ధృవపత్రాల పరిశీలన ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది.

 

వెరిఫికేషన్ ప్రక్రియ..

 {పస్తుత ఏడాది పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. విద్యార్హతలు సహా ఇతర సర్టిఫికేట్లు దరఖాస్తు సమయంలోనే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఎస్‌ఎస్‌సీ మార్కుల మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్(టెన్త్ పాస్ కానీ వారు మాత్రమే), బోనఫైడ్ సర్టిఫికెట్, రెసిడెన్షియల్ సర్టిఫికెట్, ఇన్‌కమ్, కండక్ట్, దివ్యాంగులైతే సదరు ధృవీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాలి. 

 

సీట్ల కేటాయింపు..

 15శాతం సీట్లకు లోకల్, నాన్‌లోకల్ విద్యార్థులు పోటీపడొచ్చు. మిగిలిన 85శాతం సీట్లను స్థానిక విద్యార్థులతో భర్తీ చేస్తారు. ఎస్సీలకు-15, ఎస్టీలకు-6, బీసీఏ-7, బీసీబీ-10, బీసీసీ-1, బీసీడీ-7, బీసీఈ కేటగిరి వారికి 4శాతం సీట్లను రిజర్వ్ చేస్తారు. 

 

ముఖ్యమైన సమాచారం..

  1.     దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
  2.     దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 07, 2020
  3.     పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://iti.telangana.gov.in

 

ఇంజనీరింగ్ ట్రేడ్లు..

 తెలంగాణలో అందుబాటులో ఉన్న ఇంజనీరింగ్ ట్రేడ్‌లు... 

  1.     డాఫ్డ్‌మెన్(సివిల్)
  2.     డాఫ్ట్స్‌మెన్(మెకానికల్)
  3.     ఎలక్ట్రీషియన్
  4.     ఎలక్ట్రానిక్స్ మెకానిక్
  5.     ఫిట్టర్
  6.     ఇన్ఫర్మేషన్
  7.     కమ్యూనికేషన్
  8.     టెక్నాలజీ
  9.     సిస్టమ్ మెయింటెనెన్స్
  10.     ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్
  11.     లేబొరేటరీ అసిస్టెంట్(కెమికల్ ప్లాంట్)
  12.     ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్(కెమికల్ ప్లాంట్)
  13.     మెషినిస్టు, మెషినిస్టు(గ్రైండర్)
  14.     డెంటల్ లేబొరేటరీ ఈక్విప్‌మెంట్ టెక్నీషియన్
  15.     మెకానిక్(రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్)
  16.     మెకానిక్ డీజిల్
  17.     ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్
  18.     ప్లంబర్
  19.     కార్పెంటర్
  20.     షీట్ మెటల్ వర్కర్
  21.     వెల్డర్ మొదలైనవి. 

 

నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్లు..

  1.     కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్
  2.     డెస్‌మేకింగ్
  3.     హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్
  4.     హాస్పిటల్ హౌస్‌కీపింగ్
  5.     లిథో ఆఫ్ సెట్ మెషీన్ మిండర్
  6.     సీవింగ్ టెక్నాలజీ
  7.     పీ స్కూల్ మేనేజ్‌మెంట్(అసిస్టెంట్)
  8.     స్టెనోగ్రాఫర్/సెక్రటేరియల్ అసిస్టెంట్(ఇంగ్లిష్)
  9.     డైవర్ కమ్ మెకానిక్(లైట్ మోటార్ వెహికల్) తదితరాలు. 

 

నైపుణ్య శిక్షణకు ప్రాముఖ్యత..

 ఐటీఐ ట్రేడుల్లో శిక్షణ వ్యవధిలో 70 శాతం ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. మిగిలిన 30 శాతం ట్రేడ్ థియరీ, వర్క్‌షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఎంప్లాయిబిలిటీ స్కిల్స్, లైబ్రరీ అండ్ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కు కేటాయిస్తారు.

 

అప్రెంటీస్‌షిప్ చేయాలి..

 ఐటీఐ కోర్సును పూర్తిచేసిన విద్యార్థులు నిర్ధిష్ట కాలవ్యవధిలో అప్రెంటీస్ శిక్షణను పూర్తిచేయాలి. భారత రైల్వే, బీహెచ్‌ఈఎల్, సింగరేణి, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తదితర ప్రభుత్వ/ప్రైవేట్ పారిశ్రామిక సంస్థలు అప్రెంటిస్ అవకాశాలను కల్పిస్తున్నాయి. అప్రెంటిషిప్ సమయంలో ఆయా సంస్థలు నిబంధనలకు అనుగుణంగా స్టయిపెండ్‌ను కూడా అందిస్తున్నాయి.

 

ఐటీఐ తర్వాత ఏం చేయాలి..

 ఐటీఐ విద్యను పూర్తిచేసిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ కార్మిక మంత్రిత్వశాఖ పరిధిలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్(ఎన్‌సీవీటీ) సర్టిఫికేట్ అందిస్తుంది. ఈ సర్టిఫికేట్ పొందిన అభ్యర్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉపాధి కల్పనలో ప్రాధాన్యత లభిస్తుంది. ముఖ్యంగా..

  1.     రైల్వే అసిస్టెంట్ లోకోపెలైట్
  2.     టెక్నియన్
  3.     ఆర్డినెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో కోల్ ఇండియా, సింగరేణి
  4.     విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో ఎలక్ట్రిషియన్, వెల్డర్, ఫిట్టర్ వంటి ఉద్యోగాలు;
  5.     అలాగే ఇండియన్ ఆర్మీలో సోల్జర్ ట్రేడ్‌మెన్ వంటి కొలువులు సొంతం చేసుకోవచ్చు. ఇవే కాకుండా రాష్ట్రస్థాయిలో విద్యుత్ సంస్థలో జూనియర్ లైన్‌మెన్, సర్వేయర్ వంటి ఉద్యోగాలను కూడా పొందవచ్చు.

 

ఉన్నత విద్య చదవొచ్చు..

 ఐటీఐ ఇంజనీరింగ్ ట్రేడులు పూర్తిచేసిన అభ్యర్థులు.. లేటరల్ ఎంట్రీ విధానంలో పాలిటెక్నిక్ రెండో ఏడాదిలో ప్రవేశం పొందొచ్చు. డిప్లొమా పూర్తిచేసిన తర్వాత ఈసెట్ పరీక్ష రాసి బీటెక్‌లో ప్రవేశం అవకాశం ఉంది.

Published date : 07 Sep 2020 04:58PM

Photo Stories