Skip to main content

Budget: నిర్మలమ్మ షాక్‌ ఇస్తుందా.. ఉపశమనం ఇస్తుందా...?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ 2023–24ను సమర్పించనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ సారి బడ్జెట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించడంతో పాటు పన్ను ప్రయోజనాల రూపంలో ప్రజలకు కొంత ఉపశమనాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

అయితే ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండడంతో ఆయా రాష్ట్రాలకు భారీగా తాయిళాలు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఇదే చివరి పూర్తి బడ్జెట్‌ కావడంతో దేశ ప్రజల మొత్తం దృష్టి బడ్జెట్‌పై పడింది. అలాగే ద్రవ్య లోటు, ద్రవ్యోల్బణాన్ని ఎలా నియంత్రిస్తుంది అనే దానిపై అందరి దృష్టి ఉంది. ఈ సారి బడ్జెట్‌లో ఈ ప్రతిపాదనలు ఉండొచ్చని అటు ప్రజలతో పాటు నిపుణులు భావిస్తున్నారు. అవేంటో ఓ లుక్కేద్దాం!
తక్కువ ఆర్థిక లోటు..
1 ఏప్రిల్‌ 2023 నుంచి ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారతదేశం తన ఆర్థిక లోటు లక్ష్యాన్ని 50 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించుకోవచ్చని గోల్డ్‌మన్‌ సాక్స్‌ గ్రూప్‌ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం మూలధన వ్యయాన్ని కొనసాగిస్తూ సంక్షేమ వ్యయాన్ని పెంచడంతో పాటు గ్రామీణ ఉపాధి, గృహనిర్మాణంపై దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.

budget


పన్ను స్లాబ్‌...
ప్రస్తుత పన్ను స్లాబ్‌లో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు రూ.2.5 లక్షల ప్రాథమిక మినహాయింపు పరిమితి ఉంది. దీని అర్థం ఈ పరిమితి కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయవలసిన అవసరం లేదు. అయితే ఈ నిబంధనలో గత ఏడేళ్లగా ఎటువంటి మార్పులు చేయలేదు. దీంతో రాబోయే బడ్జెట్‌లో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని కేంద్రం రూ. 5 లక్షలకు పెంచే అవకాశం ఉంది.
ప్రామాణిక తగ్గింపు(స్టాండర్డ్‌ డిడక్షన్‌ )
ప్రభుత్వం స్టాండర్డ్‌ డిడక్షన్‌ను రూ. 50,000 నుంచి రూ. లక్ష వరకు రెట్టింపు చేసే అవకాశం ఉందని పన్ను చెల్లింపుదారులు భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం పెరుగుతున్న జీవన వ్యయం, ద్రవ్యోల్బణం కోసం ప్రామాణిక మినహాయింపు పరిమితిని రెట్టింపు చేయాలని వాదన కూడా ఉంది.
మౌలిక సదుపాయాలు, సామాజిక పథకాల వ్యయం
ఈ ఏడాది బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలపై ఖర్చు కూడా పెంచే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే రానున్న కాలంలో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బడ్జెట్‌ ఇదే కావడంతో ప్రభుత్వం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సామాజిక రంగ సంక్షేమ పథకాలకు మరిన్ని నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Published date : 25 Jan 2023 06:19PM

Photo Stories