Skip to main content

ఇటీవల యువతకు ఉపాధి ముందుంటున్న నేషనల్‌ లా యూనివర్సిటీ ఇన్సూరెన్స్‌ ప్రోగ్రామ్‌ నోటిఫికేషన్‌ విడుదల.. రూ.3 ల‌క్షల ప్రారంభం వేత‌నంతో ఉద్యోగాల‌కు అవ‌కాశం..

దేశంలో వేగంగా విస్తరిస్తున్న రంగాల్లో బీమారంగం ఒకటి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిత్యనూతన పాలసీలతో, పథకాలతో ఎప్పటికప్పుడు మన ముందుకు వస్తుంటుంది బీమా రంగం. వ్యక్తులు, పరిశ్రమలు, ఆస్తులు.. ఇలా ప్రతి ఒక్క దానికి ఇన్సూరెన్స్‌ చేపించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. బీమాతో రక్షణ కల్పిస్తూనే.. లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది ఇన్సూరెన్స్‌ రంగం.

ఈ రంగంలో నిపుణుల కొరతను తీర్చేందుకు పలు ఇన్‌స్టిట్యూట్‌లు.. వివిధ రకాల కోర్సులను అందిస్తున్నాయి. ఇటీవల నేషనల్‌ లా యూనివర్సిటీ, జో«ద్‌పూర్‌.. ఎంబీఏ ఇన్సూరెన్స్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. బీమా కోర్సులు–కెరీర్‌ అవకాశాలపై కథనం..

ఎన్‌ఎల్‌యూ–ఎంబీఏ ఇన్సూరెన్స్‌..
రాజస్తాన్‌ రాష్ట్రం, జో«ద్‌పూర్‌లోని నేషనల్‌ లా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌యూ).. రెండేళ్ల ఎంబీఏ ఇన్సూరెన్స్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ఎంబీఏ ఇన్సూరెన్స్‌ అనేది రెండేళ్ల పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు. బీమా రంగంలో కెరీర్‌ కోరుకునే వారికి సంబంధిత నైపుణ్యాలు తప్పనిసరి. ఈ కోర్సులో భాగంగా కార్పొరేట్‌ రిస్క్‌ గురించి లోతైన శిక్షణను అందిస్తారు. దీనిలో బ్యాంకింగ్, బీమా రంగాలకు సంబంధించి అవగాహన కల్పిస్తారు.

అర్హతలు..
ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి, ఇంటర్మీడియెట్‌; అలాగే 50 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత లేదా దానికి సమానమైన సీజీపీఏ సాధించి ఉండాలి. రిజర్వేషన్లు కలిగిన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం–5 శాతం మేర మార్కుల సడలింపు ఉంటుంది. సంబంధిత అర్హత కోర్సు చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

క్వాలిఫయింగ్‌ టెస్ట్‌..
అభ్యర్థులకు 2020–21 క్యాట్‌/మ్యాట్‌/సీమ్యాట్‌లలో కనీస స్కోర్‌ ఉండాలి.

  • క్యాట్‌ అయితే 50 పర్సంటైల్‌
  • సీమ్యాట్‌ అయితే మొత్తం స్కోర్‌ 160
  • మ్యాట్‌ అయితే మిశ్రమంగా 400 స్కోర్‌ సాధించాలి.

ఎంపిక ప్రక్రియ..
క్వాలిఫయింగ్‌ టెస్ట్, గ్రాడ్యుయేషన్‌/ప్రీ–ఫైనల్‌ ఎగ్జామ్‌ (ఫైనల్‌ ఇయర్‌ చదివేవారైతే)లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్‌ ప్రకారం– అభ్యర్థులను ఎంపిక చేస్తారు. క్వాలిఫయింగ్‌ టెస్ట్‌కు సంబంధించి 50 శాతం వెయిటేజీ ఉంటుంది.

నైపుణ్యాలతో కెరీర్‌..
బీమా రంగాన్ని కెరీర్‌గా ఎంచుకునే వారికి నైపుణ్యాలు చాలా ముఖ్యం. సృజనాత్మకత, ఓర్పు, సహనం, చురుకుదనం, అందరితో కలిసి పనిచేయగలిగేతత్వం, ఇతరులను తమ మాటలతో ఆకర్షితులను చేయగలిగే నేర్పు ఉన్నవారు ఈ రంగంలో బాగా రాణిస్తారు.

అవకాశాలు..
బీమా రంగానికి సంబంధించిన కోర్సులు పూర్తిచేసిన వారికి ఉద్యోగావకాశాల పరంగా ఎలాంటి ఢోకా లేదు. ఈ రంగంలో ప్రస్తుతం నైపుణ్యం కలిగిన నిపుణుల కొరత అధికంగా ఉంది. బీమా సంబంధిత కోర్సులను చదివిన అభ్యర్థులకు జాబ్‌ మార్కెట్లో మంచి డిమాండ్‌ నెలకొంది. చాలా సంస్థలు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ద్వారానే అభ్యర్థులను నియమించుకుం టున్నాయి. ఈ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు.. ఐటీ, కార్పొరేట్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్‌ వంటి జాతీయ, అంతర్జా తీయ సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందే వీలుంటుంది.

భవిష్యత్తు భద్రమే..
కెరీర్‌కు భరోసానిచ్చే రంగాల్లో బీమా రంగం ముందుంటుంది. ఇతర రంగాలతో పోల్చినప్పుడు ఈ రంగం ఎప్పటికీ సుస్థిరంగా ఉంటుంది. ఇన్సూరెన్స్‌ రంగం కొత్త కొత్త పాలసీలు, నిత్యనూతన పథకాలతో ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఈ రంగంలో ఉద్యోగ భద్రత, కెరీర్‌ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

జాబ్‌ ప్రొఫైల్స్‌..
బీమా రంగంలో ఉద్యోగం పొందిన వారు అండర్‌రైటర్స్, క్లెయిమ్‌ హోల్డర్స్, మార్కెటింగ్‌ ఆఫీసర్స్, రిస్క్‌ మేనేజర్స్‌ హోదాల్లో పనిచేయాల్సి ఉంటుంది. నైపుణ్యాలు, అనుభవాన్ని బట్టి మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్‌ క్లెయిమ్స్‌గా పదోన్నతులు కూడా పొందవచ్చు.

వేతనాలు..
బీమారంగంలో పనిచేసే వారి వేతనాలు, ఐటీ సంస్థల్లో పనిచేసే వారి జీతాలతో సమానంగా ఉంటున్నాయి. కంపెనీ స్థాయి, చేసే పనిని బట్టి వార్షిక వేతనం రూ.3–5 లక్షల వరకు ఉంటుంది. అనుభవం, నైపుణ్యాలు, పనితీరు ఆధారంగా వార్షిక వేతనం రూ.10–15 లక్షల వరకు పొందే బీమా రంగ నిపుణులు కూడా ఉన్నారు.

ముఖ్య సమాచారం..

  • కోర్సు: ఎన్‌ఎల్‌యూ–ఎంబీఏ ఇన్సూరెన్స్‌.
  • దరఖాస్తు విధానం: ఆన్‌ౖలైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదీ: జూన్‌ 15, 2021
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.nlujodhpur.ac.in
Published date : 27 Apr 2021 03:01PM

Photo Stories