Skip to main content

ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ రంగంలో కొత్త కొలువులు

కామర్స్, మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ రూపంలో మరో కీలక కెరీర్‌ వేదిక అందుబాటులోకి వచ్చింది.
 అపార అవకాశాలకు కేరాఫ్‌గా మారనున్న ఈ విభాగంలో నిపుణులకు ప్రారంభంలోనేరూ.లక్షల్లో వేతనాలు లభించనున్నాయి. ఇప్పటికే ఐఐఎం, ఇతర ప్రముఖ బి–స్కూళ్లలో విద్యార్థులకు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ విభాగాల్లో క్యాంపస్‌ ఆఫర్లు సొంతమవుతున్నాయి. రానున్న రోజుల్లో ఇవి మరిన్ని ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థులకూ అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ విభాగంలో కెరీర్‌ అవకాశాలపై ప్రత్యేక కథనం..

ప్రస్తుత కార్పొరేట్‌ ప్రపంచంలో సంస్థల విలీనాలు, టేకోవర్లు, షేర్ల బై బ్యాక్‌లు, స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్స్‌ తదితరాలు సర్వసాధారణమవుతున్నాయి. ఈ పరిణామమే ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ విభాగం అభివృద్ధికి, తద్వారా కొత్త కొలువుల ఆవిష్కరణకు కారణమవుతోంది.

వైవిధ్యం..
ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌.. వాస్తవానికి బ్యాంకింగ్‌ రంగంలో అంతర్భాగమే. కానీ, కార్యకలాపాల్లో వైవిధ్యం కారణంగా దీన్ని ప్రత్యేక విభాగంగా పేర్కొంటున్నారు. కార్పొరేట్‌ ప్రపంచంలో ఓ సంస్థను మరో సంస్థ కొనుగోలు చేయడం, రెండు సంస్థలు విలీనం కావడం, వాటాలు తీసుకోవడం వంటివి జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఓ సంస్థను ఎంతకు కొనుగోలు చేయొచ్చు? ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీవో) పరంగా ఎంత ధరను నిర్ణయించొచ్చు? తదితర అంశాలకు సంబంధించి కంపెనీలు.. అనుభవమున్న బ్యాంకింగ్, కన్సల్టింగ్‌ సంస్థలపై ఆధారపడుతున్నాయి. వీటిలోని ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ నిపుణులు క్లయింట్లకు అవసరమైన సలహాలు ఇస్తారు. ఉదాహరణకు ఏబీసీ అనే సంస్థ ఎక్స్‌వైజెడ్‌ అనే సంస్థలో కొంత వాటాను కొనుగోలు చేయాలనుకుంది. ఈ క్రమంలో బ్రోకరేజ్‌/మీడియేషన్‌ సంస్థగా ఓ బ్యాంకును ఎంపిక చేసుకుంది. ఇందులోని ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ విభాగం ఎక్స్‌వైజెడ్‌ సంస్థ మార్కెట్‌ విలువ, ఆదరణ, పనితీరు, భవిష్యత్తు ప్రణాళికలు తదితరాలను విశ్లేషిస్తుంది. ఆ తర్వాత నిర్దిష్టంగా ఒక ధరకు నిర్ణీత వాటాను కొనొచ్చు అని ఏబీసీ సంస్థకు సూచిస్తుంది. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ విభాగాలు.. నిధుల సమీకరణ విషయంలోనూ సంస్థలకు సహకరిస్తాయి.

పెరిగిన ప్రాధాన్యం..
ఇటీవల కాలంలో భారత్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. క్రెడిట్‌ స్యూస్‌ సంస్థ ప్రతినిధులు 2017, 2018 సంవత్సరాలను దేశంలో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌కు స్వర్ణయుగంగా పేర్కొన్నారు. వచ్చే మూడు నాలుగేళ్లలో ఇదే ధోరణి కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీనికి కారణం.. గత రెండేళ్లుగా దేశంలో విలీనాలు, టేకోవర్లు, ఐపీవోల జారీ వంటివి గణనీయంగా పెరగడమే.

ఏ హోదాలు?
ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ విభాగంలో ప్రస్తుతం పలు హోదాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి..
1. ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌
2. అనలిస్ట్‌
3. అసోసియేట్‌
4. రిస్క్‌ మేనేజర్‌
5. పోర్ట్‌ఫోలియో మేనేజర్స్‌..
ఈ హోదాల్లోని వ్యక్తుల విధులు ఓ సంస్థకు సంబంధించిన మార్కెట్‌ విలువను లెక్కించడం, నిధుల సమీకరణ వ్యూహాలు రూపొందించడంపైనే ఉంటాయి.

కామర్స్, మేనేజ్‌మెంట్‌’కు అనుకూలం :
ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌లోని కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకుంటే ఇందులో లభించే హోదాలు కామర్స్, ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యుయేట్లకు అనుకూలంగా ఉంటున్నాయని చెప్పొచ్చు. అకడమిక్‌గా అనలిటికల్‌ స్కిల్స్, రిస్క్‌ స్ట్రాటజీస్‌ వంటి అంశాలపై అవగాహన ఉండటం దీనికి కారణం. కామర్స్, ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యుయేట్లకు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌లో ఎంట్రీ లెవల్‌లో అసోసియేట్‌ హోదాతో సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. వీరు ఆయా సంస్థల్లో అనలిస్ట్‌లు, రిస్క్‌ మేనేజర్లకు సహాయకులుగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

క్యాంపస్‌ నియామకాలు :

  • ప్రస్తుతం వాణిజ్యరంగంలో వేగంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌లో మానవ వనరులకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ క్రమంలో బ్యాంకులు, ఫైనాన్షియల్‌ కన్సల్టింగ్‌ సంస్థలు ప్రముఖ బి–స్కూళ్లలో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్స్‌ ద్వారా నియామకాలు చేపడుతున్నాయి.
  • ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌లో క్యాంపస్‌ ఆఫర్స్, వేతనాల పరంగా ఈ ఏడాది ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)ల్లో దాదాపు 20 శాతం వృద్ధి నమోదైంది. బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్, జేపీ మోర్గాన్‌ చేజ్, అవెండస్, డెలాయిట్, గోల్డ్‌మన్‌ శాచ్‌ వంటి సంస్థలు దాదాపు 200కు పైగా ఆఫర్లు అందించాయి. ఈ సంస్థలు ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, ఎండీఐ–గుర్‌గావ్‌ వంటి ఇతర ప్రముఖ బి–స్కూల్స్‌లో సైతం ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ జాబ్స్‌ను ఆఫర్‌ చేయడమే.. ఈ విభాగానికి పెరుగుతున్న డిమాండ్‌కు నిదర్శనం. ప్రస్తుత పరిస్థితుల్లో డేటా అనలిటిక్స్‌లో పట్టున్న విద్యార్థులకు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌లో మంచి ఆఫర్లు లభిస్తున్నాయి.

ఆకర్షణీయ వేతనాలు..
ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌లో సంస్థలు ఆకర్షణీయ వేతనాలను ఆఫర్‌ చేస్తున్నాయి. ఎంట్రీ లెవల్‌లో అసోసియేట్‌ హోదా ఉద్యోగాలకు సగటున రూ.6–8 లక్షల వార్షిక వేతనం అందుతోంది. ఐఐఎం విద్యార్థులకు గరిష్ట వేతనం రూ.12 లక్షలుగా నమోదైంది.

నైపుణ్యాలు..
ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ కొలువులకు సంబంధించి అకడమిక్‌ నైపుణ్యాలు, సర్టిఫికెట్లతోపాటు మరికొన్ని ఇతర నైపుణ్యాలు ప్రస్తుతం కీలకంగా మారాయి. అవి..
ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌: మార్కెట్‌ పరిస్థితులపై వాస్తవ అవగాహన కలిగుండాలి. కేవలం వాణిజ్యపరమైన అంశాలే కాకుండా.. సామాజిక–ఆర్థిక పరిస్థితులను విశ్లేషించగల సామర్థ్యం అవసరం.
అనలిటికల్‌ స్కిల్స్‌: మార్కెట్‌ పరిస్థితులను అంచనా వేయడంలో నైపుణ్యం. ఈ క్రమంలో తార్కికంగా ఆలోచించే సామర్థ్యం అవసరం.
ఆటోమేషన్‌ స్కిల్స్‌: కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌) వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగిస్తూ పనిచేయాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆటోమేషన్‌ నైపుణ్యాలు అవసరమవుతున్నాయి.
ఫార్వర్డ్‌ థింకింగ్‌: కేవలం ప్రస్తుత పరిస్థితులనే కాకుండా భవిష్యత్తు పరిణామాలను కూడా అంచనా వేయగలిగే ఫార్వర్డ్‌ థింకింగ్‌ అప్రోచ్‌ కూడా ఎంతో అవసరం.
పీపుల్‌ స్కిల్స్‌: సహజంగానే ఇతర ఉద్యోగాల మాదిరిగానే ఈ విభాగంలోనూ పీపుల్‌ స్కిల్స్‌ కనీస అవసరంగా మారాయి. నిరంతరం క్లయింట్‌ సంస్థలు, ఇన్వెస్టర్లతో సంప్రదింపులు అవసరం కాబట్టి పీపుల్స్‌ స్కిల్స్‌ కీలకంగా మారాయి.

ఇతర మార్గాలు..
ప్రముఖ బి–స్కూళ్లలో క్యాంపస్‌ డ్రైవ్స్‌ ద్వారా నియామకాలు జరుగుతున్న తరుణంలో ఇతర మేనేజ్‌మెంట్‌ కళాశాలల్లో చదువుకున్న విద్యార్థులు ఈ విభాగంలో ఉద్యోగాన్వేషణకు జాబ్‌ పోర్టల్స్‌ను ముఖ్యమైన ప్లాట్‌ఫామ్స్‌గా ఉపయోగించుకోవాలి. వీటిలో తమ ప్రొఫైల్‌ను అప్‌డేట్‌ చేసుకుంటే ఆయా సంస్థల్లోని ఖాళీల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

స్వయం ఉపాధికి అవకాశాలు..
ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌లో స్వయం ఉపాధికి కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ విభాగంలో ముందుగా ఏదైనా సంస్థలో కనీసం ఏడెనిమిదేళ్ల అనుభవం గడించి సొంతగా కన్సల్టింగ్‌ సంస్థను ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ ముఖ్యాంశాలు :
  • ఏటా 10 నుంచి 12 శాతం మేర పెరుగుతున్న డిమాండ్‌.
  • బి–స్కూళ్లలో క్యాంపస్‌ డ్రైవ్స్‌ ద్వారా నియామకాలు చేపడుతున్న సంస్థలు.
  • ఎంట్రీ లెవల్‌లో సగటున రూ.6–8 లక్షల వార్షిక వేతనం.
  • అసోసియేట్‌ హోదాతో కెరీర్‌ ప్రారంభించి చీఫ్‌ అనలిస్ట్‌ స్థాయికి చేరే అవకాశం.
సరికొత్త వేదిక :
ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ అనేది యువతకు ఎమర్జింగ్‌ ఎవెన్యూగా నిలుస్తోందనడంలో సందేహం లేదు. అయితే ఔత్సాహికులు వాస్తవిక దృక్పథంతో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నించాలి. భవిష్యత్తు కోణంలో విశ్లేషిస్తే ఈ విభాగంలో మానవ వనరులకు డిమాండ్‌ పెరగడమే తప్ప, తగ్గడమనే మాటే ఉండదు.
బి.కృష్ణమూర్తి, ఫౌండర్, బెస్ట్‌ నోన్‌ మెథడ్స్‌ అండ్‌ సొల్యూషన్స్‌(విప్రో మాజీ గ్లోబల్‌ డెలివరీ హెడ్‌).
Published date : 03 Apr 2019 05:29PM

Photo Stories