Skip to main content

ఎస్‌బీఐ పీవో... ఇలా చదివితే విజయమే!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ).. రెండువేల ‘ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)’ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా నిర్వహించే ఉమ్మడి ఎంపిక ప్రక్రియ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్‌కు రెండు నెలలు, మెయిన్ పరీక్షకు దాదాపు 100 రోజుల సమయం అందుబాటులో ఉంది. ఈ తక్కువ సమయంలో ప్రణాళిక ప్రకారం సిద్ధమైతే ఎస్‌బీఐ పీవోగా స్థిరపడొచ్చు. ఆకర్షణీయ వేతనాలు, కెరీర్‌లో ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడే ఎస్‌బీఐ పీవో కొలువు సాధించేందుకు నిపుణుల సూచనలు...

బ్యాంకింగ్ పరీక్షల్లో ఎస్‌బీఐ ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తోంది. ప్రతి పరీక్షలోనూ కొత్త తరహా ప్రశ్నలను ప్రవేశపెడుతూ అభ్యర్థులకు సవాలు సురుతోంది. ప్రశ్నల కాఠిన్యత కూడా చాలా ఎక్కువగా ఉంటోంది. ఈ విషయాన్ని గుర్తించి ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఏకకాలంలో పటిష్ట ప్రణాళిక ప్రకారం సన్నద్ధమవ్వాలి.

ఇంగ్లిష్
ఎంపిక ప్రక్రియలో ఇంగ్లిష్‌కు ప్రత్యేక స్థానం ఉంటోంది. ప్రిలిమ్స్, మెయిన్స్, డిస్క్రిప్టివ్, గ్రూప్ ఎక్సర్‌సైజ్ (జీఈ), ఇంటర్వ్యూ.. ఇలా ప్రతి దశలోనూ ఈ సబ్జెక్టు కీలక పాత్ర పోషిస్తుంది. ఇంగ్లిష్ సిలబస్‌ను వొకాబ్యులరీ, గ్రామర్, రీడింగ్ కాంప్రెహెన్షన్, వెర్బల్ ఎబిలిటీగా విభజించొచ్చు.
 • రీడింగ్ కాంప్రెహెన్షన్, క్లోజ్ టెస్ట్, పారా జంబుల్/సెంటెన్స్ జంబుల్/ఆడ్ సెంటెన్స్ ఔట్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, ఎర్రర్ స్పాటింగ్ తదితర సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.
 • రీడింగ్ కాంప్రెహెన్షన్ (ఆర్‌సీ) విభాగంలో వొకాబ్యులరీ ఆధారిత ప్రశ్నలకు ముందుగా సమాధానాలు గుర్తించాలి. సాధారణంగా టెక్నాలజీ, బ్యాంకింగ్ అండ్ ఎకానమీ, బిజినెస్, గవర్నెన్స్, ఎడ్యుకేషన్, సోషల్ ఇష్యూస్ తదితర అంశాలకు సంబంధించిన సమకాలీన పరిణామాలపై పత్రికల్లో వచ్చే ఆర్టికల్స్‌ను చదవడం ద్వారా ఆర్‌సీలో మెరుగైన స్కోరు సాధించొచ్చు.
 • రీడింగ్ కాంప్రెహెన్షన్‌లో భాగంగా ఇచ్చిన వ్యాసంలో కొన్ని కీవర్డ్స్‌ను హైలెట్ చేస్తారు. ఈ పదాలకు సందర్భాన్నిబట్టి పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలను గుర్తించమని అడుగుతారు. సమాధానాలు గుర్తించే క్రమంలో ప్రశ్న కింద ఇచ్చిన ఆప్షన్లను బాగా పరిశీలించాలి.
 • వేగంగా చదువుతూ ప్యాసేజ్ సారాంశాన్ని త్వరగా గుర్తించగలిగేలా ప్రాక్టీస్ చేస్తే ఆర్‌సీ విభాగాన్ని విజయవంతంగా పూర్తిచేయొచ్చు. రోజూ ఇంగ్లిష్ దినపత్రికలు, పుస్తకాలను చదువుతుండాలి. కొత్త పదాలను ప్రత్యేకంగా నోట్ చేసుకోవాలి. ఇలా వొకాబ్యులరీపై పట్టు సాధించాలి. ఈ సన్నద్ధత మెయిన్స్‌లోని లెటర్ రైటింగ్, ఎస్సేకు కూడా ఉపయోగపడుతుంది.
 • క్లోజ్ టెస్ట్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ సెక్షన్లకు ఏకకాలంలో సిద్ధమవాలి. వీటిలోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడానికి ఒకే టెక్నిక్ ఉంటుంది. అలాగే స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్‌లను కూడా ఒకేసారి ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది.

క్వాంటిటేటివ్ ఎబిలిటీ/డేటా అనాలిసిస్, ఇంటర్‌ప్రిటేషన్
 • క్వాంటిటేటివ్ ఎబిలిటీ/డేటా అనాలిసిస్, ఇంటర్‌ప్రిటేషన్.. ఎస్‌బీఐ పీవో పరీక్షలో అభ్యర్థులకు సవాలుతో కూడిన విభాగాలివి. ముఖ్యంగా ప్రిలిమ్స్‌లో 20 నిమిషాల్లో 35 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం కష్టమే. అయితే సరైన ప్రాక్టీస్, టైం మేనేజ్‌మెంట్‌తో మంచి స్కోరు చేయడానికి అవకాశం ఉంది.
 • గత ఎస్‌బీఐ పీవో పరీక్షలో ప్రశ్నలు కఠినంగా వచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. రీజనింగ్, ఇంగ్లిష్‌లో మంచి స్కోరు చేసినా క్యూఏ/డీఏ-ఐ విభాగాల్లో చాలామంది తడబడుతున్నారు.
 • బేసిక్ అర్థమెటిక్ అంశాలైన నిష్పత్తులు, శాతాలు, పని-కాలం, సగటు, భాగస్వామ్యాలు చాప్టర్లపై పట్టుసాధిస్తే డేటా అనాలిసిస్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ నుంచి వచ్చే ప్రశ్నలకు వేగంగా కచ్చితమైన సమాధానాలు గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. సెక్షనల్ కటాఫ్ లేకపోవడం అభ్యర్థులకు కలిసొచ్చే అంశం.
 • న్యూమరికల్ ఎబిలిటీలో మార్కులు పొందడం సులువన్నది నిపుణుల మాట.
 • ప్రిలిమ్స్... క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో మంచి స్కోరుకు బేసిక్ ఫార్ములాలు, వేగంగా గణించగలిగే స్కిల్స్ అవసరం. డీఐలో మంచి స్కోరు సాధించేందుకు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లోని కొన్ని చాప్టర్లు కీలకంగా మారుతాయి.
 • సింప్లిఫికేషన్/అప్రాక్షిమేషన్ ప్రాబ్లమ్స్, నంబర్ సిరీస్ ప్రశ్నలు విరివిగా కనిపిస్తాయి. పరీక్షల్లో వీటిని ముందుగా సాధించాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ సెక్షన్ కూడా సులువుగా స్కోరు చేయడానికి వీలున్న విభాగం.
 • అర్థమెటిక్ చాప్టర్లలో పార్టనర్‌షిప్స్, పర్సంటేజెస్ దాని అనువర్తనాలు, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్, సింపుల్ ఇంట్రెస్ట్, కంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్ చాప్టర్లకు ప్రాధాన్యమివ్వాలి.

రీజనింగ్ ఎబిలిటీ
 • ఇది అభ్యర్థుల లాజికల్ థింకింగ్, అనలిటికల్ నైపుణ్యాలను అంచనా వేసేందుకు ఉద్దేశించిన విభాగం. రీజనింగ్‌లో మంచి స్కోరు చేయగలిగితే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇతర బ్యాంకు పరీక్షలతో పోల్చితే ఎస్‌బీఐ పరీక్షలో రీజనింగ్ ప్రశ్నలు కష్టంగా వస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త మోడల్ ప్రశ్నలను సంధిస్తూ అభ్యర్థుల తార్కిక నైపుణ్యాలను పరీక్షిస్తున్నారు.
 • ఈ విభాగంలో తొలుత ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయనే దానిపై అవగాహన పెంపొందించుకోవాలి. దీనికి గత ప్రశ్నపత్రాలను ఉపయోగించుకోవాలి. గత ఎస్‌బీఐ మెయిన్స్‌లో రీజనింగ్‌లో వచ్చిన పజిల్స్ చాలా కఠినంగా ఉన్నాయి. మెజారిటీ ప్రశ్నలు పజిల్స్ నుంచే వస్తున్నాయి.
 • ఇచ్చిన సమయంలో లాజికల్ క్వశ్చన్స్‌కు సమాధానాలు రాబట్టం అభ్యర్థులకు అంత సులువేం కాదు. సరైన ప్రాక్టీస్‌తో సమస్యను అధిగమించొచ్చు. ఏ అంశాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయో తెలుసుకొని, దానికి అనుగుణంగా సన్నద్ధత ప్రణాళికలు వేసుకోవాలి. సీటింగ్ అరెంజ్‌మెంట్స్ అండ్ పజిల్స్ (సర్క్యులర్, లీనియర్ అరెంజ్‌మెంట్స్, ఫ్లోర్ టెస్ట్స్), కోడెడ్ ఇన్‌ఈక్వాలిటీస్/ఇన్‌పుట్ ఔట్‌పుట్, సిలాయిజమ్స్/కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డెరెక్షన్స్ అండ్ డిస్టెన్స్, ఆర్డరింగ్ అండ్ ర్యాంకింగ్, ఆల్ఫా న్యూమరికల్ సిరీస్, లాజికల్ రీజనింగ్‌లో ఇంప్లిసిట్ అజెంప్షన్స్; ఇన్ఫెరెన్సెస్, కాజ్ అండ్ ఎఫెక్ట్, కాజ్ ఆఫ్ యాక్షన్ విభాగాలపై దృష్టిసారించాలి.
 • రీజనింగ్‌లో అధిక స్కోరుకు తొలుత అభ్యర్థి తాను వేగంగా పరిష్కరించగలిగే ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. తర్వాత ఏ ప్రశ్నలను తక్కువ సయమంలో సాధించొచ్చు? ఏ ప్రశ్నలకు అధిక సమయం అవసరం? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఒక క్రమ పద్ధతిలో సమాధానాలు గుర్తిస్తూ ముందడుగు వేయాలి. సమయం ఎక్కువ అవసరమయ్యే ప్రశ్నలపై చివర్లో దృష్టిసారించాలి.

జనరల్ అవేర్‌నెస్
 • ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్‌కు అర్హత సాధించిన వారికి జనరల్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్‌నెస్ విభాగం ఉంటుంది. కొంచెం శ్రమిస్తే ఇందులో మంచి స్కోరు సాధించొచ్చు. ఈ విభాగం నుంచి 40 మార్కులకు 40 ప్రశ్నలు వస్తాయి. దీని ప్రిపరేషన్‌కు గత ఆరునెలల నుంచి సమకాలీన అంశాలపై దృష్టిసారించాలి.
 • బ్యాంకింగ్ రంగ పదజాలం (రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఎస్‌ఎల్‌ఆర్ తదితర)పై అవగాహన పెంపొందించుకోవాలి. అదే విధంగా ఈ రంగానికి సంబంధించి సమకాలీన పరిణామాలపై దృష్టిసారించాలి. మానిటరీ పాలసీ, ఎన్‌పీఏలు, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్‌ఆర్), డిజిటల్ పేమెంట్స్, బ్యాంకులు-వాటి యాప్స్, పన్నులు తదితరాలపై అవగాహన పెంపొందించుకోవాలి. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ముఖ్యమైన సంస్థల గురించి తెలుసుకోవాలి. ఈ విభాగంలో స్టాక్ జీకే నుంచి ప్రశ్నలు అడిగినా.. కరెంట్ అఫైర్స్‌పై దృష్టిసారించాలి.
 • వివిధ దేశాల కరెన్సీలు, రాజధానులు, జాతీయ పార్కులు, ముఖ్య దినోత్సవాలు, పోర్టులు, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు, అణువిద్యుత్ కేంద్రాలు, నదులు, రిజర్వాయర్లు, భాషలు, జానపద నృత్యాలు, బ్యాంకులు-ప్రధాన కార్యాలయాలు, అంతర్జాతీయ సంస్థలు - అవి ఉన్న ప్రదేశాలు, క్రీడలు-విజేతలు, వార్తల్లో వ్యక్తులు, పుస్తకాలు - రచయితలు, అవార్డులు - గ్రహీతలు తదితరాలను తెలుసుకోవాలి.
 • ప్రభుత్వ పథకాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎస్ అండ్ టీ), డిఫెన్స్ టెక్నాలజీ, సదస్సులు, నియామకాలు, కమిటీలు-అధ్యక్షులు తదితరాలపైనా దృష్టిసారించాలి. అభ్యర్థులు దినపత్రికలు చదువుతూ ముఖ్యాంశాలను ప్రత్యేకంగా నోట్స్‌లో పొందుపరచుకోవాలి.

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్

విభాగం

ప్రశ్నలు

సమయం

ఇంగ్లిష్ లాంగ్వేజ్

30

20 నిమిషాలు

క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్

35

20 నిమిషాలు

రీజనింగ్ ఎబిలిటీ

35

20 నిమిషాలు

మొత్తం

100

ఒక గంట


మెయిన్ ఎగ్జామినేషన్
ఆబ్జెక్టివ్ టెస్ట్:

సబ్జెక్టు

ప్రశ్నలు

మార్కులు

సమయం

రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్

45

60

60 నిమిషాలు

డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్

35

60

45 నిమిషాలు

జనరల్/ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్

40

40

35 నిమిషాలు

ఇంగ్లిష్ లాంగ్వేజ్

35

40

40 నిమిషాలు

మొత్తం

155

200

3 గంటలు


డిస్క్రిప్టివ్ టెస్ట్: దీనికి 30 నిమిషాలు అందుబాటులో ఉంటుంది. 50 మార్కులు కేటాయించారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి రెండు (లెటర్ రైటింగ్, ఎస్సే) ప్రశ్నలుంటాయి.

ముఖ్య తేదీలు
 • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2019, ఏప్రిల్ 22.
 • ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: 2019, జూన్ 8, 9, 15, 16.
 • ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష: 2019, జూలై 20.
 • గ్రూప్ ఎక్స్‌ర్‌సైజ్, ఇంటర్య్వూ తేదీలు: 2019, సెప్టెంబర్.
 • తుది ఫలితాల వెల్లడి: 2019, అక్టోబర్ రెండో వారంలో.

వెబ్‌సైట్: www.sbi.co.in/careers  

మాక్‌టెస్టులతోనే..
బ్యాంకింగ్ కెరీర్‌లో ఎస్‌బీఐ పెద్దన్న వంటిది. భారీ వేతనాలు, కెరీర్‌లో ఉన్నత స్థానాలకు వెళ్లడానికి ఇది మంచి వేదిక. అందుకే పోటీ కూడా ఎక్కువగానే ఉంటోంది. అభ్యర్థులు ఇంగ్లిష్ బేసిక్ గ్రామర్ రూల్స్, వొకాబ్యులరీపై పట్టు సాధించాలి. బేసిక్ అర్థమెటిక్‌తో డీఐలో మంచి స్కోరు సాధించొచ్చు. రీజనింగ్‌లో పజిల్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. పీవోలో విజేతగా నిలవాలంటే ప్రాక్టీస్‌కు మించిన సాధనం మరొకటి లేదు. ఎప్పటికప్పుడు మాక్‌టెస్టులు రాస్తూ ఫలితాలు విశ్లేషించుకుంటూ ముందడుగు వేయాలి. ప్రిలిమ్స్‌కు ప్రత్యేకంగా కాకుండా మెయిన్ సిలబస్‌ను దృష్టిలో పెట్టుకొని చదవాలి. రోజు పేపర్ చదువుతూ వొకాబ్యులరీ, కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించాలి. రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేయాలి. సెక్షనల్ కటాఫ్ లేకపోవడం కలిసొచ్చే అంశం.
- రాజశేఖర్ రెడ్డి, ఐరైజ్ ఫౌండర్.
Published date : 10 Apr 2019 05:30PM

Photo Stories