Skip to main content

ఎస్‌బీఐ అప్రెంటిస్‌.. బ్యాంక్‌ కొలువుకు రహదారి

దేశ బ్యాంకింగ్‌ రంగంలో ప్రముఖమైన ప్రభుత్వరంగ బ్యాంక్‌.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ).. భారీ సంఖ్యలో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 6100 అప్రెంటిస్‌ నియామకాలు చేపట్టనుంది.

ఎంపికైనవారికి ఏడాది కాలంపాటు ఎస్‌బీఐలో శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో నెలకు రూ.15 వేల స్టయిపెండ్‌ చెల్లిస్తారు. దీంతోపాటు ఇక్కడ అప్రెంటిస్‌ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఎస్‌బీఐ నియామకాల్లో వెయిటేజీ లభిస్తుంది. అంతేకాకుండా బ్యాంకింగ్‌ రంగంలో కెరీర్‌ కోరుకునే అభ్యర్థులకు ఇక్కడి పని అనుభవం ఉపయోగపడుతుంది. ఎస్‌బీఐ అప్రెంటిస్‌కు అర్హతలు, ఎంపిక విధానం, ప్రిపరేషన్‌ టిప్స్‌..

ఎస్‌బీఐ ప్రకటించిన మొత్తం 6100 అప్రెంటిస్‌ ఖాళీల్లో.. ఆంధ్రప్రదేశ్‌లో 100, తెలంగాణలో 125 ఖాళీలు ఉన్నాయి. ఈ అప్రెంటిస్‌కు దరఖాస్తు చేసుకునేందుకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 31.10.2020 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

ఎంపిక విధానం..
ఆన్‌లైన్‌ రాత పరీక్ష, స్థానిక భాష పరీక్ష, వైద్య పరీక్షల ఆధారంగా తుది ఎంపిక నిర్వహిస్తారు. రాత పరీక్షలో ప్రతిభ చూపిన వారికి లోకల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ ఉంటుంది. స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. స్థానిక భాష పరీక్షలో ఉత్తీర్ణత సాధించకుంటే.. అప్రెంటిస్‌గా తీసుకోరు.

ఆన్‌లైన్‌ రాత పరీక్ష..
అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తొలుత ఆన్‌లైన్‌ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇది మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీలో ఉంటాయి. ప్రతి సరైన జవాబుకు ఒక మార్కు లభిస్తుంది. ప్రతి పొరపాటు సమాధానానికి 1/4 మార్కు చొప్పున తగ్గిస్తారు.

రాత పరీక్షలో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ 25 ప్రశ్నలు–25 మార్కులు, జనరల్‌ ఇంగ్లిష్‌ 25 ప్రశ్నలు–25 మార్కులు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 25 ప్రశ్నలు–25 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌ 25 ప్రశ్నలు–25 మార్కులకు ఉంటాయి. ప్రతి విభాగానికి కేటాయించిన పరీక్ష సమయం 15 నిమిషాలు. అంటే.. మొత్తం నాలుగు విభాగాలకు కలిపి పరీక్ష సమయం ఒక గంట.

సిలబస్‌ ఇలా..
జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌..

ఈ విభాగం నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. ముఖ్యంగా ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్, కేపిటల్‌ మార్కెట్స్, కరెన్సీ, జీకే, కరెంట్‌ అఫైర్స్, డెవలప్‌మెంట్‌ అండ్‌ బ్యాంకింగ్‌ సెక్టార్స్, బడ్జెట్, ప్రభుత్వ పథకాలు–పాలసీలు, తాజా ఆర్థిక గణాంక అంశాల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశముంది. కాబట్టి అభ్యర్థులు ఈ విభాగంలో మంచి స్కోర్‌ సాధించేందుకు బ్యాంకింగ్‌ రంగం, దేశ ఆర్థిక వ్యవస్థ గురించిన తాజా పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి. ఎస్‌బీఐ, ఐబీపీఎస్‌ క్లర్క్, ఇతర బ్యాంక్‌ పరీక్షల పాత ప్రశ్న పత్రాలను సేకరించి.. వాటిల్లో ఈ విభాగం నుంచి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో గమనించాలి. దీనికి తాజా పరిణామాలను అనుసంధానించుకుంటూ.. జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌కు ప్రిపరేషన్‌ సాగించాలి.

జనరల్‌ ఇంగ్లిష్‌..
ఈ విభాగం నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, యాంటానిమ్స్, సినానిమ్స్, క్లోజ్‌ టెస్ట్, ఫిల్ ఇన్‌ ది బ్లాంక్స్, ఎర్రర్‌ డిటెక్షన్‌, సెంటెన్స్‌ కరెక్షన్, స్పెల్లింగ్‌ దోషాలు, టెన్సెస్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశముంది. అభ్యర్థులు బ్యాంకు పరీక్షల్లో జనరల్‌ ఇంగ్లిష్‌ విభాగంలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో గుర్తించి.. మోడల్‌ ప్రశ్నలు ప్రాక్టీస్‌ చేయాలి. ఎక్కువ స్కోర్‌ చేసేందుకు అవకాశమున్న విభాగం ఇది. కాబట్టి అభ్యర్థులు ఇంగ్లిష్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌..
ఈ విభాగం నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ప్రధానంగా ‘దూరం–సమయం, కాలం–పని, శాతాలు, సగటు, డేటా ఇంటర్‌ప్రిటేషన్, నంబర్‌ సిరీస్, నంబర్‌ సిస్టం, సింపుల్‌ ఇంటరెస్ట్, కాంపౌండ్‌ ఇంటరెస్ట్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, క్షేత్రమితి,సరళీకరణ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇది కొంత ఎక్కువగా కష్టపడాల్సిన విభాగం. అభ్యర్థులు తొలుత పదో తరగతి వరకు మ్యాథమెటిక్స్‌ బేసిక్స్‌పై స్పష్టత తెచ్చుకోవాలి. ఆ తర్వాత బ్యాంక్‌ క్లర్క్‌ పరీక్షల్లో ఈ విభాగం నుంచి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో గుర్తించి.. మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. వేగం, కచ్చితత్వం పెంచుకునేందుకు గట్టిగా కృషిచేయాలి.

రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌..
ఈ రెండు విభాగాల నుంచి మొత్తం 25 ప్రశ్నలు ఉంటాయి. రీజనింగ్‌ ఎబిలిటీలో ‘కోడింగ్‌–డీకోడింగ్, రక్త సంబంధాలు, సిలాజిజం, అనాలజీ, ఆల్ఫాబెట్స్, ఆర్డర్‌ అండ్‌ వర్డ్‌ ఫార్మేషన్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్, ఇన్‌పుట్‌ అండ్‌ అవుట్‌పుట్, పజిల్స్, అసమానతలు(ఇన్‌ ఈక్వాలిటీస్‌) అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌ విభాగంలో.. ఎంఎస్‌ ఎక్సెల్, ఎంఎస్‌ పవర్‌పాయింట్, ఎంఎస్‌ వర్డ్, రామ్, కీవర్డ్‌ షార్ట్‌కట్స్, కంప్యూటర్‌ హార్ట్‌వేర్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్, ఆపరేటింగ్‌ సిస్టమ్, కంప్యూటర్‌ ఫండమెంటల్స్‌/అబ్రివేషన్స్‌ /టెర్మినాలజీస్, నెట్‌వర్కింగ్‌ తదితర అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశముంది.

ఇంకా చ‌ద‌వండి : part 2: ఎస్‌బీఐ అప్రెంటీస్‌ సెలక్షన్‌లో.. స్టేజ్‌–2లో ఈ పరీక్ష సాధించాల్సిందే..

Published date : 15 Jul 2021 01:15PM

Photo Stories