Skip to main content

‘బీమా’ కొలువులు ధీమాగా కొట్టండిలా...

బీమా రంగం (ఇన్సూరెన్స్ సెక్టార్).. వందల కోట్లలో వ్యాపారం! ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో.. పలు బీమా సంస్థల కార్యకలాపాలు.. దేశంలో బీమా అవసరం పట్ల ప్రజల్లో క్రమేణా అవగాహన పెరుగుతోంది! లైఫ్, నాన్-లైఫ్, వాహన, ఆరోగ్య.. ఇలా అనేక విభాగాలుగా బీమా రంగం విస్తరిస్తోంది. మార్కెట్ విస్తరణకు తగ్గట్టుగానే దేశ విదేశీ కంపెనీలు బీమా రంగంలో అడుగుపెడుతున్నాయి. ఇదే ఇప్పుడు యువతకు ఉపాధి పరంగా ‘ధీమా’ కల్పిస్తోంది. గత నాలుగేళ్లుగా బీమా రంగం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ రంగంలో లభించే ఉపాధి అవకాశాలు.. అందుకునే మార్గాలు.. వేతనాలు.. విద్యార్హతలు.. అవసరమైన నైపుణ్యాల గురించి తెలుసుకుందాం...
‘ఒక్క క్లిక్’తో ఇన్సూరెన్స్ పాలసీ రెడీ అవుతోంది. ‘వయసు, అలవాట్ల ఆధారంగా.. మీరెంత బీమా చేయాలి? ఎంత ప్రీమియం చెల్లించాలి?!.. ఇలా వివరాలన్నీ క్షణాల్లో కళ్లముందు ప్రత్యక్షం అవుతున్నాయి. ఆన్‌లైన్‌లో పది నిమిషాలు వెచ్చిస్తే చాలు.. రూ.50 వేల నుంచి రూ.కోట్ల మొత్తం ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. నేటి ఆన్‌లైన్ ప్రపంచంలో బీమా పొందడం అత్యంత సులువుగా మారింది. ఇన్సూరెన్స్ రంగంలో వస్తున్న మార్పులకు తగ్గట్టే... ప్రజల్లో బీమా సౌకర్యం ఆవశ్యకతపై అవగాహన సైతం పెరుగుతోంది. ఇవన్నీ ఈ రంగం వృద్ధి బాటలో పయనించడానికి దోహదం చేస్తున్నాయి. ఫలితంగా బీమా రంగంలో టర్నోవర్ ఏటా వేల కోట్లలో ఉంటోంది. ఇంతలా విస్తరిస్తున్న బీమా రంగం యువతకు కొలువులు అందించడంలోనూ ముందుంటోంది.

పదుల సంఖ్యలో సంస్థలు...
ప్రస్తుతం మన దేశంలో పదుల సంఖ్యలో ఇన్సూరెన్స్ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఐఆర్‌డీఏ గణాంకాల ప్రకారం ప్రభుత్వ రంగంలో మూడు; ప్రైవేటు రంగంలో 45 సంస్థలు జీవిత బీమా, వాహన బీమా, ఆరోగ్య బీమా పాలసీలు అందిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క జీవిత బీమా విభాగంలోనే 30 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది. నాన్‌లైఫ్ ఇన్సూరెన్స్ విభాగాల్లో 23.38 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది.

లక్షల సంఖ్యలో ఉద్యోగాలు...
బీమా రంగంలో విస్తరిస్తున్న కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించేందుకు నిపుణులైన మానవ వనరుల అవసరం ఏర్పడుతోంది. గతేడాది ఈ రంగంలో దాదాపు 8 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించింది. సీఐఐ అంచనా ప్రకారం 2025 నాటికి దాదాపు 20 లక్షల మందికి ఈ రంగం ఉపాధి కల్పించనుంది. ఎన్‌ఎస్‌డీసీ అంచనా ప్రకారం 2021 నాటికి 8 లక్షల నుంచి తొమ్మిది లక్షల మందికి ఉపాధి లభించనుంది.

ఇంటర్మీడియెట్ టు ప్రొఫెషనల్ కోర్సులు :
బీమా రంగంలో అందుబాటులోకి వస్తున్న కొలువులు అందిపుచ్చుకునేందుకు ఇంటర్మీడియెట్ నుంచే అడుగులు వేసే అవకాశముంది. ఈ రంగంలో కార్యకలాపాల నిర్వహణకు ప్రత్యేక నైపుణ్యాలున్న ప్రొఫెషనల్స్ అవసరం పెరుగుతోంది. ఈ రంగంలో అవసరాలకు తగ్గట్టు ఇన్సూరెన్స్ కంపెనీల్లో విభిన్న జాబ్ ప్రొఫైల్స్ పుట్టుకొస్తున్నాయి. వేతనాలు కూడా అభ్యర్థుల హోదాను బట్టి నెలకు రూ. పది వేల నుంచి రూ.లక్ష వరకు లభిస్తున్నాయి.

బీమా... ఉద్యోగాలివిగో!
ఏజెంట్ కాదు... సీఆర్‌ఎం
బీమా అనగానే మనకు గుర్తొచ్చేది ‘ఏజెంట్’ అనే పదమే. ఇప్పుడు ఆ ఏజెంట్‌నే కస్టమర్ రిలేషన్స్ ఎగ్జిక్యూటివ్(సీఆర్‌ఎం)గా పిలుస్తున్నారు. వినియోగదారులకు బీమా ఆవశ్యకత తెలియజేయడం.. వారి అవసరాలకు తగ్గట్టు బీమా పాలసీలు కట్టించడం సీఆర్‌ఎంల ముఖ్యమైన విధి. కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్స్ పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ రెండు విధానాల్లోనూ పనిచేసే అవకాశముంది. సీఆర్‌ఎంలకు ఆదాయం పరంగా చూస్తే.. వారు కట్టించిన పాలసీలు, ప్రీమియం మొత్తాలను పరిగణనలోకి తీసుకొని బీమా సంస్థలు 5 శాతం నుంచి 30 శాతం వరకూ కమిషన్ చెల్లిస్తున్నాయి. తద్వారా సీఆర్‌ఎంలు నెలకు రూ.20వేల వరకు సంపాదించుకునే అవకాశముంది. సంస్థలు కచ్చితంగా ఫలానా సంఖ్యలో పాలసీలు కట్టించాలంటూ వీరికి లక్ష్యాలు నిర్దేశిస్తుండటం గమనార్హం.

డెవలప్‌మెంట్ ఆఫీసర్/సీఆర్‌ఎం హెడ్ :
బీమా రంగంలో కస్టమర్ రిలేషన్స్‌ఎగ్జిక్యూటివ్స్‌కు పైన ఉన్న హోదా.. డెవలప్‌మెంట్ ఆఫీసర్ లేదా సీఆర్‌ఎం హెడ్. సీఆర్‌ఎంల విధులను పర్యవేక్షించడం.. వారికి ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు క్షేత్ర స్థాయికి వెళ్లి వ్యక్తులను మెప్పించి బీమా తీసుకునేలా ఒప్పించడం డెవలప్‌మెంట్ ఆఫీసర్/సీఆర్‌ఎం హెడ్‌ల ముఖ్యమైన విధి. డిగ్రీ అర్హతతో భర్తీచేసే ఈ కొలువులకు నెలకు రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు వేతనం లభిస్తుంది.

యాక్చుయరీ ఎగ్జిక్యూటివ్స్ :
బీమా సంస్థల్లో అత్యంత కీలకమైన కొలువు... యాక్చుయరీ ఎగ్జిక్యూటివ్! ఓ వ్యక్తి తీసుకున్న పాలసీ మొత్తం ఆధారంగా చెల్లించాల్సిన ప్రీమియం ఎంత.. ఎంత కాలానికైతే అతనికి ప్రీమియం చెల్లించే సామర్థ్యం ఉంటుంది.. వంటి అంశాలను యాక్చుయరీ ఎగ్జిక్యూటివ్ లెక్కిస్తారు. దీని ఆధారంగానే సంస్థలు కొత్త పాలసీలను ప్రవేశపెట్టినప్పుడు పాలసీ వ్యవధి, వయో వర్గం వారీగా చెల్లించాల్సిన ప్రీమియం, ఇన్సూరెన్స్ మొత్తం వంటి వాటిని తెలియజేస్తాయి. అందుకే యాక్చుయరీ ఎగ్జిక్యూటివ్స్‌గా విధులు నిర్వహించేందుకు తప్పనిసరిగా.. యాక్చుయేరియల్ సొసైటీ నుంచి సర్టిఫికెట్ పొందాలనే నిబంధన ఉంది. బీకాం, ఎంకాం గ్రాడ్యుయేట్లు ఈ సొసైటీలో పేర్లు నమోదు చేసుకోవచ్చు. తర్వాత సొసైటీ నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే యాక్చుయేరియల్ సొసైటీ మెంబర్‌గా గుర్తింపు లభిస్తుంది. ఆ గుర్తింపు ఉంటే బీమా సంస్థల్లో ప్రారంభంలోనే నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనంతో కొలువు సొంతం చేసుకోవచ్చు.

అండర్ రైటర్స్ :
ఒక పాలసీ ప్రతిపాదన వచ్చినప్పుడు దాన్ని క్షుణ్నంగా పరిశీలించి సదరు పాలసీకి ఆ వ్యక్తి సరితూగుతాడో లేదో నిర్ణయించే నిపుణులే.. అండర్ రైటర్స్! సంస్థలు ప్రత్యేక అర్హతలు ఉన్నవారినే అండర్ రైటర్స్‌గా నియమించుకుంటున్నాయి. ఉదాహరణకు ఈ విభాగానికి సంబంధించి ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అందించే అసోసియేట్ డిప్లొమా ఉత్తీర్ణులకు బీమా సంస్థలు పెద్దపీట వేస్తున్నాయి. వీరికి వేతనాలు నెలకు రూ.40 వేల వరకు లభిస్తున్నాయి.

రిస్క్ అనలిస్ట్స్ :
జనరల్ ఇన్సూరెన్స్ పాలసీల విషయంలో రిస్క్ అనలిస్ట్‌లు ఎంతో కీలకంగా వ్యవహరిస్తారు. ఉదాహరణకు ఏదైనా ఒక నిర్మాణానికి పాలసీ కోసం ప్రతిపాదించినప్పుడు.. ఆ నిర్మాణాన్ని స్వయం పరిశీలించడం, దాని నాణ్యత, లైఫ్‌టైమ్ వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని వాటికి సంబంధించిన నివేదికను సంస్థకు అందిస్తారు. ఈ నివేదిక ఆధారంగా అప్పుడు ఆ నిర్మాణానికి పాలసీ మొత్తం పరంగా సంస్థ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుంది. రిస్క్ అనలిస్ట్‌లు ఎక్కువగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

క్లెయిమ్స్ ఎగ్జిక్యూటివ్స్ :
పాలసీ క్లెయిమ్‌ల పరిష్కారంలో క్లెయిమ్స్ ఎగ్జిక్యూటివ్స్ పాత్ర కీలకం. ముఖ్యంగా పాలసీ వ్యవధి పూర్తి కాకుండానే ఏదైనా సంఘటన జరిగి బీమా చెల్లించాల్సిన పరిస్థితిలో.. క్లెయిమ్స్ ఎగ్జిక్యూటివ్స్ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. క్లెయిమ్ ఎగ్జిక్యూటివ్స్.. సదరు బీమా మొత్తం కోసం వచ్చిన ప్రతిపాదనను పరిశీలించి, డ్యామేజ్ విలువను లెక్కిస్తారు. ఆ మొత్తానికి బీమా పరిష్కారం లభిస్తుంది. వీరికి నెలకు రూ. 40 వేల వరకు వేతనం లభిస్తుంది.

సాంకేతిక బాటలో..
బీమా సంస్థలు సాంకేతికతను ఆధారంగా చేసుకుని ఇన్సూరెన్స్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. పలు సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ విధానాలను అనుసరిస్తున్నాయి. టెక్నికల్‌గా కొత్త కొలువులు లభిస్తున్నాయి. అవి.. ఏఐ అనలిస్ట్స్, డేటా అనలిస్ట్. వీటితోపాటు సంస్థల్లో అనుసరిస్తున్న సాంకేతిక సదుపాయాల నిర్వహణకు నెట్‌వర్క్ ఇంజనీర్స్, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ ఇంజనీర్స్, ట్రబుల్ షూటర్స్ వంటి ఉద్యోగాలు కూడా లభిస్తున్నాయి. ఈ కొలువులు సంబంధిత విభాగాల్లో బీటెక్ లేదా స్పెషలైజ్డ్ సర్టిఫికేషన్ పొందిన వారికి ఇచ్చేందుకు సంస్థలు మొగ్గుచూపుతున్నాయి.

నియామకాలు ఇలా..
రిస్క్ అనలిస్ట్, అండర్ రైటర్స్, క్లెయిమ్స్ ఎగ్జిక్యూటివ్ వంటి స్పెషలైజ్డ్ ఉద్యోగాల భర్తీకి ఇన్సూరెన్స్ కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లలో కంపెనీలు క్యాంపస్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాయి. టెక్నికల్ ఉద్యోగాల కోసం ఐఐటీలు, ఇతర ప్రముఖ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లను సంప్రదిస్తున్నాయి. మిగతా అధిక శాతం ఉద్యోగాలను జాబ్ కన్సల్టెన్సీలపై ఆధారపడి భర్తీ చేస్తున్నాయి.

ప్రభుత్వ రంగ సంస్థలు..
ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎల్‌ఐసీ, యునెటైడ్ ఇన్సూరెన్స్ తదితర సంస్థల్లో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ల కోసం ఆయా సంస్థలు ప్రత్యేక నియామక పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి.

ఆ రంగాల్లోనూ..
ఇన్సూరెన్స్ స్పెషలైజ్డ్ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు ఇన్సూరెన్స్ కంపెనీల్లోనే కాకుండా.. ఇతర రంగాల్లోని సంస్థల్లోనూ అవకాశాలు అందుకోవచ్చు. థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్, మ్యూచువల్ ఫండ్ సంస్థలు, వీటితోపాటు ఇన్సూరెన్స్ సంస్థలతో ఒప్పందం ద్వారా పరోక్షంగా ఆయా సేవలందించే బ్యాంకులు, బీపీఓలు, కార్పొరేట్ హాస్పిటల్స్‌లోనూ కొలువులు లభిస్తున్నాయి.

ఇన్సూరెన్స్ స్పెషలైజ్డ్ ఇన్‌స్టిట్యూట్స్...
ఇన్సూరెన్స్ రంగంలో రాణించడానికి అవసరమైన ప్రత్యేక నైపుణ్యాలు అందించేందుకు పలు ఇన్‌స్టిట్యూట్‌లు అందుబాటులోకి వచ్చాయి.వాటిలో ముఖ్యమైనవి..
  1. నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ-పుణె.
  2. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్- హైదరాబాద్.
  3. అమిటీ స్కూల్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ యాక్చుయేరిల్ సైన్స్ - నోయిడా.
  4. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ - న్యూఢిల్లీ.
  5. ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా.
  6. తిలక్ మహారాష్ట్ర విద్యా పీఠ్-పుణె, ముంబై.
వీటితోపాటు ఐపీఈ, ఎండీఐ వంటి మరికొన్ని ప్రముఖ బి-స్కూల్స్ ఎంబీఏ, పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ఇన్సూరెన్స్ స్పెషలైజేషన్స్‌ను అందిస్తున్నాయి.
Published date : 11 Dec 2018 03:58PM

Photo Stories