అపార అవకాశాలకు ఆర్థిక సేవారంగం..
Sakshi Education
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సేవల రంగం వేగంగా విస్తరిస్తోంది. దీంతో ఈ రంగంలో పెద్దసంఖ్యలో అవకాశాలు లభిస్తున్నాయి. ఇంటర్, ఇంజనీరింగ్, సంప్రదాయ, ప్రొఫెషనల్ కోర్సులు... ఇలా అన్ని విభాగాల విద్యార్థులు ఆర్థిక సేవల రంగంలో స్థిరపడవచ్చు. ప్రజల ఆర్థిక వ్యవహారాలు క్రమేణా రెట్టింపు అవుతున్నాయి. దీంతో రానున్న ఐదేళ్లలో ఈ రంగంలో మానవ వనరులకు మంచి డిమాండ్ ఏర్పడనుందని అంచనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో కెరీర్‌పై ఫోకస్..
ఇన్సూరెన్స్
యాక్చుయేరియల్ సైన్స్.. స్పెషలైజ్డ్ కెరీర్
ఈ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు..
ఇతర ఇన్‌స్టిట్యూట్స్
ట్యాక్సేషన్ సంస్థలు
మ్యూచువల్ ఫండ్ సంస్థలు
స్టాక్ మార్కెట్స్
ఫైనాన్షియల్ సర్వీసెస్- నైపుణ్యాలు
2022 నాటికి మానవ వనరుల డిమాండ్ అంచనా
ఉపాధి వేదికలు
- ఆర్థిక సేవలు అంటే సాధారణంగా అందరికీ బ్యాంకింగ్ సంస్థలు.. బ్యాంకులు.. వాటిలోని ఉద్యోగాలు గుర్తుకొస్తాయి. ఆర్థిక రంగంలో బ్యాంకుల వాటా అధిక శాతంగా ఉన్నప్పటికీ ఇతర విభాగాలు కూడా ఈ రంగంలో తమదైన ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.
- ఇన్సూరెన్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్ కంపెనీలు, స్టాక్ బ్రోకింగ్ సంస్థలు ఆర్థిక సేవా రంగాల్లో ఇతర ముఖ్య విభాగాలుగా ఉంటాయి.
- ప్రస్తుతం ఈ సంస్థలన్నీ నిపుణులైన మానవ వనరుల కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. ఔత్సాహికులకు ఎంట్రీ లెవల్ నుంచి సీఈఓ స్థాయి వరకు ఉద్యోగావకాశాలు స్వాగతం పలుకుతున్నాయి.
- ఔత్సాహిక యువత ఈ అవకాశాలను అందిపుచ్చుకుంటే భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవచ్చు.
ఇన్సూరెన్స్
- బ్యాంకింగ్ తర్వాత ఆర్థిక సేవల రంగంలో అగ్రస్థానంలో ఉన్న విభాగం ఇన్సూరెన్స్. ఈ విభాగంలో వేలసంఖ్యలో కొలువులు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆయా పాలసీల ప్రీమియం విధి విధానాలు ఖరారు చేసే నిపుణులైన అండర్ రైటర్స్‌తో పాటు యాక్చుయేరియల్ సైన్స్ నిపుణులకు భారీగా డిమాండ్ నెలకొంది.
- 2020 నాటికి ఇన్సూరెన్స్ రంగంలో ఈ స్పెషలైజ్డ్ విభాగాలకు సంబంధించి దాదాపు 50 వేల మంది అవసరముంటుందని పరిశ్రమ వర్గాల అంచనా. ఇందులో భాగంగా వీటికి సంబంధించి అకడమిక్ నైపుణ్యాలు అందించేందుకు పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఇన్సూరెన్స్ రంగంలో ఉన్నత హోదాలు అందుకోవచ్చు.
యాక్చుయేరియల్ సైన్స్.. స్పెషలైజ్డ్ కెరీర్
- ఇన్సూరెన్స్ రంగంలో ప్రత్యేకమైన కెరీర్‌ను సొంతం చేసుకోవాలనుకునే వారికి సరైన కోర్సు యాక్చుయేరియల్ సైన్స్. ప్రధానంగా గణాంకాల విశ్లేషణ, మ్యాథమెటికల్ స్కిల్స్, డేటా విశ్లేషణ నైపుణ్యాలు గల వారికి ఇన్సూరెన్స్ రంగంలోనే విభిన్న అవకాశాలు కల్పించే కోర్సు యాక్చుయేరియల్ సైన్స్.
- ఇన్సూరెన్స్ రంగంలోని ఉద్యోగాల్లో అత్యంత స్పెషలైజ్డ్ విభాగం యాక్చుయేరియల్ సైన్స్. ఒక పాలసీకి ఎంత ప్రీమియం వసూలు చేయాలి? ఏ వయసు వారికి ఎంత వ్యవధిలో ఎంత ప్రీమియం అనుకూలంగా ఉంటుంది? వంటివి నిపుణుల ప్రధాన విధులు. ఈ కోర్సు పూర్తి చేయడం ద్వారా ఈ నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు.
- ఈ విభాగంలో 2020 నాటికి పదివేల మంది నిపుణుల అవసరం ఉంటుంది. కానీ ఏటా సర్టిఫికెట్లు పొందే వారి సంఖ్య వందల్లోనే ఉంటోంది.
ఈ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు..
- యాక్చుయేరియల్ సొసైటీ ఆఫ్ ఇండియా:
ఇది యాక్చుయేరియల్ నిపుణులను తీర్చిదిద్దేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థ. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో మొత్తం నాలుగు దశల్లో (కోర్ టెక్నికల్ స్టేజ్, కోర్ అప్లికేషన్ స్టేజ్, స్పెషలిస్ట్ టెక్నికల్ స్టేజ్, స్పెషలిస్ట్ అప్లికేషన్ స్టేజ్) 15 పేపర్లలో కోర్సు ఉంటుంది. ఇంటర్మీడియెట్‌లో మ్యాథ్స్ / స్టాటిస్టిక్స్‌తో 85 శాతం మార్కులు పొందిన విద్యార్థులు.. లేదా మ్యాథమెటిక్స్/ స్టాటిస్టిక్స్/ ఎకనోమెట్రిక్స్/ కంప్యూటర్ సైన్స్/ ఫిజిక్స్ సబ్జెక్టులతో డిగ్రీ లేదా పీజీ 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు ఈ ఇన్‌స్టిట్యూట్‌లో పేరు నమోదు చేసుకోవడానికి అర్హులు.
ఇతర ఇన్‌స్టిట్యూట్స్
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్
కోర్సు: ఇంటర్నేషనల్ పీజీ డిప్లొమా ఇన్ యాక్చుయేరియల్ సైన్స్
వెబ్‌సైట్: www.iirmworld.org.in
- భారతీదాసన్ యూనివర్సిటీ
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ యాక్చుయేరియల్ సైన్స్
వెబ్‌సైట్: www.bdu.ac.in
- కురుక్షేత్ర యూనివర్సిటీ
కోర్సు: బీఏ (ఇన్సూరెన్స్ అండ్ యాక్చుయేరియల్ సైన్స్)
వెబ్‌సైట్: www.kuk.ac.in
- నర్సీమొంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్
కోర్సు: ఎంబీఏ (యాక్చుయేరియల్ సైన్స్)
వెబ్‌సైట్: www.nmims.edu
- యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్
కోర్సు: ఎమ్మెస్సీ (యాక్చుయేరియల్ సైన్స్)
వెబ్‌సైట్: www.unom.ac.in
- అమిటీ యూనివర్సిటీ
కోర్సు: ఎమ్మెస్సీ (యాక్చుయేరియల్ సైన్స్, అప్లికేషన్స్)
వెబ్‌సైట్: www.amity.edu
ట్యాక్సేషన్ సంస్థలు
- ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో విస్తృత అవకాశాలు కల్పిస్తున్న మరో విభాగం ట్యాక్సేషన్. వ్యక్తుల నుంచి సంస్థల వరకు ఇన్‌కం ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్ ఇలా పలు రకాల ట్యాక్స్‌లు చెల్లించాల్సి ఉంటుంది.
- ట్యాక్సేషన్ సంస్థలు ఇటీవల కాలంలో శరవేగంగా విస్తరిస్తున్నాయి. గతంలో ఈ రంగంలోని నిపుణులు వ్యక్తిగతంగా కార్యకలాపాలు నిర్వహించే వారు, కాని ఇప్పుడు ప్రత్యేకంగా కన్సల్టెన్సీలు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా కన్సల్టెన్సీలు అర్హతలున్న వారికోసం అన్వేషణ సాగిస్తున్నాయి.
- ట్యాక్సేషన్ రంగంలో రాణించడానికి అవసరమైన సీఏ, ఐసీడబ్ల్యుఏ, కంపెనీ సెక్రటరీ కోర్సులు పూర్తి చేసిన వారికి మంచి వేతనాలతో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి.
సీఏ కోర్సు వివరాలకు వెబ్‌సైట్: www.icai.org
ఐసీడబ్ల్యుఏఐ కోర్సు వివరాలకు వెబ్‌సైట్: www.icmai.in
సీఎస్ కోర్సు వివరాలకు వెబ్‌సైట్: www.icsi.edu
మ్యూచువల్ ఫండ్ సంస్థలు
- మ్యూచువల్ ఫండ్ విభాగం ఆర్థిక సేవల రంగంలో జాబ్ క్రియేషన్ పరంగా ఎమర్జింగ్‌గా మారుతోంది. ఖాతాదారులు పొదుపు చేసిన నిధులను స్టాక్ ఆప్షన్స్‌లో పెట్టుబడులు పెట్టడం మ్యూచువల్ ఫండ్ సంస్థల ప్రధాన విధి.
- ఈ రంగంలోని ఉద్యోగులు క్లయింట్ల అభిరుచులకు ప్రాధాన్యమిస్తూనే.. ఏఏ సంస్థల్లో పెట్టుబడులు పెట్టొచ్చు? ఏఏ షేర్లు కొనచ్చు? వంటి సలహాలు అందిస్తారు. ఈ విభాగంలోనూ రానున్న అయిదేళ్లలో 30 నుంచి 35 వేల మంది నిపుణుల అవసరం ఏర్పడనుంది. ఈ విభాగంలో ప్రధానంగా ఫండ్ మేనేజర్, రీసెర్చ్ అనలిస్ట్, ఆపరేషన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్‌పర్ట్స్, ఫండ్ అకౌంటింగ్ శాఖల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఫిక్కీ నివేదిక ప్రకారం 2010తో పోల్చితే 2020 నాటికి క్యాపిటల్ మార్కెట్స్ మూడింతల వృద్ధి సాధిస్తాయి. దీనికి అనుగుణంగా మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా ప్రగతి సాధించనున్నాయి. మ్యూచువల్ ఫండ్ రంగానికి సంబంధించి ఇప్పుడిప్పుడే ప్రత్యేక కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి.
- నర్సీమొంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ స్పెషలైజేషన్‌తో ఎంబీఏ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తోంది.
- నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రత్యేకంగా సర్టిఫికేషన్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్ కోర్సును అందిస్తోంది.
స్టాక్ మార్కెట్స్
- కెరీర్ పరంగా రానున్న అయిదేళ్లలో స్టాక్ మార్కెట్స్ మరో ముఖ్య వేదికగా నిలవనున్నాయి. ఎన్‌ఎస్‌డీసీ అంచనాల ప్రకారం 2022 నాటికి స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో 1.3 లక్షల మంది నిపుణుల అవసరం ఏర్పడనుంది.
- స్టాక్ బ్రోకర్స్ నుంచి స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడింగ్ విభాగాలు, రీసెర్చ్ ఆపరేషన్స్, ఐపీఓ విభాగాల్లో పలు అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన సంస్థల గురించి నిరంతరం అధ్యయనం చేసేలా అబ్జర్వర్స్‌గా కూడా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయి.
- ఈ ఉద్యోగాలతో ఎంట్రీ లెవల్‌లోనే రూ. 30 వేల జీతంతో కెరీర్ ప్రారంభించొచ్చు. నైపుణ్యాల ఆధారంగా మూడు, నాలుగేళ్ల అనుభవంతో నెలకు రూ60 వేల నుంచి 80 వేల వరకు అందుతుంది.
- స్టాక్ మార్కెట్స్, స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో నిపుణులైన మానవ వనరుల ఆవశ్యకతను స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు గుర్తించాయి. ఇందులో భాగంగా క్యాపిటల్ మార్కెట్ విభాగంలో నిపుణులను తీర్చిదిద్దేందుకు ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు స్వయంగా కొన్ని కోర్సులను నిర్వహిస్తున్నాయి. వివరాలు..
- ఎన్‌ఎస్‌ఈ-పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్
వెబ్‌సైట్: www.nseindia.com/education
- ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్-పీజీ డిప్లొమా ఇన్ స్టాక్ మార్కెట్స్
వెబ్‌సైట్: www.bsebti.com
ఫైనాన్షియల్ సర్వీసెస్- నైపుణ్యాలు
- అకౌంటింగ్ నైపుణ్యాలు
- మార్కెట్ పరిస్థితులపై నిరంతర అవగాహన
- స్టాక్ మార్కెట్ కార్యకలాపాల్లో అప్రమత్తతో వ్యవహరించే దృక్పథం
- వేగంగా స్పందించే నైపుణ్యం, సమయోచితంగా తక్షణ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం
- క్లయింట్ల పొదుపు సామర్థ్యానికి అనుగుణంగా సరితూగే ఫండ్స్‌ను గుర్తించే నైపుణ్యం
2022 నాటికి మానవ వనరుల డిమాండ్ అంచనా
- బ్యాంకింగ్ అండ్ ఎన్‌బీఎఫ్‌సీ: 7.8 లక్షలు
- ఇన్సూరెన్స్: 70 వేలు
- బ్రోకింగ్ సంస్థలు: 20 వేలు
- మ్యూచువల్ ఫండ్స్: లక్ష
- స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు: 3 వేలు
ఉపాధి వేదికలు
- బ్యాంకింగ్ సంస్థలు
- ఇన్సూరెన్స్ సంస్థలు
- స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు
- స్టాక్ బ్రోకింగ్ సంస్థలు
- మ్యూచువల్ ఫండ్ సంస్థలు
బ్యాంకులతోపాటు ఎన్నో వేదికలు ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే బ్యాంకింగ్ రంగం మాత్రమే అనుకోకూడదు. ఇన్సూరెన్స్, క్యాపిటల్ మార్కెట్స్, కేపీఓల్లో పేటెంట్ ఫైలింగ్ విభాగాలు ఇలా అనేక విభాగాలు ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిధిలోకి వస్తాయి. విద్యార్థులు బ్యాచిలర్ డిగ్రీ స్థాయి నుంచే వీటిపై అవగాహన ఏర్పరచుకుని, పీజీ స్థాయిలో సంబంధిత స్పెషలైజేషన్ చేస్తే మెరుగైన అవకాశాలు లభిస్తాయి. ఈ రంగంలోని ఔత్సాహికులు మార్కెట్ పరిస్థితులపై నిరంతర అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరం. - చంద్రశేఖర్ రెడ్డి, డీజీఎం, కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ |
Published date : 20 Nov 2015 12:10PM