Skip to main content

ఐబీపీఎస్ ‘ పీవో ’ ఇంటర్వ్యూలో విజయానికి టిప్స్...

ఐబీపీఎస్ పీవో.. మెయిన్ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి! మొత్తంమూడు దశల ఎంపిక ప్రక్రియలో.. రెండో దశ అయిన మెయిన్‌లో ప్రతిభ చూపిన అభ్యర్థులు.. తుది దశ(మూడోదశ) పర్సనల్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇందులోనూ విజయం సాధిస్తే.. పదిహేడు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని ఏదో ఒక బ్యాంకులో.. ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో)/మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ)గా కెరీర్ ప్రారంభమవుతుంది.
 తుదిదశ ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే.. బాడీ లాంగ్వేజ్ మొదలు సబ్జెక్ట్ నైపుణ్యాలు, సమకాలీన అంశాలపై అవగాహన తప్పనిసరి! ఈ నేపథ్యంలో.. ఫిబ్రవరి ఆరు నుంచి ప్రారంభం కానున్న ఐబీపీఎస్ పీఓ/ఎంటీ పర్సనల్ ఇంటర్వ్యూలో విజయానికి మార్గాలు...

ఒక్క అడుగు దూరం :
వాస్తవానికి ఐబీపీఎస్ పీవో/ఎంటీ ప్రక్రియలో.. మెయిన్‌లో విజయం సాధించిన అభ్యర్థులు.. బ్యాంకింగ్ కెరీర్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచినట్లే! ఎందుకంటే.. ఐబీపీఎస్ మూడంచెల ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూ దశకు చేరుకోవడం ఎంతో క్లిష్టమైన అంశం. ఐబీపీఎస్ అనుసరిస్తున్న విధానం ప్రకారం-తొలిదశ ప్రిలిమ్స్ నుంచి మెయిన్‌కు 1:20 నిష్పత్తిలో అభ్యర్థులను అనుమతిస్తారు. మెయిన్ నుంచి ఇంటర్వ్యూకు ఒక్కో ఖాళీకి ముగ్గురు చొప్పున అంటే 1:3 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు. ప్రస్తుతం ఎంపిక ప్రక్రియ సాగుతున్న పీఓ/ఎంటీ విషయానికొస్తే.. మొత్తం పదిహేడు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4336 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు ఏడు లక్షల మంది పోటీ పడ్డారు. వీరిలో 87 వేల మంది మెయిన్‌కు హాజరయ్యారు. ఈ 87 వేల మందిలో 1:3 నిష్పత్తిలో 13వేల మంది వరకు తుదిదశ ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. ఇంటర్వ్యూలో సత్తా చాటితే పీవోగా అలాట్‌మెంట్ లెటర్‌ను అందుకోవచ్చు.

సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి సమకాలీన అంశాల వరకు :
ఐబీపీఎస్ పీఓ/ఎంటీ తుదిదశ ఇంటర్వ్యూ ప్రక్రియలో విజయం సాధించాలంటే.. అభ్యర్థులు సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి సమకాలీన అంశాల వరకు.. అనేక విషయాలపై పరిపూర్ణ అవగాహన పొందాలి. కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియర్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్ వంటివి కూడా ఇంటర్వ్యూలో విజయానికి దోహదం చేస్తాయి. కాబట్టి అభ్యర్థులు తమ ఇంటర్వ్యూ తేదీకి..ఇప్పటి నుంచి ఉన్న వ్యవధిలో పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించాలి.

ఇంటర్వ్యూ మార్కులకు వెయిటేజీ :
చాలామంది అభ్యర్థులు మెయిన్ పరీక్షలో విజయం సాధించాం కదా.. ఇంటర్వ్యూలో బయోడేటాకు సంబంధించిన ప్రశ్నలే ఉంటాయిలే అనే అభిప్రాయంతో ఉంటారు. కానీ.. తుది ఎంపికకు ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఎంతో కీలకంగా నిలుస్తోంది. కారణం.. ఇంటర్వ్యూలో ప్రతిభకు 20శాతం వెయిటేజీ ఇవ్వడమే. ఐబీపీఎస్.. మెయిన్ మార్కులు, ఇంటర్వ్యూ మార్కులు రెండింటినీ వంద మార్కుల శ్రేణికి క్రోడీకరిస్తోంది. అందులో 80శాతం వెయిటేజీని మెయిన్ మార్కులకు, 20శాతం వెయిటేజీని ఇంటర్వ్యూలో పొందిన మార్కులకు నిర్దేశించింది. ఇంటర్వ్యూలో అభ్యర్థులు కేటగిరీల వారీగా కనీస అర్హత మార్కులు పొందాలనే నిబంధన కూడా అమలవుతోంది. వంద మార్కులకు నిర్వహించే ఇంటర్వ్యూలో.. జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 40శాతం మార్కులు, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 35 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. నిర్దేశిత మార్కులు పొందిన అభ్యర్థులనే తుది జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటారు.

పర్సనల్ ఇంటర్వ్యూలో ఇలా..
ఇంటర్వ్యూలో అధిక శాతం ప్రశ్నలు అభ్యర్థి విద్యా నేపథ్యం, వ్యక్తిగత విషయాలు, పని అనుభవం, జాతీయ, అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక పరిణామాలు, భవిష్యత్తు లక్ష్యాలపైనే ఉంటాయి. ప్రధానంగా జాతీయ స్థాయిలో ఇటీవల కాలంలో చోటుచేసు కుంటున్న కీలకమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశముంది. కాబట్టి అభ్యర్థులు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన అన్ని ముఖ్యాంశాలపై దృష్టిసారించాలి. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వంటి వాటితోపాటు, బ్యాంకింగ్ రంగంలో తాజా పరిణామాలు గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి.

బ్యాంకింగ్ రంగం :
పర్సనల్ ఇంటర్వ్యూకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన అంశాలపై ప్రత్యేకదృష్టి సారించి, అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా బ్యాంకింగ్ టెర్మినాలజీ, దేశంలో ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో పరిణామాల (ఉదా: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం, బ్యాంకింగ్ రంగంలో డిజిటల్ టెక్నాలజీ తదితర అంశాలు) గురించి తెలుసుకోవాలి. వ్యాపార, వాణిజ్య పరమైన విషయాలపైనా పట్టుసాధించాలి. అంతర్జాతీయంగా వివిధ దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలు, వాటివల్ల దేశానికి ప్రయోజనాలు, అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేస్తున్న అంశాలు (ఉదా: ముడి చమురు ధరలు పెరగడం, బంగారం దరలు పెరగడం తదితర) కూడా తెలుసుకోవాలి.

మాక్ ఇంటర్వ్యూలు..
ఇంటర్వ్యూను సమర్థంగా ఎదుర్కొనేందుకు మంచి సాధనం మాక్ ఇంటర్వ్యూలు. అభ్యర్థులు కనీసం రెండు మాక్ ఇంటర్వ్యూలకైనా హాజరవడం మేలు చేస్తుంది. దీనివల్ల తమ బలాలు, బలహీనతలు,వ్యక్తిగతంగా మెరుగైన వ్యవహార శైలి తదితర అంశాలపై అవగాహన ఏర్పడుతుంది.

తడబడకుండా.. నిజాయితీగా
ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు ఎలాంటి తడబాటు లేకుండా మాట్లాడాలి. బోర్డులో అయిదు నుంచి ఆరు మంది సభ్యులు ఉండే అవకాశముంది. ప్రశ్న అడిగిన సభ్యుడితోపాటు ఇతర బోర్డ్ మెంబర్లను కూడా చూస్తూ సమాధానం చెప్పాలి. అప్పుడే బోర్డ్ సభ్యులకు అభ్యర్థి పట్ల సానుకూల అభిప్రాయం ఏర్పడుతుంది. అలాగే ఏదైనా ప్రశ్నలకు సమాధానం తెలియకుంటే.. తెలియదని నిజాయితీగా అంగీకరించాలి. తెలిసిన ఏదో ఒక సమాధానం చెప్పి.. అదే సరైంది అనే రీతిలో వ్యవహరించొద్దు. కొన్ని సందర్భాల్లో బోర్డ్ సభ్యులు అభ్యర్థి సహనాన్ని పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతుంటారు. అలాంటప్పుడు వారిని ఒప్పించే విధంగా సున్నితంగా చెప్పే నైపుణ్యం పెంచుకోవాలి.

భవిష్యత్తు లక్ష్యాలపై స్పష్టంగా..
ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు తమ భవిష్యత్తు లక్ష్యాలపై స్పష్టతతో వ్యవహరించాలి. ముఖ్యంగా ‘బ్యాంకింగ్ రంగాన్నే ఎందుకు ఎంచుకున్నారు..’, ‘మీ అర్హతలకు ఇంత కంటే మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి కదా?’, ‘మీరు ఇప్పటికే మంచి ఉద్యోగంలో ఉన్నారు కదా.. ఇలాంటప్పుడు మళ్లీ బ్యాంకు ఉద్యోగం కోసం ఎందుకు వచ్చారు? వంటి ప్రశ్నలు అడగడం సహజం. ఇలాంటి ప్రశ్నలకు బోర్డ్ సభ్యులను మెప్పించేలా నేర్పుతో సమాధానాలు చెప్పాలి.

బాడీ లాంగ్వేజ్ :
ఇంటర్వ్యూలో బాడీ లాంగ్వేజ్ సైతం కీలక పాత్ర పోషిస్తుంది. సమాధానాలు చెప్పేటప్పుడు బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడాలి. బోర్డ్ సభ్యులు అభ్యర్థులకు ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చూస్తారు. కాబట్టి అనవసరంగా ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండాలి. తెలియని ప్రశ్న ఎదురైనప్పుడు ఒత్తిడికి గురికావడం సరికాదు. ముఖ కవళికలు ప్రసన్నంగా ఉండేలా చూసుకోవాలి.

కరెంట్ అఫైర్స్ :
ఇంటర్వ్యూలో కరెంట్ అఫైర్స్ చాలా కీలకం. కాబట్టి ఇంటర్వ్యూకి సన్నద్ధమయ్యే అభ్యర్థులు ప్రస్తుత సమయంలో ప్రతిరోజు దినపత్రికలను అనుసరించడం ఎంతో మేలు చేస్తుంది. ఇలా చదువుతున్నప్పుడు ఎడిటోరియల్స్, నిపుణుల వ్యాసాలను చదవాలి. వాటిలోని ముఖ్యమైన అంశాలతో నోట్స్ రూపొందించుకోవాలి. ఒక వ్యాసం చదివిన తర్వాత దాని సారాంశం ఆధారంగా.. సొంతంగా, క్లుప్తంగా నోట్స్ రాసుకోవాలి. దీంతోపాటు న్యూస్ ఛానెళ్లలో సమకాలీన పరిణామాలపై నిర్వహించే డిబేట్స్‌ను వీక్షించడం, అందులో నిపుణుల అభిప్రాయాలను నోట్ చేసుకోవడం ఉపయోగపడుతుంది.

ఐబీపీఎస్ పీఓ/ఎంటీ-9 (2020-2021).. ముఖ్యాంశాలు :
  • మొత్తం 4336 ఖాళీల భర్తీకి త్వరలో ఇంటర్వ్యూలు
  • మెయిన్ నుంచి ఇంటర్వ్యూకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
  • మెయిన్ మార్కులకు 80 శాతం, ఇంటర్వ్యూ మార్కులకు 20 శాతం వెయిటేజీ
  • ఇంటర్వ్యూలో కేటగిరీల వారీగా కనీస అర్హత మార్కుల నిబంధన
  • ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్‌లోడ్ సదుపాయం: ఫిబ్రవరి 6, 2020 వరకు.

ఒత్తిడికి గురి కావద్దు :

ఇంటర్వ్యూ అంటేనే అభ్యర్థులు ఒత్తిడికి గురవుతారు. కానీ ఇది సరికాదు. బోర్డ్ సభ్యులు కూడా అభ్యర్థుల పరిస్థితిని గమనించి వారికి ఆహ్లాదకర వాతావరణం కలిగే విధంగా చూస్తారు. దీన్ని వినియోగించుకోవాలి. ఇక.. సమాధానాలు చెప్పేటప్పుడు బోర్డ్‌లోని సభ్యులందరినీ చూస్తూ సమాధానం చెప్పడం వల్ల ప్రశ్న అడిగిన మెంబర్ మాత్రమే కాకుండా.. ఇతర సభ్యుల్లోనూ సానుకూల దృక్పథం కలుగుతుంది. ప్రస్తుత సమయంలో అభ్యర్థులు ప్రధానంగా కమ్యూనికేషన్ స్కిల్స్, కరెంట్ అఫైర్స్‌పై అవగాహన పెంచుకునేలా సన్నద్ధమవ్వాలి.
- వినయ్ కుమార్ రెడ్డి, ఐఏసీఈ
Published date : 30 Jan 2020 01:13PM

Photo Stories