Skip to main content

APPSC Group‌-1 Guidance: విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు ఇవే!

APPSC Group‌-1 guidance and preparation tips and exam pattern, syllabus, marks
APPSC Group‌-1 guidance and preparation tips and exam pattern, syllabus, marks

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ఉద్యోగార్థులకు శుభవార్త. ముఖ్యంగా అత్యున్నత సర్వీసులుగా పేర్కొనే.. గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీకి సర్కారు అనుమతి ఇచ్చింది. మొత్తం 110 గ్రూప్‌–1 పోస్ట్‌ల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశముంది. కాబట్టి అభ్యర్థులు తమ కలలను సాకారం చేసుకునే సమయం ఆసన్నమైంది! రాష్ట్ర స్థాయిలో అత్యున్నత కొలువులు అందుకునేందుకు ఇప్పటి నుంచే సన్నద్ధత ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. గ్రూప్‌–1 ఎంపిక విధి విధానాలు, విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై విశ్లేషణ... 

  • ఏపీలో 110 గ్రూప్‌–1 పోస్ట్‌ల భర్తీకి అనుమతి
  • మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఎంపిక ప్రక్రియ
  • ఇప్పటి నుంచే అడుగులు వేస్తే విజయావకాశాలు ఖాయం

గత కొన్ని నెలలుగా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం–నోటిఫికేషన్లతో ఉద్యోగార్థుల ముంగిటకు వస్తున్న ఏపీపీఎస్సీ.. గ్రూప్‌–1కు సంబంధించి వీలైనంత త్వరగా నోటిఫికేషన్‌ ఇస్తుందని భావించొచ్చు. ఈ పోస్ట్‌ల భర్తీకి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించడమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా 19 విభాగాల్లో మొత్తం 110 గ్రూప్‌–1 పోస్ట్‌ల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఇందులో డిప్యూటీ కలెక్టర్, కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్, డిప్యూటీ సూపరింటెండ్‌ ఆఫ్‌ పోలీస్‌(డీఎస్పీ) వంటి పోస్టులు ఉండటం అభ్యర్థులను ఊరిస్తోంది.

ముందుగా ప్రిలిమినరీ

ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 పోస్ట్‌ల ఎంపిక ప్రక్రియలో ముందుగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. తొలిదశగా నిర్వహించే ప్రిలిమినరీ పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో సాగుతుంది. ఇందులో నిర్దిష్ట కటాఫ్‌ మార్కుల జాబితాలో నిలిచిన వారికి రెండో దశలో మెయిన్‌ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్‌కు ఒక్కో పోస్ట్‌కు 50 మంది చొప్పున(1:50 నిష్పత్తిలో) ఎంపిక చేస్తారు. మెయిన్‌ పరీక్ష పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. మెయిన్‌లో నిర్దేశిత మార్కులు పొందిన వారిని చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. పర్సనల్‌ ఇంటర్వ్యూ, మెయిన్‌ల్లో చూపిన ప్రతిభ ఆధారంగా తుది విజేతలను ఖరారు చేస్తారు.

చదవండి: ఏపీపీఎస్సీ ప‌రీక్ష స్ట‌డీమెటీరియ‌ల్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, సిల‌బ‌స్, గైడెన్స్‌, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

ప్రిలిమ్స్‌.. రెండు పేపర్లు

గ్రూప్‌–1 ఎంపిక ప్రక్రియలో తొలి దశగా పేర్కొనే ప్రిలిమ్స్‌ను రెండు పేపర్లుగా నిర్వహిస్తున్నారు. ప్రిలిమ్స్‌నే స్క్రీనింగ్‌ టెస్ట్‌గా పిలుస్తున్నారు. ప్రిలిమ్స్‌ పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో.. మూడు గంటల వ్యవధిలో జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు..
 

పేపర్‌ సబ్జెక్ట్‌లు మార్కులు
1 ఎ) హిస్టరీ అండ్‌ కల్చర్‌
బి) రాజ్యాంగం, పాలిటీ, సోషల్‌ జస్టిస్, అంతర్జాతీయ సంబంధాలు
సి) భారత్, ఆంధ్రప్రదేశ్‌ ఎకానమీ
డి) జాగ్రఫీ 
120
2 జనరల్‌ అప్టిట్యూడ్‌ ఎ) జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ బి–1) సైన్స్‌ అండ్‌ టెక్నాలజీస్‌ బి–2) ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలు 120

 

మెయిన్‌ .. ఏడు పేపర్లుగా

గ్రూప్‌–1 ఎంపిక ప్రక్రియలో రెండో దశ మెయిన్‌ ఎగ్జామినేషన్‌.ఇందులో ఏడు పేపర్లు ఉంటాయి. తెలుగు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ పేపర్లను అర్హత పేపర్లుగా నిర్దేశిస్తారు. ఈ పేపర్లలో కనీసం 40 శాతం(ఓసీ అభ్యర్థులు), (35 శాతం రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు) మార్కులు సాధిస్తేనే మెయిన్‌ మిగతా పేపర్ల మూల్యాంకన చేస్తారు. మెయిన్‌లో సాధించిన మార్కుల ఆధారంగా.. ఖాళీలను అనుసరించి 1:2 నిష్పత్తిలో చివరి దశ పర్సనల్‌ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. మెయి¯Œ పరీక్ష పేపర్ల వివరాలు..
 

పేపర్‌ సబ్జెక్ట్‌  మార్కులు
లాంగ్వేజ్‌ పేపర్‌ తెలుగు  150
లాంగ్వేజ్‌ పేపర్‌ ఇంగ్లిష్‌ 150
పేపర్‌–1 జనరల్‌ ఎస్సే (ప్రాంతీయ, జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న సమకాలీన అంశాలు) 150
పేపర్‌–2 హిస్టరీ భారత్, ఏపీ చరిత్ర సంస్కృతి, భౌగోళిక శాస్త్రం 150
పేపర్‌–3 పాలిటీ, రాజ్యాంగం, పాలన, లా, ఎథిక్స్‌ 150
పేపర్‌–4 ఎకానమీ, భారత దేశ, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి 150
పేపర్‌–5 సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పర్యావరణ అంశాలు 150
మొత్తం మార్కులు   750

 

ప్రిపరేషన్‌కు కదలండిలా

గ్రూప్‌–1 పోస్ట్‌ల సంఖ్య, వాటికి ఆమోదంపై స్పష్టత లభించింది. కాబట్టి త్వరలోనే ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. నోటిఫికేషన్‌ వచ్చే వరకు వేచి చూడకుండా.. ఇప్పటి నుంచే ప్రిపరేషన్‌ దిశగా అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 

చ‌ద‌వండి: Previous Papers Exams

సిలబస్‌ పరిశీలన

ముందుగా అభ్యర్థులు ప్రిలిమ్స్, మెయిన్‌ సిలబస్‌ను పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఆ తర్వాత ఆయా అంశాలకు కల్పిస్తున్న వెయిటేజీని గమనించాలి. దీనికి అనుగుణంగా ప్రిపరేషన్‌ సమయంలో ఆయా సబ్జెక్ట్‌లలో ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అంశాలను గుర్తించాలి. వాటి కోసం సమయం కేటాయించాలి.

Latest Current Affairs

కాన్సెప్ట్స్‌ + కరెంట్‌ ఈవెంట్స్‌

ఆయా సిలబస్‌ అంశాలను చదివేటప్పుడు వాటిని సమకాలీన పరిణామాలతో సమన్వయం చేసుకోవాలి. డిస్క్రిప్టివ్‌ విధానంలో ప్రిపరేషన్‌ సాగించాలి. తద్వారా కోర్‌ సబ్జెక్ట్‌లపై పట్టుతోపాటు సమకాలీన పరిస్థితుల్లో అన్వయించే నైపుణ్యం కూడా లభిస్తుంది. ముఖ్యంగా గ్రూప్‌–1 అభ్యర్థులకు ఇది ఎంతో కలిసొచ్చే అంశంగా మారుతుంది.

విశ్లేషించుకుంటూ అధ్యయనం

  • గ్రూప్‌–1 అభ్యర్థులు ప్రిలిమ్స్‌ నుంచే ఆయా అంశాలను విశ్లేషించుకుంటూ.. అభ్యసించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. సమకాలీన అంశాలపై పూర్తి స్థాయి అవగాహన, విశ్లేషణ, స్వీయ అభిప్రాయ దృక్పథం పెంచుకోవాలి. ముఖ్యమైన అంశాలకు సంబంధించి సినాప్సిస్, నేపథ్యం, ప్రభావం, ఫలితం, పర్యవసానాలు.. ఇలా అన్ని కోణాల్లో అవగాహన ఏర్పరచుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు.. ముఖ్యంగా నవరత్నాలు, అమలు చేస్తున్న పథకాలు, లక్షిత వర్గాలు, బడ్జెట్‌ కేటాయింపులు, ఇప్పటివరకు లబ్ధి పొందిన వారి సంఖ్య తదితర వివరాలను అవపోసన పట్టాలి. అదే విధంగా రాష్ట్ర స్థాయిలో అమలవుతున్న ఆర్థిక విధానాలు, వాటిద్వారా కలిగిన అభివృద్ధిపైనా దృష్టి సారించాలి. 
  • గత రెండేళ్లుగా ప్రపంచాన్ని కుదిపేసిన కొవిడ్‌ పరిణామాల గురించి కూడా అధ్యయనం చేయాలి. వీటిని స్థానిక పరిస్థితులతో అన్వయం చేసుకుంటూ అభ్యసనం సాగించడం కూడా మేలు చేస్తుంది.అదే విధంగా జాతీయ స్థాయిలో తాజా రాజ్యాంగ సవరణలు, నూతన జాతీయ విద్యా విధానం, ఇటీవల కాలంలో కీలకమైన తీర్పుల గురించి పూర్తి అవగాహన పెంచుకోవాలి.


APPSC Groups Study Material

​​​​​​​చరిత్ర.. మరవకుండా

హిస్టరీ విషయంలో రాష్ట్ర చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అంశాలపై పట్టు సాధించాలి. ప్రాచీన చరిత్ర మొదలు ఆధునిక చరిత్ర వరకూ.. ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించాలి. జాతీయోద్యమంలో ఆంధ్రప్రదేశ్‌ పాత్ర గురించి అధ్యయనం చేయాలి. ఇదే తీరులో భారత దేశ చరిత్రకు సంబంధించిన అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. జాగ్రఫీకి సంబంధించి రాష్ట్రంలోని భౌగోళిక వనరులు, అడవులు, జీవ సంపద, వ్యవసాయ వనరుల గురించి తెలుసుకోవాలి. వీటిని తాజా పరిస్థితులతో అన్వయం చేసుకోవాలి. అదే విధంగా గత ఏడాది కాలంలో చేపట్టిన వ్యవసాయ, నీటి పారుదల ప్రాజెక్ట్‌లు.. వాటి ద్వారా లబ్ధి చేకూరే ప్రాంతాలు వంటి వాటిపై దృష్టి పెట్టాలి.

పాలిటీ పట్టు సాధించాలంటే

ఈ సబ్జెక్ట్‌పై పట్టు సాధించాలంటే.. రాజనీతి శాస్త్రం, రాజ్యాంగానికి సంబంధించి ప్రాథమిక అంశాలు, భావనలు మొదలు తాజా పరిణామాలు(రాజ్యాంగ సవరణలు వాటి ప్రభావం) తెలుసుకోవాలి. గవర్నెన్స్, లా, ఎథిక్స్‌కు సంబంధించి సుపరిపాలన దిశగా చేపడుతున్న చర్యలు, పబ్లిక్‌ సర్వీస్‌లో పాటించాల్సిన విలువలు, ప్రజాసేవలో చూపించాల్సిన నిబద్ధత, అంకిత భావం వంటి విషయాలపైనా అవగాహన ఏర్పరచుకోవాలి. వాస్తవానికి దీనికి సంబంధించి ప్రత్యేక పుస్తకాలు లేనప్పటికీ.. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పుస్తకాలు కొంత మేలు చేస్తాయి. వీటితోపాటు స్ఫూర్తిదాయక నేతల వివరాలు, వారు పాలించిన తీరు తదితర అంశాలను సేకరించుకోవాలి. న్యాయపరమైన అంశాలపైనా పట్టు సాధించాలి. ప్రాథమిక హక్కులు, విధులు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు.. వీటికి సంబంధించి న్యాయ వ్యవస్థకున్న అధికారాల గురించి తెలుసుకోవాలి. అదే విధంగా, సివిల్, క్రిమినల్‌ లా, కార్మిక చట్టాలు, సైబర్‌ చట్టాలు, ట్యాక్స్‌ లాస్‌ గురించి తెలుసుకోవాలి.

APPSC Groups Practice Tests

ఎకానమీ.. ఎంతో విస్తృతం

గ్రూప్‌–1 అభ్యర్థులు ఎకనామీకి విస్తృతంగా అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత నెలకొంది. ప్రిపరేషన్‌ ప్రారంభ దశలో ఎకానమీకి సంబంధించి మౌలిక భావనలు మొదలు తాజా వృద్ధి రేట్ల వరకూ.. గణాంక సహిత సమాచారం సేకరించుకుని పరీక్షకు సన్నద్ధం కావాలి. ఇటీవల కాలంలో చేపట్టిన ప్రధాన ఆర్థిక సంస్కరణలు, వాటిద్వారా లబ్ధి చేకూరే వర్గాలు; జాతీయ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా తాజాగా తీసుకొచ్చిన విధానాలపై పట్టు సాధించాలి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లు, ఎకనామిక్‌ సర్వేలపై అవగాహన పొందాలి.

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

ఈ సబ్జెక్ట్‌కు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమలవుతున్న కొత్త విధానాలు, ప్రధాన సంస్థలు, రాష్ట్ర స్థాయిలో ఐసీటీ విధానాలు, ఇండియన్‌ స్పేస్‌ ప్రోగ్రామ్, డీఆర్‌డీఓ, ఇంధన వనరులు, విపత్తు నిర్వహణకు అనుసరిస్తున్న సాంకేతిక విధానాలు తదితర అంశాలపై పట్టు సాధించాలి. దీంతోపాటు పర్యావరణ సంబంధిత అంశాలపైనా దృష్టి సారించాలి. అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి జాతీయ, రాష్ట్ర స్థాయిలో అమలు చేస్తున్న చట్టాలు, విధానాలపై అవగాహన పొందాలి.

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం

గ్రూప్‌–1 అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన మరో కీలక అంశం.. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం–2014. జనరల్‌ స్టడీస్,ఎకానమీ, హిస్టరీ పేపర్లు అన్నింటిలోనూ.. ఈ చట్టం నుంచి ప్రశ్నలు అడిగే అవకాశాలున్నాయి. కాబట్టి అభ్యర్థులు ఈ చట్టాన్ని ప్రత్యేక దృష్టితో అభ్యసించాలి. విభజన తర్వాత ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలు.. వాటి పరిష్కారానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి సమకాలీన అంశాలతో కూడిన సమాచారంతో పరీక్ష సమయానికి సన్నద్ధత సాధించాలి.

గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రాధాన్యం

ప్రభుత్వం నెలకొల్పిన గ్రామ, వార్డ్‌ సచివాలయ వ్యవస్థ గురించి కూడా పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. ఈ వ్యవస్థ ఉద్దేశం, లక్షిత వర్గాలు, ఇప్పటి వరకు ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు లభించిన ఫలితాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా జనరల్‌ ఎస్సే, లేదా పాలిటీ పేపర్లలో దీనికి సంబంధించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి వార్డ్, గ్రామ సచివాలయాల ద్వారా అందుతున్న సేవలు, సిబ్బంది, లక్షిత వర్గాలు.. ఇలా అన్ని కోణాల్లో గణాంకాలతో కూడిన సమాచారాన్ని అవపోసన పట్టాలి. ఇలా.. ప్రిపరేషన్‌ తొలి దశ నుంచి ఆయా సబ్జెక్ట్‌ల వారీగా నిర్దిష్ట ప్రణాళికతో అడుగులు వేస్తే విజయావకాశాలు మెరుగవుతాయి.

APPSC Groups Guidance

గ్రూప్‌–1 ప్రిపరేషన్‌.. ముఖ్యాంశాలు

ప్రిలిమ్స్‌ నుంచే మెయిన్స్‌ దృక్పథంలో డిస్క్రిప్టివ్‌ విధానంలో చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి.

  • ఆయా అంశాలకు సంబంధించి భావనలు, ప్రాథమిక అంశాలను సమకాలీన అంశాలతో బేరీజు వేసుకుంటూ చదవాలి.
  • ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్‌ చదివే విధంగా సమయ పాలన రూపొందించుకోవాలి.
  • ప్రతి రోజు కనీసం ఎనిమిది నుంచి పది గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించేలా సన్నద్ధత పొందాలి.
  • ప్రిలిమ్స్, మెయిన్స్‌ అంశాలను అనుసంధానం చేసుకుంటూ చదివితే.. మెయిన్స్‌ ప్రిపరేషన్‌ సమయంలో ఒత్తిడి నుంచి దూరంగా ఉండే అవకాశం.
  • ప్రిలిమ్స్‌కు నెల రోజుల ముందు నుంచి పూర్తిగా ప్రిలిమ్స్‌కే కేటాయించాలి.
  • ప్రిలిమ్స్‌ పూర్తయ్యాక 60 శాతం మార్కులు వస్తాయనే ధీమా ఉంటే వెంటనే మెయిన్స్‌కు ప్రిపరేషన్‌ మొదలు పెట్టాలి.
  • మెయిన్స్‌ ప్రిపరేషన్‌ సమయంలో రైటింగ్‌ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
  • మాక్‌ టెస్ట్‌లు, మోడల్‌ టెస్ట్‌లకు హాజరు కావాలి.

అన్వయ దృక్పథం

గ్రూప్‌–1 అభ్యర్థులు ఏ అంశాన్నైనా సమకాలీన పరిణామాలతో అన్వయం చేసుకుంటూ చదివే సామర్థ్యాన్ని సొంతం చేసుకోవాలి. ఇటీవల కాలంలో గ్రూప్‌–1, సివిల్స్‌ వంటి పరీక్షల్లో కోర్‌ సబ్జెక్టును కాంటెంపరరీ అంశాలతో సమ్మిళితం చేసి ప్రశ్నలు అడిగే విధానం పెరుగుతోంది. కాబట్టి ఈ అన్వయ దృక్పథం సమాధానాలు ఇచ్చే విషయంలో ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ప్రిపరేషన్‌ సమయంలో అభ్యర్థులు ఏ సబ్జెక్ట్‌ను విస్మరించకుండా చదవడం ముఖ్యమని గుర్తించాలి.
–కృష్ణ ప్రదీప్, పోటీ పరీక్షల శిక్షణ నిపుణులు


చదవండి: AP Government Jobs: వైద్య, ఆరోగ్య శాఖలో 4775 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Published date : 07 Apr 2022 06:27PM

Photo Stories