Skip to main content

వారు రిజర్వ్‌డ్ కేటగిరీకే అర్హులు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించే స్క్రీనింగ్ టెస్టు/ప్రిలిమ్స్‌లో ప్రత్యేక మినహాయింపుతో ఎంపికయ్యే రిజర్వ్‌డ్ అభ్యర్థులు వారి రిజర్వ్‌డ్ కేటగిరీ పోస్టులకు మాత్రమే అర్హులవుతారని ఏపీపీఎస్సీ చైర్మన్ పి.ఉదయభాస్కర్ పేర్కొన్నారు.
ఈ అభ్యర్థులు మెయిన్‌‌సలో అత్యధిక మార్కులతో మెరిట్‌లో ఉన్నా ఓపెన్ కేటగిరీ పోస్టులకు వెళ్లడానికి వీల్లేదని స్పష్టంచేశారు. జనవరి 4న ఏపీపీఎస్సీ కార్యాలయంలో కమిషన్ సభ్యులు జి.రంగజనార్దన, కె.విజయకుమార్, గుర్రం సుజాత, కె.పద్మరాజు, సేవారూప, కార్యదర్శి ఏకే మౌర్యలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఇంతకు ముందు స్క్రీనింగ్ టెస్టు/ప్రిలిమ్స్ నుంచి మెయిన్‌‌సకు 1:50 చొప్పున అభ్యర్థులను ఎంపికచేసే వారం. కటాఫ్‌లో ఎలాంటి మినహాయింపులు లేకుండా ఎంపికయ్యే వీరిలో కొన్ని రిజర్వ్‌డ్ కేటగిరీ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేనప్పుడు అవి భర్తీకాకుండా మిగిలిపోతున్నాయి. దీనిని నివారించేందుకు ఈసారి స్క్రీనింగ్ టెస్టులో నుంచి మెయిన్‌‌సకు ఎంపిక చేసే ప్రక్రియలో కొన్ని మార్పులు చేశాం. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి స్క్రీనింగ్ టెస్టు అనంతరం ఒక కటాఫ్ మార్కుతో నిర్ణీత నిష్పత్తిలో అన్ని పోస్టులకు కలిపి మొత్తం అభ్యర్థులను మెయిన్‌‌సకు ఎంపికచేస్తాం. వారిలో ఏ రిజర్వ్‌డ్ కేటగిరీకి అయినా నిష్పత్తికి తగినంత మంది అభ్యర్థులు ఎంపిక కాకుంటే మిగిలిన వారిని కటాఫ్ మార్కులు తగ్గించి ఎంపికచేస్తాం. ఇలా కటాఫ్ మార్కుల తగ్గింపు ద్వారా ప్రత్యేక మినహాయింపుతో ఎంపికై న వారు ఆతరువాత వారి రిజర్వ్‌డ్ కేటగిరీ పోస్టులకు మాత్రమే అర్హులవుతారు. మెయిన్‌‌సలో మెరిట్ సాధించినా ఓపెన్ కేటగిరీకి కాకుండా రిజర్వ్‌డ్ కేటగిరీకే పరిమితమవుతారు’ అని ఉదయభాస్కర్ వివరించారు. స్క్రీనింగ్ టెస్టులో జనరల్ కటాఫ్‌తో కాకుండా కేటగిరీల వారీగా కటాఫ్ నిర్ణయించి మెయిన్‌‌సకు ఎంపికలు చేయాలని, ఆ తరువాత మెయిన్‌‌స ఇంటర్వ్యూల్లో మెరిట్ ఆధారంగా అందరికీ ఓపెన్ కేటగిరీ పోస్టులకు అవకాశాలు కల్పించాలని అభ్యర్థులు కోరుతున్న విషయాన్ని మీడియా ప్రస్తావించగా చైర్మన్ స్పందిస్తూ తాము యూపీఎస్సీ విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నిర్వహించే టెట్, డీఎస్సీ, వంటి ఇతర నియామక పరీక్షల్లో స్క్రీనింగ్ టెస్టులో మినహాయింపులతో ఎంపికై నా ఆతదుపరి పరీక్షలో మెరిట్ సాధిస్తే ఓపెన్ కేటగిరీకి అర్హులవుతున్నారని గుర్తుచేయగా టెట్, డీఎస్సీలతో తమకు సంబంధం లేదని చైర్మన్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో లేని నిబంధనను నోటిఫికేషన్లలో పెట్టి రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నారంటూ వస్తున్న విమర్శల గురించి ప్రస్తావించగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే చేస్తున్నామని చైర్మన్ వివరించారు.

త్వరలోనే మరికొన్ని నోటిఫికేషన్లు...
ఇదిలా ఉండగా డిసెంబర్ ఆఖరు వరకు ఏపీపీఎస్సీ ద్వారా వివిధ విభాగాలకు చెందిన 3,255 పోస్టులకు 21 నోటిఫికేషన్లు జారీచేశామని చైర్మన్ తెలిపారు. ఇందులో ఏఈఈ పోస్టులకు 97వేల వరకు, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పోస్టులకు 16130, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు 5,411, హార్టికల్చర్ అధికారుల పోస్టులకు 1,307, పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు ఇప్పటివరకు 56,612 దరఖాస్తులు వచ్చాయన్నారు. త్వరలో మరో 1521 పోస్టులకు సంబంధించి 14 నోటిఫికేషన్లు జారీచేయనున్నామన్నారు.
Published date : 05 Jan 2019 02:43PM

Photo Stories